ప్రధాన మంత్రి కార్యాలయం
చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) 25వ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి
Posted On:
01 SEP 2025 11:53AM by PIB Hyderabad
చైనాలోని టియాంజిన్ నగరంలో 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నిర్వహించిన 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో షాంఘై సహకార సంస్థ బలోపేతం, అంతర్జాతీయ పాలన సంస్కరణ, ఉగ్రవాద నిర్మూలన, శాంతి- భద్రత, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల పై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి.
సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఎస్‌సీఓ విధానాలను బలోపేతం చేయటానికి భారత్ తీసుకుంటున్న విధానాన్ని వివరిస్తూ, భద్రత, అనుసంధానం, అవకాశం అనే మూడు స్తంభాల ద్వారా భారతదేశం మరిన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. శాంతి, భద్రత, స్థిరత్వం అనేవి పురోగతికి, శ్రేయస్సుకు కీలకమని చెబుతూ, అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సభ్య దేశాలు బలమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, తీవ్రవాద ధోరణుల పై సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో సభ్య దేశాలు చూపించిన బలమైన సంఘీభావానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, సరిహద్దుల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించి, ప్రోత్సహించే దేశాలను బాధ్యులను చేయాలని సభ్యదేశాలను కోరారు.
అభివృద్ధి, నమ్మకాన్ని పెంచడంలో అనుసంధానత కీలకమనీ, చాబహార్ పోర్టు, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ వంటి ప్రాజెక్టులకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, యువ సాధికారత, ఉమ్మడి వారసత్వం వంటి రంగాల్లోని అవకాశాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, వీటిని ఎస్‌సీఓ పరిధిలో కొనసాగించాలని, ప్రజల మధ్య సంబంధాలను, సాంస్కృతిక అవగాహనను పెంపొందించటానికి ఒక సివిలైజేషన్ డైలాగ్ ఫోరం( సంస్కృతుల సంభాషణ వేదిక) ప్రారంభించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు.
సభ్య దేశాల సంస్కరణల ఆధారిత అజెండాకు ప్రధానమంత్రి మద్దతు తెలుపుతూ, సంఘటిత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ భద్రత వంటి సమస్యల పరిష్కారానికి కేంద్రాల ఏర్పాటును స్వాగతించారు. గ్రూపులోని ఐక్యరాజ్యసమితితో సహా వివిద సంస్థల్లో కూడా ఈ విధమైన సంస్కరణ విధానమే ఉండాలని కోరారు.
ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ వీక్షించవచ్చు [Link].
తనకు ఇచ్చిన ఆతిథ్యానికి, సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు
ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌సీఓ తదుపరి నిర్వహణకు అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన కిర్గిస్థాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. సదస్సు ముగింపులో, ఎస్‌సీఓ సభ్య దేశాలు టియాంజిన్ డిక్లరేషన్‌ను ఆమోదించాయి.
***
(Release ID: 2162733)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada