ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబరు 1న ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి

ప్రత్యేక స్మారక తపాలా బిళ్లనూ, నాణేన్నీ విడుదల చేయనున్న ప్రధానమంత్రి

ఆర్ఎస్ఎస్ వారసత్వాన్నీ, సాంస్కృతిక సేవలనూ, భారతదేశాన్ని ఏకతాటి మీద నిలపడంలో ఆర్ఎస్ఎస్ పాత్రనూ

ముఖ్యంగా ప్రస్తావించ బోతున్న శత వార్షికోత్సవం

Posted On: 30 SEP 2025 10:30AM by PIB Hyderabad

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతవార్షికోత్సవాలను రేపు (అక్టోబరు 1న) ఉదయం 10:30కి న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ అందిస్తున్న సేవలను ప్రతిబింబించేటట్లు రూపొందించిన ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్లనూ, స్మారక నాణేన్నీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
దేశ ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్నీ, క్రమశిక్షణనూ, సేవ భావనతో పాటు సామాజిక బాధ్యతనూ పెంచే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్‌ను డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో స్థాపించారు. స్వచ్ఛందంగా  సేవ చేసే కార్యకర్తలు ఈ సంస్థకు వెన్నుదన్నుగా ఉంటున్నారు.
జాతి పునర్నిర్మాణ ధ్యేయంతో ప్రజలు పెంచి పోషిస్తున్న ఒక అద్వితీయ ఉద్యమం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. భారత్ శతాబ్దాల తరబడి విదేశీ పాలనను చూసింది. ఈ పరిణామానికి ఒక ప్రతిస్పందనగా ఆర్ఎస్ఎస్ పుంజుకుందని చెప్పవచ్చు. ధర్మం పునాదులపై మన దేశ వైభవాన్ని దర్శించుకోవాలని చాటిచెబుతున్న ఈ సంస్థ ఇంతింతగా విస్తరిస్తోంది.
దేశభక్తి, జాతీయవాదం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పట్టుగొమ్మలుగా ఉన్నాయి. మాతృభూమి పట్ల పౌరుల్లో నిష్ఠను పాదుగొల్పడం, క్రమశిక్షణను పెంచడం, స్వయంసంయమనాన్నీ, ధైర్య సాహసాలనూ, వీరత్వాన్నీ ప్రోత్సహించడం సంఘ్ ఆశయాలు. భారత్ ‘‘సర్వాంగీణ ఉన్నతి’’ (సర్వతోముఖ అభివృద్ధి) దిశగా భారత్ అడుగులు వేసేటట్లు చూడడమే సంఘ్ అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్వయంసేవకులంతా ఎప్పటికప్పుడు పునరంకితమవుతున్నారు.
విద్య, ఆరోగ్యం, అందరి సంక్షేమం దిశగా పాటుపడడంతో పాటు విపత్తుల వేళల్లో రక్షణ, సహాయ చర్యలను చేపడుతూ ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాలుగా ఒక ప్రధాన పాత్రను పోషిస్తోంది. వరదలు, భూకంపాలు, గాలివాన సహా ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు రక్షణ చర్యలను చేపట్టే, పునరాశ్రయాన్ని  సమకూర్చే కృషిలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చురుగ్గా సేవలందించారు. దీనికి తోడు, ఆర్ఎస్ఎస్‌‌తో అనుబంధమున్న వేర్వేరు సంస్థలు కూడా యువత, మహిళలతో పాటు రైతుల సాధికారతకు కూడా తోడ్పడుతూ, వివిధ ప్రాంతాల్లో స్థానికులను చైతన్యవంతులను చేస్తున్నాయి.
శతవార్షికోత్సవాలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇంతవరకు చరిత్రలో నమోదు చేసిన ఘన విజయాలను స్ఫురణకు తెస్తూనే, భారత సాంస్కృతిక ప్రస్థానానికి సంస్థ అందించిన సేవలనూ, దేశమంతా ఒక్కటే అనే ఈ సంస్థ సందేశాన్నీ ప్రజలకు మరో మారు చాటిచెబుతాయి.

 

***


(Release ID: 2173075) Visitor Counter : 17