ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని నవీ ముంబయిలో రూ.12,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
అటల్ బిహారీ వాజ్ పేయి సెవ్రీ- నవాషెవా అటల్ సేతుకు ప్రారంభోత్సవం
ఈస్టర్న్ ఫ్రీవే ఆరెంజ్ గేట్ ను మెరైన్ డ్రైవ్ తో కలిపే భూగర్భ రహదారి టన్నెల్ కు శంకుస్థాపన
ఎస్ఈఈపీజెడ్ సెజ్ లో 'భారత్ రత్నం', న్యూ ఎంటర్ ప్రైజెస్ అండ్ సర్వీసెస్ టవర్ (ఎన్ఈఎస్టీ) 01 కు ప్రారంభోత్సవం
రైలు, తాగునీటికి సంబంధించిన పలు ప్రాజెక్టులు జాతికి అంకితం
ఉరాన్ రైల్వే స్టేషన్ నుంచి ఖార్కోపర్ వరకు ఈఎంయూ రైలు ప్రారంభం
నమో మహిళా శశక్తికరణ్ అభియాన్ ప్రారంభం
జపాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు; షింజో ఆబేకు నివాళి
“భారతదేశ మౌలిక సదుపాయాల నైపుణ్యానికి, 'వికసిత్ భారత్' దిశగా భారత్ ప్రయాణంలో
పురోగతికి నిదర్శనం అటల్ సేతు ప్రారంభం”
“మేం చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ నవభారత నిర్మాణం దిశగా ఒక మాధ్యమం"
"ఇంతకుముందు, కోట్లాది కుంభకోణాలు చర్చల్లో భాగంగా ఉండేవి...
నేడు చర్చలు వేలకోట్ల రూపాయల ప్రాజెక్టులను పూర్తి చేయడం చుట్టూ తిరుగుతున్నాయి"
"ఇతరుల మీద అంచనాలు ముగిసిన చోట మోదీ హామీ మొదలవుతుంది"
"ఏ రాష్ట్రంలోనైనా, ఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికైనా మహిళా సంక్షేమమే అత్యంత
प्रविष्टि तिथि:
12 JAN 2024 7:18PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని నవీ ముంబయిలో రూ.12,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ రోజు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ముందుగా నవీ ముంబయిలో రూ.17,840 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అటల్ బిహారీ వాజ్పేయి సేవ్రీ - నవ షేవా అటల్ సేతును ప్రధాని ప్రారంభించారు. ఈ రోజు ప్రారంభం ఆయన అభివృద్ధి ప్రాజెక్టులలో రోడ్డు, రైలు కనెక్టివిటీ, తాగునీరు, రత్నాలు, ఆభరణాలు, మహిళా సాధికారత వంటి రంగాలకు చెందినవి ఉన్నాయి
ప్రధానమంత్రి ఈసందర్భంగా మాట్లాడుతూ, ఈ రోజు ముంబయికి, మహారాష్ట్రకు మాత్రమే కాకుండా 'వికసిత్ భారత్' సంకల్పానికి కూడా ఒక చరిత్రాత్మకమైన రోజు అని అన్నారు. "ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ముంబయిలో జరుగుతున్నప్పటికీ, దేశం మొత్తం దృష్టి వీటిపైనే ఉన్నాయి” అని శ్రీ మోదీ అన్నారు. భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు ను ప్రారంభించడాన్ని గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, భారత్ అభివృద్ధి పట్ల నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం అని పేర్కొన్నారు. 2016వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన ఎంటీహెచ్ఎల్ అటల్ సేతుకు తాము శంకుస్థాపన చేయడాన్ని గుర్తు చేస్తూ, నేటి సందర్భం సంకల్పం ద్వారా సాఫల్యానికి కూడా ఒక చిహ్నంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజలు నిరాశకు గురయ్యారని, ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. "దేశం ముందుకు సాగుతుంది. దేశం ప్రగతి సాధిస్తుంది. ఇది 2016లో మోదీ ఇచ్చిన హామీ" అని ప్రధానమంత్రి అన్నారు. "ఛత్రపతి శివాజీ, ముంబాదేవి, సిద్ధివినాయక్ లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దేశప్రజలకు నేను అటల్ సేతును అంకితం చేస్తున్నా” అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అంతరాయాలు ఏర్పడినా ఎంటీహెచ్ఎల్. అటల్ సేతును సకాలంలో పూర్తిచేయడాన్ని ఆయన ప్రశంసించారు. ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభోత్సవం, అంకితం లేదా శంకుస్థాపన చేయడం ఫోటోల కోసం కాదని, ఇది భారతదేశ అభివృద్ధి మాధ్యమం అని ఆయన అన్నారు."ఇటువంటి ప్రతి ప్రాజెక్ట్ గొప్ప భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది" అని ప్రధానమంత్రి అన్నారు.
రోడ్లు, రైల్వేలు, మెట్రో, నీరు, వ్యాపార సంబంధిత మౌలిక సదుపాయాల రంగాల కు సంబంధించి నేడు ప్రారంభించిన ప్రాజెక్టులను గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టులలో చాలా వరకు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్ నేతృత్వంలోని బృందం కృషిని ప్రశంసించారు.
కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరై ఆశీస్సులు అందించిన మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ, "కుమార్తెలు, అక్కచెల్లెళ్లకు మోదీ ఇచ్చిన సాధికారతను మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెడుతోంది" అని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి మహిళా సాక్షీకరణ అభియాన్, నారీ శక్తిదూత్ అప్లికేషన్, లెక్ లడ్కీ యోజన వంటి పథకాలు ఆ దిశలో తీసుకొన్న ప్రయత్నాలని ఆయన పేర్కొన్నారు. “మహిళలతో ముందుకు వచ్చి వికసిత భారత్ కోసం ఉద్యమాన్ని నడిపించడం అత్యంత కీలకం. మా తల్లులు, కుమార్తెల మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించడం, వారికి సౌకర్యవంతమైన జీవితం కల్పించడం మా ప్రభుత్వ ప్రాధాన్యత” అని ఆయన తెలిపారు. ఉజ్జ్వల, ఆయుష్మాన్ కార్డ్, జన్ ధన్ ఖాతాలు, పిఎం ఆవాస్ కింద పక్కా గృహాలు, మాతృవందన, 26 వారాల ప్రసూతి సెలవులు, సుకన్య సమృద్ధి ఖాతాలు వంటి పథకాలను ఆయన వివరించారు. "ఏ రాష్ట్రంలోనైనా, ఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికైనా మహిళా సంక్షేమం అత్యంత ప్రాధాన్యం" అని ఆయన అన్నారు.
అటల్ సేతు దాని పరిమాణం, ప్రయాణ సౌలభ్యం, ఇంజనీర్లు, స్థాయి కారణంగా ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన ఉక్కు 4 హవారా వంతెనలు, 6 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాల నిర్మాణానికి సరిపోతుందని ఆయన తెలియజేశారు. జపాన్ ప్రభుత్వం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధాని షింజో ఆబేను గుర్తు చేసుకున్నారు. "ఈ వంతెన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేం నిర్ణయించాం” అని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
“2014లో యావత్ దేశం వ్యక్తం చేసిన ఆకాంక్షల రూపమే అటల్ సేతు'' అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలకు ముందు రాయ్ ఘడ్ కోటను సందర్శించి శివాజీ సమాధి వద్ద గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ, 10 సంవత్సరాల క్రితం తీసుకున్న కలలు, సంకల్పాలు నేడు నెరవేరడం దేశం చూసిందని ఆయన అన్నారు. "అటల్ సేతు ఈ నమ్మకానికి ప్రతిబింబం, ఇది వికసిత్ భారత్ చిత్రాన్ని ప్రదర్శిస్తుంది" అని ఆయన అన్నారు. ఎంటీహెచ్ఎల్ అటల్ సేతు యువతలో కొత్త విశ్వాసాలను నింపుతుందని ఆయన చెప్పారు. “వికసిత భారత్‌లో అందరికీ సేవలు, సంపద ఉంటాయి. ఇది ప్రపంచాన్ని మరింత దగ్గరగా చేర్చే వేగాన్ని, ప్రగతిని కలిగిఉంటుంది. జీవితం, జీవనోపాధి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇదే అటల్ సేతు సంకేతం” అని ప్రధానమంత్రి అన్నారు.
గత పదేళ్లలో దేశంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, 2014కు ముందు భారతదేశాన్ని గుర్తు చేసుకుంటే మార్పు చెందిన భారతదేశ చిత్రం మరింత స్పష్టమవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "ఇంతకుముందు, కోట్లాది కుంభకోణాలపై చర్చలు జరిగేవి. కానీ నేడు చర్చలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను పూర్తి చేయడం చుట్టూ తిరుగుతున్నాయి" అని శ్రీ మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంతంలో భూపేన్ హజారికా సేతు, బోగీబీల్ వంతెన నిర్మాణం, అటల్ టన్నెల్, చీనాబ్ వంతెన, బహుళ ఎక్స్ప్రెస్ వేలు, ఆధునిక రైల్వే స్టేషన్లు, తూర్పు, పశ్చిమ సరకు రవాణా కారిడార్, వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్ళ నిర్మాణం, క్రొత్త విమానాశ్రయాల ప్రారంభోత్సవం వంటి ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
మహారాష్ట్రలో ఇటీవలి భారీ అభివృద్ధి ప్రాజెక్టులను గురించి ప్రస్తావిస్తూ, బాలా సాహెబ్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ ప్రారంభోత్సవం, నవీ ముంబయి విమానాశ్రయం, కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ పనులు ముంబయిలో కనెక్టివిటీ రూపురేఖలను మార్చగలవని ప్రధాని పేర్కొన్నారు. ఈస్టర్న్ ఫ్రీవే ఆరెంజ్ గేట్ ను మెరైన్ డ్రైవ్ తో కలిపే భూగర్భ రహదారి టన్నెల్ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. "త్వరలో, ముంబయి కూడా తన మొదటి బుల్లెట్ రైలును పొందుతుంది" అని ఆయన అన్నారు. "ఢిల్లీ-ముంబయి ఎకనామిక్ కారిడార్ మహారాష్ట్రను మధ్య, ఉత్తర భారతదేశంతో కలుపుతుంది. మహారాష్ట్రను తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఇతర పొరుగు రాష్ట్రాలతో అనుసంధానించడానికి ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్లులను కూడా చేపట్టారు. చమురు, గ్యాస్ పైప్ లైన్, ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, నవీ ముంబయి విమానాశ్రయం, శేంద్ర-బిడ్కిన్ ఇండస్ట్రియల్ పార్క్ వంటి పెద్ద ప్రాజెక్టులు మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాయి” అన్నారు.
పన్ను చెల్లింపుదారుల డబ్బును దేశాభివృద్ధికి ఎలా వినియోగిస్తున్నారో ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ డబ్బును ఇంతకుముందు నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఐదు దశాబ్దాల కిందట ప్రారంభమై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసిన నీల్వాండే డ్యామ్ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడారు. ఉరాన్-ఖార్కోపర్ రైల్వే లైన్ పనులను మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించగా, డబుల్ ఇంజన్ ప్రభుత్వం వేగవంతం చేసిందని, మొదటి దశను ఈ రోజు జాతికి అంకితం చేశామని ఆయన చెప్పారు. అదేవిధంగా, నవీ ముంబయి మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశ చాలా ఆలస్యం తర్వాత పూర్తయింది. అటల్ సేతు కూడా 5-6 దశాబ్దాలుగా ప్రణాళికలో ఉందని ఆయన తెలియజేశారు. ఐదు రెట్ల చిన్న ప్రాజెక్ట్ బాంద్రా-వర్లీ సీలింక్ కూడా 10 సంవత్సరాలకు పైగా పట్టిందని, బడ్జెట్ 4-5 రెట్లు పెరిగిందని చెప్పారు.
అటల్ సేతు నిర్మాణంలో సుమారు 17,000 మంది కార్మికులు, 1500 మంది ఇంజనీర్లకు ఉపాధి కల్పించడంతో పాటు రవాణా, నిర్మాణ పరిశ్రమలలో కూడా ఉపాధి అవకాశాలు లభించాయని ప్రధానమంత్రి తెలియజేశారు. "అటల్ సేతు ఈ ప్రాంతంలో అన్ని వ్యాపార కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది. వ్యాపార, జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది" అని ఆయన అన్నారు. 2014కు ముందు 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కోసం కేవలం రూ.12 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని, ప్రస్తుత ప్రభుత్వ పదేళ్ల హయాంలో మౌలిక సదుపాయాల కోసం రూ.44 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి తెలియజేశారు. "ఒక్క మహారాష్ట్రలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.8 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇంకొన్నింటి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ మొత్తం ప్రతి రంగంలోనూ ఉపాధి అవకాశాలను కూడా పెంచుతోంది" అని ఆయన అన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ, "ఇతరుల మీద ఆశలు ముగిసిన చోట మోదీ హామీ మొదలవుతుంది" అని ప్రధానమంత్రి అన్నారు. పరిశుభ్రత, విద్య, వైద్య సహాయం, ఆదాయ రాబడి సంబంధిత పథకాలు మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాయని ఆయన పేర్కొన్నారు. పీఎం జన్ ఔషధి కేంద్రాలు, స్వనిధి, పీఎం ఆవాస్, స్వయం సహాయక బృందాలకు సహాయం 'లక్షాధికారి దీదీలను' సృష్టిస్తున్నాయి. రెండు కోట్ల మంది 'లక్షాధికారి దీదీలను' తయారు చేయడమే లక్ష్యం అని ప్రధాన మంత్రి అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఈ దిశగా కృషి చేస్తున్నాయి. "మహారాష్ట్ర అభివృద్ధికి కూడా అదే అంకితభావంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నా. అభివృద్ధి చెందిన భారతదేశానికి మహారాష్ట్ర బలమైన ఆధారంగా మారడానికి మేం ఎటువంటి అవకాశాన్నీ అవకాశాన్ని వదిలిపెట్టం” అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
అటల్ బిహారీ వాజ్ పేయి సెవ్రీ- నవాషెవా అటల్ సేతు
పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను, అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా పౌరుల చలన సౌలభ్యాన్ని మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఇప్పుడు 'అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ- నవాషెవా అటల్ సేతు' అని పిలుస్తున్న ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎంటిహెచ్ఎల్) నిర్మాణానికి 2016 డిసెంబరులో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
అటల్ సేతును మొత్తం రూ .17,840 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. ఇది సముద్రంపై 16.5 కిలోమీటర్ల పొడవు, భూమిపై 5.5 కిలోమీటర్ల పొడవుతో 21.8 కిలోమీటర్ల పొడవైన 6-లేన్ వంతెన. ఇది భారతదేశంలో అతి పొడవైన వంతెన. అలాగే భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెనకూడా. . ఇది ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ముంబయి నుంచి పూనే, గోవాలకు, దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది ముంబయి పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీని కూడా మెరుగుపరుస్తుంది.
ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు
ఈస్టర్న్ ఫ్రీవేస్ ఆరెంజ్ గేట్ ను మెరైన్ డ్రైవ్ తో కలిపే భూగర్భ రహదారి సొరంగ మార్గానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 9.2 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని రూ.8700 కోట్లకుపైగా వ్యయంతో నిర్మిస్తారు. ఇది ముంబయిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఇది ఆరెంజ్ గేట్, మెరైన్ డ్రైవ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
సూర్య ప్రాంతీయ బల్క్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. 1975 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పరచిన ఈ ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని పాల్ ఘర్, థానే జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. దీని ద్వారా సుమారు 14 లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూరుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.2000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. వీటిలో జాతికి అంకితం చేసిన 'ఉరాన్-ఖార్కోపర్ రైల్వే లైన్ 2' నవీ ముంబయికి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. నెరుల్/బేలాపూర్ నుంచి ఖార్కోపర్ వరకు నడిచే సబర్బన్ సర్వీసులను ఇప్పుడు ఉరాన్ వరకు విస్తరిస్తారు. ఉరాన్ రైల్వే స్టేషన్ నుంచి ఖార్కోపర్ వరకు ఈఎంయూ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు.
ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన ఇతర రైలు ప్రాజెక్టులలో థానే-వాషి/పన్వేల్ ట్రాన్స్-హార్బర్ మార్గంలో కొత్త శివారు స్టేషన్ 'దిఘా గావ్', ఖార్ రోడ్, గోరేగావ్ రైల్వే స్టేషన్ మధ్య కొత్త 6వ మార్గం ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ముంబయిలోని వేలాది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తాయి.
శాంతాక్రజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ - స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఇఇపిజెడ్ ఎస్ఇజెడ్) లో రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించిన 'భారత్ రత్నం' (మెగా కామన్ ఫెసిలిటేషన్ సెంటర్) ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది 3డి మెటల్ ప్రింటింగ్ తో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ మెషీన్లతో భారతదేశంలోనే మొట్టమొదటిది. దివ్యాంగ విద్యార్థులతో సహా ఈ రంగానికి చెందిన శ్రామిక శక్తికి నైపుణ్యం కల్పించడానికి ఇది శిక్షణా పాఠశాలను కలిగి ఉంటుంది. ఈ మెగా సీఎఫ్సీ రత్నాలు, ఆభరణాల వాణిజ్యంలో ఎగుమతి రంగాన్ని మారుస్తుంది. దేశీయ తయారీకి కూడా సహాయపడుతుంది.
ప్రధానమంత్రి ఎస్ ఇఇపిజెడ్- ఎస్ఇజెడ్ లో న్యూ ఎంటర్ ప్రైజెస్ అండ్ సర్వీసెస్ టవర్ (ఎన్ఇఎస్టి) 01 ను కూడా ప్రారంభించారు. ఎన్ఈఎస్టీ-01 ప్రధానంగా రత్నాలు, ఆభరణాల తయారీ యూనిట్ల కోసం ఉద్దేశించినది, వీటిని ఇప్పటికే ఉన్న స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ - I నుంచి తరలిస్తారు. పరిశ్రమ డిమాండ్. కు అనుగుణంగా పెద్దఎత్తున ఉత్పత్తి కోసం కొత్త టవర్ ను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, నమో మహిళా శశక్తికరణ్ అభియాన్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ అభియాన్, మహారాష్ట్రలోని మహిళల సామర్థ్యం పెంపొందించేందుకు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ, వ్యాపార అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అభియాన్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మహిళా అభివృద్ధి కార్యక్రమాలను ఏకీకృతం చేసి, వాటిని సంతృప్త స్థాయికి చేర్చడానికి కూడా కృషి చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2168848)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam