వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 10న అత్యాధునిక సౌకర్యాలున్న విద్యుత్ వాహన (ఈవీ) నాణ్యతా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్న కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి
దేశీయంగా తయారీ రంగానికి మద్దతిచ్చే
శక్తిమంతమైన ఈవీ నాణ్యతా పరీక్షల దిశగా మౌలిక వసతులు
అంతర్జాతీయ స్థాయి పరీక్ష, ధ్రువీకరణ ద్వారా ఈవీలపై విశ్వాసం
Posted On:
09 SEP 2025 12:31PM by PIB Hyderabad
సుస్థిరమైన వాహన రంగాన్ని ప్రోత్సహించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే భారత్ లక్ష్యానికి అనుగుణంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ వాహన (ఈవీ) పరీక్షా కేంద్రాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహరాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక శక్తి మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి 2025, సెప్టెంబర్ 10న ప్రారంభిస్తారు. దీనిని కోల్‌కతాలోని అలిపోర్ ప్రాంతీయ ప్రయోగశాలలో ఏర్పాటు చేశారు.
అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలలో ఈవీ బ్యాటరీలు, భాగాలపై కీలకమైన పరీక్షలు నిర్వహిస్తారు. విద్యుత్ భద్రత, ఎఫ్సీసీ/ఐఎస్ఈడీ అమలు, మన్నిక, వాతావరణ పరీక్షలు (ఐపీ, యూవీ, తుప్పు పట్టడం), యాంత్రిక, పదార్థ భద్రత (మండే స్వభావం, గ్లో వైర్ తదితరమైనవి) అంశాలపై పరీక్షలు నిర్వహిస్తారు. ఈవీ బ్యాటరీ తయారీదారులకు ముఖ్యంగా తూర్పు భారత్‌లో విశ్వసనీయమైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరీక్ష, ధ్రువీకరణను అందిస్తుంది. ఉత్పత్తి భద్రత, పనితీరు, నియంత్రణల అమలుకు ఈ కేంద్రం హామీ ఇస్తుంది.
ఈవీల నాణ్యత హామీకి జాతీయ ప్రమాణంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. లోపాలను ముందుగానే తయారీదారులు గుర్తించడానికి, ఉత్పత్తి విశ్వసనీయతను పెంచడం, కఠినమైన భద్రత, పనితీరు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఈవీ వినియోగదారుల్లో విశ్వాసానాన్ని పెంపొందించి, గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది.
బలమైన ఈవీ వ్యవస్థను రూపొందించడానికి, ఎగుమతులను తగ్గించడానికీ, చౌకగా లభించే నాణ్యతా పరీక్షల సేవలతో దేశీయ వినియోగదారులను శక్తిమంతం చేయడం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ కేంద్రం ప్రతిబింబిస్తుంది. ఈ అభివృద్ధితో, సుస్థిర రవాణా వ్యవస్థను సాధించే దిశగా భారత్ పరివర్తనకు, నాణ్యతా ప్రమాణాలకు హామీ ఇచ్చే మౌలిక వసతులను కల్పించడంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ఎదగడంలో ఎన్‌టీహెచ్ తన పాత్రను బలోపేతం చేసుకుంటుంది.
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ.. పర్యావరణహిత రవాణా పరిష్కాల దిశగా ప్రపంచ పరివర్తనలో ఎలక్ట్రిక్ వాహనాలు ముందంజలో ఉన్నాయి. 2030 (30@30) నాటికి 30 శాతం ఈవీల విస్తరణ సాధించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యానికి మద్దతు ఇచ్చేందుకు.. ఈవీలు, వాటికి సంబంధించిన భాగాలు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన పరీక్ష, ప్రామాణికం, ధ్రువీకరణ పొందాయని నిర్దారించుకోవడం చాలా అవసరం.
***
(Release ID: 2164936)
Visitor Counter : 2