ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐఐటీ భువనేశ్వర్‌లో 'నమో సెమీకండక్టర్ ల్యాబ్' ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా స్వదేశీ చిప్ తయారీ, ప్యాకేజింగ్ సామర్ధ్యాలను బలోపేతం చేసేందుకు మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు దోహదపడనున్న ల్యాబ్
పరిశ్రమల అవసరాలకు సరిపోయే నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేస్తూ 'భారత్‌లో తయారీ', 'భారత్‌లో డిజైన్ ' కార్యక్రమాలను బలోపేతం చేయనున్న ల్యాబ్
ఐఐటీ భువనేశ్వర్‌ను సెమీకండక్టర్ పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా మార్చనున్న ల్యాబ్
Posted On:
05 OCT 2025 12:06PM by PIB Hyderabad
ఐఐటీ భువనేశ్వర్‌లో ‘నమో సెమీకండక్టర్ లాబొరేటరీ’ ఏర్పాటుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఆమోదం తెలిపారు. ఎంపీ లాడ్స్ పథకం నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4.95 కోట్లు.
నమో సెమీకండక్టర్ ల్యాబ్ యువతను పరిశ్రమ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా భారత్‌లోని మానవ వనరులను పెంచనుంది. ఐఐటీ భువనేశ్వర్‌ను సెమీకండక్టర్ పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా మార్చనున్న ఈ ల్యాబ్ .. దేశవ్యాప్తంగా రాబోతున్న చిప్ తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లకు కావాల్సిన మానవ వనరుల అభివృద్ధిలో సహాయపడనుంది.
ఈ కొత్త ల్యాబ్ 'భారత్‌లో తయారీ’, 'భారత్‌లో డిజైన్' కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తుంది. ఇది భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న సెమీకండక్టర్ వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైన్ చేస్తోన్న మానవ వనరుల్లో 20 శాతం భారత్‌లో ఉంది. దేశవ్యాప్తంగా 295 విశ్వవిద్యాలయాల విద్యార్థులు సెమీ కండక్టర్ పరిశ్రమలు అందించిన అధునాతన ఈడీఏ సాధనాలను ఉపయోగిస్తున్నారు. 20 సంస్థలకు చెందిన ఇరవై ఎనిమిది విద్యార్థులు రూపొందించిన చిప్‌లను తయారీ కోసం ఎస్‌సీఎల్ మొహాలికి పంపించారు.
ఐఐటీ భువనేశ్వర్ ఎందుకు?
ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఒడిశాలో రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఇటీవల ఆమోదం లభించింది. వీటిలో ఒకటి సిలికాన్ కార్బైడ్ (ఎస్ఐసీ) ఆధారిత కాంపౌండ్ సెమీకండక్టర్లను తయారుచేసేది కాగా రెండోది అధునాతన 3డీ గ్లాస్ ప్యాకేజింగ్‌కు సంబంధించినది.
ఇప్పటికే ఐఐటీ భువనేశ్వర్‌లో సిలికాన్ కార్బైడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీఆర్ఐటీ) ఉంది. ఈ కొత్త ల్యాబ్ వల్ల ప్రస్తుతం విద్యా సంస్థలో ఉన్న పరిశుభ్రమైన గదులు పెరగనున్నాయి. భారతదేశంలోని సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతునిచ్చేందుకు పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలను ఈ ల్యాబ్ అందించనుంది.
నమో సెమీకండక్టర్ ల్యాబ్:
ప్రతిపాదిత ల్యాబ్‌లో సెమీకండక్టర్ శిక్షణ, డిజైన్, తయారీకి అవసరమైన పరికరాలు, సాఫ్ట్‌వేర్ ఉంటాయి. పరికరాలకు 4.6 కోట్లు, సాఫ్ట్‌వేర్‌కు 35 లక్షలు ఖర్చు అవుతుందన్న అంచనా ఉంది.
(Release ID: 2175009)
Visitor Counter : 6