ప్రధాన మంత్రి కార్యాలయం
డిజిటల్ దిశగా ఎంఎస్ఎంఈ-ఆటోమోటివ్ కంపెనీలు... తమిళనాడు... మధురైలో జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
27 FEB 2024 9:44PM by PIB Hyderabad
వణక్కం! (శుభాకాంక్షలు)
నేనిక్కడికి రావడంలో ఆలస్యం వల్ల మీరంతా వేచి ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను మన్నించాల్సిందిగా ముందుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఈ ఉదయం అనుకున్న సమయానికే ఢిల్లీ నుంచి బయల్దేరాను. అయితే ఒక్కో కార్యక్రమంలో అయిదూ, పదీ నిమిషాల జాప్యం వల్ల నాకు ఆలస్యమైంది. ఈ జాప్యానికి మన్నించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.
మిత్రులారా,
సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో మేధోసంపన్నులైన ఇంతమంది పాల్గొన్న సమావేశంలో భాగస్వామి కావడం నిజంగా ఉత్తేజకరం. భవిష్యత్తును రూపుదిద్దే ప్రయోగశాలలో నేను అడుగుపెట్టానా అని అనిపిస్తోంది. సాంకేతికతలో.. ముఖ్యంగా ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో తమిళనాడు సత్తా చాటింది. ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్’ అని ఈ కార్యక్రమానికి మీరు తగిన పేరే పెట్టడం సంతోషదాయకం. ‘క్రియేటింగ్ ది ఫ్యూచర్ – డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్స్!’ సమావేశం ఎంఎస్ఎంఈలను, అనేక మంది ప్రతిభావంతులైన యువతను ఒకే వేదికపైకి ఆహ్వానించిన టీవీఎస్ కంపెనీకి అభినందనలు. ఈ కార్యక్రమం ఆటోమోటివ్ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా.. అభివృద్ధి చెందిన భారత్ సాకారమయ్యేలా దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది స్పష్టమైన సందేశాన్ని అందిస్తోందన్న విషయం నాకర్థమైంది.
మిత్రులారా,
మన మొత్తం జీడీపీలో ఆటోమొబైల్ పరిశ్రమ వాటా 7 శాతమని మీకు తెలుసు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటునందిస్తోంది. రవాణాను సులభతరం చేయడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థనూ, పురోగతినీ ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆటోమొబైల్స్ కీలక పోషిస్తోందని దీని ద్వారా స్పష్టమవుతోంది. తయారీని, ఆవిష్కరణలను పెంపొందించడంలో కూడా ఆటోమొబైల్ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
మిత్రులారా,
ఈ రంగంలో ఎంఎస్ఎంఈల పాత్రను బట్టి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఎంత ప్రధానమైనదో స్పష్టమవుతోంది. భారత్ ఏటా దాదాపు 45 లక్షల కార్లు, 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 10 లక్షల వాణిజ్యపరమైన వాహనాలు, 8.5 లక్షల త్రిచక్ర వాహనాలను తయారు చేస్తోంది. ఏ ప్యాసింజర్ వాహనంలోనైనా 3000 నుంచి 4000 విడిభాగాలుంటాయని మీకు బాగా తెలుసు. అంటే ఆ వాహనాల తయారీకి రోజూ లక్షలాది విడిభాగాలు అవసరమవుతాయి. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న భారతీయ ఎంఎస్ఎంఈలే వీటిలో చాలా వరకు సరఫరా చేస్తున్నాయి. భారతీయ ఎంఎస్ఎంఈలు తయారుచేస్తున్న విడిభాగాలను నేడు ప్రపంచవ్యాప్తంగా వాహనాల్లో అమర్చుతున్నారు. దీంతో అనేక అంతర్జాతీయ అవకాశాలు లభిస్తున్నాయి.
మిత్రులారా,
అంతర్జాతీయ సరఫరా శ్రేణిలో సమగ్ర అంతర్భాగాలుగా నిలిచేందుకు మన ఎంఎస్ఎంఈలకు ప్రస్తుతం అనేక అవకాశాలున్నాయి. అయితే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, మన్నికలను పెంపొందించుకోవడానికి మన ఎంఎస్ఎంఈలు ప్రాధాన్యమివ్వాలి. ‘లోపాల్లేని, ఉద్గార రహిత (జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్) ఉత్పత్తులు’ అనే ప్రాథమిక సూత్రాన్ని మనస్ఫూర్తిగా అందిపుచ్చుకుంటేనే.. అంతర్జాతీయ వేదికపై భారత్ తనదైన ముద్ర వేయగలదని ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ నేనొకసారి స్పష్టంగా చెప్పాను. జీరో డిఫెక్ట్ అంటే లోపాల్లేని నాణ్యతా ప్రమాణాల నిర్వహణ. జీరో ఎఫెక్ట్ అంటే.. ఉత్పత్తి ప్రక్రియల ద్వారా పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడకుండా చూసుకోవడం. మంత్రప్రదమైన ఈ ప్రాథమిక భావనకు కట్టుబడి ఉండడం మన విజయానికి చాలా కీలకం.
మిత్రులారా,
‘డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్స్’ కార్యక్రమం దేశంలోని చిన్న తరహా పరిశ్రమల కోసం ఓ కొత్త మార్గాన్ని రూపొందించడంతోపాటు భవిష్యత్తు కోసం వాటిని సన్నద్ధం చేయబోతోంది.
మిత్రులారా,
కోవిడ్-19 విపత్తు మిగిల్చిన సవాళ్ల నేపథ్యంలోనూ.. దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు పునరుత్తేజాన్ని, సమర్థతను కనబరిచాయి. భారత్ ఆ విపత్తును జయించడంలో కీలక పాత్ర పోషించిన ఎంఎస్ఎంఈ రంగం.. భవిష్యత్ అవకాశాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపింది. ఎంఎస్ఎంఈలకు అందుబాటులో ఉన్న వనరుల బలోపేతానికి, ఆర్థిక సాయంతోపాటు నైపుణ్యాభివృద్ధికీ సమగ్ర కృషి జరుగుతోంది. ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వంటి పథకాలు ఈ దిశగా కీలకమైనవి. విపత్తు ఉధృతి భారీగా ఉన్న సమయంలో లక్షలాది ఉద్యోగాలను కాపాడడంలో ఎంఎస్ఎంఈ రుణ భరోసా పథకం కీలక పాత్ర పోషించింది. దీన్నిబట్టి, సంక్షోభ సమయాల్లో ఈ రంగం ప్రాధాన్యం స్పష్టమవుతోంది.
మిత్రులారా,
వివిధ రంగాల్లోని ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీకి రుణాలు, నిర్వహణ మూలధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు నేడు సమష్టి కృషి జరుగుతోంది. వాటి వనరులు విస్తరిస్తున్న కొద్దీ ఆవిష్కరణ సామర్థ్యం కూడా పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడంతోపాటు అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుంది. ఈ నిరంతర ఉన్నతీకరణ, ఆవిష్కరణలు మన ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఎంఎస్ఎంఈల్లో సాంకేతిక పురోగతి, అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించి.. ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతోపాటు శిక్షణ సంస్థలను కూడా నెలకొల్పాం. గతంలో సాధారణంగా భావించిన నైపుణ్యాభివృద్ధి.. ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. నా హయాంలో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దడంలో నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని హృదయపూర్వకంగా గుర్తిస్తున్నాను. ఆధునిక, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య విశ్వవిద్యాలయాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మిత్రులారా,
ప్రభుత్వం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఇక్కడ సమావేశమైన చిన్న పారిశ్రామికవేత్తలందరినీ నేను కోరుతున్నాను. మీకు తెలుసు.. రూఫ్‌టాప్ సోలార్‌కు సంబంధించి ముఖ్య విధానాన్ని భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ గణనీయమైన ఆర్థిక సాయం లభిస్తుంది. ఇందులో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుతోపాటు అదనపు విద్యుత్ కొనుగోలుకూ అవకాశం ఉంది. మొదట్లో కోటి ఇళ్లను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇళ్ల వద్ద రూఫ్‌టాప్ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నాం. దీంతో రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గడమే కాకుండా.. మీ అందరికీ ఇదొక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.
మిత్రులారా,
ఆటో, ఆటో విడిభాగాల కోసం దాదాపు రూ.26,000 కోట్లతో ప్రభుత్వం.. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) రూపొందించింది. ఈ పథకం తయారీ రంగంతో పాటు హైడ్రోజన్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. దీని సహాయంతో, మేం 100 కంటే ఎక్కువ అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీలను ప్రోత్సహించాం. కొత్త టెక్నాలజీలు దేశంలోకి ప్రవేశించినప్పుడు, వాటికి సంబంధించిన ప్రపంచ పెట్టుబడులు కూడా వస్తాయి. ఇది మన ఎంఎస్ఎంఈలకు కూడా ఒక గొప్ప అవకాశం. కాబట్టి, ఎంఎస్ఎంఈల సామర్థ్యాన్ని విస్తరించుకోవటానికి, కొత్త రంగాల్లో పనిచేయటం ప్రారంభించటానికి ఇదే సరైన సమయం.
మిత్రులారా,
అవకాశాలున్న చోటే సవాళ్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు.. డిజిటలైజేషన్, విద్యుదీకరణ, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు, మార్కెట్ డిమాండ్ హెచ్చుతగ్గులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సరైన సమయంలో, సరైన మార్గంలో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా, మనం ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం నైపుణ్యాలను పెంచుకోవటం తప్పనిసరి. అదనంగా, ఎంఎస్ఎంఈల ఆధునీకీకరణ ఒక ప్రధాన సవాలు. ఈ దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మేం ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా మార్చాం. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈల వృద్ధికి మార్గాన్ని సుగమం చేసింది.
మిత్రులారా,
దేశాభివృద్ధికి, భారత ప్రభుత్వం ప్రతి పరిశ్రమకు అండగా నిలబడింది. గతంలో, అది పరిశ్రమైనా, వ్యక్తి అయినా, చిన్న చిన్న విషయాలకే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇవాళ, ప్రతి రంగంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. గత కొన్నేళ్లలో మేం 40 వేలకు పైగా సమస్యలను పరిష్కరించాం. అనేక చిన్న వ్యాపార సంబంధిత తప్పులను నేరరహితంగా మార్చాం. ఫ్యాక్టరీలోని టాయిలెట్‌కు ఆరు నెలలకోసారి పెయింట్ వేయకపోతే, జైలుకు పంపే చట్టాలు మన దేశంలో ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇవన్నీ తొలగించాను. అలాంటి వాటిని మార్చేందుకు దేశానికి 75 ఏళ్లు పట్టింది.
మిత్రులారా,
కొత్త లాజిస్టిక్స్ విధానమైనా, జీఎస్టీ అయినా, ఆటోమొబైల్ రంగంలోని చిన్న తరహా పరిశ్రమలకు ఎంతో సహకరించాయి. భారత్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం రూపొందించింది. పీఎం గతిశక్తిలో 1,500 కంటే ఎక్కువ దశల్లో డేటాను ప్రాసెస్ చేయటం ద్వారా భవిష్యత్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ఇది మల్టీ-మోడల్ అనుసంధానానికి భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పరిశ్రమలకు మద్దతిచ్చేందుకు యంత్రాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆటోమొబైల్ ఎంఎస్ఎంఈ రంగానికి చెప్పాలనుకుంటున్నాను. ఆవిష్కరణ, పోటీతత్వంతో మనం ముందుకు సాగాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ దిశగా టీవీఎస్ చేస్తున్న ప్రయత్నం మీకు సహకరిస్తుందని నా నమ్మకం.
మిత్రులారా,
మరో రెండు విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం వెహికల్స్ స్క్రాప్ విధానాన్ని రూపొందించింది. పాత వాహనాలన్నీ తొలగించి.. నూతన, ఆధునిక వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక భారీ అవకాశం ఉంది. అందువల్ల పరిశ్రమలోని వ్యక్తులు, భారత ప్రభుత్వ స్క్రాపింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను. నౌకా నిర్మాణంలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. నౌకా నిర్మాణ రంగంలో వస్తువుల పునర్వినియోగం భారీ మార్కెట్ గా మారింది. సమగ్ర ప్రణాళికతో మనం ముందుకు వెళ్తే, పొరుగు దేశాలు, వాహనాలను వేగంగా భర్తీ చేస్తున్న గల్ఫ్ దేశాలు స్క్రాప్ కోసం భారత్ కు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఇది పరిశ్రమల ఏర్పాటుకు అవకాశమిస్తుంది. ఇది ఎంఎస్ఎంఈలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాశాలను మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
అదేవిధంగా, రవాణా రంగంలోని వ్యక్తులు కూడా ఇందులో పాల్గొన్నారని తెలిసింది. నేను ఏదైనా అంశాన్నీ పరిశీలిస్తే, దాని గురించి సమగ్రంగా ఆలోచిస్తాను. మొబిలిటీ, రవాణా గురించి చర్చించినప్పుడు డ్రైవర్ల గురించి చర్చించకపోతే నా పని అసంపూర్ణంగా ఉంటుంది. కొన్ని రోజుల కిందట మా పాలసీ గురించి వార్తాపత్రికలో చదివే ఉంటారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రధాన రహదారుల వెంట 1,000 విశ్రాంతి కేంద్రాలను నిర్మించనున్నాం. వీటిల్లో డ్రైవర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఈ కేంద్రాల వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. డ్రైవర్లకు విశ్రాంతి లభిస్తుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విశ్రాంతి కేంద్రాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రవాణా రంగంలోని సోదరులు, అక్కాచెల్లెళ్లకు.. డ్రైవర్లకు భద్రత, సంతృప్తి, కొత్త వ్యాపార అవకాశాలుంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
మిత్రులారా,
మీ మధ్య ఉండే అవకాశం నాకు లభించింది. మీకున్న ఆకాంక్షలు, కలలను నేను సంకల్పంగా మార్చుకుని వాటిని నిజం చేసేందుకు మనసుపెట్టి పనిచేస్తాను. రాబోయే ఐదేళ్లకు మీ ప్రణాళికలు ఏమైనప్పటికీ నాపై నమ్మకం ఉంచి, ధైర్యంగా ముందుకు సాగండి. నేను మీకు అండగా, మీతోనే ఉంటాను. దేశం నూతన శిఖరాలు అధిరోహించేలా చేస్తాను. మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ దన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2172544)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam