ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని నవ్‌సారీలో లఖ్‌పతి దీదీలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటా మంతీ

Posted On: 08 MAR 2025 10:32PM by PIB Hyderabad

ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని నవ్‌సారీలో ‘లఖ్‌పతి దీదీ’లతో (లక్షాధికారి సోదరీమణులతో) మనస్ఫూర్తిగా మాట్లాడారు. మహిళా సాధికారతకు ఉన్న ప్రాధాన్యంతో పాటు సమాజానికి వారు అందిస్తున్న తోడ్పాటును ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రపంచం ఈ రోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటూ ఉండవచ్చు, కానీ మన సంస్క‌ృతి సంప్రదాయాల ప్రకారం అమ్మ అంటే మనం కనబరిచే భక్తిశ్రద్ధలు, ‘మాతృ దేవో భవ’ అనే భావన.. వీటితోనే దీనికి నాందీప్రస్తావన జరిగిపోయిందంటూ ప్రధాని అభివర్ణించారు. మన దృష్టిలో,  ప్రతిరోజూ ‘మాతృ దేవో భవ’ అనే అభిప్రాయం చెరిగిపోదని ఆయన అన్నారు.

లక్షాధికారి సోదరీమణుల్లో ఒకరు శివాని మహిళా మండల్‌తో  కలిసి పనిచేసిన తన అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ తాము సౌరాష్ట్రకు చెందిన సాంస్కృతిక హస్తకళలో భాగమైన ముత్యాల అలంకరణ పనిని చేసేవాళ్లమన్నారు. తాము 400  కు పైగా అక్క చెల్లెళ్లకు ఈ  పనిలో శిక్షణ ఇచ్చినట్లు, తమలో కొంతమంది సోదరీమణులు మార్కెటింగును, అకౌంట్లు రాసే పనిని చూసుకొంటున్నారన్నారు. మార్కెటింగ్ బృందం సభ్యులు రాష్ట్రం దాటి బయటకు కూడా వెళ్తున్నారా? అని ప్రధాని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ, దేశంలో అన్ని ప్రధాన నగరాలను తాము చుట్టివచ్చినట్లు చెప్పారు. ఆమె రూ.40,000 కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న మరో లఖ్‌పతి దీదీ విజయాన్ని ప్రస్తావించారు. ఈ విధంగా, లఖ్‌పతి దీదీలు చేజిక్కించుకుంటున్న విజయాల్ని ఆమె సగర్వంగా చాటిచెప్పారు. 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా తయారు చేయాలన్నదే తన కల అని శ్రీ మోదీ అన్నారు. వారి సంఖ్య 5 కోట్లకు కూడా చేరుకోగలదని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.
 
అరవై అయిదు మంది మహిళలతో కలిసి మిశ్రీ (పటిక బెల్లం) నుంచి పాకాన్ని తయారుచేస్తున్న విషయాన్ని  మరో లక్షాధికారి సోదరీమణి తెలిపారు. ఏడాదికి రూ.25-35 లక్షల టర్నోవరు సాధించామని ఆమె అన్నారు. ప్రభుత్వం తమకు  చూపిన మార్గం నిస్సహాయ మహిళలకు సైదోడుగా నిలవడంతో పాటు వారి పిల్లలకు చదువు చెప్పించగల స్థితికి తమను చేర్చిందని ఆమె అన్నారు. తమ కృషిని పెంపొందింపచేసుకుంటూ, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం వాహనాలను కూడా సమకూర్చుకున్నామని ఆమె వెల్లడించారు. శ్రీ మోదీ అనేక మంది లక్షాధికారి సోదరీమణులు ఏర్పాటు చేసిన స్టాళ్లను  తాను ముఖ్యమంత్రో లేదా ప్రధానమంత్రి హోదాలోనో కాకుండా ఒక సామాన్య వ్యక్తిలాగా వెళ్లి చూశానని, ఇది తనకు సాధారణ విషయంగా అనిపించిందన్నారు.
   
