రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అంతకంతకూ పెరుగుతున్న భారత్ స్వదేశీ పరాక్రమానికి ఉజ్వల నిదర్శనం ‘ఆపరేషన్ సిందూర్’: రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


‘‘రూ.3 లక్షల కోట్ల రక్షణ ఉత్పాదనల తయారీతో పాటు రూ.50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాలను
2029 కల్లా సాధించగలమని మేం ఆశిస్తున్నాం’’

విద్యార్థులు విద్యారంగ విజయాలకు మించి ముందడుగు వేసి
సృజనశీలురుగా, ఆవిష్కర్తలుగా, దేశాభివృద్ధికి సహకరించే వారుగా
మారాలంటూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సూచన

Posted On: 16 OCT 2025 2:47PM by PIB Hyderabad
‘‘అంతకంతకూ పెరుగుతున్న భారత్ స్వదేశీ పరాక్రమానికి ‘ఆపరేషన్ సిందూర్’ ఉజ్వల నిదర్శనం. ఇది దేశంలో స్వావలంబన కలిగిన రక్షణ తయారీ అనుబంధ విస్తారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టు విడువక చేసిన ప్రయత్నాల ఫలితమ’’ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ  రోజు పుణెలో స్పష్టం చేశారు. సింబయోసిస్ స్కిల్స్, ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నమ్మకం, నిరంతర శ్రమ వంటి గుణాలు విద్యార్థులకు ఎంతో ముఖ్యమని  ఆయన అన్నారు.
 
image.png

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి కలిగిందిగా భారత్‌ను తీర్చిదిద్దే పనిని ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు అది ఆరంభంలో కష్టమనిపించిందని రక్షణ మంత్రి విద్యార్థులతో చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి సకల ప్రయత్నాలనూ చేశామనీ, దీంతో సానుకూల ఫలితాలు రావడం మొదలైందనీ మంత్రి తెలిపారు.
 
మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ మనం ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఎక్కువగా ఆధారపడ్డాం. ఈ కారణంగా, రక్షణ రంగంలో మార్పును తీసుకు వచ్చే దిశగా పయనించాలని మేం ప్రతిన బూనాం. ఆయుధాలను భారత్‌లో తయారు చేసే రాజకీయ సంకల్పం మనలో లోపించినందువల్ల వాటిని కొనుగోలు చేయడానికి అలవాటుపడిపోయాం. రక్షణ తయారీని ప్రోత్సహించడానికి అవసరమైన చట్టాలూ రూపొందించుకోలేదు. ఈ స్థితిలో మార్పు అవసరమైంది. మన సైనికులకు దేశీయంగా ఆయుధాలను భారత్ తయారుచేయాలనేది మా సంకల్పమే. ఆపరేషన్ సిందూర్ వేళ మన సైనికుల ధైర్య సాహసాలను ప్రపంచం గమనించింది. వారు భారత్లో తయారైన సామగ్రిని పెద్ద ఎత్తున వినియోగించి, నిర్దేశించిన లక్ష్యాల్ని సాధించార’’న్నారు.

రక్షణ రంగానికి కావలసినవి తయారు చేయడంలో యువత తోడ్పాటు ముఖ్యమని రక్షణ మంత్రి అన్నారు.  గత 10 సంవత్సరాల్లో రక్షణ ఉత్పాదన స్థాయి ఏటా రూ.46,000 కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఒక రికార్డు అనీ, దీనిలో సుమారు రూ.33,000 కోట్ల విలువైన ఉత్పాదనలను ప్రయివేటు రంగం సమకూర్చిందన్నారు. రూ.3 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పాదనల తయారీతో పాటు రూ.50,000 కోట్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని 2029కల్లా సాధించగలమన్న విశ్వాసం తనకుందని ఆయన చెప్పారు.

విద్యార్థులు చదువులో విజయం సాధించడానికి మించి, సృజనకారులుగా, ఆవిష్కర్తలుగా, దేశాభివృద్ధికి తమ వంతుగా తోడ్పడేవారుగా మారాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సిసలైన విజయం డిగ్రీలు అందుకోవడంలోనే లేదనీ, సంపాదించుకున్న జ్ఞ‌ానాన్ని సమాజానికి మేలు చేయడానికి అర్థవంతంగా ఉపయోగించడంలోనే ఉందనీ ఆయన స్పష్టం చేశారు.

భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నైపుణ్యాభివృద్ది పాత్ర ఎంతో ముఖ్యమని రక్షణ మంత్రి చెప్తూ, ‘‘మనం ‘మీకు తెలిసిందేమిటి?’ అనే యుగంలో లేం. ‘మీరు ఏమి చేయగలుగుతారు?’ అంటూ వర్తమాన ప్రపంచం ప్రశ్నిస్తోంది. జ్ఞ‌ానాన్ని సద్వినియోగం చేయలేదంటే అది అసంపూర్ణంగా మిగులుతుంది. నేర్చుకోవడానికీ, చేసి చూపెట్టడానికీ మధ్య వంతెన లాంటిది నైపుణ్య’’మన్నారు.

సాంకేతికత ప్రసరిస్తున్న ప్రభావాన్ని గురించి, మరీ ముఖ్యంగా కృత్రిమ మేధను (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్..ఏఐ) గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఉద్యోగ నష్టాలు, మనుషుల అవసరం లేకపోవడం తాలూకు భయాలను పటాపంచలు చేశారు. మానవుల చోటులోకి ఏఐ రాదనీ, ఏఐని ఉపయోగించేవారు దానిని వాడని వారి చోటులోకి వచ్చి చేరతారనీ మంత్రి అన్నారు. సామాజిక ప్రసార మాధ్యమాలు, బయటి ఒత్తిళ్లు రువ్వుతున్న సవాళ్లను పరిష్కరిస్తూనే సాంకేతికత ఒక పరికరంగా ఉండి తీరాలి తప్ప మనిషి సూక్ష్మబుద్ధికీ, విలువలకూ, నైతిక ప్రమాణాలకూ అది ఒక ప్రత్యామ్నాయం కాకూడదని ఆయన స్పష్టం చేశారు. యువత పోలికల సుడిలో చిక్కుకొనేందుకు బదులు, సొంత కలలను నెరవేర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు.
 
image.png

భారత్ అమృత కాలంలోకి అడుగు పెడుతున్న క్రమంలో, 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా వారి జీవనంలో అత్యంత నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తున్నారని రక్షణ మంత్రి అన్నారు. ‘‘రాబోయే 20-25 సంవత్సరాలు మీ ఉద్యోగ జీవనానికి రూపురేఖలను కల్పించడం ఒక్కటే కాకుండా, దేశ ప్రజల భవితవ్యాన్ని కూడా తీర్చిదిద్దుతాయి. మీ తపన దేశానికి మేలుమలుపును అందించేలా శ్రద్ధ తీసుకోండ’’ని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, స్కూల్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీని రక్షణ మంత్రితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, విశ్వవిద్యాలయ ఉప కులపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
***
 

(Release ID: 2179926) Visitor Counter : 12