ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 11న న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగే ప్రత్యేక కృషి కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రూ. 42,000 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులు, పథకాల ఆవిష్కరణ, ప్రారంభం, శంకుస్థాపనతో పాటు జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

24,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

100 జిల్లాల్లో వ్యవసాయాన్ని సానుకూలంగా మార్చడమే పథకం లక్ష్యం

రూ. 11,440 కోట్ల వ్యయంతో పప్పు ధాన్యాల స్వయం-సమృద్ధి మిషన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఉత్పాదకతను మెరుగుపరచడం, సాగు విస్తీర్ణాన్ని విస్తరించడం, వాణిజ్య కార్యకలాపాల బలోపేతం ద్వారా పప్పుధాన్యాల్లో స్వయం-సమృద్ధి సాధనే మిషన్ లక్ష్యం

పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులతో మాట్లాడనున్న ప్రధానమంత్రి

Posted On: 10 OCT 2025 6:10PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగే ప్రత్యేక కృషి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులతో ప్రధానమంత్రి సంభాషిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రైతు సంక్షేమం, వ్యవసాయ స్వయం-సమృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం పట్ల ప్రధానమంత్రి నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు అండగా నిలవడం, రైతు కేంద్రంగా చేపట్టిన కార్యక్రమాల్లో సాధించిన కీలక విజయాలను గుర్తించడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

రూ. 35,440 కోట్ల వ్యయంతో వ్యవసాయ రంగం కోసం రూపొందించిన రెండు ప్రధాన పథకాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. రూ. 24,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజననూ ఆయన ప్రారంభిస్తారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, విభిన్న రకాల పంటల సాగును ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, పంచాయతీలు.. మండలాల స్థాయిలో పంటకోతల అనంతరం నిల్వ సామర్థ్యాలను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, ఎంపిక చేసిన 100 జిల్లాల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల లభ్యతను సులభతరం చేయడం దీని లక్ష్యం.

పప్పుధాన్యాల్లో స్వయం-సమృద్ధి కోసం రూ. 11,440 కోట్లతో చేపట్టిన మిషన్‌నూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పప్పుధాన్యాల దిగుబడి స్థాయిలను మెరుగుపరచడం.. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని విస్తరించడం.. సేకరణ, నిల్వ, శుద్ధి వంటి వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయడం.. నష్టాలను తగ్గించడం దీని లక్ష్యం.

వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార శుద్ధి రంగాల్లో రూ. 5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి... వాటిని జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ. 815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు.

బెంగళూరు, జమ్మూ కాశ్మీర్‌లలో కృత్రిమ గర్భధారణ శిక్షణా కేంద్రాలు.. అమ్రేలి, బనాస్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద అస్సాంలో ఐవీఎఫ్ ల్యాబ్.. మెహ్సానా, ఇండోర్, భిల్వారాల్లో పాల పొడి ప్లాంట్లు.. అస్సాంలోని తేజ్‌పూర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల దాణా ప్లాంట్.. వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లకు మౌలిక సదుపాయాలు, సమీకృత కోల్డ్ చెయిన్-వాల్యూ అడిషన్ మౌలిక సదుపాయాలు ప్రధానమంత్రి ప్రారంభించనున్న ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.

ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చెయిన్-వాల్యూ అడిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఇర్రేడియేషన్).. ఉత్తరాఖండ్‌లో ట్రౌట్ ఫిషరీస్.. నాగాలాండ్‌లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్.. పుదుచ్చేరిలోని కారైకల్‌లో స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్.. ఒడిశాలోని హిరాకుడ్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద సర్టిఫై అయిన రైతులకు, మైత్రి సాంకేతిక నిపుణులకు, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పీఎంకేఎస్‌కేలు)గా మారిన ప్రాథమిక వ్యవసాయ సహకార క్రెడిట్ సొసైటీలకు (పీఏసీఎస్), కామన్ సర్వీస్ సెంటర్లకు (సీఎస్‌సీలు) సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.

ప్రభుత్వ కార్యక్రమాల కింద సాధించిన కీలక విజయాలను ఈ కార్యక్రమం సూచిస్తుంది. 10,000 ఎఫ్‌పీవోలలో 50 లక్షల మంది రైతుల సభ్యత్వాల నమోదు.. వీటిలో 1,100 ఎఫ్‌పీవోలు 2024-25లో రూ. 1 కోటి కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్‌ నమోదు చేయడం ఈ విజయాల్లో భాగంగా ఉన్నాయి. నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కింద 50,000 మంది రైతుల సర్టిఫికేషన్.. 38,000 మైత్రిల (గ్రామీణ భారతంలోని బహుళ ప్రయోజన ఏఐ సాంకేతిక నిపుణులు) సర్టిఫికేషన్.. కంప్యూటరీకరణ కోసం 10,000లకు పైగా బహుళ ప్రయోజన ఈ-పీఏసీఎస్‌ల మంజూరు, కార్యాచరణ.. పీఏసీఎస్‌, పాడి, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతం వంటి కార్యక్రమాలూ ఈ విజయాల్లో భాగంగా ఉన్నాయి. 10,000 కంటే ఎక్కువ పీఏసీఎస్‌లు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పీఎమ్‌కేఎస్‌కేలు)గా, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్‌సీలు)గా వివిధ రకాల సేవలను అందించనున్నాయి.

వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమలో వాణిజ్య కార్యకలాపాల ఆధారిత విధానాన్ని అమలు చేయడం కోసం ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులతో ప్రధానమంత్రి సంభాషిస్తారు. ఈ రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీవోల) సభ్యత్వం, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా మద్దతు వంటి ప్రయోజనాలను పొందారు.

 

***


(Release ID: 2177576) Visitor Counter : 9