ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మంగోలియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం

Posted On: 14 OCT 2025 3:23PM by PIB Hyderabad
గౌరవ అధ్యక్షుడు శ్రీ హురేల్‌సుఖ్,
ఇరు దేశాల ప్రతినిధులు,
ప్రసార మాధ్యమాలకు చెందిన మిత్రులారా,

నమస్కారం.

సైన్ బైన్ ఓ

అధ్యక్షుడు శ్రీ  హురేల్‌సుఖ్‌కూ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి నేను స్వాగతం పలుకుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

ఆరేళ్ల అనంతరం మంగోలియా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం చాలా ప్రత్యేకమైన సందర్భం. భారత్, మంగోలియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 10 సంవత్సరాలైన వేళ ఈ పర్యటన చోటుచేసుకొంది. ఈ సందర్భంగా ఈ రోజున మేం ఒక సంయుక్త తపాలా బిళ్లను విడుదల చేశాం.. ఇది మన ఉమ్మడి  వారసత్వం, వైవిధ్యం, నాగరికత పరమైన సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.

మిత్రులారా,

ఈ రోజున, మా భేటీ ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’లో భాగంగా ఒక మొక్కను నాటే కార్యక్రమంతో మొదలైంది. అధ్యక్షుడు శ్రీ హురేల్‌సుఖ్ ఆయన తల్లి గారి గౌరవార్థం ఒక మర్రి మొక్కను నాటారు. ఆ మొక్క మా మధ్య గల ప్రగాఢ స్నేహానికీ, పర్యావరణం అంటే మాకున్న ఉమ్మడి నిబద్ధతకూ చిహ్నంగా ఉంటుంది.

మిత్రులారా,

పది సంవత్సరాల కిందట, నేను మంగోలియాలో పర్యటించినప్పుడు, మేం మా భాగస్వామ్యానికి వ్యూహాత్మక భాగస్వామ్య హోదాను ఇచ్చాం. గడచిన పదేళ్లలో, ఈ  భాగస్వామ్యం ప్రతి కోణంలోనూ మరింత బలపడడంతో పాటు విస్తరించింది.

మా రక్షణ, భద్రత సహకారం కూడా నిరంతరం పటిష్ఠమవుతోంది. శిక్షణ కార్యక్రమాల మొదలు రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అటాషేను నియమించడం వరకూ చూస్తే, మేం అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. మంగోలియా సరిహద్దు భద్రత దళాలకు సామర్థ్యాన్ని పెంచే ఒక కొత్త  కార్యక్రమాన్ని కూడా భారత్ ఆరంభించనుంది.

మిత్రులారా,

ప్రపంచ అంశాలపై మన దృష్టికోణం, మన ఉమ్మడి విలువలపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ వేదికల్లో మనం సన్నిహిత భాగస్వాములం. మన రెండు దేశాలూ దాపరికమంటూ ఎరుగని, బహిరంగ, సమ్మిళిత, నియమాలపై ఆధారపడ్డ ఇండో-పసిఫిక్‌ను సమర్ధిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని బిగ్గరగా వినిపించడానికి కూడా మేం కలిసి పనిచేస్తున్నాం.  

మిత్రులారా,

భారత్, మంగోలియాల మధ్య  ఉన్న సంబంధం ఒక్క దౌత్య సంబంధం మాత్రమే కాదు, అది అంతకు మించింది. మన మధ్య ఉన్నది ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన సంబంధాల్లో సిసలైన గాఢతనూ, విస్తృతినీ మన ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర  సంబంధాలు చాటి చెబుతున్నాయి.

మన రెండు దేశాలూ యుగాల తరబడి బౌద్ధధర్మ బంధంతో పెనవేసుకొన్నాయి. ఈ  కారణంగా మనని ఆధ్యాత్మిక బంధువులు అని కూడా పిలుస్తారు. ఇవాళ  ఈ సంప్రదాయాన్ని మరింత గాఢపరుచుకోవడంతో పాటు ఈ  చరిత్రాత్మక సంబంధాలకు ఒక కొత్త బలాన్ని ఇవ్వడానికి మేం అనేక ముఖ్య నిర్ణయాలు తీసుకున్నాం. వచ్చే సంవత్సరంలో భగవాన్ బుద్ధుని మహనీయ శిష్యులు.. సారిపుత్ర, మౌద్గల్యాయన్..లకు చెందిన పవిత్ర అవశేషాలను భారత్ నుంచి మంగోలియాకు పంపిస్తామని మీకు తెలియజేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

గందన్ మఠంలోని బౌద్ధ గ్రంథాలను కూలంకషంగా అధ్యయనం చేయడానికీ, ప్రాచీన జ్ఞాన పరంపరను  మరింత గాఢతరం చేయడానికీ దోహదం చేసేటట్లు మేం ఒక సంస్కృత టీచరును గందన్ మఠానికి పంపిస్తాం. మేం 10 లక్షల ప్రాచీన చేతిరాత పుస్తకాల డిజిటలీకరణ ప్రాజెక్టును కూడా త్వరలోనే మొదలుపెట్టాలని నిర్ణయించాం. మంగోలియాలో బౌద్ధధర్మం విస్తరించడంలో నలందా విశ్వవిద్యాలయం ఒక కీలక పాత్రను  పోషించింది. నలందాను గందన్ మఠంతో జోడించి మేం ఈ చరిత్రాత్మక సంబంధాల్లో ఒక కొత్త శక్తిని తీసుకురావాలని కూడా మేం ఇవాళ అంగీకరించాం.

మన సంబంధాలు ఒక్క కేంద్ర ప్రభుత్వాల వరకే పరిమితమైనవి కావు.. ఈ రోజు లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కూ, మంగోలియాకు చెందిన ఆర్ఖాంగాయ్ ప్రావిన్సుకూ మధ్య కుదిరిన ఎంఓయూ మన సాంస్కృతిక బంధాలకు సరికొత్త బలాన్నిస్తుంది.

మిత్రులారా,

మన సరిహద్దులు ఒకదానితో మరొకటి జతపడి ఉండకపోవచ్చు, కానీ భారత్ మంగోలియాను ఎప్పటికీ ఒక పొరుగు దేశంగానే చూస్తోంది. ఈ దృష్టితోనే మేం రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పటిష్ట పరుచుకుంటూ ఉంటాం. మంగోలియా  పౌరులకు ఉచితంగా ఈ-వీసాలను ఇవ్వాలని మేం నిర్ణయించాం. దీంతో పాటు ప్రతి ఏటా మంగోలియా యువతీయువకులు సాంస్కృతిక రాయబారులుగా భారత్‌లో పర్యటించేందుకు స్పాన్సర్‌గా మేం వ్యవహరిస్తాం.

మిత్రులారా,

మంగోలియా అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఒక బలమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటోంది.

భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌తో సిద్ధమవుతున్న చమురు శుద్ధి కర్మాగారం మంగోలియాకు ఇంధన భద్రతను బలపరుస్తుంది. ఇది ప్రపంచంలోనే భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న అతి పెద్ద డెవలప్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్ ప్రాజెక్టు. 2,500 కన్నా ఎక్కువ మంది భారతీయ వృత్తి నిపుణులు మంగోలియాలో సహచరులతో కలిసి ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.  

మిత్రులారా,

నైపుణ్యాలకు సాన పెట్టడంలోనూ మా  సహకారాన్ని మేం బలరుచుకొన్నాం. అటల్ బిహారీ వాజ్‌పేయీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఐటీ, ఇండియా-మంగోలియా ఫ్రెండ్‌షిప్ స్కూల్‌ల సాయంతో మంగోలియా యువత తన ఆకాంక్షలను నెరవేర్చుకోబోతోంది. ఈ పథకాలు మన గాఢమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఈ రోజు, సామాన్య ప్రజల జీవనంలో సానుకూల మార్పులను తీసుకువచ్చే ఉద్దేశంతో అనేక పథకాలను కూడా మేం ప్రకటించబోతున్నాం. మంగోలియా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కృషిని మేం ఇక ముందూ కొనసాగిస్తాం.

ఇంధనం, కీలక ఖనిజాలు, రేర్-అర్త్‌స్, డిజిటల్, గనుల తవ్వకం, వ్యవసాయం, పాడి, సహకార సంఘాల వంటి రంగాల్లో సహకారానికి సంబంధించిన కొత్త అవకాశాలను మన ప్రయివేటు రంగం కూడా పరిశీలిస్తుండడం చూస్తే నాకు సంతోషంగా ఉంది.

గౌరవ అధ్యక్షా,
 
రెండు ప్రాచీన నాగరికతల మధ్య విశ్వాసం, మైత్రిల తాలూకు బలమైన పునాది మీద మన సంబంధాలు నిలబడ్డాయి. వీటిని ఉమ్మడి  వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి సాధన విషయంలో నిబద్ధత పెంచి పోషిస్తున్నాయి. మనం  కలిసికట్టుగా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చుతామని నేను నమ్ముతున్నాను.

మరోసారి, మీ ఈ చరిత్రాత్మక పర్యటనకూ, భారత్ పట్ల మీ అచంచల మైత్రికీ, నిబద్ధతకూ నేను మీకు నా కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నాను.
 
బాయర్‌లా

అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.
 
***
 

(Release ID: 2179021) Visitor Counter : 9