ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలోని యశోభూమిలో సెప్టెంబరు 2న ‘సెమికాన్ ఇండియా-2025’ని ప్రారంభించనున్న ప్రధాని
సెమికాన్ ఇండియాలో సెప్టెంబరు 3న సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
భారత్‌లో బలమైన, సుస్థిర సెమీకండక్టర్ వ్యవస్థను ఉత్తేజపరిచేలా సెమికాన్ ఇండియా - 2025
సెమీకండక్టర్ ఫాబ్రికేషన్స్, అధునాతన ప్యాకేజింగ్, ఏఐ, పరిశోధన - అభివృద్ధి, అధునాతన తయారీ, పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించేలా సదస్సు
48 దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు
Posted On:
01 SEP 2025 3:30PM by PIB Hyderabad
భారత సెమీకండక్టర్ వ్యవస్థకు ప్రేరణనిచ్చే లక్ష్యంతో రూపొందించిన ‘సెమికాన్ ఇండియా - 2025’ను సెప్టెంబరు 2న ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సెప్టెంబరు 3న ఉదయం 9:30 గంటల సమయంలో జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు.
సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు జరిగే ఈ మూడు రోజుల సదస్సులో.. దేశంలో బలమైన, క్రియాశీల, సుస్థిర సెమీకండక్టర్ అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. సెమికాన్ ఇండియా కార్యక్రమ పురోగతి, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ - అధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సంసిద్ధత, అధునాతన తయారీ, పరిశోధన - అభివృద్ధి, కృత్రిమ మేధలో ఆవిష్కరణలు, పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర స్థాయిలో విధానాల అమలు తదితర అంశాలపై ఇందులో సదస్సులుంటాయి. అంతేకాకుండా డిజైన్ ఆధారిత ప్రోత్సాహక (డీఎల్ఐ) పథకం కింద చేపట్టిన కార్యక్రమాలు, అంకుర సంస్థల అనుకూల వ్యవస్థ వృద్ధి, అంతర్జాతీయ సహకారం, భారత సెమీకండక్టర్ రంగం కోసం భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో ప్రముఖంగా చర్చించనున్నారు.
20,750 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారిలో 48 దేశాలకు చెందిన 2,500కు పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా అంతర్జాతీయ ప్రముఖులు సహా 150 మందికి పైగా వక్తలు, 350కి పైగా ఎగ్జిబిటర్లు ఉన్నారు. 6 దేశాల రౌండ్ టేబుల్ చర్చలు, దేశాల ప్రదర్శన వేదికలు, శ్రామిక శక్తిని మెరుగుదలతోపాటు అంకుర సంస్థల కోసం ప్రత్యేక వేదికలు కూడా ఇందులో ఉంటాయి.
సెమీకండక్టర్ రంగంలో విశేషంగా పెరిగిన సాంకేతిక పురోగతి, అలాగే సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేసేలా వివిధ దేశాల విధానాలకు సంబంధించి.. అంతర్జాతీయ విస్తృతిని పెంచడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సెమికాన్ సదస్సులు నిర్వహించారు. సెమీకండక్టర్ రూపకల్పన, తయారీ, సాంకేతిక అభివృద్ధికి నిలయంగా భారత్‌ను నిలపాలన్న ప్రధానమంత్రి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా.. 2022లో బెంగళూరులో, 2023లో గాంధీనగర్‌లో, 2024లో గ్రేటర్ నోయిడాలో సదస్సులు నిర్వహించారు.
***
(Release ID: 2162825)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada