హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లోక్‌సభలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం


· రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025.. కేంద్రపాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు-2025.. జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2025ను సభ ముందుంచిన కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా

· దేశంలో రాజకీయ అవినీతి నిరోధంతోపాటు ప్రజాగ్రహానికి ప్రతిస్పందనపై మోదీ ప్రభుత్వ నిబద్ధత మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు: మంత్రి ప్రకటన

· “దీని ప్రకారం ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రులు సహా కేంద్ర-రాష్ట్ర మంత్రులు వంటి కీలక రాజ్యాంగ పదవుల్లోగల వ్యక్తులు జైలుకు వెళితే ప్రభుత్వాన్ని నడిపే వీల్లేదు”

· “ప్రజా జీవితంలో క్షీణిస్తున్న నైతిక ప్రమాణాల పరిరక్షణ... రాజకీయాలకు సమగ్రత తేవడమే ఈ బిల్లు ఉద్దేశం”

· “ఇటీవల దేశంలో ఒక ఆశ్చర్యకర పరిస్థితి తలెత్తింది... ముఖ్యమంత్రులు లేదా మంత్రులు రాజీనామా చేయకుండా జైలు నుంచి అనైతిక రీతిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు”

· “జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం మంత్రి.. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి వంటివారికి సముచితమో... కాదో దేశ ప్రజలే నిర్ణయించాలి”

· “ఒకవైపు శ్రీ మోదీ తననుతాను చట్ట పరిధిల

Posted On: 20 AUG 2025 7:40PM by PIB Hyderabad

కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా ఇవాళ లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025, కేంద్రపాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు-2025, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2025లను ఆయన సభకు సమర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా వరుస పోస్టులతో ఈ సమాచారాన్ని హోం మంత్రి ప్రజల ముందుంచారు. ముఖ్యంగా దేశంలో రాజకీయ అవినీతి నిరోధంతోపాటు ప్రజాగ్రహానికి ప్రతిస్పందనపై మోదీ ప్రభుత్వ నిబద్ధత మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును స్పీకర్‌ అనుమతితో సభలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కేంద్ర-రాష్ట్ర మంత్రుల వంటి కీలక రాజ్యాంగ పదవుల్లోగల వ్యక్తులు జైలుకు వెళితే ప్రభుత్వాన్ని నడిపే వీలుండదని తెలిపారు. అలాగే, ప్రజా జీవితంలో క్షీణిస్తున్న నైతిక ప్రమాణాల పరిరక్షణతోపాటు  రాజకీయాలకు సమగ్రత తేవడమే ఈ బిల్లు ఉద్దేశమని వివరించారు. ఈ మూడు బిల్లులకు ఆమోదంతో రూపొందే చట్టాలు కింది అంశాలకు వర్తిస్తాయని శ్రీ అమిత్ షా వెల్లడించారు:

1.    అరెస్టయ్యాక జైలులో ఉన్న ఏ వ్యక్తీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పరిపాలన సాగించలేరు.

2.   రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలో అరెస్టుకు ముందు నైతిక కారణాలతో రాజీనామా చేసేందుకు నిరాకరించే నాయకులు భవిష్యత్తులో తయారవుతారని దాని రూపశిల్పులు ఊహించి ఉండరు. అయితే, ఇటీవల దేశంలో ఒక ఆశ్చర్యకర పరిస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రులు లేదా మంత్రులు రాజీనామా చేయకుండా జైలు నుంచి అనైతిక రీతిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

3.   నిందితుడైన రాజకీయ నాయకుడు అరెస్టయిన 30 రోజుల్లోగా కోర్టు నుంచి బెయిల్ పొందడానికి ఈ బిల్లులోని నిబంధన వీలు కల్పిస్తుంది. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో 31వ రోజున కేంద్రంలోని ప్రధానమంత్రి లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా మంత్రులను పదవుల నుంచి తొలగిస్తారు. లేదంటే తమంతట తామే విధులు నిర్వర్తించడానికి చట్టబద్ధంగా అనర్హులవుతారు. ఆరోణలున్ననాయకుడికి చట్టపరమైన ప్రక్రియ అనంతరం బెయిల్ మంజూరైతే వారు తిరిగి తమ పదవిని చేపట్టవచ్చు.

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి వంటివారికి సముచితమో... కాదో దేశ ప్రజలే నిర్ణయించాలని హోం-సహకార శాఖ మంత్రి అన్నారు. ఒకవైపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తననుతాను చట్ట పరిధిలోకి తెస్తూ రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తే, మరోవైపు బిల్లు పరిధిలోకి రాకుండా జైలు నుంచి ప్రభుత్వాలు నడపడానికి ప్రధాన ప్రతిపక్షం నాయకత్వంలో ఇతర పక్షాలన్నీ ఏకమై దీన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు.

ఈ గౌరవనీయ సభలో అత్యవసర పరిస్థితి సమయాన, అప్పటి ప్రధానమంత్రి 39వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టి, వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు వీల్లేకుండా చేసిన రోజులను దేశం నేటికీ గుర్తుంచుకుందని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పని సంస్కృతిని, విధానాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రిని కూడా చట్టానికి అతీతుణ్ని చేయడాలని ఆనాడు ప్రయత్నించారని గుర్తుచేశారు. అయితే, మా సొంత ప్రభుత్వ ప్రధానమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా చట్ట పరిధిలోకి తేవడం తమ పార్టీ విధానమని ప్రకటించారు.
సభలో ఈ రోజున తనను లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసిందని గుర్తుచేశారు. ఆనాడు తాను రాజీనామా చేయలేదని ఇప్పుడు చెబుతున్నారని, వాస్తవానికి తన అరెస్టుకు ముందే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని పేర్కొన్నారు. బెయిల్‌పై విడుదలయ్యాక కూడా ఆ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చేదాకా తాను ఎటువంటి రాజ్యాంగ పదవిని చేపట్టలేదనే నిజాన్ని ప్రధాన ప్రతిపక్షం గుర్తుకు తెచ్చుకోవాలని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఆ రోజున రాజకీయ ప్రతీకారంతో దీనిని ప్రేరేపించారని పేర్కొంటూ కోర్టు తనపై తప్పుడు కేసును కొట్టివేసిందని పేర్కొన్నారు.
తమ పార్టీతోపాటు ఎన్డీఏ కూటమి సదా నైతిక విలువలను నిబద్ధతతో పాటిస్తాయని ఆయన అన్నారు. ఈ బిల్లును సంయుక్త సభా సంఘం (జేఏసీ) పరిశీలనకు పంపుతామని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు. అక్కడ దీనిపై పూర్తి స్థాయిలో చర్చిస్తారని చెప్పారు. అయినప్పటికీ, అవినీతిపరులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష కూటమి సిగ్గూబిడియాలేవీ లేకుండా అసభ్యంగా బిల్లును వ్యతిరేకించిందని విమర్శించారు. తద్వారా ప్రజల ముందు తమ వాస్తవ నైజమేమిటో పూర్తిగా బహిర్గతం చేసుకున్నదని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు.

 

****


(Release ID: 2158737)