మరో లక్షాధికారి సోదరీమణి తన అనుభవాన్ని తెలియజేస్తూ, తాను కష్టపడి పనిచేసి కొన్నేళ్లలోనే కోటీశ్వరురాలిని కాగలనని ధీమాగా చెప్పారు. విజయాల బాటలో ముందుకు ఎలా సాగవచ్చో తమకు చూపినందుకు గాను ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఒక డ్రోన్ దీదీ తాను నేర్చుకున్న అంశాల్ని వివరిస్తూ, తాను దగ్గర దగ్గర రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్లు  చెప్పారు. ప్రధాని తన వంతుగా మాటలు కలుపుతూ, సైకిల్ స్వారీ కూడా తెలియని ఓ మహిళ డ్రోన్ పైలట్ కాగలిగిన విషయాన్ని తెలియజేశారు.  మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఆ మహిళ తన చుట్టాలు, స్నేహితురాళ్లు  తనను   ‘పైలట్’ అని పిలుస్తున్నారన్నారు. డ్రోన్ దీదీ అయ్యే  అవకాశాన్ని తనకు అందించడంతో పాటు ఆ  అవకాశంతో ఇవాళ తాను ఒక లక్షాధికారి సోదరీమణిగా నిలబడగలిగినందుకు ఆమె ప్రధానమంత్రికి  ధన్యవాదాలు తెలిపారు. డ్రోన్ దీదీలు ప్రస్తుతం ప్రతి గ్రామానికి ఒక గుర్తింపుగా మారారని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ మోదీ ఆ తరువాత, నెలకు సుమారు రూ.4 - 5 లక్షల విలువైన కార్యకలాపాలను పూర్తి చేస్తున్న ఒక ‘బ్యాంకు సఖి’తో మాట్లాడారు. మరో మహిళ తాను లక్షాధికారి సోదరిగా ఎదిగినట్లుగానే, ఇతర మహిళలను కూడా లక్షాధికారి సోదరీమణులుగా తీర్చిదిద్దాలని తనకు కోరికగా ఉందని చెప్పారు.

ఆన్‌లైన్ ఆధారిత వాణిజ్య కార్యకలాపాల్లోకి అడుగుపెట్టడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రధాని వారికి సూచించారు. ఈ దిశగా తమ కార్యకలాపాలను విస్తరించేవారికి ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. చాలా మంది మహిళలు క్షేత్ర స్థాయిలో సంపాదిస్తున్నారని, భారతీయ మహిళలు ఒక్క ఇంటి పనికే కాకుండా ఆర్థికంగా కూడా శక్తి స్వరూపిణులేనన్న సంగతిని ప్రపంచం తెలుసుకోవాలని ఆయన ప్రధానంగా చెప్పారు. భారత్ ఆర్థికంగా పుష్టిగా ఉండటంలో గ్రామీణ ప్రాంతాల నారీమణులు  కీలక పాత్రను పోషిస్తున్నారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మహిళలు సాంకేతికతను ఇట్టే అందిపుచ్చుకొంటారని తాను గమనించానని, డ్రోన్లను ఉపయోగించడాన్ని డ్రోన్ దీదీలు (డ్రోన్ సోదరీమణులు) మూడు, నాలుగు రోజుల్లోనే నేర్చుకోవడంతో పాటు చిత్తశుద్ధితో ప్రయోగాత్మకంగా వాటిని పనిచేయించిన సంగతి కూడా తనకు తెలుసని ఆయన వివరించారు.  భారత మహిళామణులలో పోరాటం చేసే, సృష్టించే, పెంచి పోషించే, సంపదను సాధించే శక్తి స్వతహాగానే ఇమిడి ఉందని ఆయన అభివర్ణించారు. ఈ బలమే దేశానికి కొండంత అండగా నిలుస్తుందని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.

 

***


(Release ID: 2158927) Visitor Counter : 3