ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


సుదర్శన చక్రధారి మోహన్.. చరఖాధారి మోహన్‌లు చూపిన మార్గంలో నడుస్తూ భారత్ మరింత బలపడుతోంది

ఉగ్రవాదులు.. వారి సూత్రధారులు.. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదు

మా ప్రభుత్వం చిరు వ్యాపారులు, రైతులు, పశువుల పెంపకందారులకు ఎటువంటి హాని జరగనివ్వదు

గుజరాత్ గడ్డపై నేడు అన్ని రకాల పరిశ్రమలూ విస్తరిస్తున్నాయి

నవ-మధ్యతరగతి.. మధ్యతరగతి వర్గాలను శక్తిమంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం

ఈ దీపావళికి వ్యాపార వర్గాలు.. అన్ని కుటుంబాలవారూ రెట్టింపు ఆనందాన్ని పొందనున్నారు

పండుగ సీజన్‌లో ఇంటికి తెచ్చే అన్ని కొనుగోళ్లు, కానుకలు, అలంకరణ వస్తువులు భారత్‌లో తయారైనవై ఉండాలి: ప్రధానమంత్రి

Posted On: 25 AUG 2025 9:04PM by PIB Hyderabad

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ వర్షాకాలంలో భారత్‌లోని పలు ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోనూ క్లౌడ్‌బరస్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయన్న శ్రీ నరేంద్ర మోదీ.. వర్షాల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపం యావత్ దేశానికి ఒక సవాలుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహాయక, రక్షణ చర్యలు చురుగ్గా చేపడుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

గుజరాత్ ఇద్దరు మోహన్‌ల భూమి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీరిలో మొదటి మోహన్‌ సుదర్శన చక్రధారి అయిన ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు కాగా.. రెండో మోహన్ సబర్మతి ఆశ్రమంలో రాట్నపు చక్రం తిప్పిన పూజ్య బాపూజీగా ప్రధానమంత్రి అభివర్ణించారు. "సుదర్శన చక్రధారి మోహన్, చరఖాధారి మోహన్‌లు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారత్ నేడు మరింత బలమైన శక్తిగా ఎదుగుతోంది" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సుదర్శన చక్రధారి మోహన్ దేశాన్నీ, సమాజాన్నీ ఎలా రక్షించాలో మనకు నేర్పించారన్నారు. న్యాయం, భద్రతల కవచంగా సుదర్శన చక్రం పాతాళలోకంలో దాగిన శత్రువులను కూడా శిక్షించగలదని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తి నేటి భారత్ నిర్ణయాల్లో ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న వారు ఎక్కడ దాక్కున్నా భారత్ విడిచిపెట్టదని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచమంతా చూసిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను భారత సాయుధ దళాల పరాక్రమానికి, సుదర్శన చక్రధారి మోహన్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న మన దేశ దృఢ సంకల్పానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు.

స్వదేశీ ఉద్యమం ద్వారా భారత్‌కు శ్రేయస్సు మార్గాన్ని చూపించిన చరఖాధారి మోహన్ పూజ్య బాపూజీ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ.. బాపూజీ పేరుతో దశాబ్దాలుగా అధికారం అనుభవించిన పార్టీ చేసిన పనులు, చేయని పనులకూ సబర్మతి ఆశ్రమం సాక్షిగా నిలుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వదేశీ మంత్రంతో ఆ పార్టీ ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ మన దేశాన్ని విదేశాలపై ఆధారపడేలా చేసిందని విమర్శించారు. దిగుమతి మోసాలను, అవినీతినీ అది పెంచి పోషించిందని శ్రీ నరేంద్ర మోదీ ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడం కోసం స్వయంసమృద్ధిని నేటి భారత్ పునాదిగా మార్చుకుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారులు, వ్యాపారస్తుల బలంతో భారత్ ఈ మార్గంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గుజరాత్‌లోనూ పెద్ద సంఖ్యలో పశువుల పెంపకందారులు ఉన్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. భారత పాడి పరిశ్రమ బలానికి మూలమనీ.. ఈ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక స్వార్థం ద్వారా నడిచే రాజకీయాలను ప్రపంచమంతా గమనిస్తోందని ప్రధానమంత్రి హెచ్చరించారు. చిరు వ్యాపారులు, దుకాణదారులు, రైతులు, పశువుల పెంపకందారుల సంక్షేమం తనకు అత్యంత ముఖ్యమని అహ్మదాబాద్ నేల సాక్షిగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చిరు వ్యాపారులు, రైతులు, పశువుల పెంపకందారుల ప్రయోజనాలకు ఎలాంటి హాని జరగనివ్వదని ఆయన హామీ ఇచ్చారు.

"ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి గుజరాత్ అద్భుతమైన ఊపును అందిస్తోంది. అంకితభావంతో కూడిన రెండు దశాబ్దాల కృషి ఫలితమే ఈ పురోగతి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కర్ఫ్యూలు తరచుగా జరిగే రోజులను నేటి యువత చూడనేలేదని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు వ్యాపార వాణిజ్యాల నిర్వహణ చాలా కష్టంగా ఉండేదని గుర్తుచేసుకుంటూ.. నాటి వాతావరణం అశాంతితో నిండి ఉండేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు అహ్మదాబాద్ దేశంలోని అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఈ పరివర్తనను సాధ్యం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్‌లో శాంతి భద్రతల వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా సానుకూల ఫలితాలనిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "నేడు గుజరాత్‌లో అన్ని రకాల పరిశ్రమలూ విస్తరిస్తున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. రైల్ ఫ్యాక్టరీలో శక్తిమంతమైన ఎలక్ట్రిక్ రైలింజన్లు తయారవుతున్న దాహోద్‌ను ఇటీవల సందర్శించిన విషయాన్ని గుర్తుచేసిన శ్రీ నరేంద్ర మోదీ.. గుజరాత్‌లో తయారైన మెట్రో కోచ్‌లు ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌లో మోటార్‌సైకిళ్లు, కార్ల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుజరాత్ ఇప్పటికే వివిధ విమాన భాగాలను ఉత్పత్తి చేస్తూ ఎగుమతి చేస్తోందన్నారు. వడోదర ఇప్పుడు రవాణా విమానాల తయారీని ప్రారంభించిందని ఆయన ప్రకటించారు. గుజరాత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతోందన్న ప్రధానమంత్రి.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభమవుతున్న హన్సల్‌పూర్‌ను రేపు సందర్శించనున్నట్లు తెలిపారు. సెమీ కండక్టర్లు లేకుండా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయలేమని చెబుతూ.. సెమీ కండక్టర్ల రంగంలో గుజరాత్ ప్రముఖ తయారీ కేంద్రంగా మారబోతోందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలతో గుజరాత్ తనదైన గుర్తింపును ఏర్పర్చుకుందన్నారు. ఔషధాలు, టీకాలు సహా ఔషధ ఉత్పత్తి రంగంలో.. దేశ ఎగుమతుల్లో దాదాపు మూడింట ఒక వంతు గుజరాత్ నుంచే జరుగుతున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.

"సౌర, పవన, అణు విద్యుత్ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో గుజరాత్ సహకారం అత్యధికం" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. హరిత ఇంధనాలు, పెట్రోకెమికల్స్‌ కోసం కూడా గుజరాత్ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. దేశ పెట్రోకెమికల్ అవసరాలను తీర్చడంలో గుజరాత్ గణనీయ పాత్ర పోషిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్ పరిశ్రమ, సింథటిక్ ఫైబర్, ఎరువులు, మందులు, పెయింట్ పరిశ్రమ, సౌందర్య సాధనాలు ఇలా అన్నీ పెట్రోకెమికల్ రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌లో సంప్రదాయిక పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.. అలాగే కొత్త పరిశ్రమలూ ఏర్పాటవుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు. ఈ వృద్ధి గుజరాత్ యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు.

పరిశ్రమలైనా, వ్యవసాయమైనా, పర్యాటకమైనా అన్ని రంగాల్లోనూ అద్భుతమైన కనెక్టివిటీ అత్యంత అవసరమని ప్రధానమంత్రి తెలిపారు. గత 20-25 సంవత్సరాల్లో గుజరాత్ కనెక్టివిటీ పూర్తిగా పరివర్తన చెందిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నేడు అనేక రహదారులు, రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరిగాయన్నారు. సర్దార్ పటేల్ రింగ్ రోడ్ పేరుతో గల సర్క్యులర్ రోడ్డును ఇప్పుడు మరింత విస్తరిస్తున్నట్లు ప్రస్తావించిన ప్రధానమంత్రి.. దానిని ఆరు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విస్తరణ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. విరామ్‌గామ్-ఖుద్రద్-రాంపురా రహదారి విస్తరణ ఈ ప్రాంత రైతులకు, పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. కొత్తగా నిర్మించిన అండర్‌పాస్‌లు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు నగర కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంతంలో పాత ఎరుపు రంగు బస్సులు మాత్రమే నడిచేవని గుర్తుచేసుకుంటూ.. నేడు బీఆర్‌టీఎస్ జన్‌మార్గ్, ఏసీ-ఎలక్ట్రిక్ బస్సుల వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మెట్రో రైలు నెట్‌వర్క్ కూడా వేగంగా విస్తరిస్తోందని ఆయన గుర్తుచేశారు. ఇది అహ్మదాబాద్ ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుందన్నారు. గుజరాత్‌లోని ప్రతి నగరం ఒక ప్రధాన పారిశ్రామిక కారిడార్‌తో అనుసంధానమై ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పదేళ్ల కిందట ఓడరేవులకు, అటువంటి ఇతర పారిశ్రామిక సమూహాలకు మధ్య సరైన రైలు కనెక్టివిటీ లేదని ఆయన గుర్తుచేశారు. 2014లో ప్రధానమంత్రి అయిన వెంటనే గుజరాత్‌లో ఈ సమస్య పరిష్కారం ప్రారంభించానని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గత పదకొండు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు ఏర్పాటయ్యాయని పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. గుజరాత్ మొత్తం రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు విద్యుదీకరణ పూర్తి చేసుకుందని తెలిపారు. గుజరాత్ కోసం నేడు ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులు రైతులకు, పరిశ్రమలకు, యాత్రికులకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

పట్టణ పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన శ్రీ మోదీ, ఈ నిబద్ధతకు ప్రత్యక్ష సాక్ష్యంగా రామపిర్ నో టెక్రోను ఉదహరించారు. గాంధీజీ ఎప్పుడూ పేదల ఆత్మ గౌరవాన్నే ఆకాంక్షించారని,  సబర్మతి ఆశ్రమం సమీపంలో కొత్తగా నిర్మించిన ఇళ్లు ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తాయని అన్నారు. నిరుపేదలకు 1,500 శాశ్వత గృహాలను కేటాయించడం లెక్కలేనన్ని కొత్త కలలకు పునాది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నవరాత్రులు, దీపావళి సందర్భంగా ఈ ఇళ్లలో నివసించే వారి హృదయాల్లో ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంతో పాటు, పూజ్య బాపుకు నిజమైన నివాళిగా బాపూ ఆశ్రమం పునరుద్ధరణ కూడా జరుగుతోందని ఆయన అన్నారు.


సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తాను ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణను కొనసాగించగలిగానని ఆయన తెలిపారు. ఐక్యతా మూర్తి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)  దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా మారినట్లే, సబర్మతి ఆశ్రమం పునరుద్ధరణ పూర్తయితే, అది శాంతికి గొప్ప అంతర్జాతీయ చిహ్నంగా మారుతుందని ఆయన ఉద్ఘాటించారు. సబర్మతి ఆశ్రమం పునరుద్ధరణ పూర్తయిన తర్వాత అది శాంతికి ప్రపంచంలోనే అగ్రగామి స్ఫూర్తిగా నిలుస్తుందన్న తన మాటలను అందరూ గుర్తుంచుకోవాలని  శ్రీ మోదీ కోరారు.

"కార్మిక కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం" అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం గుజరాత్ లోని మురికివాడల్లో నివసించే వారికి శాశ్వత గేటెడ్ నివాస సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. కొన్నేళ్లుగా ఇలాంటి అనేక గృహనిర్మాణ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మురికివాడల స్థానంలో గౌరవప్రదమైన నివాస స్థలాలను ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

నిర్లక్ష్యానికి గురైన వారి పట్ల  తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు. పట్టణ పేదల జీవితాలను మెరుగుపరచడం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. గతంలో వీధి వ్యాపారులను, ఫుట్ పాత్ కార్మికులను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బై లక్షల మంది వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల కార్మికులు, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందగలిగారని తెలిపారు. గుజరాత్ లో కూడా లక్షలాది మంది  ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారని ఆయన తెలిపారు.

గడచిన పదకొండేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని, ఇది భారతదేశానికి గర్వకారణమని, ప్రపంచ ఆర్థిక సంస్థల్లో కూడా దీనిపై చర్చించారని ప్రధాని పేర్కొన్నారు. వీరంతా దేశంలో కొత్త మధ్యతరగతి ఆవిర్భావంలో భాగస్వాములయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. “కొత్త మధ్యతరగతి,  సాంప్రదాయ మధ్యతరగతి రెండింటినీ శక్తిమంతం చేయడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది" అని శ్రీ మోదీ చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షికాదాయాన్ని పన్ను రహితంగా మార్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతోందని ఆయన ప్రకటించారు. ఈ సంస్కరణలు చిన్న పారిశ్రామికవేత్తలకు వెసులుబాటు కల్పిస్తాయని, అనేక వస్తువులపై పన్నులను తగ్గిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ దీపావళికి దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గాలు, కుటుంబాలు రెట్టింపు ఆనందాన్ని పొందుతాయని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద విద్యుత్ బిల్లు జీరో చేస్తున్నామని, గుజరాత్ లో ఇప్పటికే ఆరు లక్షల కుటుంబాలు ఈ పథకంలో చేరాయని శ్రీ మోదీ వివరించారు. ఒక్క గుజరాత్ లోనే ఈ కుటుంబాలకు ప్రభుత్వం రూ.3,000 కోట్లకు పైగా అందించిందన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు నెలవారీ విద్యుత్ బిల్లులపై గణనీయమైన ఆదా అయిందని ప్రధాని తెలిపారు.

అహ్మదాబాద్ నగరం ఇప్పుడు కలలు, సంకల్పాల నగరంగా మారుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు అహ్మదాబాద్ ను ప్రజలు 'గర్దాబాద్' అని ఎగతాళి చేసేవారని గుర్తు చేసిన శ్రీ మోదీ, దుమ్ము, ధూళి ఏవిధంగా నగరానికి దుర్గతి కలిగించాయో వివరించారు. నేడు అహ్మదాబాద్ పరిశుభ్రతకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని ప్రతి ఒక్కరి సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.

సబర్మతి నది ఎండిపోయిన కాలువను తలపించే మునుపటి రోజులను నేటి యువత చూడలేదని పేర్కొన్న ప్రధాన మంత్రి, ఈ దుస్థితిని మార్చాలని అహ్మదాబాద్ ప్రజలు సంకల్పించారని గుర్తు చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ఇప్పుడు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెస్తోందని అన్నారు. కంకారియా సరస్సు నీరు కలుపు మొక్కల కారణంగా ఆకుపచ్చగా, దుర్వాసన వెదజల్లేదని, దీంతో సమీపంలో నడవడం కూడా కష్టంగా ఉండేదని, ఈ ప్రాంతం సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా ఉండేదని శ్రీ మోదీ గుర్తు చేశారు. అయితే నేడు ఈ సరస్సు ఉత్తమ వినోద గమ్యస్థానాలలో ఒకటిగా మారిందని ఆయన పేర్కొన్నారు. సరస్సులో బోటింగ్, కిడ్స్ సిటీ పిల్లలకు వినోదం, విజ్ఞానం అందిస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ మారుతున్న అహ్మదాబాద్ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. కంకారియా కార్నివాల్ ఇప్పుడు నగరానికి కొత్త గుర్తింపుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

అహ్మదాబాద్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచెందుతోందని చెబుతూ, యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ గుర్తింపు తెచ్చుకోవడాన్ని ప్రస్తావించారు. చారిత్రక ద్వారాలు కావచ్చు -  సబర్మతి ఆశ్రమం కావచ్చు -  నగర గొప్ప వారసత్వం కావచ్చు- అహ్మదాబాద్ ఇప్పుడు ప్రపంచ పటంలో ప్రకాశిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

నగరంలో ఆధునిక, వినూత్నమైన పర్యాటక రూపాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. కచేరీ ఆర్థిక వ్యవస్థకు అహ్మదాబాద్ ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఆధునిక, ఆవిష్కరణాత్మక పర్యాటక ఆకర్షణలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, అహ్మదాబాద్ వివిధ కళారూపాల కచేరీల ఆధారిత ఆర్థిక కేంద్రంగా మారిందని ఆయన చెప్పారు. నగరంలో ఇటీవల జరిగిన కోల్డ్ ప్లే కచేరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ఆయన గుర్తు చేశారు. లక్షమంది కూర్చునే సామర్ధ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం ప్రధాన ఆకర్షణగా మారిందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. భారీ స్థాయి కచేరీలతో పాటు ప్రధాన క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వగల అహ్మదాబాద్ సామర్థ్యాన్ని ఇది చాటుతుందని ఆయన చెప్పారు.

దేశం ఇప్పుడు నవరాత్రి, విజయదశమి, ధంతేరస్, దీపావళి వంటి వేడుకల కాలంలోకి ప్రవేశిస్తోందని, ఈ పండుగలు కేవలం సాంస్కృతిక వేడుకలు మాత్రమే కాదని, వీటిని స్వావలంబన పండుగలుగా కూడా చూడాలని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. పండుగ సీజన్ లో ఇంటికి తీసుకువచ్చే కొనుగోళ్లు, బహుమతులు, అలంకరణ వస్తువులన్నీ మేడ్ ఇన్ ఇండియాగా ఉండేలా చూడాలని ప్రధాని మరోసారి ప్రజలను కోరారు. నిజమైన బహుమతి అనేది భారతదేశంలో తయారైందీ, భారతీయ పౌరులు తయారు చేసిందే కావాలని ఆయన ప్రతి ఒక్కరికీ గుర్తు చేశారు. భారతీయ తయారీ ఉత్పత్తులను సగర్వంగా విక్రయించాలని దుకాణదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ చిన్న, అర్థవంతమైన ప్రయత్నాల ద్వారా, ఈ పండుగలు భారతదేశ సౌభాగ్యాన్ని చాటే గొప్ప వేడుకలుగా మారుతాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రజలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు.

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్ , కేంద్ర మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన,  కనెక్టివిటీ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి రూ.1,400 కోట్ల పైగా విలువ చేసే పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇందులో రూ.530 కోట్ల పైగా వ్యయంతో కూడిన 65 కిలోమీటర్ల మెహసానా-పాలన్పూర్ రైలు మార్గం డబ్లింగ్,  37 కిలోమీటర్ల కలోల్-కడి-కటోసన్ రోడ్ రైలు మార్గం గేజ్ మార్పిడి, రూ.860 కోట్లకు పైగా వ్యయంతో కూడిన 40 కిలోమీటర్ల బెచ్రాజీ-రణుజ్ రైలు మార్గం ప్రాజెక్టులు ఉన్నాయి. గేజ్ సామర్థ్యాన్ని పెంచడంతో, ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో మరింత సాఫీగా, సురక్షితంగా, నిరంతరాయంగా అనుసంధానాన్ని కల్పిస్తాయి. దీని వల్ల రోజువారీ ప్రయాణికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. అదే సమయంలో ప్రాంతీయ ఆర్థిక సమీకరణానికి దోహదపడతాయి. కటోసన్ రోడ్,  సబర్మతి మధ్య ప్యాసింజర్ రైలు ప్రారంభం వల్ల మతపరమైన గమ్యస్థానాలకు చేరుకోవడం సులభమవుతుంది. క్షేత్రస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తుంది. బెచ్రాజీ నుంచి ప్రారంభమైన కార్ల రవాణా రైలు సర్వీసు రాష్ట్ర పారిశ్రామిక కేంద్రాలకు కనెక్టివిటీని పెంచుతుంది, ఇది రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుంది.  ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

అనుసంధానతను మెరుగుపరచడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడానికి తన దార్శనికతను మరింత ముందుకు తీసుకువెడుతూ ప్రధాన మంత్రి విరామ్ గామ్-ఖుదాద్-రాంపురా రహదారి వెడల్పు ప్రాజెక్టును ప్రారంభించారు. అహ్మదాబాద్ - మెహసానా-పాలన్ పూర్ రహదారిలో ఆరు వరసల వెహికల్ అండర్ పాస్ ల నిర్మాణానికి,  అహ్మదాబాద్-విరాంగామ్ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టులన్నీ పారిశ్రామిక వృద్ధిని పెంచుతాయి. ఈ ప్రాంతంలో  రవాణా సామర్థ్యాన్ని,  ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తాయి.

రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఊతమిచ్చేందుకు, నష్టాలను తగ్గించడం, నెట్ వర్క్ ను ఆధునీకరించడం, పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం కింద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ (యుజివిసిఎల్) ఆధ్వర్యంలో అహ్మదాబాద్, మెహసానా,  గాంధీనగర్ లలో విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ.1000 కోట్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్టులు ప్రతికూల వాతావరణంలో విద్యుత్ అంతరాయాలు, నిలిపివేతలను తగ్గిస్తాయి. ప్రజలకు భద్రతతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్ రక్షణను పెంచి విద్యుత్ సరఫరా వ్యవస్థ విశ్వసనీయతను బలపరుస్తాయి.

ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన [పీఎంఏ వై-యు) లోని ‘ఇన్ సిటు స్లమ్ రీహాబిలిటేషన్‘  విభాగం (మురికివాడల వారిని వేరే చోటికి తరలించకుండా ఆ ప్రదేశంలోనే నివాసం కల్పించడం) కింద రామపిర్ నో టెక్రో  సెక్టార్-3లోని మురికివాడల్లో సౌకర్యాలు కల్పించే పనులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్ చుట్టూ ఉన్న సర్దార్ పటేల్ రింగ్ రోడ్‌పై ప్రధాన రహదారి విస్తరణ ప్రాజెక్టులకు శంకుస్థాపన వేశారు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించి, అనుసంధానాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. మంచినీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

గుజరాత్ లో పరిపాలనా సామర్ధ్యాన్ని,  ప్రజాసేవను పటిష్ఠం చేసే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. పౌర సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో అహ్మదాబాద్ వెస్ట్ లో కొత్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనం,  గుజరాత్ అంతటా సురక్షితమైన డేటా మేనేజ్ మెంట్,  డిజిటల్ పాలనా సామర్థ్యాలను పెంపొందించడానికి గాంధీనగర్ లో రాష్ట్ర స్థాయి డేటా స్టోరేజ్ సెంటర్  నిర్మాణాలు  ఇందులో ఉన్నాయి.


(Release ID: 2160789)