పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఉజ్వల పథకం కింద 25 లక్షల అదనపు ఎల్‌పీజీ కనెక్షన్ల విడుదలకు ఆమోదం
Posted On:
22 SEP 2025 5:12PM by PIB Hyderabad
మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు వేస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద 25 లక్షల అదనపు ఎల్‌పీజీ కనెక్షన్ల విడుదలకు ప్రభుత్వం ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ “నవరాత్రి శుభ సందర్భంలో ఉజ్వల కుటుంబంలో చేరుతున్న అందరు తల్లులు, ఆడపడుచులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం పవిత్రమైన పండుగ సమయంలో మీ అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళా సాధికారత పట్ల మా ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. “నవరాత్రి ప్రారంభ సందర్భంలో ఉజ్వల పథకం కింద అదనంగా 25 లక్షల డిపాజిట్ రహిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించాలనే ఈ నిర్ణయం.. దుర్గాదేవితో సమానంగా మహిళలను గౌరవించే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతకు మరో నిదర్శనం. ఇది తల్లులు, ఆడపడుచుల గౌరవం, సాధికారత పట్ల మా ప్రభుత్వ సంకల్పాన్ని బలపరుస్తుంది. వంట గదులను పొగ రహితంగా మార్చడం, ఆరోగ్యాన్ని కాపాడటం, దేశవ్యాప్తంగా కుటుంబాల భవిష్యత్తును ప్రకాశవంతం చేయడం ద్వారా దేశంలోని అత్యంత ప్రభావవంతమైన సామాజిక సంక్షేమ పథకాల్లో ఒకటిగా ఉజ్వల పథకం ఆవిర్భవించింది.” అని వ్యాఖ్యానించారు.
ఈ విస్తరణతో మొత్తం పీఎంయూవై కనెక్షన్ల సంఖ్య 10.58 కోట్లకు పెరుగుతుంది. ఈ కనెక్షన్ల విడుదల కోసం ప్రభుత్వం రూ 676 కోట్లు ఖర్చు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇందులో ప్రతి కనెక్షన్‌కు రూ 2,050 చొప్పున 25 లక్షల డిపాజిట్-రహిత కనెక్షన్‌లను అందించడానికి రూ 512.5 కోట్లు, ప్రతి 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌కు అందిస్తున్న రూ 300ల సబ్సిడీ కోసం రూ 160 కోట్లు (సంవత్సరానికి తొమ్మిది రీఫిల్స్ వరకు, 5 కిలోల సిలిండర్లకు అనుగుణంగా), ప్రాజెక్ట్ నిర్వహణ ఖర్చులు, లావాదేవీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు, సమాచారం, అవగాహన-కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, నిర్వహణ ఖర్చుల కోసం మొత్తం రూ 3.5 కోట్లు ఖర్చు చేస్తారు.
పీఎంయూవై కింద లబ్ధిదారులు డిపాజిట్-రహిత ఎల్‌పీజీ కనెక్షన్‌ను పొందుతారు. సిలిండర్, ప్రెజర్ రెగ్యులేటర్, సురక్ష పైపు, డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డ్ (డీజీసీసీ) బుక్లెట్, ఇన్స్టలేషన్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌లను ఇది కవర్ చేస్తుంది. ఉజ్వల 2.0 విధానాలకు అనుగుణంగా మొదటి రీఫిల్, స్టవ్ కూడా ఉచితంగా అందిస్తారు. ఎల్‌పీజీ కనెక్షన్ మొదటి రీఫిల్, స్టవ్ కోసం లబ్ధిదారులు ఎటువంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చులను భారత ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) భరిస్తాయి. 14.2 కిలోల సింగిల్ బాటిల్ కనెక్షన్, 5 కిలోల సింగిల్ బాటిల్ కనెక్షన్, 5 కిలోల డబుల్ బాటిల్ కనెక్షన్ నుంచి ఏదైనా ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారులకు ఉంటుంది.
పారదర్శకతనూ, అందుబాటులో ఉండే సౌలభ్యాన్నీ మరింత పెంచడం కోసం పీఎంయూవై కింద ఎల్‌పీజీ కనెక్షన్ పొందే ప్రక్రియను పూర్తిగా క్రమబద్ధీకరించి, సాంకేతికతను జోడించారు. కుటుంబంలో ఇప్పటికే ఎల్‌పీజీ కనెక్షన్ లేని పేద కుటుంబాలకు చెందిన అర్హులైన వయోజన మహిళలు [www.pmuy.gov.in] ( http://www.pmuy.gov.in) చిరునామాను సందర్శించడం ద్వారా గానీ.. ప్రభుత్వ రంగ ఓఎంసీలకు చెందిన ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద గానీ సరళమైన కేవైసీ దరఖాస్తు ఫారం, సిలిండర్ లేదనే ధ్రవీకరణను సమర్పించడం ద్వారా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ వోచర్ జారీ చేయడం, దరఖాస్తుదారుల నివాసంలో ఎల్‌పీజీ కనెక్షన్ ఇన్‌స్టాల్ చేయడానికి ముందు సిస్టమ్-ఆధారిత డీ-డూప్లికేషన్ తనిఖీలు నిర్వహిస్తారు. అనంతరం ఓఎంసీ అధికారులు దరఖాస్తులను భౌతికంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. ఇప్పటికే దరఖాస్తు పెండింగులో ఉన్న వారు.. సవరించిన ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి తాజా వివరాలను కొత్త నమూనా ప్రకారం సమర్పించాలి.
2016 మే నెలలో ప్రారంభించిన పీఎంయూవై పథకం ద్వారా ప్రారంభంలో 8 కోట్ల డిపాజిట్ రహిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించాలన్న లక్ష్యం 2019 సెప్టెంబరు నాటికి సాకారమైంది. మిగిలిన పేద కుటుంబాల ప్రయోజనం కోసం ఉజ్వల 2.0ను 2021 ఆగస్టు నెలలో ప్రారంభించారు. 2022 జనవరి నాటికి 1 కోటి అదనపు కనెక్షన్ల లక్ష్యం అందుకున్నారు. ఉజ్వల 2.0 కింద 2022 డిసెంబరు నాటికి సాధించిన 60 లక్షల అదనపు కనెక్షన్లకు, జూలై 2024 నాటికి సాధించిన మరో 75 లక్షల కనెక్షన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025 జూలై నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్లకు పైగా పీఎంయూవై కనెక్షన్లు విడుదల చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శుద్ధ ఇంధన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.
మరిన్ని వివరాల కోసం లబ్ధిదారులు అధికారిక పీఎంయూవై పోర్టల్ www.pmuy.gov.inని సందర్శించవచ్చు లేదా ప్రభుత్వ రంగ ఓఎంసీల సమీపంలోని ఎల్‌పీజీ పంపిణీదారులను సంప్రదించవచ్చు.
****
(Release ID: 2169968)