ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
23 AUG 2025 12:13PM by PIB Hyderabad
మంత్రివర్గ సహచరులు.. ఇస్రో, అంతరిక్ష రంగ శాస్త్రవేత్తలు.. ఇంజనీర్లు.. నా ప్రియమైన దేశవాసులారా!
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. "ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ దాకా" అనే ఈ సంవత్సర ఇతివృత్తం.. భారత చరిత్ర పట్ల విశ్వాసాన్ని.. భవిష్యత్తు పట్ల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. తక్కువ సమయంలోనే జాతీయ అంతరిక్ష దినోత్సవం భారత యువతకు ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించే సందర్భంగా మారిన తీరును మనం ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి ఇది దేశానికే గర్వకారణం. శాస్త్రవేత్తలు, యువత సహా అంతరిక్ష రంగానికి చెందిన అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటీవల భారత్ అంతర్జాతీయ స్థాయి ఆస్ట్రానమీ – ఆస్ట్రోఫిజిక్స్ ఒలంపియాడ్ నిర్వహించింది. అరవైకి పైగా దేశాల నుంచి దాదాపు 300 మంది యువకులు ఈ ఒలంపియాడ్ పోటీల్లో పాల్గొన్నారు. మన భారతీయ యువత కూడా పలు పతకాలను గెలుచుకున్నారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనం.
మిత్రులారా,
యువతలో అంతరిక్షం పట్ల ఆసక్తిని మరింత పెంపొందించడం కోసం ఇండియన్ స్పేస్ హ్యాకథాన్, రోబోటిక్స్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలను ఇస్రో ప్రారంభించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు, పోటీల విజేతలకు నా అభినందనలు.
మిత్రులారా,
అంతరిక్ష రంగంలో వరుస విజయాలు సాధించడం భారత శాస్త్రవేత్తలకు సాధారణంగా మారింది. రెండేళ్ల కిందటే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో డాకింగ్-అన్‌డాకింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ప్రపంచంలోని నాల్గో దేశంగా భారత్ అవతరించింది. శుభాంశు శుక్లాను మూడు రోజుల కిందటే కలిశాను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. ఆయన ఆ త్రివర్ణ పతాకాన్ని చూపించినప్పుడు అద్భుతమైన అనుభూతి కలిగింది. శుభాంశు శుక్లాతో మాట్లాడుతున్నప్పుడు నవ భారత యువత అపరిమిత ధైర్యం.. అనంతమైన కలలను నేను దర్శించాను. ఈ కలలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ "ఆస్ట్రోనాట్ పూల్" ను సిద్ధం చేస్తోంది. అంతరిక్ష దినోత్సవ సందర్భంగా యువత ఉత్సాహంగా దీనిలో భాగస్వాములై భారత ఆకాంక్షల సాకారం కోసం తోడ్పాటునందించాలని నేను ఆహ్వానిస్తున్నాను.
మిత్రులారా,
సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో భారత్ వేగంగా పురోగమిస్తోంది. త్వరలోనే భారత్ గగన్‌యాన్ మిషన్‌ను ప్రారంభించనుంది. రాబోయే సంవత్సరాల్లో సొంత అంతరిక్ష కేంద్రాన్నీ భారత్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మనం చంద్రుడిని, అంగారక గ్రహాన్ని చేరుకున్నాం. మానవాళి భవితను మరింత ఉజ్వలంగా చేసే అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి మరింత లోతుగా అంతరిక్షాన్ని మనం అన్వేషించాలి. మనం చూడాల్సిన విశ్వం అంతులేనిది.
మిత్రులారా,
ఏదీ మనకు చివరి సరిహద్దు కాదనే విషయాన్ని అంతులేని విశ్వం తెలియజేస్తుంది. అదే విధంగా భారత్ ఎలాంటి హద్దులు లేకుండా అంతరిక్షంలో పురోగమించాలి. ఎర్రకోట వేదికగా నేను చెప్పినట్లుగా సంస్కరణలు.. పనితీరు.. పరివర్తన అనే మార్గంలో భారత్ ముందుకు సాగుతోంది. గత పదకొండేళ్లుగా అంతరిక్ష రంగంలో అనేక ప్రధాన సంస్కరణలను దేశం అమలు చేసింది. అంతరిక్షం వంటి భవిష్యత్ రంగాలు అనేక పరిమితులకు కట్టుబడి ఉన్న సమయంలో మా ప్రభుత్వం ఈ పరిమితులన్నీ తొలగించింది. అంతరిక్ష సాంకేతికతలో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి వీలు కల్పించింది. ఈ కారణంగా నేడు 350కి పైగా అంకురసంస్థలు అంతరిక్ష సాంకేతికతలో ఆవిష్కరణలతో పాటు పురోగతికి చోదకశక్తిగా పనిచేస్తున్నాయి. పూర్తి ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన మొదటి పీఎస్ఎల్‌వీ రాకెట్టును త్వరలోనే ప్రయోగించనున్నాం. భారత మొట్టమొదటి ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం కూడా అభివృద్ధి దశలో ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. భూమిని నిరంతరం పరిశీలించడం కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ప్రయోగించేందుకూ సన్నాహాలు జరుగుతున్నాయి. భారత యువతకు అంతరిక్ష రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
మిత్రులారా,
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంలో స్వయంసమృద్ధి సాధించాల్సిన పలు రంగాలను నేను ప్రస్తావించాను. ప్రతీ రంగం తమ సొంత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని నేను కోరాను. ఈరోజు అంతరిక్ష దినోత్సవ సందర్భంగా మన అంతరిక్ష రంగ అంకురసంస్థలను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రాబోయే అయిదు సంవత్సరాల్లో అంతరిక్ష రంగంలో అయిదు యునికార్న్‌ల (బిలియన్ డాలర్ల విలువైన అంకురసంస్థలను) ఏర్పాటు లక్ష్యం మనం నిర్దేశించుకోగలమా? ప్రస్తుతం భారతగడ్డపై సంవత్సరానికి అయిదు నుంచి ఆరు ప్రధాన ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే అయిదేళ్లలో సంవత్సరానికి 50 రాకెట్లను అంటే వారానికో రాకెట్ ప్రయోగించేలా ప్రైవేట్ రంగం ముందంజ వేయాలి. ఈ దార్శనికత సాకారం కోసం అత్యాధునిక సంస్కరణలు అమలు చేయడానికి మా ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశంతో, సంకల్పంతో ముందుకు సాగుతోంది. అంతరిక్ష రంగానికి మా ప్రభుత్వం ప్రతి అడుగులోనూ అండగా ఉంటుంది.
మిత్రులారా,
శాస్త్రీయ అన్వేషణ కోసం ఒక సాధనంగా మాత్రమే కాకుండా.. జీవన సౌలభ్యాన్ని పెంపొందించే మార్గంగానూ అంతరిక్ష సాంకేతికతను భారత్ ఉపయోగించుకుంటుంది. దేశ పరిపాలనలో అంతరిక్ష సాంకేతికత కీలక అంతర్భాగంగా మారుతోంది. పంటల బీమా పథకాల్లో ఉపగ్రహ ఆధారిత అంచనాలు అయినా.. మత్స్యకారులకు ఉపగ్రహ ఆధారిత సమాచారం అందించడం అయినా.. భద్రత, విపత్తు నిర్వహణలో ఉపగ్రహ సమాచారం వినియోగించడం అయినా.. ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో జియోస్పేషియల్ డేటాను ఉపయోగించడం ద్వారా అయినా.. అంతరిక్ష రంగంలో భారత పురోగతి పౌరుల జీవితాన్ని సులభతరం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం కోసం నిన్న నేషనల్ మీట్ 2.0 నిర్వహించుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ప్రజా సేవ లక్ష్యంగా కొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని మన అంతరిక్షరంగ అంకురసంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే కాలంలో అంతరిక్షంలో భారత ప్రయాణం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ఇదే నమ్మకంతో.. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు!
***
(Release ID: 2160350)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada