ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ ప్రధానితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
Posted On:
04 SEP 2025 1:43PM by PIB Hyderabad
గౌరవ ప్రధాని శ్రీ వాంగ్,
రెండు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్కారం.
ప్రధానమంత్రి శ్రీ వాంగ్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మొదటిసారిగా భారత్ అధికార పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ పర్యటన మరింత మహత్తరమైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత ప్రస్తుతం 60వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
మిత్రులారా,
కిందటి ఏడాది నేను సింగపూర్లో పర్యటించినప్పడు, మన బంధానికి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిని తీసుకెళ్లాం. ఒక సంవత్సర కాలంలో, మన చర్చలు, మన సహకారం వేగంతో పాటు మరింత దృఢతరంగా మారాయి.
ప్రస్తుతం, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో, సింగపూర్ మా ప్రధాన వాణిజ్య భాగస్వామి. సింగపూర్ నుంచి భారత దేశంలోకి పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. మన రక్షణ రంగ బంధం అంతకంతకు బలపడుతోంది.. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు విస్తరించడమే కాక మరింత చైతన్యభరితమవుతున్నాయి.
మన భావి భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక సమగ్ర మార్గసూచీని రూపొందించాం. మన సహకారం సాంప్రదాయక రంగాలకే పరిమితమై ఉండిపోదు. మారుతున్న కాలంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా, ఆధునిక తయారీ, గ్రీన్ షిప్పింగ్, నైపుణ్యాల పెంపు, అణు ప్రధాన ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నీటి నిర్వహణ .. ఇవి మన సహకారంలో కీలకం కాబోతున్నాయి.
మన రెండు దేశాల వాణిజ్యాన్ని ఇప్పటి స్థాయి కన్నా మరింత విస్తరించుకొనే ఉద్దేశంతో మన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంతో పాటు ఆసియాన్ తో మన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిర్ణీత కాలంలో సమీక్షించాలని సంకల్పించాం.
భారత్, సింగపూర్ మధ్య బంధాలను బలపరచడంలో మా రాష్ట్రాలు కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి. అధ్యక్షుడు శ్రీ థర్మన్ జనవరిలో భారతదేశానికి వచ్చిన వేళ, ఆయన ఒడిశాకు కూడా వెళ్లారు. గత ఏడాది కాలంలో ఒడిశా, తెలంగాణ, అస్సాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సింగపూర్లో పర్యటించారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లను కలుపుతూ మరో వారధిగా నిలిచింది.
మిత్రులారా,
కిందటి ఏడాది కొలిక్కివచ్చిన సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థ భాగస్వామ్య ఒప్పందం పరిశోధనకు, అభివృద్ధికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ‘సెమీకాన్ ఇండియా’ సదస్సులో సింగపూర్ కంపెనీలు అమిత ఉత్సాహంతో పాల్గొనడం కూడా మరో ప్రాధాన్యతాంశం.
చెన్నైలో, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయడంలో సింగపూర్ సహకరించనుంది. ఈ కేంద్రం ఆధునిక తయారీ రంగంలో కార్మికులను తీర్చిదిద్దుతుంది.
మిత్రులారా,
సాంకేతికత, నవకల్పన.. ఇవీ మన భాగస్వామ్యానికి స్తంభాలు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్, తదితర డిజిటల్ టెక్నాలజీలలో మన సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత పెంపొందించుకోవాలని అనుకున్నాం. ఈ రోజు కుదుర్చుకున్న అంతరిక్ష రంగ ఒప్పందం రోదసీ విజ్ఞాన శాస్త్రాల్లో మన సహకారంలో ఓ కొత్త అధ్యాయాన్ని చేరుస్తోంది. ఇండియా-సింగపూర్ హ్యాకథాన్ తరువాతి రౌండును ఈ సంవత్సరం చివర్లో నిర్వహించాలని కూడా నిర్ణయించాం.
మన డిజిటల్ సంధానం ఫలప్రదం అయ్యిందనడానికి ‘యూపీఐ’, ‘పేనౌ’ లే చక్కని నిదర్శనాలు. దీనిలో కొత్తగా 13 భారతీయ బ్యాంకులు చేరడం సంతోషించదగ్గది.
గ్రీన్, డిజిటల్ షిప్పింగ్ కారిడార్లపై ఈ రోజు కుదుర్చుకొన్న ఒప్పందం నౌకా వాణిజ్య రంగంలో హరిత ప్రధాన ఇంధన సరఫరా వ్యవస్థకు, డిజిటల్ పోర్ట్ ఆమోద ప్రక్రియకు గొప్ప ఊతాన్ని అందిస్తుంది. ఓడరేవులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పటిష్ఠపరుచుకొనేందుకు భారత్ ఎంతో కృషి చేస్తోంది. ఈ రంగంలో సింగపూరుకున్న నైపుణ్యం ఎంతో విలువైంది. ఈ రోజు ప్రారంభించిన భారత్ ముంబయి కంటెయినర్ టర్మినల్ రెండో దశ ప్రాజెక్టును తీర్చిదిద్దింది సింగపూర్‌కి చెందిన ఎస్‌పీఏ ఇంటర్నేషనల్. ఈ కీలక ఘట్టం మా కంటెయినర్ హ్యాండ్లింగ్ సత్తాను మరింత పెంచనుంది.
మిత్రులారా,
మా ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’కి సింగపూర్ కీలకం. కలిసికట్టుగా మనం ఆసియాన్‌తో చెట్టపట్టాల్ వేసుకొని ముందుకు సాగుదాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పాలనే మన ఇరుపక్షాల ఆశయాన్ని సాధించే దిశగా ముందడుగులు వేద్దాం.
ఉగ్రవాదం విషయంలో మన ఉభయ దేశాలూ ఆందోళన చెందుతున్నాయి. మానవతను గౌరవించే దేశాలన్నీ ఈ ముప్పును సమైక్యంగా ఎదుర్కొని పోరాడాలన్నదే మన దృఢ విశ్వాసం. పహల్గాం ఉగ్ర దాడిపై విచారం వ్యక్తం చేసినందుకూ, ఉగ్రవాదంపై మా సమరానికి మద్దతు అందిస్తున్నందుకు సింగపూర్ ప్రభుత్వానికీ, ప్రధాని శ్రీ వాంగ్‌కు నేను మనసారా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను.
శ్రీ వాంగ్,
మన సంబంధాలు దౌత్యాని కన్నా మిన్న.
ఈ భాగస్వామ్యం ఒక ప్రయోజనంతో కూడిన, ఉమ్మడి విలువలపై ఆధారపడ్డ,
ఉభయ పక్షాల ప్రయోజనాలు మార్గనిర్దేశం చేస్తున్న భాగస్వామ్యం. మరి దీనికి శాంతిని, ప్రగతిని, సమృద్ధిని సాధించాలనే ఉమ్మడి లక్ష్యం చోదక శక్తిగా పనిచేస్తూ ముందుకు నడిపిస్తోంది.
ఈ భాగస్వామ్యం విషయంలో మీరు వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నందుకుగాను నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీకు అనేక ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం. ఆయన హిందీలో మాట్లాడారు.
***
(Release ID: 2163883)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam