ప్రధాన మంత్రి కార్యాలయం
మహా కుంభమేళా విజయవంతమైన సందర్భంగా లోక్ సభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను: ప్రధాని
· మహా కుంభమేళా విజయవంతం కావడానికి ఎందరో సహకరించారు.. ప్రభుత్వం, సమాజంలోని కర్మయోగులందరికీ అభినందనలు: ప్రధాని
· మహా కుంభమేళా నిర్వహణలో ‘మహా ప్రయాస’ను మనం చూశాం: ప్రధాని
· ఈ మహా కుంభమేళాకు ప్రజలదే నేతృత్వం.. వారి సంకల్పమే నడిపించింది, అచంచలమైన వారి భక్తిశ్రద్ధలే దీనికి ప్రేరణ: ప్రధాని
· ప్రయాగరాజ్ మహా కుంభమేళా కీలక ఘట్టం.. దేశ చేతనను అది ప్రతిబింబించింది: ప్రధాని
· మహా కుంభమేళా ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేసింది: ప్రధాని
· మహా కుంభమేళా భేదభావాలను రూపుమాపింది.. ఇది భారత్ కు గొప్ప బలం; మనలో వేళ్లూనుకున్న ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనం: ప్రధాని
· విశ్వాసం, వారసత్వాలతో అనుసంధానించే స్ఫూర్తే నేడు భారత్ కు గొప్ప ఆస్తి: ప్రధాని
Posted On:
18 MAR 2025 1:21PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఈ రోజు లోకసభనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహా కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన అసంఖ్యాకులైన దేశ పౌరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. మహా కుంభమేళా విజయవంతం కావడానికి వ్యక్తిగతంగానూ బృందాలుగానూ సమష్టిగా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ కొనియాడారు. ప్రభుత్వం, సమాజంతోపాటు కార్మికులందరూ అంకితభావంతో ఈ మహత్కార్యంలో నిమగ్నమయ్యారని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా భక్తులకు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు.. అందునా ప్రత్యేకించి ప్రయాగరాజ్ వాసులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అమూల్యమైన సహకారాన్ని అందించి, ఈ కార్యక్రమంలో వారు భాగస్వాములయ్యారన్నారు.
అచంచలమైన కృషి ద్వారానే మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించడం సాధ్యపడిందని చెబుతూ.. గంగను భూమిపైకి తేవడానికి పురాణ పురుషుడు భగీరథుడు చేసిన కృషితో పోల్చారు. ఎర్రకోట ప్రసంగం సందర్భంగా ‘సబ్ కా ప్రయాస్’ ఎంత ప్రధానమైనదో తాను పేర్కొన్న విషయాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. భారతదేశ వైభవాన్ని ఈ మహా కుంభమేళా ప్రపంచానికి చాటిందని ఆయన వ్యాఖ్యానించారు. “దేశ ప్రజల ఉమ్మడి సంకల్పం, భక్తి శ్రద్ధలు, అంకిత భావానికి మహా కుంభమేళా నిదర్శనం. వారి అచంచలమైన విశ్వాసమే దీనికి స్ఫూర్తి” అని ఆయన అన్నారు.
మహా కుంభమేళా సందర్భంగా విస్తృతంగా జాతీయతా చేతన జాగృతమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది కొత్త సంకల్పాల దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తుందని, వాటిని సాకారం చేసుకునే స్ఫూర్తిని ప్రసాదిస్తుందని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ సామర్థ్యాలపై కొందరిలో ఉన్న సందేహాలు, ఆందోళనలను ఈ మహా కుంభమేళా పటాపంచలు చేసిందన్నారు.
విప్లవాత్మకమైన మార్పుల దిశగా దేశం పయనిస్తోందన్నారు. గతేడాది అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ, ఈ ఏడాది మహా కుంభమేళాను పోలుస్తూ.. వచ్చే సహస్రాబ్ది కోసం దేశ సంసిద్ధతను ఈ కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు. ఈ సమష్టి చైతన్యం అపారమైన దేశ సమర్థతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మానవ చరిత్రలో మాదిరిగానే దేశ చరిత్రలోని కీలక ఘట్టాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. స్వదేశీ ఉద్యమ సమయంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవం, చికాగోలో స్వామి వివేకానందుడి చారిత్రక ప్రసంగాలతోపాటు.. 1857 తిరుగుబాటు, భగత్ సింగ్ త్యాగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘ఢిల్లీ చలో’ పిలుపు, మహాత్మా గాంధీ దండి యాత్ర వంటి స్వాతంత్ర్యోద్యమ కీలక ఘట్టాలను శ్రీ మోదీ గుర్తు చేశారు. ఆ చారిత్రక ఘట్టాలు దేశాన్ని మేల్కొలిపాయని, సరికొత్తగా దిశా నిర్దేశం చేశాయని పేర్కొన్నారు. “ప్రయాగరాజ్ మహా కుంభమేళా కూడా అటువంటి విశేషమైన చారిత్రక ఘట్టమే. దేశ జాగరూకతా స్ఫూర్తికి అది ప్రతీక” అని ఆయన వ్యాఖ్యానించారు.
మహా కుంభమేళా సందర్భంగా దాదాపు నెలన్నర రోజులపాటు దేశంలో వెల్లివిరిసిన ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ... కోట్లాదిగా భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అచంచలమైన భక్తిశ్రద్ధలతో అందులో పాల్గొనడం అపారమైన దేశ సమర్థతను చాటిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల మారిషస్ పర్యటన సందర్భంగా ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం నుంచి పవిత్ర జలాన్ని అక్కడికి తీసుకెళ్లినట్లు ప్రధానమంత్రి తెలిపారు. మారిషస్ లోని గంగా తలావ్‌లో పవిత్ర జలాన్ని సమర్పించినప్పుడు అచంచలమైన భక్తి భావం, ఆనందం కలిగాయన్నారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, విలువలను ప్రపంచం అందిపుచ్చుకుని, ఘనంగా చాటడంతోపాటు వాటిని పరిరక్షించే దిశగా తాము విస్తృతంగా కృషి చేస్తున్న తీరును ఇది ప్రతిబింబిస్తోందన్నారు.
మహా కుంభమేళా, ఇతర పండుగల్లో ఈ కాలపు దేశ యువత ఎంతో భక్తిశ్రద్ధలతో భాగస్వాములయ్యారని చెప్తూ.. తరతరాలుగా సంప్రదాయాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నేటి యువత తమ సంప్రదాయాలు, విశ్వాసాలు, నమ్మకాలను సగర్వంగా అందిపుచ్చుకుని.. భారతీయ సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
“సమాజం తన వారసత్వాన్ని సగర్వంగా స్వీకరిస్తే.. మహా కుంభమేళాలో మనం చూసినట్టు వైభవోపేతమైన, స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు. ఆ స్ఫూర్తి ఐక్యతతోపాటు బృహత్తరమైన దేశ లక్ష్యాలను సాధించే దిశగా ఆత్మ విశ్వాసాన్నీ పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయాలు, విశ్వాసం, వారసత్వాలతో అనుసంధానతే నేటి భారతదేశానికి విలువైన ఆస్తి అని వ్యాఖ్యానించారు. దేశ సమష్టి శక్తి, సాంస్కృతిక ఔన్నత్యానికి అది ప్రతీక అన్నారు.
మహా కుంభమేళా ఎన్నో విశేష ఫలితాలనిచ్చిందని, ఐక్యతా స్ఫూర్తిని అత్యంత ఉన్నతమైనదిగా చాటిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతమూ, నలుమూలల నుంచీ ప్రజలు ప్రయాగరాజ్ లో ఒక్కచోటికి వచ్చి వ్యక్తిగత అహాలను పక్కనపెట్టి ‘నా’ బదులు ‘మన’ అన్న సమష్టి స్ఫూర్తిని ప్రదర్శించిన తీరును ఆయన కొనియాడారు. జాతీయత, ఐక్యతా భావాలను బలంగా చాటుతూ.. వివిధ రాష్ట్రాల ప్రజలు పవిత్ర త్రివేణీ సంగమానికి తరలివచ్చారన్నారు. వివిధ భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలు సంగమ ప్రాంతంలో ‘హర్ హర్ గంగే’ అని నినదించడం ‘ఏక్ భారత్, శ్రేష్టతా భారత్’ సంకల్పాన్ని ప్రతిబింబించిందని, ఏకతా స్ఫూర్తిని పెంపొందించిందని అన్నారు. పేదా గొప్పా అన్న వివక్షలు మహా కుంభమేళాలో కనిపించలేదని, ఇది అపారమైన భారత శక్తి సామర్థ్యాలను చాటుతోందని శ్రీ మోదీ అన్నారు. బలమైన ఐక్యతా భావం ఈ దేశానికి స్వభావసిద్ధమైనదని, విచ్ఛిన్నం చేసే కుయుక్తులను దేశం అధిగమిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఐక్యత భారతీయులకు గొప్ప అదృష్టమని, విచ్ఛిన్నతల ముప్పును ఎదుర్కొంటున్న ప్రపంచంలో ఇది దేశానికి విశేషమైన బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. దేశంలో చెక్కుచెదరకుండా కొనసాగుతున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ భావనే భారత్ కు ప్రామాణికమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఈ వైభవానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమనే ఈ విశిష్ట లక్షణాన్ని నిరంతరం సుసంపన్నం చేస్తూండాలని దేశాన్ని ఆయన కోరారు.
మహా కుంభమేళా మనకు అందించిన అనేక ఆదర్శాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశంలో విస్తారమైన నదీ వ్యవస్థ ఉందని, వాటిలో చాలావరకూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని శ్రీ మోదీ చెప్పారు. మహా కుంభమేళా స్ఫూర్తితో నదీ ఉత్సవాల సంప్రదాయాన్ని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాంటి కార్యక్రమాలు నీటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇప్పటి తరానికి దోహదపడతాయని, నదీ స్వచ్ఛతను ప్రోత్సహిస్తాయని, నదుల సంరక్షణకు భరోసా ఇస్తాయని అన్నారు.
మహా కుంభమేళా అందించిన స్ఫూర్తి.. దేశ సంకల్పాలను సాకారం చేసుకునేందుకు బలమైన సాధనంగా ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. మహాకుంభమేళా నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అభివాదాలు చెప్పారు. సభ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
(Release ID: 2158699)
Visitor Counter : 6
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam