రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్న ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారులు
దేశీయ అవసరాలకు తగినట్లుగా, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుసంధానంగా
మన దౌత్య ప్రయత్నాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Posted On:
19 AUG 2025 1:56PM by PIB Hyderabad
2024 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ శిక్షణార్థులు నేడు (ఆగష్టు 19, 2025) రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు.
అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత విదేశాంగ శాఖలో చేరినందుకు వారికి అభినందనలు తెలిపారు. తమ విధి ప్రయాణంలో భారత నాగరిక విలువలైన శాంతి, బహుళత్వం, అహింస, చర్చాయుత పరిష్కారం వంటి అంశాలను ఎల్లప్పుడూ తమతో తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో విభిన్న సంస్కృతుల నుంచి ఆలోచనలు, దృక్పథాలను స్వీకరించే ధోరణితో ఉండాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. నేడు ప్రపంచం వేగంగా మారుతోందని, భౌగోళిక, రాజకీయ మార్పులు, డిజిటల్ విప్లవం, వాతావరణ మార్పు, ప్రపంచ పోటీ పెరుగుతోందని అన్నారు. ఇవన్నీ సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో యువ అధికారులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ, అనుకూలత సామర్థ్యం కలిగి ఉండటమే దేశ విజయానికి కీలకమని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రపతి మాట్లాడుతూ.... ప్రపంచంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపే దేశంగా నేడు భారత్ ఎదుగుతోంది. అవి ఉత్తర–దక్షిణ దేశాల మధ్య వ్యత్యాసాలు కావొచ్చు. సరిహద్దు ఉగ్రవాద ప్రమాదాలు, వాతావరణ మార్పు ప్రభావాలు కావొచ్చు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కూడా. మన అభిప్రాయానికి విలువ, గౌరవం లభిస్తుంది. దేశానికి ముఖ్య దౌత్యవేత్తలుగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారుల మాటలు, చర్యలు, విలువలు, సిద్ధాంతాలను ప్రపంచం గమనిస్తుంది.
ప్రస్తుత కాలంలో సాంస్కృతిక దౌత్య ప్రాధాన్యత పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. హృదయం, ఆత్మతో ఏర్పడిన సంబంధాలు ఎప్పటికీ బలంగా నిలుస్తాయన్నారు. యోగా, ఆయుర్వేదం, చిరు ధాన్యాలు, దేశ సంగీతం, కళలు, భాషలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలన్నింటినీ మరింత సృజనాత్మకతో, గొప్ప ప్రయత్నాలతో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. అలాగే భారత విస్తృత వారసత్వాన్ని విదేశాలకు అందించాలని పిలుపునిచ్చారు.
మన దౌత్య ప్రయత్నాలు దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉండాలని, 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలనే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్రపతి అన్నారు. యువ అధికారులైన వారు దేశ ప్రయోజన సంరక్షకులుగా మాత్రమే కాకుండా, దేశీయ ఆత్మకు రాయబారులుగా పరిగణించాలని ఆమె సూచించారు.
***
(Release ID: 2158127)