ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: భారత్-బ్రిటన్ సీఈఓ ఫోరం సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
09 OCT 2025 4:41PM by PIB Hyderabad
గౌరవనీయులైన ప్రధానమంత్రి స్టార్మర్..
భారత్, బ్రిటన్ వ్యాపార రంగ నాయకులారా..
నమస్కారం!
ఈనాటి భారత్-బ్రిటన్ సీఈఓల ఫోరం సమావేశంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నింటికంటే ముందుగా విలువైన ఆలోచనలను పంచుకున్నందుకు ప్రధాన మంత్రి స్టార్మర్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార రంగ నాయకులుగా మీరు చేస్తోన్న నిరంతర కృషి వల్ల ఈ ఫోరం.. భారత్-బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైన వేదికగా మారింది. ఈ రోజు మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత.. మనం సహజ భాగస్వాములుగా మరింత వేగంతో ముందుకు సాగగలమనే నా నమ్మకం మరింత పెరిగింది. ఈ విషయంలో మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆస్థిరత ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. భారత్- బ్రిటన్ సంబంధాల్లో స్థిరత్వం పెరిగింది. ఈ జూలైలో నా బ్రిటన్ పర్యటన సందర్భంగా మేం సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేశాం. ఈ చారిత్రాత్మక విజయం సాధించటంలో నా స్నేహితుడు ప్రధాన మంత్రి స్టార్మర్ చూపించిన నిబద్ధత, దార్శనికత పట్ల ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు.. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల ఉమ్మడి పురోగతి, ఉమ్మడి సుసంపన్నత, ఉమ్మడి ప్రజా సంబంధాలకు సంబంధించిన ఒక రోడ్‌మ్యాప్. మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు రెండు దేశాలలోని ఎంఎస్ఎంఈలను కూడా ఈ ఒప్పందం శక్తిమంతం చేస్తుంది. ఇది లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి మార్గాలను తీసుకొస్తుంది.
మిత్రులారా,
సీఈటీఏ పూర్తి సామర్థ్యాన్ని అందుకోవటంలో సహాయపడేందుకు ఈ భాగస్వామ్యానికి సంబంధించిన నాలుగు కొత్త అంశాలను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒప్పందానికి ఇవి బహుశా మరింత విస్తృత అర్థాన్నిస్తాయి.
సీ అంటే వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ (కామర్స్, ఎకానమీ)
ఈ అంటే విద్య, ప్రజా సంబంధాలు (ఎడ్యుకేషన్, పీపుల్ టూ పీపుల్ టైస్)
టీ అంటే సాంకేతికత, ఆవిష్కరణ (టెక్నాలజీ, ఇన్నోవేషన్)
ఏ అంటే ఆకాంక్షలు (యాస్పిరేషన్స్)
నేడు మన ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 56 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనిని 2030 నాటికి రెట్టింపు చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. మనం ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం నాకు ఉంది.
మిత్రులారా,
నేడు భారత్.. విధాన స్థిరత్వం, ఊహించదగిన చట్ట నియంత్రణ, భారీ డిమాండ్‌ను అందిస్తోంది. ఈ వాతావరణంలో దేశంలో మౌలిక సదుపాయాలు, ఔషధాలు, శక్తి, ఆర్థిక సేవలతో సహా ప్రతి రంగంలోనూ గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. త్వరలో భారత్‌లో తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌లను ప్రారంభించనున్నాయన్న విషయం కూడా సంతోషాన్ని కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో విద్యా-పరిశ్రమ భాగస్వామ్యాలు మన ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద చోదక శక్తిగా మారతాయి.
మిత్రులారా,
ఈరోజు టెలికాం, ఏఐ, బయోటెక్, క్వాంటం సాంకేతికత, సెమీకండక్టర్స్, సైబర్, స్పేస్ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారానికి లెక్కలేనన్ని కొత్త అవకాశాలు వస్తున్నాయి. రక్షణ రంగంలో కూడా మనం సహ-రూపకల్పన, సహోత్పత్తి వైపు అడుగులు వేస్తున్నాం. ఈ అవకాశాలన్నింటినీ వేగం, సంకల్పంతో ఖచ్చితమైన భాగస్వామ్యాలుగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కీలక ఖనిజాలు, అరుదైన భూ పదార్థాలు, ఏపీఐలు వంటి వ్యూహాత్మక రంగాలలో మనం నిర్మాణాత్మక స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలి. ఇది మన భాగస్వామ్యానికి భవిష్యత్తు దిశను నిర్దేశిస్తుంది.
మిత్రులారా,
ఫిన్‌టెక్ రంగంలో భారత్ సామర్థ్యాన్ని మీరందరూ చూశారు. ప్రపంచంలోని తక్షణ డిజిటల్ లావాదేవీలలో దాదాపు 50 శాతం ప్రస్తుతం భారత్‌లోనే జరుగుతున్నాయి. ఆర్థిక సేవలలో బ్రిటన్ నైపుణ్యాన్ని భారత్‌కు సంబంధించిన డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలతో (డీపీఐ- డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్రక్చర్) జోడించటం ద్వారా మానవాళి మొత్తానికి అపారమైన ప్రయోజనాలను మనం చేకూర్చగలం.
మిత్రులారా,
మన సంబంధాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు ప్రధాన మంత్రి స్టార్మర్, నేను కలిసి విజన్ 2035ను ప్రకటించాం. ఇది మన ఉమ్మడి ఆశయాల బ్లూప్రింట్. భారత్, బ్రిటన్ వంటి బహిరంగ మార్కెట్ కలిగి ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్యం పెంపొందని ఆంశమే ఉండదు. భారత్‌కు ఉన్న నైపుణ్యాలు- స్థాయి బ్రిటన్‌కు ఉన్న పరిశోధన- అభివృద్ధి - నైపుణ్యాలతో కలిపి భారీ స్థాయి ఫలితాలను అందించగల భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆకాంక్షలు, ఆశయాలను సమయానుకూల పద్ధతిలో సాకారం చేసుకోవడంలో మీ మద్దతు, సహకారం చాలా ముఖ్యం.
మిత్రులారా,
మీ కంపెనీలలో చాలా వరకు ఇప్పటికే భారత్‌లో ఉన్నాయి. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అనవసరమైన చట్టాలు, నిబంధనల భారాన్ని తగ్గించడం ద్వారా వ్యాపారాన్ని సులభతరం చేయడంపై దేశం గట్టిగా దృష్టి సారించింది. ఇటీవల మేం జీఎస్టీలో సంస్కరణలను తీసుకొచ్చాం. ఇది మీ అందరికీ కొత్త అవకాశాలను సృష్టిస్తూనే.. మన మధ్యతరగతి, ఎంఎస్‌ఎంఈల వృద్ధిని మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
మౌలిక సదుపాయాల అభివృద్ధి మాకు అత్యంత ప్రాధాన్యతగా ఉంది. తదుపరి తరం భౌతిక మౌలిక సదుపాయాలలో మేం పెట్టుబడులు పెడుతున్నాం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. అణు విద్యుత్ రంగ ద్వారాలను ప్రైవేట్ రంగానికి తెరుస్తున్నామని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పరిణామాలన్నీ భారత్-బ్రిటన్ సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే కొత్త మార్గాలను సృష్టిస్తున్నాయి. భారత్ అభివృద్ధి ప్రయాణంలో కలిసి నడవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫిన్‌టెక్, హరిత హైడ్రోజన్, సెమీకండక్టర్లు లేదా అంకురాలు అయినా మనం ఉమ్మడిగా ప్రపంచ నాయకులుగా మారే రంగాలను భారత్, బ్రిటన్ వ్యాపార రంగ నాయకులు కలిసి గుర్తించగలరని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి అంశాలు ఇంకా చాలా ఉండొచ్చు. భారతదేశం, బ్రిటన్ కలిసి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించనిద్దాం!
ఈరోజు ఇక్కడికి వచ్చేందుకు సమయం కేటాయించినందుకు మీ అందరికీ మరోసారి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
***
(Release ID: 2177496)
Visitor Counter : 19
Read this release in:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam