ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 08 OCT 2025 1:19PM by PIB Hyderabad

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!

‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ (ఐఎంసీ) ప్రత్యేక సమావేశానికి హాజరైన మీకందరికీ ముందుగా నా సాదర స్వాగతం. అనేక కీలకాంశాలపై మన అంకుర సంస్థల ప్రతినిధులు తమ ఆలోచనలను సాదృశంగా వివరించారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక మోసాల నిరోధం, క్వాంటం కమ్యూనికేషన్, 6జి సాంకేతికత, ఆప్టికల్ కమ్యూనికేషన్, సెమీకండక్టర్లు వంటివి ఆకట్టుకున్నాయి. ఇవన్నీ చూశాక దేశ సాంకేతిక భవిష్యత్తు సమర్థుల చేతుల్లోనే ఉందన్న నమ్మకం కలిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ, మీ వినూత్న ఆవిష్కరణలపై శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

‘ఐఎంసీ’ అనేది ఇప్పుడు కేవలం మొబైల్ లేదా టెలికాం రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఈ కార్యక్రమం ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ సాంకేతిక వేదికగా రూపొందింది.

మిత్రులారా!

‘ఐఎంసీ’ విజయానికి మూలమేమిటి? దీనికి సారథులెవరు?

మిత్రులారా!

ఈ విజయానికి మూలం భారత సాంకేతిక నైపుణ్య దృక్పథం. దీనికి సారథ్యం వహించింది మన యువతరం, భారతీయ ప్రతిభ. మన ఆవిష్కర్తలు, మన అంకుర సంస్థలు అండదండగా నిలిచాయి. ఈ దేశీయ ప్రతిభాసామర్థ్యాలకు ప్రభుత్వం దృఢమైన మద్దతు తోడు కావటంతో ఇదంతా సుసాధ్యమైంది. ఈ మేరకు “టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్, ‘డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్క్వేర్” వంటి పథకాల ద్వారా అంకుర సంస్థలకు మేం నిధులు సమకూరుస్తున్నాం. అంతేకాకుండా అంకుర సంస్థలు తమ ఉత్పత్తులకు రూపమిచ్చే దిశగా “5జి, 6జి, అడ్వాన్స్‌డ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్‌, టెరా-హెర్ట్జ్” వంటి సాంకేతికతలపై ప్రయోగాలకు నిధులిస్తున్నాం. అలాగే అంకుర సంస్థలు, ప్రధాన పరిశోధన సంస్థల మధ్య భాగస్వామ్య సౌలభ్యం కల్పిస్తున్నాం. భారత పారిశ్రామిక రంగం, అంకుర సంస్థలు, విద్యా సంస్థలు నేడు అనేక రంగాల్లో ప్రభుత్వ చేయూతతో సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. స్వదేశీ సాంకేతికతల రూపకల్పన, విస్తరణ, పరిశోధన-ఆవిష్కరణలతో మేధా సంపద సృష్టి లేదా అంతర్జాతీయ ప్రమాణాలకు తోడ్పాటు వంటి ప్రతి కోణంలోనూ భారత్‌ వేగంగా పురోగమిస్తోంది. ఈ బహుముఖ కృషి ఫలితంగానే ఓ ప్రభావశీల ప్రపంచ వేదికగా అవిర్భవించింది.

మిత్రులారా!

స్వయంసమృద్ధి దిశగా భారత్‌ దార్శనికత బలాన్ని టెలికాం రంగంలో దేశం సాధించిన విజయంతో పాటు ‘ఐఎంసీ’ ప్రతిబింబిస్తున్నాయి. నేను ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి ప్రస్తావించిన ప్రతిసారి కొందరు ఎలా హేళన చేసేవారో మీకు గుర్తుంది కదా! అత్యున్నత సాంకేతికతతో ఉత్పత్తుల తయారీ భారత్‌కు సాధ్యమేనా? అని సందేహ జీవులు ప్రశ్నించేవారు. వారి హయాంలో సరికొత్త సాంకేతికత భారత్‌కు అందాలంటే ఏళ్లూపూళ్లూ పట్టేది. కాబట్టే అన్నిటినీ సందేహించడం వారికి అలవాటుగా మారింది. ఇప్పుడు దేశం వారికి దీటైన సమాధానమిస్తోంది... ఒకనాడు మన దేశం 2జి సాంకేతికతకు పరిమితమై ఎన్నో ఇబ్బందులు పడింది. అయితే, నేడు దేశంలో దాదాపు ప్రతి జిల్లాకూ 5జి సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇక 2014తో పోలిస్తే మన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 6 రెట్లు దాటగా- మొబైల్ ఫోన్ తయారీ 28 రెట్లు, ఎగుమతులు 127 రెట్లు పెరిగాయి. గడచిన దశాబ్దం  వ్యవధిలో మొబైల్ ఫోన్ తయారీ రంగం లక్షలాది ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. ఇటీవల వెల్లడైన ఒక పెద్ద స్మార్ట్‌ ఫోన్ కంపెనీ సమాచారం ప్రకారం- 45 భారత కంపెనీలు సదరు కంపెనీ సరఫరా వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. ఈ అనుసంధానం ఫలితంగా దేశంలోని శ్రామిక శక్తికి సుమారు 3.5 లక్షల ఉద్యోగాలు లభించాయి. ఇది ఒక కంపెనీకి సంబంధించిన సంఖ్య కాదు... మన దేశ తయారీ రంగంలో ఇప్పుడు అనేక కంపెనీలు ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. ఈ ప్రత్యక్ష ఉద్యోగాలకు పరోక్ష అవకాశాలను జోడిస్తే, ఉపాధి పొందేవారి సంఖ్య ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

మిత్రులారా!

భారత్‌ ఇటీవలే ‘మేడ్ ఇన్ ఇండియా’ 4జి ‘శ్టాక్‌’ (4వ తరం టెలికాం సాంకేతిక నెట్‌వర్క్‌)ను ప్రారంభించింది. స్వదేశీ నినాదంతో దేశం సాధించిన అతిపెద్ద విజయమిది. తద్వారా ఈ సాంకేతిక సామర్థ్యం గల ప్రపంచంలోని 5 దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. డిజిటల్ స్వావలంబన, సాంకేతిక స్వాతంత్ర్యం దిశగా దేశానికి ఇదొక పెద్ద ముందడుగు. స్వదేశీ 4జి, 5జి ‘శ్టాక్‌’ ద్వారా నిరంతర సంధానం సాధ్యమవుతుంది. అంతేగాక దేశవాసులకు వేగంతో కూడిన, విశ్వసనీయ సేవలు కూడా లభిస్తాయి. ఇటీవల ‘మేడ్ ఇన్ ఇండియా’ 4జి ‘శ్టాక్‌’కు శ్రీకారం చుట్టిన రోజునే దేశవ్యాప్తంగా దాదాపు లక్ష 4జి టవర్లను కూడా ప్రారంభించాం. ఇలా లక్ష టవర్లను ఒకేసారి వినియోగంలోకి తెచ్చిన వార్త కొన్ని దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దేశంలోని ప్రజలకూ ఈ గణాంకాలు ఊహకందనివిగా కనిపించినా, ఏకకాలంలో 2 కోట్ల మందికిపైగా ఈ డిజిటల్ విప్లవంలో భాగస్వాములు కావడం వాస్తవం. అనేక మారుమూల ప్రాంతాలకు డిజిటల్ అనుసంధానం కష్టతరమైన నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ప్రదేశాలకు ఇంటర్నెట్ సదుపాయం చేరువైంది.

మిత్రులారా!

మన  ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ 4జి శ్టాక్‌ మరో విధంగానూ విశిష్టమైనది... ఇది ఎగుమతి సంసిద్ధమైనది కావడమే ఆ ప్రత్యేకత. అంటే- భారత వ్యాపార విస్తరణకు ఒక మాధ్యమంగానూ, ‘భారత్‌-2030’.. అంటే- ‘ఇండియా 6జి దార్శనికత’ విజయవంతం కావడంలోనూ ఇది తోడ్పడుతుంది.

మిత్రులారా!

భారత సాంకేతిక విప్లవం గత 10 సంవత్సరాల్లో వేగంగా పురోగమించింది. ఈ వేగం, స్థాయి సాధించాలంటే చట్టపరంగా బలమైన, ఆధునిక విధాన పునాది అవసరమనే భావన చాలా కాలం నుంచీ ఉంది. ఈ మేరకు రెండు పురాతన చట్టాలు- ‘ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం’, ‘ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం’ స్థానంలో ‘టెలికమ్యూనికేషన్స్ చట్టం’ రూపొందించాం. మునుపటి చట్టాలు మీరు, నేను, ఇక్కడ కూర్చున్న వ్యక్తులు కూడా పుట్టక ముందు కాలంలో రూపొందాయి. కాబట్టి, 21వ శతాబ్దపు పద్ధతులకు తగిన కొత్త వ్యవస్థను సృష్టించాల్సిన అవసరానికి అనుగుణంగా మేం కొత్త చట్టానికి రూపమిచ్చాం. ఇది ఒక నియంత్రణ వ్యవస్థలా కాకుండా, సౌలభ్యం కల్పించేదిగా ఉంటుంది గనుక అనుమతులు, ఆమోదాలు వంటివన్నీ పొందడం సులభమవుతుంది. దీని ఫలితాలు... ఫైబర్, టవర్ నెట్‌వర్కుల విస్తరణ రూపంలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. దీంతో వాణిజ్య సౌలభ్యం ఇనుమడించి, పెట్టుబడులకు ప్రోత్సాహం లభించడంతో పాటు పరిశ్రమలకు దీర్ఘకాలిక ప్రణాళిక సదుపాయం కలిగింది.

మిత్రులారా!

మరోవైపు సైబర్ భద్రతకు మేం సమ ప్రాధాన్యమిస్తూ మోసాల నిరోధానికి కఠిన చట్టాలు రూపొందించడంతో ఇప్పుడు దేశంలో జవాబుదారీతనం కూడా ఇనుమడించింది. అంతేగాక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా మెరుగుపరిచినందువల్ల అటు పారిశ్రామిక రంగానికి, ఇటు ప్రజానీకానికి భారీ ప్రయోజనాలు లభిస్తున్నాయి.

మిత్రులారా!

యావత్‌ ప్రపంచం నేడు భారత్‌ సామర్థ్యాన్ని గుర్తిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్ మనదే కావడంతోపాటు రెండో అతిపెద్ద 5జి మార్కెట్ ఇక్కడుంది. అంతేగాక మానవశక్తి, చలనశీలత, సానుకూల దృక్పథం కూడా ఉన్నాయి. మానవశక్తి విషయానికొస్తే,  దేశంలో నైపుణ్యం, స్థాయి.. రెండింటికీ కొదవలేదు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభాగల దేశం కావడమేగాక ప్రస్తుత యువతరం భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ పొందుతోంది. మరోవైపు డెవలపర్ల సంఖ్య రీత్యా భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తున్న దేశంగానూ పరిగణనలో ఉంది.

మిత్రులారా!

నేను తరచూ ‘టీ’ తాగడాన్ని ఉదాహరిస్తుంటాను... అదే తరహాలో దేశంలో నేడు ఒక ‘జీబీ’ వైర్‌లెస్ డేటా ధర ఒక కప్పు టీ ఖర్చుకన్నా తక్కువ. కాబట్టే, తలసరి డేటా వినియోగంలో భారత్‌ ప్రపంచంలోని ప్రముఖ దేశాల జాబితాలో ఉంది... అంటే- మన దేశంలో డిజిటల్ సంధానం ఇకపై  ఒక ప్రత్యేక సౌకర్యం లేదా విలాసం కాదు... భారతీయుల జీవితంలో అంతర్భాగం.

మిత్రులారా!

పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించే ధోరణిలోనూ మనం ముందంజలోనే ఉన్నాం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, సాదరంగా స్వాగతించే ప్రభుత్వ విధానాలు, వాణిజ్య సౌలభ్య విధానాలు, భారత్‌ను పెట్టుబడుల అనుకూల గమ్యంగా మార్చాయి. సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో మన విజయం ‘డిజిటల్‌ ప్రాధాన్యం’పై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. అందువల్ల భారత్‌లో పెట్టుబడులతోపాటు ఆవిష్కరణలకు, తయారీకి ఇది అనువైన సమయమని నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను! తయారీ రంగం నుంచి సెమీకండక్టర్లు.. మొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్.. అంకుర సంస్థల దాకా ప్రతి రంగంలోనూ భారత్‌ శక్తిసామర్థ్యాలు అపారం.

మిత్రులారా!

కొన్ని వారాల కిందట ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి ప్రసంగిస్తూ- ఇది పెనుమార్పుల సంవత్సరమని, భారీ సంస్కరణలు ముందున్నాయని నేను ప్రకటించాను. తదనుగుణంగా మేం సంస్కరణల వేగం పెంచుతున్నాం కాబట్టే, మా పరిశ్రమలు, ఆవిష్కర్తల బాధ్యత కూడా పెరుగుతోంది. ఈ మేరకు మన అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. వారి వేగం, సాహసం, సామర్థ్యాల తోడ్పాటుతో అంకుర సంస్థలు కొత్త మార్గాలను, కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఐఎంసీ’ ఈసారి 500కుపైగా అంకుర సంస్థలను ఆహ్వానించడంతోపాటు ప్రపంచ మార్గదర్శకులు, పెట్టుబడిదారులతో సంధానానికి వీలు కల్పించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

మిత్రులారా!

ఈ రంగం వృద్ధిలో ఇప్పటికే స్థిరపడిన మా సంస్థల పాత్ర నిరంతరం విస్తరిస్తోంది. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంతోపాటు దాని సుస్థిరత, స్థాయి, దిశను కూడా నిర్దేశించగలవు. అంతేగాక పరిశోధన-ఆవిష్కరణల సామర్థ్యం ఉన్నందున అంకుర సంస్థల వేగం, స్థిరపడిన సంస్థల స్థాయి... రెండింటి ద్వారా మనం మరింత శక్తి సంపన్నులు కాగలం.

మిత్రులారా!

ఆరంభ దశలోని అంకుర సంస్థలు, మన విద్యా, పరిశోధన సంస్థలు, పరిశోధకులు-విధాన రూపకర్తల మధ్య సహకారం తదితరాలతో కూడిన పరిశ్రమ సంబంధిత అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిపై చర్చలకు ‘ఐఎంసీ’ వేదిక కాగలిగితే, మన ప్రయోజనాలు అనేక రెట్లు పెరిగే వీలుంటుంది.

మిత్రులారా!

ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఎక్కడ అంతరాయాలు సంభవిస్తున్నాయో మనం గమనించాలి. మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ సహా యావత్‌ సాంకేతికావరణ వ్యవస్థలో అంతర్జాతీయంగా అవరోధాలు ఉన్నచోట పరిష్కారాలను అందించే అవకాశం భారత్‌కు ఉంది. ఉదాహరణకు సెమీకండక్టర్ తయారీ సామర్థ్యం కొన్ని దేశాలకే పరిమితమైందని, ప్రపంచం ఇప్పుడు వైవిధ్యాన్ని ఆకాంక్షిస్తున్నదని మనం గమనించాం. అందుకే, ఈ దిశగా గణనీయ చర్యలు తీసుకోవడంతో దేశంలో ఇప్పుడు 10 సెమీకండక్టర్ తయారీ యూనిట్ల నిర్మాణం కొనసాగుతోంది.

మిత్రులారా!

ఎలక్ట్రానిక్స్ తయారీలో స్థాయి, విశ్వసనీయత రెండింటినీ అందించగల విశ్వసనీయ భాగస్వాముల కోసం అనేక అంతర్జాతీయ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఆ క్రమంలోనే టెలికాం నెట్‌వర్క్ పరికరాల రూపకల్పన, తయారీలోనూ నమ్మకమైన భాగస్వాముల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అలాంటప్పుడు భారత కంపెనీలు విశ్వసనీయ అంతర్జాతీయ రూపకర్తలు, సరఫరాదారు భాగస్వాములుగా మారడం అసాధ్యమా?

మిత్రులారా!

“చిప్‌సెట్‌లు, బ్యాటరీల నుంచి డిస్ప్లేలు, సెన్సార్ల” దాకా మొబైల్ తయారీ పనులు దేశంలోనూ అధికంగా సాగాలి. మునుపటితో పోలిస్తే ప్రపంచంలో ఇవాళ ఎక్కువ డేటా ఆవిష్కృతం అవుతోంది. కాబట్టి, నిల్వ-భద్రత, సర్వాధికారం వంటి అంశాలు కీలకమవుతున్నాయి. అందువల్ల, డేటా సెంటర్లతోపాటు క్లౌడ్ మౌలిక సదుపాయాలపై కృషి ద్వారా భారత్‌ ప్రపంచ డేటా కూడలి కాగలదు.

మిత్రులారా!

ఈ నేపథ్యంలో ‘ఐఎంసీ’ వేదికపై కొనసాగే చర్చలు, సంభాషణలు ఈ విధానం, లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంపై మరోసారి మీకందరికీ నా శుభాకాంక్షలు... అనేకానేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

 

చివరగా అందరికీ కృతజ్ఞతలు.


(Release ID: 2176520) Visitor Counter : 4