ప్రధాన మంత్రి కార్యాలయం
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
వైవిధ్యం, డిమాండ్, విస్తృతి... మూడు సామర్థ్యాలు భారత్ సొంతం: పీఎం
గడిచిన పదేళ్లలో.. భారత్‌లో పేదరికాన్ని జయించిన వారి సంఖ్య 25 కోట్లు: పీఎం
అంకుర సంస్థలున్న మూడో అతిపెద్ద దేశం భారత్
ఆహారం, వ్యవసాయ రంగాల్లోనే అత్యధికం: పీఎం
ప్రపంచ ఆహార భద్రతకు భారత్ నిరంతర మద్దతు: పీఎం
ప్రస్తుతం మార్కెట్లో చిన్న రైతులే ప్రధాన శక్తి: పీఎం
భారత్ డైయిరీ రంగాన్నీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనీ బలోపేతం చేస్తున్న సహకార సంఘాలు: పీఎం
Posted On:
25 SEP 2025 8:41PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, వినియోగదారులు పాల్గొన్నారనీ, కొత్త పరిచయాలను పెంపొందించుకోవడానికీ, సృజనాత్మకతకు వరల్డ్ ఫుడ్ ఇండియాను వేదికగా మార్చారన్నారు. తాను ఇప్పుడే ఎగ్జిబిషన్‌ను సందర్శించానని చెబుతూ.. పోషకాహారం, వంటనూనె వినియోగాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా మార్చడంపై ప్రాథమిక దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
పెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికి ఉన్న సహజ సామర్థ్యాలను అంచనా వేస్తారని ప్రధానమంత్రి చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు - ముఖ్యంగా ఆహార రంగంలో ఉన్నవారు భారత్ వైపు ఆశావాదంతో చూస్తున్నారన్నారు. ‘‘భారత దేశానికి వైవిధ్యం, డిమాండు, విస్తృతి.. మూడూ ఉన్నాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు. మనదేశం అన్ని రకాల ధాన్యాలు, పండ్లూ, కూరగాయలను పండిస్తోందనీ, ఈ వైవిధ్యమే ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిందని విశ్లేషించారు. ప్రతి వంద కిలోమీటర్లకు వంటలూ రుచులూ మారిపోతాయని, ఇవి భారతీయ ఆహార వైవిధ్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. దేశీయంగా ఉన్న వైవిధ్యమే... భారత్‌ను పోటీలో నిలిపిందనీ, పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మార్చిందనీ ప్రధానమంత్రి తెలిపారు.
‘‘అపూర్వమైన, అసాధారణ రీతిలో భారత్ అభివృద్ధి చెందుతోంది. గడచిన పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని ఓడించి నవ మధ్యతరగతిలో భాగమయ్యారు. ఇది దేశంలో అత్యంత శక్తిమంతమైన, ఆకాంక్షాత్మక విభాగం’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ తరగతికి చెందిన వారి ఆకాంక్షలే కొత్త ఆహార సరళిని రూపొందిస్తున్నాయనీ, డిమాండును పెంచుతున్నాయనీ ప్రధానమంత్రి వివరించారు. ప్రతిభావంతమైన దేశ యువత అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలు చేస్తోందని, ఆహార రంగం ఏ మాత్రం మినహయింపు కాదని తెలియజేశారు. ‘‘ఆహారం, వ్యవసాయ రంగాల్లో అనేక అంకుర సంస్థలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగింది’’ అని శ్రీ మోదీ వెల్లడించారు. ఏఐ, ఈ-కామర్స్, డ్రోన్లు, యాప్‌లు తదితర సాంకేతికతలు ఈ రంగంలో భాగమవుతున్నాయనీ, సరఫరా వ్యవస్థలు, రిటైల్, శుద్ధి ప్రక్రియలను రూపాంతరం చెందిస్తున్నాయన్నారు. వైవిధ్యం, డిమాండు, ఆవిష్కరణల వేదికగా భారత్ ఉందని, అవసరమైన అన్ని కీలకాంశాలతో పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా మారిందని స్పష్టం చేశారు. ఎర్రకోటపై తన సందేశాన్ని పునరుద్ఘాటిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు ఇదే సరైన సమయమని తెలియజేశారు.
ఇరవై ఒకటో శతాబ్దపు సవాళ్లు అందరికీ తెలిసినవేనని, అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురైన ప్రతి సందర్భంలోనూ తనదైన పాత్ర పోషించేందుకు భారత్ ఎప్పుడూ ముందుకొస్తుందనీ, ప్రపంచ ఆహార భద్రత అంశంలో చురుకైన పాత్రను పోషిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. రైతులు, పాడి రైతులు, మత్స్యకారుల కృషి కారణంగా భారత వ్యవసాయ రంగ సామర్థ్యం బలోపేతమైందనీ, దీనికి ప్రభుత్వ విధానాల సహకారం తోడైందని వివరించారు. గడచిన దశాబ్దంలో ఆహార ధాన్యాల దిగుబడిలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారతేనని, అంతర్జాతీయ అవసరాల్లో 25 శాతం పాలను దేశమే అందిస్తోందనీ, చిరుధాన్యాల ఉత్పత్తిలో కూడా అగ్రస్థానంలో ఉందని ప్రధాని వెల్లడించారు. వరి, గోధుమల ఉత్పత్తిలో అంతర్జాతీయంగా భారత్ రెండో స్థానంలో ఉందని, పండ్లు, కూరగాయలు, మత్స్య ఉత్పత్తుల్లోనూ గణనీయమైన వాటా కలిగి ఉందన్నారు. ప్రపంచంలో ఎప్పుడైనా ఆహార సంక్షోభం లేదా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడితే.. భారత్ దృఢంగా నిలబడి, తన బాధ్యతను నిర్వర్తిస్తుందని భరోసా ఇచ్చారు.
సామర్థ్యాలను విస్తరించుకోవడంతో పాటు.. అంతర్జాతీయ ఆసక్తులకు తోడ్పడేందుకు భారత్ చిత్తశుద్ధితో ఉందని తెలియజేస్తూ.. ఈ రంగంలో భాగమైన వారందరినీ ఏకం చేయడం ద్వారా మొత్తం ఆహార, పోషకాహార వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ప్రధాని తెలిపారు. నూరు శాతం ఎఫ్‌డీఐలతో ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పీఎల్ఐ పథకం, మెగా ఫుడ్ పార్కుల విస్తరణ ద్వారా కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతోందని తెలియజేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టోరేజీ మౌలిక వసతుల పథకాన్ని చేపడుతోందని శ్రీ మోదీ వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతోన్న ఈ ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయనీ, గడచిన పదేళ్లలో భారత ఆహార శుద్ధి పరిశ్రమ సామర్థ్యం ఇరవై రెట్లు పెరిగిందనీ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపయ్యాయని తెలియజేశారు.
భారత ఆహార సరఫరా, విలువ ఆధారిత వ్యవస్థలో రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు పోషిస్తున్న కీలకపాత్రను వివరిస్తూ.. గడచిన దశాబ్దంలో వీరందరినీ బలోపేతం చేశామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశంలో 85 శాతం కంటే ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులేనని, అందుకే వారికి సాధికారత కల్పించేందుకు అవసరమైన విధానాలు, మద్దతు వ్యవస్థలను అభివృద్ధి చేశామని ప్రధానమంత్రి తెలియజేశారు. ప్రస్తుత మార్కెట్లో చిన్నకారు రైతులు ప్రధాన శక్తిగా ఎదుగుతున్నారని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది సభ్యులుగా ఉన్న స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్ల గురించి వివరిస్తూ.. ఈ సంఘాలకు ప్రభుత్వం క్రెడిట్ అనుసంధాన సబ్సిడీలను అందిస్తోందని శ్రీ మోదీ తెలియజేశారు. అలాగే రూ.800 కోట్లను లబ్దిదారులకు బదిలీ చేశామన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవో)ను ప్రభుత్వం విస్తరిస్తోందని, 2014 నుంచి 10,000 ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేశామనీ, ఇవి లక్షలాది మంది చిన్నకారు రైతులను అనుసంధానిస్తున్నాయని స్పష్టం చేశారు. రైతులు తమ ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలించేందుకు తోడ్పడటమే కాకుండా.. బ్రాండెడ్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమ రంగంలో ఎఫ్‌పీవోలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రధాని అన్నారు. భారత ఎఫ్‌పీవోల సామర్థ్యం అపారమైనదని, ఆన్లైన్లో 15,000 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనికి కాశ్మీర్ నుంచి బాస్మతీ బియ్యం, కుంకుమపువ్వు, వాల్ నట్స్, హిమాచల్ నుంచి జామ్, యాపిల్ జ్యూస్, రాజస్థాన్ నుంచి మిల్లెట్ కుకీలు, మధ్యప్రదేశ్ నుంచి సోయా నగ్గెట్స్, బీహార్ నుంచి సూపర్ ఫుడ్ మఖానా, మహారాష్ట్ర నుంచి వేరుశెనగ నూనె, బెల్లం, కేరళ నుంచి బనానా చిప్స్, కొబ్బరి నూనెను ఉదాహరణగా చూపించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ వ్యవసాయ వైవిధ్యాన్ని ఎఫ్‌పీవోలు ఇంటింటికీ తీసుకెళుతున్నాయన్నారు. 1,100కు పైగా ఎఫ్‌పీవోల వార్షిక టర్నోవర్ రూ.1 కోటి దాటిందన్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలోనూ, యువతకు ఉద్యోగాుల కల్పించడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ఎఫ్‌పీవోలతోపాటు దేశంలో సహకార సంఘాలు చాలా బలంగా ఉన్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరమని గుర్తు చేస్తూ.. భారత్‌లో పాడి రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అవి శక్తిమంతం చేస్తున్నాయన్నారు. సహకార సంఘాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ.. వాటి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా విధానాల రూపకల్పన కోసం ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. పన్ను, పారదర్శకత సంబంధిత సంస్కరణలను కూడా ఈ రంగంలో అమలు చేశామన్నారు. ఈ విధాన స్థాయి మార్పుల ఫలితంగా.. సహకార రంగం కొత్త బలాన్ని పుంజుకుంది.
సముద్ర, మత్స్య పారిశ్రామిక రంగాల్లో భారత్ అద్భుతవృద్ధిని సాధిస్తోందని శ్రీ మోదీ తెలిపారు. గత దశాబ్ద కాలంలో మత్స్య పరిశ్రమ సంబంధిత మౌలిక సదుపాయాలను ప్రభుత్వం భారీగా విస్తరించిందన్న ఆయన.. లోతైన సముద్ర ప్రాంతాల్లో చేపల వేట కోసం పడవలతోపాటు నిధులను కూడా అందించిందన్నారు. ఫలితంగా సముద్ర ఉత్పత్తి, ఎగుమతులు రెండూ పెరిగాయి. ప్రస్తుతం ఈ రంగం దాదాపు మూడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు, శీతలీకరణ మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, ఆధునిక సదుపాయాలతో కూడిన హార్బర్లలో పెట్టుబడుల ద్వారా.. సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ విస్తరణ దిశగా కృషి చేస్తున్నామన్నారు.
పంటల సంరక్షణ కోసం ఆధునిక సాంకేతికతలో ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆహార వికిరణ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయోత్పత్తుల మన్నిక కాలం మరింత పెరగడంతోపాటు.. ఆహార భద్రత బలోపేతమైంది. ఈ కృషిలో భాగస్వామ్యం వహించిన యూనిట్లకు ప్రభుత్వం సమగ్ర మద్దతును అందిస్తోందన్నారు.
“తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలపై విస్తృత చర్చలతో.. ఆవిష్కరణలు, సంస్కరణల నవమార్గంలో భారత్ ముందుకు సాగుతోంది’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సంస్కరణలు రైతులకు ఖర్చులను తగ్గించడంతోపాటు ఆదాయాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. వెన్న, నెయ్యి ఇప్పుడు 5 శాతం జీఎస్టీ పరిధిలోకే వస్తాయని, ఇది గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలిపారు. పాల డబ్బాలపైనా పన్ను 5 శాతమే ఉండడంతో రైతులు, ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు లభిస్తాయన్నారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకే పోషకాహారం లభించేలా భరోసానిస్తుందన్నారు. వినియోగానికి సిద్ధంగా ఉన్న నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాలు ఇప్పుడు 5 శాతం జీఎస్టీ శ్లాబు పరిధిలోకే వస్తాయనీ.. ఈ సంస్కరణల వల్ల ఆహార శుద్ధి రంగం గణనీయంగా లాభపడుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రాసెస్ చేసిన ఆహారోత్పత్తుల్లో 90 శాతానికి పైగా పన్ను రహితంగానో 5 శాతం పన్ను పరిధిలోకో వస్తాయని తెలిపారు. జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాలపై జీఎస్టీ తగ్గిందని, దీంతో తక్కువ ధరలకే అవి అందుబాటులోకి రావడంతోపాటు చిన్న సేంద్రియ రైతులు, ఎఫ్‌పీవోలకు అవి నేరుగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
పర్యావరణ హిత ప్యాకేజింగ్ తక్షణ అవసరమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఉత్పత్తులను తాజాగా, నాణ్యంగా ఉంచడం అవసరమే అయినా.. ప్రకృతి పట్ల మన బాధ్యతను నెరవేర్చడమూ అంతే ఆవశ్యకమన్నారు. ఇదే స్ఫూర్తితో పర్యావరణ హిత ప్యాకేజింగ్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. ఈ తరహా ప్యాకేజింగ్ సంబంధిత ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక భాగస్వాములందరినీ ప్రధానమంత్రి కోరారు. భారత్ విశాల దృక్పథంతో ప్రపంచమంతటినీ ఆహ్వానిస్తోందని, ఆహార వ్యవస్థకు సంబంధించి అన్ని కార్యకలాపాల్లోనూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోందని పునరుద్ఘాటించారు. సహకారం దిశగా భారత సంసిద్ధతను పునరుద్ఘాటిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మరోసారి అభినందనలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
గౌరవ రష్యా ఉప ప్రధానమంత్రి దిమిత్రి పత్రుషేవ్, కేంద్ర మంత్రులు శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ రవనీత్ సింగ్, శ్రీ ప్రతాప్‌రావు జాదవ్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
వరల్డ్ ఫుడ్ ఇండియా- 2025 ఎడిషన్‌ను సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు. ఆహార శుద్ధి రంగం, ఆహార సుస్థిరత, పుష్టికరమైన, సేంద్రియ ఆహారోత్పత్తిలో భారత్ శక్తిని ఈ ప్రదర్శన చాటుతుంది.
రూ.2,510 కోట్లతో ప్రారంభించిన ‘ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల వ్యవస్థీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ)’ కింద ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ కార్యక్రమంలో 26 వేల మంది లబ్దిదారులకు రూ.770 కోట్లను పంపిణీ చేయనున్నారు.
వరల్డ్ ఫుడ్ ఇండియాలో భాగంగా సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశాలు, సాంకేతిక సదస్సులు, ప్రదర్శనలుంటాయి. ఇవే కాకుండా వాణిజ్య సంస్థల మధ్య (బి2బి), వాణిజ్య సంస్థలు- ప్రభుత్వానికి మధ్య (బి2జీ), ప్రభుత్వ విభాగాల మధ్య (జీ2జీ) సమావేశాలు సహా వివిధ వాణిజ్య చర్చలు నిర్వహిస్తారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, ఇటలీ, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, బెల్జియం, టాంజానియా, ఎరిత్రియా, సైప్రస్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అమెరికా సహా ప్రదర్శనలో పాల్గొంటున్న 21 దేశాలతోపాటు 150 అంతర్జాతీయ భాగస్వాముల ప్రదర్శనలు కూడా ఇందులో ఉంటాయి.
ఆహార శుద్ధిలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్, ఆహార శుద్ధిలో సుస్థిరత - ఉద్గార రహితం, ఆహార శుద్ధిలో పరిమితులు, భారత పెంపుడు జంతువుల ఆహార పరిశ్రమ, పోషకాలు - ఆరోగ్యం కోసం ప్రాసెస్ చేసిన ఆహారం, మొక్కల ఆధారిత ఆహారం, ఆహార ఉత్పన్నాలు (న్యూట్రాస్యూటికల్స్), ప్రత్యేక ఆహారాలు సహా విస్తృత శ్రేణి అంశాలపై ప్రత్యేక ఇతివృత్తాలతో సదస్సులు కూడా వరల్డ్ ఫుడ్ ఇండియాలో నిర్వహిస్తారు. నిర్దిష్ట ఇతివృత్తాలతో కూడిన 14 ప్రత్యేక ప్రదర్శన వేదికలు ఇందులో ఉంటాయి. దాదాపు 100,000 మంది సందర్శకులు హాజరవుతారని అంచనా.
***
(Release ID: 2171958)
Visitor Counter : 7
Read this release in:
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam