ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని
· కర్నూలులో దాదాపు రూ. 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
· పరిశ్రమ, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం - సహజ వాయువు సహా వివిధ రంగాల్లో ప్రాజెక్టులు
· శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దర్శనం, పూజ
· శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి ఛత్రపతి వారసత్వ సంస్మరణ
Posted On:
14 OCT 2025 5:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఉదయం 11:15 గంటల సమయంలో నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలతోపాటు దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి కర్నూలుకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దాదాపు రూ. 13,430 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
శ్రీశైలంలో ప్రధానమంత్రి
12 జ్యోతిర్లింగాలు, 52 శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రధానమంత్రి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే ప్రాంగణంలో కలిసి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. దేశం మొత్తం మీద ఈ తరహా దేవాలయం ఇదొక్కటే.
ధ్యాన మందిరంతో కూడిన శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్ర స్మారక సముదాయాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శిస్తారు. నాలుగు మూలల్లో నాలుగు ప్రతిష్ఠాత్మక కోటలు - ప్రతాప్‌గడ్, రాజ్‌గడ్, రాయ్‌గడ్, శివనేరి నమూనాలున్నాయి. మధ్యలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తీక్షణమైన ధ్యానంలో ఉన్న విగ్రహం ఉంది. శ్రీ శివాజీ స్మారక కమిటీ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పవిత్ర మందిరాన్ని సందర్శించిన చరిత్రాత్మక ఘట్టం స్మారకార్థం శ్రీశైలంలో దీనిని నెలకొల్పారు.
కర్నూలులో ప్రధానమంత్రి
దాదాపు రూ. 13,430 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. పరిశ్రమ, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం - సహజ వాయువు వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం, సమ్మిళిత సామాజిక-ఆర్థిక వృద్ధిని సాధించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం.
కర్నూలు-III పూలింగ్ స్టేషనులో రూ. 2,880 కోట్ల పెట్టుబడితో సరఫరా వ్యవస్థ బలోపేతం కోసం ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 765 కిలోవాట్ల డబుల్ సర్క్యూట్ కర్నూలు-III పూలింగ్ స్టేషన్ - చిలకలూరిపేట సరఫరా మార్గం నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో ఉంది. ఇది సరఫరా సామర్థ్యాన్ని 6,000 ఎంవీఏకు పెంచడంతోపాటు భారీగా పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలు కల్పించి దేశాభివృద్ధికి తోడ్పడుతుంది.
కర్నూలులోని ఓర్వకల్, కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడితో వీటిని చేపడుతున్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి – అమలు ట్రస్టు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ) సంయుక్తంగా ఈ ఆధునిక, బహుళ రంగాల పారిశ్రామిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాయి. కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సిద్ధంగా, అన్ని సౌకర్యాలూ సమీపంలోనే ఉండేలా వీటిని రూపొందించారు. ఇవి రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని, దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధితోపాటు అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందిస్తాయి.
రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం.. సబ్బవరం నుంచి షీలానగర్ వరకు రూ. 960 కోట్లతో ఆరు వరుసల కొత్త హైవే నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. విశాఖపట్నంలో రద్దీని తగ్గించడంతోపాటు వాణిజ్యం, ఉపాధి పరంగా సౌలభ్యం కల్పించడం దీని లక్ష్యం. అంతేకాకుండా దాదాపు రూ. 1,140 కోట్ల విలువైన ఆరు రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పీలేరు-కాలూరు సెక్షన్ నాలుగు వరుసల రహదారి, కడప/నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు విస్తరణ, జాతీయ రహదారి-165పై గుడివాడ, నుజెల్లా రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల రైల్ ఓవర్ బ్రిడ్జి, జాతీయ రహదారి -716 పై పాపాగ్ని నదిపై ప్రధాన వంతెన, జాతీయ రహదారి -565పై కనిగిరి బైపాస్, జాతీయ రహదారి -544డీడీలోని ఎన్. గుండ్లపల్లి పట్టణంలో బైపాస్ సెక్షన్ అభివృద్ధి ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో భద్రతను మెరుగుపరుస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయి.
రూ. 1,200 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేస్తారు. కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్‌కు శంకుస్థాపన, పెందుర్తి - సింహాచలం ఉత్తర మధ్య రైల్ ఫ్లైఓవర్, కొత్తవలస-బొద్దవర సెక్షన్ డబ్లింగును జాతికి అంకితం, షిమిలిగుడ-గోరాపూర్ సెక్షన్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించడంతోపాటు వేగవంతమైన - సురక్షితమైన ప్రయాణాలను అందిస్తాయి. ప్రయాణికులు, సరుకు రవాణా సజావుగా సాగడానికి వీలు కల్పిస్తాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు అందిస్తాయి.
ఇంధన రంగానికి సంబంధించి.. గెయిల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన శ్రీకాకుళం-అంగుల్ సహజ వాయు పైప్‌లైన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 124 కి.మీ, ఒడిశాలో 298 కి.మీల విస్తీర్ణంలో మొత్తం రూ. 1,730 కోట్లతో దీనిని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 వేల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటును కూడా ఆయన ప్రారంభిస్తారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలు, తమిళనాడులోని రెండు జిల్లాలు, కర్ణాటకలోని ఒక జిల్లాలో 80 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 7.2 లక్షలకు పైగా వినియోగదారులకు ఈ ప్లాంటు సేవలందించనుంది. ఈ ప్రాంతంలోని గృహ, వాణిజ్య సంస్థలకు నమ్మకమైన ఎల్పీజీ సరఫరాను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రక్షణ తయారీని బలోపేతం చేసే దిశగా.. కృష్ణా జిల్లా నిమ్మలూరులో అధునాతన నైట్ విజన్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ.360 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీనిని నెలకొల్పింది. భారత రక్షణ దళాల కోసం అధునాతన ఎలక్ట్రో-ఆప్టికల్ వ్యవస్థలను ఈ కేంద్రం తయారు చేస్తుంది. రక్షణ ఉత్పత్తిలో స్వావలంబనను బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తుంది.
***
(Release ID: 2179179)
Visitor Counter : 29