ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

17వ లోక్‌సభ చివరి సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 10 FEB 2024 8:44PM by PIB Hyderabad

గౌరవ అధ్యక్షా!

   మహత్తర భారత ప్రజాస్వామ్య సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన రోజు. ఈ 17వ లోక్‌సభ దేశ సేవలో భాగంగా గత ఐదేళ్లలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అనేక సవాళ్ల నడుమ దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రతి సభ్యుడూ తన సామర్థ్యం మేరకు సహకరించారు. ఒక విధంగా దేశానికి అంకితమైన మన ఐదేళ్ల సైద్ధాంతిక ప్రయాణాన్ని వివరించడానికి, మన సంకల్పాలను మరోసారి దేశానికి అంకితం ఇవ్వడానికి ఈ రూపంలో మనకొక అవకాశం దక్కింది. ఈ ఐదేళ్ల సంస్కరణ, సామర్థ్యం, సమూల మార్పులు అత్యంత అరుదైనవి. సంస్కరణల అమలు, సామర్థ్య వికాసంతో సమూల మార్పుల ద్వారా సరికొత్త ఆత్మవిశ్వాసం పాదుకోవడం మన కళ్ల ముందున్న వాస్తవం. ఇది 17వ లోక్‌సభ ద్వారా దేశ పౌరులకూ అనుభవంలోకి వచ్చింది. ఆ మేరకు 17వ లోక్‌సభకు దేశ ప్రజానీకం ఆశీస్సులు కొనసాగుతాయని విశ్వసిస్తున్నాను. ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరూ అన్ని ప్రక్రియలలో తమవంతు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మీకందరికీ నాయకుడుగా, మీ సహచరుడుగా... ప్రతి ఒక్కరినీ ఇవాళ అభినందిస్తున్నాను.

గౌరవనీయ అధ్యక్షా! ముఖ్యంగా...

మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు... శ్రీమతి సుమిత్ర (మహాజన్) గారు అడపాదడపా (సభాధ్యక్షరాలుగా ఐదేళ్ల పదవీకాలంలో) చతురోక్తులు విసిరేవారు. అయితే, మీ వదనంలో మందహాసం నిరంతరం తొణికిసలాడుతుంది. ఎప్పుడు, (సభలో) ఏం జరిగినా ఆ చిరునవ్వు చెదరడం నేనెన్నడూ చూడలేదు. అనేక సందర్భాల్లో ఈ సభను మీరు ఎంతో సమతూకంతో, నిష్పాక్షికంగా, వాస్తవిక రీతిలో మార్గనిర్దేశం చేస్తూ నిర్వహించారు. మీ సభా నిర్వహణ తీరును హృదయపూర్వకంగా ప్రస్తుతిస్తున్నాను. ఆగ్రహావేశాలు, ఆరోపణల కలకలం రేగిన క్షణాల్లో ఆ పరిస్థితులన్నింటినీ ఎంతో ఓపికగా, అవగాహనతో సంబాళిస్తూ సభను నడిపించి మాకందరికీ మార్గదర్శిగా నిలిచిన మీకు సదా కృతజ్ఞుడనై ఉంటాను.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఈ ఐదేళ్లలోనే యావత్‌ మానవాళి ప్రస్తుత శతాబ్దంలో ఎన్నడూ ఎరుగని పెను సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. “బతికి బట్టకట్టేదెవరు? ఏ ఒక్కరైనా ఇతరులను రక్షించగలరా?” అన్నది ఆనాటి గడ్డు పరిస్థితి. గడప దాటాలన్నా భయపడే రోజులవి... ఇక సభకు రావడమంటే మాటలా! అటువంటి సంక్లిష్ట స్థితిలోనూ దేశంలో కార్యకలాపాలకు భంగం కలగకుండా ఎలాంటి కొత్త చర్యలు తీసుకోవాల్సి వచ్చినా మీరు వెనుకాడలేదు. సభ గౌరవం చెదరనీయకుండా, దేశానికి అవసరమైన పనులు సజావుగా సాగిపోయేలా సభను నడిపించడంలో మీరెంత మాత్రం తడబడలేదు. మీ సభా నిర్వహణ నైపుణ్యంతో ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచారు.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఆ సమయంలో దేశ అవసరాల దృష్ట్యా ప్రతిపాదించిన మేరకు ఒక్క క్షణం కూడా యోచించకుండా ‘ఎంపీలాడ్‌’ నిధులను వదులుకోవడంలో చొరవ చూపిన గౌరవనీయ ఎంపీలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అంతేకాదు... పౌరులకు ఆశావహ సందేశమిస్తూ సమాజంలో విశ్వాసం పెంచే దిశగా తమ వేతనంలో 30 శాతం కోతకు ఎంపీలు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా తొలుత ముందడుగు వేసింది ఎంపీలేనని ఈ నిర్ణయం దేశానికి నిరూపించింది.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఎంపీలుగా మా ప్రత్యేక హక్కులు, పార్లమెంటు క్యాంటీన్‌లో మాకు సబ్సిడీ ఆహార సదుపాయంపై మీడియాలోని కొన్ని వర్గాలు ఏటా ఒకటికి రెండుసార్లు నిష్కారణంగా మమ్మల్ని విమర్శిస్తూండేవి. బయటి ధరలతో పోలిస్తే పార్లమెంటు క్యాంటీన్‌లో ఆహార ధర చాలా తక్కువగా ఉందంటూ నిరంతరం పరిహసించే దుస్థితి ఉండేది. అలాంటి పరిస్థితిలో క్యాంటీన్‌ ధరలు అందరికీ ఒకేవిధంగా ఉండాలని మీరు నిర్ణయించినపుడు ఎంపీలు దాన్ని ఎంతమాత్రం వ్యతిరేకించకుండా తక్షణం ఆమోదించారు. వాస్తవానికి నిష్కారణంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా గతంలో పార్లమెంటు క్యాంటీన్‌లో సబ్సిడీ ఆహారాన్ని ఆస్వాదిస్తూ వచ్చారు. ఏదిఏమైనా వారి అపహాస్యం నుంచి ఎంపీలందర్నీ రక్షించినందుకు కూడా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గౌరవనీయ అధ్య‌క్షా!

పార్లమెంటుకు కొత్త సౌధం నిర్మాణం కోసం మన 15వ లోక్‌సభ కాలంనుంచీ ప్రస్తుత 17వ సభదాకా సభ్యుల నుంచి డిమాండ్ వినిపిస్తూ వచ్చిందన్నది వాస్తవం. ఈ అంశంపై అందరూ సమష్టిగా గళమెత్తినా, ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరకు మీ నాయకత్వాన దృఢ నిశ్చయంతో ఈ అంశం ముందుకు కదిలింది. ప్రభుత్వంతో పలుమార్లు సమావేశాలు, చర్చోపచర్చల అనంతరం దేశ చట్టసభకు ఈ కొత్త భవన సముదాయం సమకూరింది.

గౌరవనీయ అధ్య‌క్షా!

మీ నాయకత్వాన ఈ కొత్త సౌధంలో ‘సెంగోల్‌’ స్థాపన ఒక మహత్యార్యం. మన వారసత్వంలో ఒక భాగాన్ని సంరక్షించే, స్వాతంత్ర్య తొలి క్షణాన్ని కరదీపికలా సజీవంగా ఉంచాలన్న లక్ష్యం దీంతో నెరవేరింది. ఇకమీదట ఇది ఏటా నిర్వహించే ఉత్సవాల్లో అంతర్భాగమై భావితరాలను ఆ తొలి స్వాతంత్ర్య క్షణంతో అనుసంధానిస్తుంది. ఆ విధంగా భరతమాత విముక్తి తొలి అనుభవం మన జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ పవిత్ర కర్తవ్యం దేశ పురోగమన కృషికి స్ఫూర్తినిస్తుంది.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఈ లోక్‌సభ కాలంలోనే జి-20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షతపై భారత్‌ అంతర్జాతీయంగా విశేష ప్రశంసలు అందుకోవడం వాస్తవం. భారత్‌ శక్తిసామర్థ్యాలు ఎలాంటివో (జి-20 అనుబంధ సమావేశాల నిర్వహణ ద్వారా) దేశంలోని ప్రతి రాష్ట్రం తనదైన గుర్తింపును చాటుతూ ప్రపంచానికి స్పష్టం చేసింది. ఆ ప్రభావం నేటికీ ప్రపంచ యవనికపై స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు అనేక దేశాల వక్తలతో నిర్వహించిన పి-20 శిఖరాగ్ర సదస్సు మీ నాయకత్వంలో విజయవంతమైంది. తద్వారా ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారత సుసంపన్న సంప్రదాయానికి, శతాబ్దాలుగా మనం కొనసాగిస్తున్న ప్రజాస్వామ్య విలువలకు మరింత ప్రాచుర్యం లభించింది. వ్యవస్థలు మారుతున్నా, భారత్ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిశ్చల రీతిలో ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఈ వాస్తవాన్ని మీరు ప్రపంచ వక్తల సమక్షంలో అద్భుతంగా విశదీకరించడం ద్వారా మీ నాయకత్వాన ప్రజాస్వామ్య వ్యవస్థలలో భారతదేశానికి ఎనలేని గౌరవం సముపార్జించి పెట్టారు.

గౌరవనీయ అధ్య‌క్షా!

మన గౌరవనీయ ఎంపీలు సహా మీడియా మిత్రులు కూడా దృష్టి సారించని అంశంపై మీ శ్రద్ధకు ప్రత్యేక అభినందనలు. సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటుకు కొత్త పేరు) ప్రాంగణంలోని మహనీయుల విగ్రహాలకు వారి జయంతి సందర్భంగా మనమంతా పుష్పగుచ్ఛాలతో నివాళి  అర్పించేవాళ్లం. అయితే, ఓ పది నిమిషాల తంతుగా ఆ కార్యక్రమం ముగియగానే మనం (పార్లమెంటులో విధుల నిర్వహణకు) వెనుదిరిగేవాళ్లం. అయితే, ఈ మహనీయులను దేశమంతా స్మరించుకునే విధంగా వారి జీవిత విశేషాలపై మీరు జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థుల స్థాయిలో వక్తృత్వ, వ్యాసరచన పోటీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో ప్రతి రాష్ట్రం నుంచి విజేతలైన ఇద్దరేసి బాలలు మహనీయుల జయంతి రోజున ఢిల్లీకి వచ్చి మనతోపాటు నివాళి అర్పించడమే కాకుండా నాయకుల సరసన ఉపన్యసించే అవకాశం కూడా వారికి కల్పించారు. అటుపైన ఆ బాలలందరూ ఎంపీల కార్యకలాపాల గురించి తెలుసుకోవడంతోపాటు ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి వెళ్లేవారు. లక్షలాది బాలలు మన పార్లమెంటరీ సంప్రదాయంతో ముడిపడేలా విశిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత కచ్చితంగా మీకే చెందుతుంది. ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ సగర్వంగా కొనసాగుతుందని ఆశిస్తూ, మీకు నా అభినందనలు తెలుపుతున్నాను.

గౌరవనీయ అధ్య‌క్షా!

పార్లమెంట్ గ్రంథాలయం ఎవరి కోసం ఏర్పాటైందో వారు దాన్ని ఎంతవరకూ ఉపయోగించుకున్నారో చెప్పలేనుగానీ, మీరు సామాన్యుల కోసం ఆ గ్రంథాలయం తలుపులు తెరిపించారు. మన ఘన సంప్రదాయ వారసత్వానికి నెలవైన ఈ జ్ఞాన నిధిని సామాన్యులకు చేరువ చేసిన మీ ప్రశంసనీయ చొరవకు నా హృదయపూర్వక అభినందనలు. మరోవైపు కాగిత రహిత పార్లమెంటు, డిజటలీకరణ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు మన వ్యవస్థలో భాగం చేశారు. దీనికి అలవాటు పడటంలో కొందరు సహచరులు మొదట ఇబ్బందిపడినా, ఇప్పుడు అందరూ అలవాటుపడ్డారు. మీరు ఈ స్థానంలో కూర్చుని నిరంతరం ఏదో ఒక సత్కార్యంతో గణనీయ విజయం సాధిస్తూ వచ్చారు. అనేక శాశ్వత వ్యవస్థలను ఉనికిలోకి తెచ్చినందుకు కూడా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

గౌరవనీయ అధ్య‌క్షా!

మీ నైపుణ్యం, గౌరవనీయ ఎంపీల అవగాహనతోపాటు వారి సమష్టి కృషితో 17వ లోక్‌సభ 97 శాతం ఉత్పాదకత సాధించిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఇది ఎంతో సంతృప్తినిచ్చే అంశమే అయినా, ఈ రోజు 17వ లోక్‌సభ పదవీ కాలం సమాప్తమై (కొన్ని రోజుల్లో) 18వ లోక్‌సభ ప్రారంభ సుముహూర్తం సమీపిస్తున్న తరుణంలో మన ఉత్పాదకత 100 శాతం దాటాలన్న కృతనిశ్చయంతో ముందుకెళ్లగలమని విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా 17వ లోక్‌సభ కాలంలో 100 శాతానికి పైగా ఉత్పాదకత సాధించిన 7 సమావేశాల గురించి ప్రస్తావిస్తున్నాను. ప్రతి ఎంపీ లేవనెత్తే అంశాలను ప్రభుత్వ దృష్టికి తేవడం కోసం మీరు రాత్రంతా ఓపికగా కూర్చుని పనిచేయడం నేను గమనించాను. ఈ లోక్‌సభ సాధించిన ఇలాంటి అనేక విజయాలపై గౌరవనీయ సభ్యులందరితోపాటు వివిధ పార్టీల సభాపక్ష నాయకులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా 17వ లోక్‌సభ తొలి సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు 30 బిల్లులను ఆమోదించి, ఓ కొత్త రికార్డు సృష్టించాయి. దీంతోపాటు అనేక కొత్త ప్రమాణాలకు ఈ లోక్‌సభ శ్రీకారం చుట్టింది.

గౌరవనీయ అధ్య‌క్షా!

మన 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుక అందరికీ దక్కిన ఒక గొప్ప అదృష్టం. ఈ సందర్భంగా ప్రతి అంశంలోనూ పార్లమెంటు కీలక మార్గదర్శక పాత్ర పోషించడం చిరస్మరణీయ ఘట్టం. తమ నియోజకవర్గాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మన ఎంపీలందరూ కృషి చేశారనడంలో సందేహం లేదు. ఆ మేరకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను దేశం ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడంలో మన గౌరవనీయ ఎంపీలతోపాటు ఈ పార్లమెంటు పోషించిన ముఖ్య  భూమికను విస్మరించలేం. రాజ్యాంగ 75వ వార్షికోత్సవం కూడా యాదృచ్ఛికంగా ఈ సమయంలోనే రావడంతో గౌరవనీయ ఎంపీలందరికీ ఆ వేడుకలోనూ పాల్గొనే అవకాశం లభించింది. రాజ్యాంగ పరమైన మన బాధ్యతలు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి కాబట్టి, వాటితో ముడిపడి ఉండటం సహజంగానే ఎంతో స్ఫూర్తిదాయకం.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఈ లోక్‌సభ పదవీకాలంలో గణనీయ స్థాయిలో అమలైన సంస్కరణలను కీలక మలుపుగా పేర్కొనవచ్చు. ప్రస్తుత 21వ శతాబ్దపు భారత దేశానికి బలమైన పునాది పడటం ఈ అంశాలన్నిటిలో స్పష్టమవుతుంది. దేశం ఒక పెనుమార్పు దిశగా భారీ అంగలతో శరవేగంగా ముందడుగు వేసింది. ఈ దిశగా సభలోని సహచరులందరూ తమ వంతు పాత్ర పోషించడంతోపాటు అద్భుతంగా మార్గనిర్దేశం చేశారు. చాలాకాలం నుంచీ  ఎదురుచూస్తూ వచ్చిన అనేక మార్పులు ఈ 17వ లోక్‌సభ ద్వారానే సాధ్యమయ్యాయి. ఫలితంగా తరతరాల నిరీక్షణకు ఈ మార్పులు ముగింపు పలికాయని మనం ఆత్మసంతృప్తితో చెప్పగలం. యావద్దేశానికీ ఒకే రాజ్యాంగం కోసం అనేక తరాలు కలలు కంటూ వచ్చాయి. కానీ, అనుక్షణం ఏదో ఒక అవరోధం... ఒక అగాధం.. ఒక అసందిగ్ధం ఎదురవుతూనే వచ్చింది. చివరకు ఆర్టికల్ 370 రద్దు ద్వారా రాజ్యాంగ లక్ష్యాల సంపూర్ణ సాక్షాత్కారానికి ఈ సభ దోహదం చేసింది. రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నేపథ్యంలో దాన్ని రూపొందించిన మహనీయులు ఏ లోకంలో ఉన్నా వారి ఆకాంక్షను నెరవేర్చినందుకు మనను ఆశీర్వదిస్తారన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఇన్నేళ్లుగా సామాజిక న్యాయం దక్కని జమ్మూకాశ్మీర్ ప్రజలకు న్యాయం చేయడంలో మా నిబద్ధతను నిరూపించుకోవడం మాకెంతో సంతృప్తినిస్తోంది. ఇప్పుడు అక్కడి సోదరీసోదరులకు మేమెంతో చేరువయ్యాం.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఏళ్ల తరబడి మన దేశాన్ని వెంటాడుతూ వచ్చిన ఉగ్రవాద భూతం నిత్యం మన గుండెల్లో బుల్లెట్లు దింపుతూ భరతమాతను రక్తసిక్తం చేసేది. దేశంలోని అనేకమంది సాహసులు, ప్రతిభావంతులు ఉగ్రవాదానికి బలయ్యేవారు. అటువంటి పరిస్థితుల మధ్య ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ మేం కఠిన చట్టాలను రూపొందించాం... ఈ సభే వాటికి సమగ్ర రూపమిచ్చింది. గతంలో ఇలాంటి సమస్యలతో పోరాడిన వారు ఇప్పుడు బలం పుంజుకున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మన మనోస్థైర్యం ఇనుమడించగా, భారత్‌ నేడు ఉగ్రవాదం నుంచి విముక్తి లభించినట్లుగా భావిస్తోంది. ఈ స్వప్నం కూడా త్వరలో సాకారం కాగలదని నేను చెబుతున్నాను. ఇక మనమంతా 75 ఏళ్లపాటు బ్రిటిష్ పాలకులు నిర్దేశించిన శిక్షాస్మృతి పరిధిలో జీవించాం. అయితే, 75 సంవత్సరాల కాలం చెల్లిన ఆ శిక్షాస్మృతికి స్వస్తి చెప్పి మనదైన న్యాయ వ్యవస్థలో జీవిస్తున్నామని, సిసలైన ప్రజాస్వామ్యం ఇదేనని ఇప్పుడు మనం దేశానికి, నేటి నవ తరానికి, రాబోయే కొత్త తరానికి సగర్వంగా చెప్పగలం.

గౌరవనీయ అధ్య‌క్షా!

మరో అంశంపైనా మీకు నా అభినందనలు తెలుపుతున్నాను. కొత్త భవనంలో తొలిసారి కొలువైన ఈ సభ అంతే వైభవంతో భారత ప్రాథమిక విలువలను బలోపేతం చేసే ఒక నిర్ణయంతో మొదలైంది. అదే.. నారీశక్తి వందన్ అధినియం (మహిళా సాధికారత చట్టం). ఈ కొత్త సౌధం ప్రస్తావన వచ్చినపుడల్లా ఈ ఘట్టం తప్పక స్ఫురణకు వస్తుంది. ఇది స్వల్పకాలిక సమావేశమైనా దూరదృష్టిగల నిర్ణయాలకు వేదికైంది. ఈ చట్టం ఆమోదం పొందిన క్షణం నుంచే కొత్త సభ పవిత్రత భావన మనకు సరికొత్త శక్తినివ్వడం ప్రారంభించింది. భవిష్యత్తులో మన తల్లులు.. ఆడపడుచులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆసీనులైనపుడు దేశం నిజంగా గర్వపడుతుంది. మన ముస్లిం ఆడపడుచులు ముమ్మారు తలాఖ్‌ దుష్ట సంప్రదాయం నుంచి విముక్తి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కోర్టులలో వారికి ఊరట లభించినా, వారికి ఆ హక్కు లభించకపోవడంతో వారి కష్టాలు కొనసాగాయి. ఈ విషయాన్ని వారిలో కొందరు బహిరంగంగా, మరికొందరు పరోక్షంగా ప్రకటించి ఉండవచ్చు. ఏదేమైనా, 17వ లోక్‌సభ వారిని ఆ దుస్సంప్రదాయం నుంచి విముక్తం చేయడం ద్వారా శుభం పలికింది. గౌరవనీయ  సభ్యుల అభిప్రాయాలు, నిర్ణయాలు ఎలాంటివైనా, ఈ ఆడపడుచులకు న్యాయం చేయడంలో మాకూ భాగముందని ఏదో ఒకరోజున తప్పక చెబుతారు. తరతరాలుగా కొనసాగిన ఈ అన్యాయాన్ని సరిదిద్దినందుకు వారిప్పుడు మనను ఆశీర్వదిస్తున్నారు.

గౌరవనీయ అధ్య‌క్షా!

మన దేశానికి రాబోయే 25 ఏళ్ల కాలం అత్యంత విలువైనది. రాజకీయాల్లో హడావుడి, ఆ రంగంలో ఉన్నవారి ఆకాంక్షలు... దేని దారి దానిదేగానీ- పౌరుల అంచనాలు, ఆందోళనలు, కలలు దేశ  సంకల్పంగా మారాయి. కాబట్టి, ఆశించిన ఫలితాలను దేశం మరో పాతికేళ్లలో సాధించి తీరుతుంది. మహాత్మాగాంధీ 1930లో దండి యాత్రకు శ్రీకారం చుట్టినపుడు ‘ఉప్పు సత్యాగ్రహం’పై ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ఆనాడు స్వదేశీ ఉద్యమమైనా, సత్యాగ్రహ సంప్రదాయమైనా, ఉప్పు సత్యాగ్రహమైనా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, అలా 1947 దాకా సాగిన పాతికేళ్ల ఉద్యమ కాలమే మనం స్వేచ్ఛగా జీవించాలనే ఆకాంక్షను దేశ ప్రజల్లో రగిలించింది. అదే స్ఫూర్తి నేడు దేశవ్యాప్తంగా వెల్లువెత్తడం నాకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి వీధి మూల నుంచి, ప్రతి బిడ్డ నోటా ఇప్పుడు “25 సంవత్సరాల్లో 'వికసిత భారత్’ను తీర్చిదిద్దుతాం” అనే మాట మారుమోగుతోంది. అందువల్ల, పాతికేళ్ల కాలం మన యువశక్తికి అమూల్యం. ఈ వ్యవధిలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలనే  ఆకాంక్ష లేనివారిని మనం ఎక్కడా చూడలేం. ప్రతి ఒక్కరికీ ఓ కల తప్పక ఉంటుంది... కొందరు దాన్ని ఇప్పటికే దాన్ని తమ సంకల్పంగా మలచుకున్నారు. మరికొందరికి మరికొంత సమయం అవసరం కావచ్చు... కానీ, అందరూ అందులో భాగస్వాములు కాక తప్పదు. అలా కాలేకపోయినవారు సజీవులై ఉంటే, వారు ‘వికసిత భారత్‌’ ఫలాలు పొందడం తథ్యమన్నది నా ప్రగాఢ విశ్వాసం.

గౌరవనీయ అధ్య‌క్షా!

యువతరం కోసం గత ఐదేళ్లలో చరిత్రాత్మక చట్టాలు అమలులోకి వచ్చాయి. వ్యవస్థలో పారదర్శకత వల్ల యువతకు కొత్త అవకాశాలు చేరువయ్యాయి. వారిని ఆందోళనకు గురిచేసే పేపర్ లీక్‌ల వంటి సమస్యల పరిష్కారంలో చాలా కఠినంగా వ్యవహరించాం. గౌరవనీయ సభ్యులందరూ దేశ యువత మనోభావాలను అర్థం చేసుకుంటూ వ్యవస్థపై వారిలో గూడుకట్టుకున్న అనుమానాలు, సందేహాలను తీర్చే విధంగా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

గౌరవనీయ అధ్య‌క్షా!

పరిశోధన లేనిదే మానవ సమాజం ముందడుగు వేయలేదన్నది వాస్తవం. పరిశోధనతోనే నిరంతర పరిణామం సాధ్యం. ప్రతి యుగంలో పరిశోధనల గురించి వేల ఏళ్ల మానవజాతి చరిత్ర చాటిచెబుతోంది. జీవన పురోగమనం, విస్తరణకు ఇది దారితీస్తుందని రుజువవుతూనే ఉంది. ఇదే బాటలో పరిశోధనలను ప్రోత్సహించే చట్టపరమైన చట్రాన్ని అధికారికంగా ఏర్పాటు చేయడంలో ఈ సభ గణనీయ చొరవ చూపింది. ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ రోజువారీ రాజకీయ చర్చల్లో నలిగే అంశం కాకపోయినా, విస్తృత ప్రభావం చూపుతుంది. ఇది 17వ లోక్‌సభ చేపట్టిన మహత్కార్యం. మన యువత ప్రతిభతో మన దేశం విశ్వవ్యాప్త పరిశోధనల కూడలిగా రూపొందగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మన యువతరం ప్రతిభ ఎంతటిదంటే- అనేక అంతర్జాతీయ సంస్థలు నేటికీ భారత్‌లో తమ ఆవిష్కరణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అయితే, త్వరలోనే మన దేశం అందుకు ప్రధాన కూడలి కాగలదన్న ప్రగాఢ విశ్వసం ప్రకటిస్తున్నాను.

గౌరవనీయ అధ్య‌క్షా!

ప్రస్తుత 21వ శతాబ్దంలో మన కనీస అవసరాలు పూర్తిగా మారిపోతున్నాయి. నిన్నటిదాకా పనికిరానిదిగా కనిపించినదే ఇప్పుడు విలువైనదిగా మారుతోంది. అదే డేటా... దీని సామర్థ్యంపై నేడు  ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో డేటా రక్షణ బిల్లు ద్వారా యావత్‌ భావితరం భద్రతకు భరోసా ఇస్తూ ఈ రూపంలో ఓ కొత్త ఉపకరణాన్ని సమకూర్చాం. దీన్ని తమ ఉజ్వల భవిత కోసం వారు సద్వినియోగం చేసుకుంటారు. డిజిటల్ పర్సనల్ డేటా రక్షణ చట్టం మన యువతలోనే కాకుండా ప్రపంచ మానవాళిలోనూ ఆసక్తి రేపింది. ప్రపంచ దేశాలన్నీ దీనిపై అధ్యయనం చేపట్టాయి. తమ కొత్త వ్యవస్థలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలని అవి ప్రయత్నిస్తున్నాయి. డేటా వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. రక్షణకు సంబంధించి దాని సామర్థ్యం జనం నోళ్లలో నానే ఓ ‘బంగారు గని లేదా కొత్త చమురు బావి’లాంటిది. మనది వైవిధ్యసమృద్ధ దేశం కాబట్టి, భారత్‌కు ఈ సామర్థ్యం ఉందని నాకు అవగతమైంది. మన వద్దగల సమాచారం, దాని విభిన్నత ఎలాంటివంటే- మన రైలు ప్రయాణికుల డేటాను ఓసారి పరిశీలిద్దాం... ఇది ప్రపంచానికి గొప్ప పరిశోధనాంశం కాగలదు. మొత్తం మీద మేం డేటా శక్తిని గుర్తించి, దానికి చట్టబద్ధ వ్యవస్థను ఏర్పరిచాం.

గౌరవనీయ అధ్య‌క్షా!

శతాబ్దాలుగా నీరు, భూమి, ఆకాశంపై చర్చలు సాగుతున్నాయి... అయితే, ఇప్పుడు ప్రపంచం ముందున్న సంక్షోభాలను పరిశీలిస్తే- సముద్ర శక్తి, అంతరిక్ష శక్తి, సైబర్ శక్తి సంబంధిత పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచం ఆలోచనాత్మక ప్రభావ సృష్టికి యత్నిస్తున్నందున, మనం కూడా ఈ రంగాల్లో సానుకూల సామర్థ్యాలను సృష్టించుకోవాలి. ప్రతికూల శక్తుల సవాళ్లను ఎదుర్కొనేలా మనల్ని మనం శక్తిమంతం చేసుకోవాలి. అందువల్ల, అంతరిక్ష సంబంధిత సంస్కరణలు అవశ్యం. కాబట్టే, మన దేశంలో దూరదృష్టితో అంతరిక్ష సంస్కరణల అమలు పూర్తయింది.

గౌరవనీయ అధ్య‌క్షా!

దేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలలో గౌరవనీయ 17వ లోక్‌సభ సభ్యులు కీలక పాత్ర పోషించారు. కొన్నేళ్లుగా వేలాది నిబంధనలు అనవసరంగా ప్రజలను చిక్కులపాలు చేశాయి. ముదిరిపోయిన వక్రీకృత పాలన వ్యవస్థల నుంచి విముక్తి పొందడం గర్వకారణం... ఈ ఘనత కూడా ఈ సభకే దక్కుతుంది. ఇటువంటి నిబంధనలతో సామాన్యులపై భారం పడుతుంది. “కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ట పాలన” గురించి చర్చించుకున్న నేపథ్యంలో- జన జీవనంలో ప్రభుత్వ ప్రమేయం ఎంతగా తగ్గితే ప్రజాస్వామ్యం అంతగా బలోపేతం కాగలదని విశ్వసిస్తున్నట్లు ఓ సందర్భంలో ఎర్రకోట పైనుంచి మాట్లాడుతూ నేను స్పష్టం చేశాను. ప్రజల దైనందిన జీవితంలోని ప్రతి మలుపులోనూ ప్రభుత్వం జోక్యం ఎందుకు? అవును... ప్రభుత్వం సదా నిస్సహాయులకు అందుబాటులో ఉండాలి తప్ప వారి జీవితాలకు అడ్డంకిగా మారితే ప్రజాస్వామ్యం కునారిల్లుతుంది. కాబట్టి, సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని వీలైనంతగా తగ్గించడమే మన లక్ష్యం కావాలి. తద్వారా ప్రపంచానికి మనం సుసంపన్న ప్రజాస్వామ్యాన్ని అందించగలం... ఈ స్వప్నాన్ని మేం తప్పక సాకారం చేస్తాం.

గౌరవనీయ అధ్య‌క్షా!

కంపెనీల చట్టం, పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం సహా 60కి పైగా కాలం చెల్లిన చట్టాలను మేం రద్దుచేశాం. వ్యాపార సౌలభ్యం మెరుగుకు ఇదెంతో కీలకం. దేశం పురోగమించాలంటే, అనేక అవరోధాలను అధిగమించాలి. అయితే, మన చట్టాలు చాలావరకు స్వల్ప కారణంతో ప్రజలను జైలుపాలు చేసేలా ఉండేవి. ఉదాహరణకు॥, ఒక ఫ్యాక్టరీలోని టాయిలెట్‌కు ప్రతి ఆరు నెలలకు సున్నం వేయకపోతే, ఆ కంపెనీ యజమాని ఎంత గొప్పవాడైనా జైలుకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఇవాళ వామపక్ష ఉదారవాదులమని చాటుకునే భావజాలాన్ని, ఈ దేశంలో ‘కుమార్ షాహి’ శకాన్ని వదిలించుకోవడానికి మనం ధైర్యంగా నిలబడాలి. కాబట్టే, ప్రజల్లో విశ్వాసాన్ని ప్రోది చేయడానికి 17వ లోక్‌సభ ప్రశంసనీయంగా కృషి చేసింది. ఈ క్రమంలో మనం జన్‌ విశ్వాస్ చట్టం గురించి మాట్లాడుకుందాం... ఈ చట్టం కింద 180కిపైగా నిబంధనలను నేరరహితం చేశాం. చిన్న పొరపాట్లకే జైలుపాలయ్యే దురవస్థ గురించి నేనిప్పడే ప్రస్తావించాను. ఇప్పుడు అలాంటి పొరపాట్లను ఈ సభ ద్వారా గౌరవనీయ సభ్యులు నేరరహితం చేస్తూ పౌరులకు సాధికారత కల్పించారు. కోర్టుల చిక్కుల నుంచి ప్రజలకు రక్షణ, కోర్టు వెలుపల వివాదాల నుంచి విముక్తి కల్పించడం చాలా ముఖ్యమైన బాధ్యతలు. ఆ దిశగా మధ్యవర్తిత్వ చట్టాలదీ కీలక పాత్ర... ఈ విషయంలోనూ గౌరవనీయ సభ్యులు కీలక భూమిక వహించారు. ఎప్పుడూ పక్కనే ఉండేవారిలో ఏ ఒక్కరూ వారిని పట్టించుకున్నది లేదు. అలాంటి వారు ఇప్పుడు ప్రభుత్వ ప్రాముఖ్యమేమిటో గ్రహించారు. అవును.. నేను చెబుతున్నది నిజమే, కోవిడ్‌ సమయంలో ఉచిత టీకాలు అందుబాటులోకి వచ్చాక ఈ వాస్తవం వారికి అవగతమైంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ఉనికి ప్రధానం... ముఖ్యంగా సామాన్యుల ప్రజల జీవితాలకు ఎంతో అవసరం. నిస్సహాయ పరిస్థితి ఇకపై ఏ ఒక్కరికీ, ఎన్నడూ తలెత్తనివ్వం.

లింగమార్పిడి సమాజంపై ఒకనాడు వివక్ష కనిపించేది. పలుమార్లు ఇదే అనుభవం ఎదురైతే వారి ధోరణిలో విపరీత మార్పులు వచ్చే ముప్పు ఉంది. మరోవైపు ఇటువంటి అంశంపై మాట్లాడటానికి  సాధారణంగా అందరూ వెనకాడుతారు. అయితే, 17వ లోక్‌సభలోని గౌరవనీయ సభ్యులందరూ వారిపై సానుభూతితో వ్యవహరిస్తూ వారి జీవితాల మెరుగుకు దోహదపడ్డారు. అందుకే, వారి సంక్షేమం దిశగా భారత్‌ చేపట్టిన చర్యలు, కృషిపై ప్రపంచవ్యాప్త చర్చ సాగుతోంది. ఇక ఉద్యోగం చేసే మహిళలు గర్భందాల్చితే వారికి 26 వారాల ప్రసూతి సెలవు సదుపాయం కల్పించడం చూసి, ప్రపంచమే... చివరకు సంపన్న దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అంటే- ఈ 17వ లోక్‌సభ ఎన్నో ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా లింగమార్పిడి వ్యక్తులకు ఒక గుర్తింపు ఇచ్చాం. ఇప్పటిదాకా దాదాపు 16-17 వేల మందికి గుర్తింపు కార్డులు జారీ చేశాం. వాటి సాయంతో ఇప్పుడు వారు ‘ముద్ర’ పథకం ద్వారా రుణ సహాయంతో చిన్న వ్యాపారాలు చేసుకుంటూండటం నేనూ గమనించాను. వారు స్వయం ఉపాధితో సంపాదించుకుంటూ గౌరవప్రదంగా జీవిస్తున్నారు. దీనికి గుర్తింపుగా భిన్న రంగాల్లో విశిష్ట కృషి చేసిన లింగమార్పిడి వ్యక్తులకు పద్మ అవార్డులు ప్రదానం చేశాం. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వారు ప్రయోజనం పొందే ప్రక్రియ ప్రారంభమై, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం వారికి ఇప్పుడు లభించింది.

గౌరవనీయ అధ్య‌క్షా!

కోవిడ్ మహమ్మారి దాదాపు రెండేళ్లు మనను పీడించింది. అయినప్పటికీ, 17వ లోక్‌సభ దేశానికి ప్రయోజనం కల్పిస్తూ అనేక విధాలుగా కృషి చేసింది. మరోవైపు ఈ మహమ్మారి ఫలితంగా మనం కొందరు సహచరులు కూడా కోల్పోయాం. వారు ఈ రోజున మన మధ్య ఉండి ఉంటే, ప్రస్తుత వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ కోవిడ్ కారణంగా ఎందరో ప్రతిభావంతులైన మన సహచరులు నేడు మన మధ్య లేకపోవడం విచారకరం. ఈ నష్టం తెచ్చిన దుఃఖం మనను సదా బాధిస్తూనే ఉంటుంది.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఈ 17వ లోక్‌సభ చివరి సమావేశంలో ఇవి ఆఖరు క్షణాలు. ప్రజాస్వామ్యం, భారత్ పురోగమన ప్రయాణం అనంతం. ఈ దేశం ఒక ఉదాత్త లక్ష్యాన్ని కర్తవ్యంగా స్వీకరించింది... ఆ లక్ష్యం యావత్‌ మానవాళి సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తుంది. స్వామి అరబిందో లేదా స్వామి వివేకానంద ప్రబోధాలు ఈ అంశాన్ని మనకు స్పష్టం చేస్తాయి. ఆ ప్రబోధాల్లోని దార్శనికత, వాటి ప్రభావం ఎంత శక్తిమంతమైనవో మనం నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. భారత్‌ ఔన్నత్యాన్ని ప్రపంచం అంగీకరిస్తోంది... మన శక్తిసామర్థ్యాలను గుర్తిస్తోంది... ఈ నేపథ్యంలో మన ప్రగతి పయనం మరింత ఉత్తేజంతో ముందుకు సాగాలి.

గౌరవనీయ అధ్య‌క్షా!

ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు... కాబట్టి, కొందరికి కాస్త బెరుకుగా అనిపించవచ్చు. అయితే, ఇది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైన కీలకాంశం. మనమంతా దీన్ని సగర్వంగా అంగీకరిస్తాం. మన ఎన్నికల ప్రక్రియ దేశానికే గర్వకారణంగా నిలిచి... ప్రజాస్వామ్య సంప్రదాయం కొనసాగుతుందని, ప్రపంచమంతా మరోసారి ఆశ్చర్యపోవడం తథ్యమని దృఢంగా విశ్వసిస్తున్నాను.

గౌరవనీయ అధ్య‌క్షా!

గౌరవనీయ సభ్యులందరి నుంచి నాకు లభించిన మద్దతు, మేం తీసుకోగలిగిన నిర్ణయాలు సంతోషం కలిగించాయి. కొన్ని సందర్భాల్లో ఎదురు దాడులు వినోదాత్మకంగా ఉంటూనే, మా బలాన్ని వెలికి తీయడంలో దోహదం చేశాయి. సర్వశక్తిమంతుడైన ఆ దైవం దయ వల్ల మనం సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఆనందం కూడా కలుగుతుందని నా నమ్మకం. ప్రతి సవాలును మేం నిండైన ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఎదుర్కొన్నాం. రామాలయ నిర్మాణంపై ఈ సభ ఆమోదించిన తీర్మానం  భారతీయ విలువలపై మన భావితరాలు గర్వించేలా రాజ్యాంగ శక్తినిస్తుంది. ఇలాంటి బృహత్కార్యాల్లో పాలుపంచుకోగల ధైర్యం అందరికీ ఉండదనేది వాస్తవం. అందుకే కొందరు మధ్యలోనే నిష్క్రమిస్తారు. ఏదిఏమైనా భవిష్యత్తు రికార్డులను, ప్రస్తుత ప్రసంగాలను, వ్యక్తీకరించిన భావాలను, ప్రవేశపెట్టిన తీర్మానాలను చూసినప్పుడు వాటిలో అంతర్లీనమైన సానుభూతి, దృఢ సంకల్పం, కరుణ కనిపిస్తాయి. అంతేగాక ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ విధానాన్ని చిత్తశుద్ధితో కొనసాగించే అంశం కూడా ఇమిడి ఉందన్నది స్పష్టమవుతుంది.

ఈ దేశం ఎన్నో దుర్దినాలను చూసింది.. దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొంది. అయినప్పటికీ, భావితరాలకు ఏదో ఒక మంచి చేయడానికే సదా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఈ సభ కూడా మనకెంతో స్ఫూర్తినిచ్చింది.. సమష్టి సంకల్పం, శక్తిసామర్థ్యాలతో మన యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా సాధ్యమైనంత మేర అత్యుత్తమ ఫలితాల కోసం మనం సర్వదా శ్రమిస్తాం.

ఈ ప్రగాఢ విశ్వాసంతో గౌరవనీయ సభ్యులందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

****


(Release ID: 2170554) Visitor Counter : 8