ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో మాధ్యమం ద్వారా బీహార్ రాజ్య జీవిక నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆ సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.105 కోట్లను కూడా బదిలీ చేస్తారు.
జీవికతో అనుబంధం ఉన్న సంఘ సభ్యులకు సులభంగా, తక్కువ వడ్డీ రేటుకు నిధులను అందించడం జీవిక నిధి స్థాపన ముఖ్య ఉద్దేశ్యం. జీవికలో నమోదు చేసుకున్న అన్ని క్లస్టర్-స్థాయి సమాఖ్యలు ఈ సొసైటీలో సభ్యులుగా ఉంటాయి. ఈ సంస్థ కార్యకలాపాల కోసం బీహార్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తాయి.
గత కొన్నేళ్లుగా జీవిక స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల్లో పరిశ్రమల ఏర్పాటులో వృద్ధి కనిపిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక చిన్న సంస్థలు, ఉత్పత్తిదారుల కంపెనీలు నెలకొన్నాయి.
అయినప్పటికీ, మహిళా పారిశ్రామికవేత్తలు తరచుగా 18%–24% అధిక వడ్డీ రేట్లను వసూలు చేసే సూక్ష్మ రుణ సంస్థలపై ఆధారపడవలసి వస్తోంది. ఎంఎఫ్ఐలపై ఆధారపడటాన్ని తగ్గించి, తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువ రుణాన్ని సకాలంలో అందించేందుకు జీవికా నిధిని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా రూపొందించారు.
ఇది పూర్తిగా డిజిటల్ ఆధారిత వ్యవస్థ. దీనివల్ల జీవిక సభ్యులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మరింత వేగంగా, పారదర్శకంగా బదిలీ అవుతాయి. ఈ విధానాన్ని సులభతరం చేసేందుకు 12,000 మంది కమ్యూనిటీ కార్యకర్తలకు మినీ కంప్యూటర్ల (ట్యాబ్ లు)ను ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి, సంఘ ఆధారిత వ్యాపారాల వృద్ధిని వేగవంతం చేసే అవకాశం ఉంది. బీహార్ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.
***