ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, కొన్నింటిని ప్రారంభించి, కొన్నింటిని జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
23 FEB 2024 5:30PM by PIB Hyderabad
హర హర మహాదేవ్!
ఈ వేదికపై ఉన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాద్, కేంద్ర క్యాబినెట్లో నా సహచరుడు శ్రీ మహేంద్రనాద్ పాండే, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పాఠక్, బనాస్ డైరీ ఛైర్మన్ శంకర భాయ్ ఛౌదరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి, రాష్ట్ర మంత్రులు, ప్రతినిధులు, కాశీ సోదరీసోదరులారా,
ఈ కాశీ నేలపై మీ మధ్య ఉండే అవకాశం మరోసారి నాకు దక్కింది. వారణాసికి రాకపోతే నా హృదయం ప్రశాంతంగా ఉండలేదు. పదేళ్ల కిందట మీరు నన్ను బెనారస్ పార్లమెంట్ సభ్యుడిని చేశారు. ఈ పదేళ్లలో బెనారస్ నన్ను బెనారసీగా మార్చింది.
సోదరీసోదరులారా,
మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి మీరు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ దృశ్యం మమ్మల్ని కదిలించింది. మీరు కష్టపడి పనిచేయడం వల్లే కాశీ పునరుద్ధరణ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ రోజు మనం 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించుకున్నాం. ఇవి కాశీ అభివృద్ధితో పాటు.. పూర్వాంచల్ సహా తూర్పు భారత వృద్ధిని వేగవంతం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో రైలు, రోడ్డు, విమానాశ్రయాలు, పశు సంవర్థక, పరిశ్రమలు, క్రీడలు, నైపుణ్యాబివృద్ధి, ఆరోగ్యం, పారిశుద్ద్యం, ఆధ్యాత్మికం, పర్యాటకం, ఎల్పీజీ గ్యాస్ సహా ఇతర రంగాలకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల బెనారస్‌లోనూ, పూర్వాంచల్ ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సంత్ రవిదాస్ జన్మస్థలానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు సైతం ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులకు గాను మీ అందరికీ అభినందనలు.
స్నేహితులారా,
కాశీ, పూర్వాంచల్‌కు ఏదైనా మంచి జరిగితే అది సహజంగానే నాకు ఆనందాన్నిస్తుంది. ఈ రోజు పెద్ద సంఖ్యలో యువ మిత్రులు ఇక్కడికి వచ్చారు. నిన్న రాత్రి బబత్‌పూర్ నుంచి బీఎల్‌డబ్ల్యూ అతిథి గృహానికి నేను రోడ్డు మార్గంలో వచ్చాను. కొన్ని నెలల క్రితం నేను బెనారస్‌కు వచ్చినప్పుడు ఫుల్వారియా ఫ్లైఓవర్‌ను ప్రారంభించాను. బెనారస్‌కు ఈ ఫ్లైఓవర్ వరంలా ఎలా మారిందో మనకు కనిపిస్తోంది. గతంలో ఎవరైనా బీఎల్‌డబ్ల్యూ నుంచి బబత్‌పూర్ వెళ్లాలంటే.. రెండు - మూడు గంటల ముుందే ఇంటి నుంచి బయలుదేరాల్సి వచ్చేది. మండువాఢి నుంచి మొదలయ్యే ట్రాఫిక్ మహ్మూర్గంజ్, కంటోన్మెంట్, చౌకాఘాట్, నాదేసర్ వరకు కొనసాగేది. విమానంలో ఢిల్లీకి వెళ్లడానికి పట్టే సమయం కంటే.. ఆ విమానాశ్రయానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. ఈ ఫ్లైఓవర్‌తో ఆ ప్రయాణ సమయం సగానికి తగ్గింది.
నిన్న రాత్రి ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని, ఏర్పాట్లను సమీక్షించాను. అక్కడ కొంత సమయం నడిచాను కూడా. గత పదేళ్లుగా బెనారస్ అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరిగింది. కొద్దిసేపటి క్రితమే.. సిగారా స్టేడియం వద్ద మొదటి దశ పనులను ప్రారంభించాం. బెనారస్ యువ అథ్లెట్ల కోసం అత్యాధునిక షూటింగ్ రేంజ్ ప్రారంభించాం. ఇది బెనారస్ సహా ఈ ప్రాంతంలోని యువ అథ్లెట్లకు భారీగా ప్రయోజనం చేకూరుస్తుంది.
స్నేహితులారా,
ఇక్కడికి రావడానికి ముందు నేను బనాస్ డైరీ ప్లాంట్ సందర్శించాను. అక్కడ పశు సంరక్షణలో నిమగ్నమైన అనేక మంది అక్కాచెల్లెళ్లతో నేను మాట్లాడాను. ఈ రైతు కుటుంబాలకు రెండు, మూడేళ్ల క్రితం దేశీయ జాతి గిర్ ఆవులను అందించాం. పూర్వాంచల్‌లో మెరుగైన దేశీయ జాతి ఆవుల సమాచారం అందించి పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే దీని ముఖ్యోద్దేశం. ఇక్కడ గిర్ ఆవుల సంఖ్య మూడు వందల యాభైకి చేరుకుందని నాకు చెప్పారు. సాధారణ ఆవులు 5 లీటర్ల పాలు ఇస్తే.. గిర్ జాతి ఆవులు 15 లీటర్ల పాలు ఇస్తాయని ఈ ఆడపడుచులు నాకు చెప్పారు. ఒక కుటుంబంలోని ఆవు 20 లీటర్ల పాలు ఇస్తుందని కూడా నాకు తెలియజేశారు. ఫలితంగా ఈ అక్కాచెల్లెళ్లంతా నెలకు వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇప్పుడు మన ఆడపడుచులు ‘లఖ్‌పతి దీదీలు’గా మారుతున్నారు. ఇది దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న 10 కోట్ల మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది.
స్నేహితులారా,
రెండేళ్ల కిందట నేను బనాస్ డైరీని ప్రారంభించాను. ఆ సమయంలో వారణాసితో సహా పూర్వాంచల్లోని పశు పోషకులు, పాడి రైతులకు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తానని వాగ్దానం చేశాను. ఈ రోజు, మోదీ గ్యారంటీ మీ ముందే ఉంది. అందుకే మోదీ హామీ అంటే కచ్చితంగా నెరవేరుతుందనే గ్యారంటీ ఉందని ప్రజలు అంటారు. సరైన పెట్టుబడితో ఉపాధి అవకాశాలను ఎలా సృష్టించవచ్చో చెప్పడానికి బనాస్ డైరీ ఓ ఉదాహరణ. వారణాసి, మీర్జాపూర్, ఘాజీపూర్, రాయ్‌బరేలీ జిల్లాల నుంచి 2 లక్షల లీటర్ల పాలను బనాస్ డైరీ ప్రస్తుతం సేకరిస్తుంది.
ఈ ప్లాంట్ ప్రారంభంతో బల్లియా, చందౌలీ, ప్రయాగరాజ్, జౌన్పూర్, ఇతర జిల్లాలకు చెందిన లక్షలాది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుంది. వారణాసి, జౌన్పూర్, చందౌలి, ఘాజీపూర్, అజాంఘడ్ జిల్లాల్లో వేలాది గ్రామాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా డైరీ మార్కెట్లు ఏర్పాటవుతాయి. పాలను ఎక్కువ ధరకు అమ్మితే.. పాడి రైతుల కుటుంబాలు ఎక్కువ ఆదాయం ఆర్జిస్తాయి. మేలు జాతి పశువులు, పశువుల దాణాకు సంబంధించిన సమాచారాన్ని అందించి రైతులకు, పాడి రైతులకు అవగాహన పెంచడంతో పాటు అవసరమైన శిక్షణను ఈ ప్లాంట్ అందిస్తుంది.
స్నేహితులారా,
ఇదే కాకుండా.. బనాస్ కాశీ శంకుల్ వేలాది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వివిధ రంగాల్లో ఉపాధి సృష్టి జరుగుతుంది. ఈ శంకుల్ ద్వారా ఈ ప్రాంతంలో మూడు లక్షల మంది రైతుల ఆదాయం పెరిగిందని అంచనా వేస్తున్నారు. పాలు మాత్రమే కాకుండా మజ్జిగ, పెరుగు, లస్సీ, ఐస్ క్రీమ్, పన్నీర్, ప్రాంతీయంగా దొరికే వివిధ రకాల స్వీట్లను కూడా తయారు చేస్తున్నారు. వీటిని అమ్మే వారికి కూడా ఉపాధి లభిస్తుంది. దేశం నలుమూలలకు బెనారస్‌లో ప్రసిద్ధి చెందిన స్వీట్లు చేరేలా ఈ ప్లాంట్ గణనీయమైన పాత్రను పోషిస్తుంది. పాల సరఫరాకు సంబంధించిన వ్యాపారం ద్వారా సైతం ఎంతో మంది ఉపాధిని పొందుతారు. పశువుల దాణాకు సంబంధించిన వ్యాపారాలు, స్థానిక పంపిణీ వ్యవస్థలు కూడా పెరుగుతాయి. ఇవి కూడా ఎన్నో ఉద్యోగాలను సృష్టిస్తాయి.
స్నేహితులారా,
ఈ ప్రయత్నాల్లో భాగంగా.. బనాస్ డైరీ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉన్నత ఉద్యోగులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. పాలకు సంబంధించిన డబ్బును పురుషుల చేతికి ఇవ్వకుండా డిజిటల్‌గా మన ఆడపడుచుల ఖాతాల్లోకి పంపించమని కోరుతున్నాను. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నా అనుభవం చెబుతోంది. మన అక్కాచెల్లెళ్లు ఎక్కువగా నిమగ్నమై ఉన్న రంగం పశు పోషణ. వారికి స్వావలంబన అందించడానికి ఇదే మంచి మార్గం. చిన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాలకు పశు పోషణ గణనీయమైన తోడ్పాటు ఇస్తుంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ పశు సంవర్థక, పాడి రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది.
స్నేహితులారా,
రైతును ఇంధన సరఫరాదారుగా మాత్రమే కాకుడా.. ఎరువుల సరఫరాదారుగా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తోంది. పాలతో పాటుగా ఆవు పేడను సైతం ఆదాయ వనరుగా మార్చేందుకు అవసరమైన అవకాశాలను పాడి రైతులకు మేం అందిస్తున్నాం. మా డెయిరీ ప్లాంట్లు ఆవు పేడ నుంచి బయోగ్యాస్ సీఎన్‌జీని తయారు చేస్తున్నాయి. రైతులకు తక్కువ ధరలకే సేంద్రీయ ఎరువులను అందించే పనులు కొనసాగుతున్నాయి. ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తుంది. గంగా నదీ తీరాన సేంద్రీయ సాగు పెరుగుతోంది. అలాగే గంగా ఒడ్డున సహజ వ్యవసాయ పద్ధతి కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం, గోబర్ దాన్ పథకం ద్వారా ఆవు పేడ, ఇతర వ్యర్థాలతో బయో గ్యాస్, బయో-సీఎన్‌జీ ఉత్పత్తి అవుతున్నాయి. ఇది పారిశుద్ద్యాన్ని అందించడమే కాకుండా.. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తుంది.
స్నేహితులారా,
వ్యర్థాలను సంపదగా మార్చడంలో కాశీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రోజు ఇక్కడ అలాంటి మరో ప్లాంట్ ప్రారంభమైంది. ఈ ప్లాంట్ నగరంలో రోజూ ఉత్పత్తి అయ్యే 600 టన్నుల వ్యర్థాలను 200 టన్నుల చార్‌కోల్‌గా మారుస్తుంది. ఈ చెత్తను ఏదైనా ప్రదేశంలో వేయడం ప్రారంభిస్తే.. వ్యర్థాలు కొండలా ఎలా పేరుకుపోతాయో ఊహించండి. కాశీలో మురుగు నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరిచే పనులు పూర్తయ్యాయి.
స్నేహితులారా,
బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులు, పాడి రైతులకు అధిక ప్రాధాన్యమిచ్చింది. రెండు రోజుల క్రితమే చెరకు పంటకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.340కి పెంచింది. పశు పోషకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పశువుల బీమా కార్యక్రమాన్ని సులభతరం చేశాం. గత ప్రభుత్వ హయాంలో చెరకు చెల్లింపుల విషయంలో ఎలా ఇబ్బందులకు గురి చేసేదో గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. రైతులకు పాత బకాయిలను తీర్చడమే కాకుండా.. పంట దిగుబడికి దక్కే ధరలు సైతం పెరిగాయి.
సోదరీసోదరులారా,
‘ఆత్మ నిర్భర్ భారత్’ (స్వావలంబన సాధించిన భారత్) సామర్థ్యం ఆధారంగా ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన భారత్)ను నిర్మించాలి. ప్రతి వస్తువునూ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా ‘వికసిత భారత్’ను సాధించలేం. గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే. దేశంలోని ప్రతి చిన్న శక్తిని మేల్కొల్పినప్పుడు, చిన్నకారు రైతులు, పాడి రైతులు, చేతివృత్తుల వారు, కళాకారులు, చిన్న వ్యాపారవేత్తలకు సాయం అందించినప్పుడే ‘ఆత్మనిర్భర భారత్’ సాధ్యమవుతుంది. అందుకే స్థానిక ఉత్పత్తుల గురించి నేను మాట్లాడుతూ ఉంటారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడం వల్ల వార్తాపత్రికలు, టీవీల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వలేని చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులకు ప్రచారం దొరుకుతుంది. స్థానికంగా ఉత్పత్తులను తయారు చేసే ప్రతి ఒక్కరికీ మోదీ ప్రచారం చేస్తారు.
ప్రతి చిన్న రైతు, వ్యాపారవేత్తకు మోదీ ఈ రోజు ప్రచారకర్త. ఖాదీ కొనండి, ఖాదీ ధరించండి అని నేను ప్రజలను కోరినప్పుడు, ప్రతి గ్రామంలోనూ ఖాదీ ధరించే ఆడపడుచులను మార్కెట్‌తో అనుసంధానిస్తాను. దేశంలో తయారు చేసిన బొమ్మల కొనుగోలు గురించి మాట్లాడినప్పుడు అది తరతరాలుగా బొమ్మల తయారీలో నిమగ్నమై ఉన్న కుటుంబాల జీవితాలను మెరుగుపరుస్తుంది. మేక్ ఇన్ ఇండియా గురించి నేను మాట్లాడినప్పుడు, చిన్న, కుటీర పరిశ్రమల సామర్థ్యాలను, మన ఎంఎంస్ఎంఈలను నేను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ‘దేఖో అప్నా దేశ్’ (మనదేశాన్ని సందర్శించండి) అన్నప్పుడు నేను మన దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాను.
కాశీలో ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. విశ్వనాథ ధామ్ పునర్నిర్మాణం అనంతరం కాశీను దాదాపు 12 కోట్ల మంది ప్రజలు సందర్శించారు. ఇది దుకాణదారులు, దాబా యజమానులు, వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, పూల విక్రేతలు, పడవ నడిపేవారు, ఇతరులందరికీ ఉపాధిని పెంపొందించింది.
ఈ రోజు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. అయోధ్య, కాశీ మధ్య చిన్న విద్యుత్ విమానాలను నడిపే ప్రణాళిక ప్రారంభమైంది. ఇది కాశీ, అయోధ్య మధ్య ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుంది.
సోదరీసోదరులారా,
దశాబ్దాలుగా బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు అభివృద్ధిలో ఉత్తర ప్రదేశ్ వెనకబడి ఉండేలా చేశాయి. అందుకే గత ప్రభుత్వాలు యూపీని బీమారు (రోగం) రాష్ట్రంగా మార్చి, యువత భవిష్యత్తును దొంగిలించాయి. కానీ ఇప్పుడు యూపీ మారుతోంది.. యూపీ యువత వారి నూతన భవిష్యత్తును రూపొందించుకుంటున్నారు. మరి ఈ కుటుంబ పార్టీలు ఏం చేస్తున్నాయి? వారి మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. కాంగ్రెస్ రాజ కుంటుబానికి చెందిన వారసుడు ఏం చెబుతున్నారో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాశీ గురించి కాంగ్రెస్ రాజ కుటుంబ వారసుడు ఏమంటున్నారంటే.. కాశీ యువత, యూపీ యువత వ్యసనపరులని అంటున్నారు. ఇదేమి భాష?
మోదీని దూషిస్తూ రెండు దశాబ్దాలు గడిపిన వారు ఇప్పుడు తమ నైరాశ్యాన్ని యూపీ యువతపై, నా కాశీ యువతపై ప్రదర్శిస్తున్నారు. కాశీ, యూపీకి చెందిన యువతను వ్యసనపరులుగా పిలిచే వారు తమ వివేకాన్ని కోల్పోయారు. ఓ కఠినాత్ములైన రాచరికవాదులారా! కాశీ, యూపీ యువత ‘వికసిత యూపీ’ (అభివృద్ధి చెందిన యూపీ) నిర్మాణంలో భాగస్వాములై ఉన్నారు. తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకొనేందుకు కృషి చేస్తున్నారు. ఇండీ కూటమి ఉత్తర ప్రదేశ్ యువతకు చేసిన అవమానాన్ని ఎవరూ మరచిపోరు.
స్నేహితులారా,
ఇదే రాచరిక వాదుల అసలు స్వరూపం. వారు ఎల్లప్పడూ యువత శక్తికి, యువ ప్రతిభకు భయపడుతూనే ఉంటారు. ఎక్కడైనా సాధారణ యువతకు అవకాశాలు లభిస్తే.. ప్రతి చోటా తమకు సవాలు విసురుతారని వారు భయపడతారు. తమను పగలూ రాత్రి నిరంతరాయంగా పొగిడే వారికే ప్రాధాన్యమిస్తారు. ఈ రోజుల్లో వారి కోపానికి, నిరాశకు మరో కారణం కూడా ఉంది. కాశీ, అయోధ్యల నూతన ముఖచిత్రం వారికి నచ్చట్లేదు. రామ మందిరం గురించి తమ ప్రసంగాల్లో ఎలా మాట్లాడతారో చూడండి. తమ మాటలతో ఎలా దాడి చేస్తారో గమనించండి. భగవాన్ శ్రీరాముడి పట్ల కాంగ్రెస్‌కు అంత ద్వేషం ఎందుకో నాకు అర్థం కాదు.
సోదరీసోదరులారా,
తమ కుటుంబం, తమ ఓటు బ్యాంకును దాటి వారు చూడలేరు. దానిని అధిగమించి ఆలోచించలేరు. అందుకే ప్రతి ఎన్నికల సమయంలో వారంతా ఒక్క చోట చేరతారు. ఫలితం శూన్యమైతే.. విడిపోయి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటారు. వారికి తెలియని విషయం ఏంటంటే - ఇది బెనారస్, ఇక్కడ ఇండీ కూటమి పని చేయదని అందరికీ తెలుసు. బెనారస్‌లో మాత్రమే కాదు.. మొత్తం యూపీికి కూడా దాని గురించి తెలుసు. ఉత్పత్తి పాతదే.. కానీ ప్యాకేజింగ్ మాత్రం కొత్తది. ఈ సారి తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోవడానికి వారు చాలానే కష్టపడాలి.
స్నేహితులారా,
ఇప్పుడు దేశమంతా ఒక్కటే ఆలోచిస్తోంది - ఈ సారి ఎన్డీయే 400 (సీట్లు) దాటి గెలుస్తుంది అని. ఇది మోదీ గ్యారంటీ - ప్రతి లబ్ధిదారు 100 శాతం ప్రయోజనాన్ని పొందుతారు. లబ్ధిదారులకు అధిక ప్రయోజనాన్ని అందించేందుకు మోదీ హామీ ఇస్తున్నారు. అందుకే యూపీలోని అన్ని సీట్లను మోదీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఈ సారి యూపీ తన ఎంపీ సీట్లన్నీ ఎన్డీయేకే ఇస్తుంది.
సోదరీసోదరులారా,
ప్రపంచంలో భారత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు అత్యంత శక్తిమంతమైన దశగా మోదీ మూడో పాలనా కాలం ఉండబోతోంది. ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజం, రక్షణ, సంస్కృతి ఇలా అన్ని రంగాలు నూతన శిఖరాలను చేరుకుంటాయి. గత పదేళ్లలో భారత్ 11వ స్థానం నుంచి అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. రానున్న అయిదేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
గత పదేళ్లలో దేశంలో ప్రతిదీ డిజిటల్ రూపం సంతరించుకోవడం మీరు చూశారు. ఈ రోజు, మీరు నాలుగు లేన్లు, ఆరు లేన్లు, ఎనిమిది లేన్లతో కూడిన విశాలమైన రోడ్లను, ఆధునిక రైల్వే స్టేషన్లను చూస్తున్నారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ లాంటి ఆధునిక రైళ్లు చాలా వేగంగా నడుస్తున్నాయి. ఇదే నవ భారతం. రానున్న అయిదేళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం మరింత పెరుగుతుంది, ఈ దేశం పరివర్తనను చూడబోతోంది.
భారత్‌లో అభివృద్ధికి దూరంగా ఉన్న తూర్పు ప్రాంతాన్ని ‘వికసిత్ భారత్’ వృద్ధికి ఇంజిన్‌గా మార్చేందుకు మోదీ గ్యారంటీ ఇస్తున్నాను. వారణాసి నుంచి ఔరంగాబాద్‌కు ఆరులేన్ల జాతీయ రహదారి మొదటి దశ పూర్తయింది. వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తయినప్పుడు యూపీ, బీహార్‌లకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరుతుంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ మధ్య దూరాన్ని, ప్రయాణ సమయాన్ని వారణాసి - రాంచీ - కోల్కతా ఎక్స్‌ప్రెస్‌వే తగ్గిస్తుంది. భవిష్యత్తులో వారణాసి నుంచి కోల్కతాకు ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది.
స్నేహితులారా,
వచ్చే అయిదేళ్లలో కాశీ, యూపీ అభివృద్ధిలో నూతన కోణాలు ఆవిష్కృతమవుతాయి. అప్పుడు కాశీ రోప్ వే లాంటి అత్యాధునిక రవాణా వ్యవస్థను కాశీ ప్రజలు వినియోగించుకుంటారు. విమానాశ్రయ సామర్థ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. యూపీలో మాత్రమే కాకుండా దేశంలో కాశీ ముఖ్యమైన క్రీడా నగరంగా మారనుంది. వచ్చే అయిదేళ్లలో మేడ్ ఇన్ ఇండియా, ‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమాలకు నా కాశీ స్ఫూర్తిని ఇస్తుంది. వచ్చే అయిదేళ్లలో పెట్టుబడి, ఉపాధి, నైపుణ్యం, ఉద్యోగాలు కాశీ కేంద్రంగా కీలకపాత్ర పోషిస్తాయి.
వచ్చే ఐదేళ్లలో కాశీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ సిద్ధమవుతుంది. ఇది యూపీలోని యువత నైపుణ్యానికి, ఉపాధికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. అలాగే తోటి చేనేత కార్మికులకు, హస్త కళాకారులకు నూతన సాంకేతికత, నైపుణ్యాలను అందించడం సులభతరం చేస్తుంది.
స్నేహితులారా,
గడచిన దశాబ్దంలో ఆరోగ్య, విద్యా కేంద్రంగా కాశీకి కొత్త గుర్తింపును తీసుకొచ్చాం. ఇప్పుడు నూతన మెడికల్ కళాశాల కూడా అందులో భాగమే. బీహెచ్‌యూలో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్‌తో పాటు రూ. 35 కోట్ల విలువైన ఇతర డయాగ్నస్టిక్ యంత్రాలు, పరికరాలు ఏర్పాటయ్యాయి. తద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సులభంగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు తోడ్పడతాయి. కాశీలోని ఆసుపత్రుల్లో జీవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్రత్యేక కేంద్రం త్వరలో సిద్దం కానుంది.
స్నేహితులారా,
మనం వేగంగా కొనసాగుతున్న కాశీ, ఉత్తరప్రదేశ్, దేశ అభివృద్ధిని మనం ఆపకూడదు. కాశీలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన సందర్భం ఇది. దేశానికి, ప్రపంచానికి మోదీ గ్యారెంటీ మీద ఇంత నమ్మకం ఉంటే.. దాని వెనుక మీ ఆపేక్ష, బాబా ఆశీస్సులు ఉన్నాయి. మరోసారి ఈ ప్రాజెక్టుల విషయంలో మీ అందరికీ శుభాకాంక్షలు. నాతో కలసి చెప్పండి -
భారత్ మాతా కీ-జై!
భారత్ మాతా కీ-జై!
భారత్ మాతా కీ-జై!
హర హర మహాదేవ్!
సూచన: ఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2169365)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam