హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం

గత 11 సంవత్సరాల పురోగతికి మార్గసూచీగా, వర్తమానానికి బలంగా, సంపన్న భారతదేశం కోసం ఒక వ్యూహంగా అభివర్ణించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 15 AUG 2025 4:40PM by PIB Hyderabad
ఆపరేషన్  సిందూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేత, మిషన్ సుదర్శన్ చక్ర  ద్వారా దేశ మౌలిక సదుపాయాలకు రక్షణ, హైపవర్ డెమోగ్రఫీ మిషన్ ద్వారా దేశాన్ని చొరబాటురహితంగా ఉంచాలనే సంకల్పంతో భారత్ ను బలంగా, సురక్షితంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
 
 ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ దేశ రైతుల సంక్షేమానికి ప్రభుత్వ అచంచలమైన మద్దతును పునరుద్ఘాటించారు
 
అణు ఇంధనం, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం, జెట్ ఇంజిన్ రంగాల్లో స్వావలంబన సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
 
 రాబోయే దీపావళి సందర్భంగా, పన్ను ఉపశమనం కలిగించడానికి, పౌరులకు జీవితాన్ని సులభతరం చేయడానికి,  చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను ప్రధాని మోదీ ప్రకటించారు
 
ప్రైవేట్ రంగంలో మొదటిసారి ఉద్యోగం పొందుతున్న వారికి రూ 15,000 అందిస్తూ, రూ.లక్ష కోట్లతో 'ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన'ను ప్రారంభించడం ద్వారా ప్రధాని మోదీ యువతకు కానుక ఇచ్చారు.
 
ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఘన చరిత్రను, దేశ నిర్మాణంలో దాని సేవలను ప్రముఖంగా వివరిస్తూ, దాని కార్యకర్తలందరికీ నివాళులు అర్పించారు
 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వీయ ఎదుగుదలతో పాటు  సేవ, అంకితభావం, సంఘటితం, క్రమశిక్షణ ద్వారా జాతి నిర్మాణంలో తన నిబద్ధతను నెరవేరుస్తూనే ఉంది
 

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని గత 11 సంవత్సరాల పురోగతికి మార్గసూచీగా, వర్తమానానికి బలంగా,  సంపన్న భారతదేశం కోసం ఒక వ్యూహంగా  కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా  అభివర్ణించారు.

ఆపరేషన్  సిందూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేత, మిషన్ సుదర్శన్ చక్ర  ద్వారా దేశ మౌలిక సదుపాయాలకు రక్షణ, హైపవర్ డెమోగ్రఫీ మిషన్ ద్వారా దేశాన్ని చొరబాటురహితంగా ఉంచాలనే సంకల్పంతో భారత్ ను బలంగా, సురక్షితంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమ వేదిక  'ఎక్స్' లో వరుస పోస్టుల్లో పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాల పట్ల తిరుగులేని ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన  ప్రధాని మోదీ,  అణు ఇంధనం, కీలకమైన ఖనిజాలు, ఇంధనం, అంతరిక్ష రంగం, జెట్ ఇంజిన్ల రంగాల్లో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అంతేకాక, 'ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన' ప్రకటన,  రానున్న దీపావళి కానుకగా జీఎస్టీ లో తీసుకువచ్చే గణనీయమైన ఉపశమన చర్యలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని, చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తాయని ఆయన తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ లక్ష కోట్ల రూపాయల నిధులతో 'ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన' అమలును ప్రకటించడం ద్వారా దేశ యువతకు కానుక ఇచ్చారని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ పథకం కింద, ప్రైవేట్ రంగంలో మొదటిసారి పనిచేసే ఉద్యోగులకు రూ .15,000 లభిస్తాయని, ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే కంపెనీలకు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. సుమారు 3.5 కోట్ల మంది యువతకు లాభం చేకూర్చే ఈ కార్యక్రమం, భారత యువతకు ఒక స్వర్ణావకాశంగా నిలిచి, ఆత్మనిర్భర్ భారత ప్రయాణాన్ని బలోపేతం చేస్తుంది.

చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడం ద్వారా స్వావలంబన భారత్ దిశగా మోదీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోం,  సహకార శాఖల మంత్రి పేర్కొన్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ దేశానికి దీపావళి కానుకగా జీఎస్టీ సంస్కరణలను ప్రకటించారు. ఈ సంస్కరణలు చిన్న పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూర్చడమే కాకుండా రోజువారీ నిత్యావసరాలను మరింత చౌకగా అందిస్తాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ ప్రయత్నం భారత ఆర్థిక శక్తిని మరింత బలపరచి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ 'మిషన్ సుదర్శన చక్ర'ను ప్రారంభించడం చారిత్రాత్మకమని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ మిషన్ లో భాగంగా 2035 నాటికి కీలకమైన జాతీయ ప్రదేశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. శత్రువుల దాడులను నిర్వీర్యం చేయడమే కాకుండా సుదర్శన చక్రం తరహాలో ప్రభావవంతమైన ప్రతిదాడులు చేయడం కూడా ఈ మిషన్ లక్ష్యం. ఈ చర్య జాతీయ భద్రతను దుర్భేద్యంగా మార్చడంలో,  అలాగే ప్రత్యర్థులపై లక్ష్య నిర్దేశిత దాడులకు వీలు కల్పించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

ప్రధాని మోదీ తమ  చారిత్రాత్మక స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)  100 సంవత్సరాల ఘనమైన చరిత్రను,  దేశ నిర్మాణానికి అది అందించిన సేవలను ప్రముఖంగా ప్రస్తావించారని,  100 సంవత్సరాల దేశ పురోగతి ప్రయాణంలో అసమానమైన కృషి చేసిన ఆరెస్సెస్ వాలంటీర్లందరికీ నివాళులు అర్పించారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. గత శతాబ్దకాలంగా సేవ, అంకితభావం, సంఘటితం, క్రమశిక్షణతో స్వీయ వికాసం ద్వారా దేశ నిర్మాణం అనే తన సంకల్పాన్ని ఆరెస్సెస్ నెరవేర్చింది.

 

***

 

(Release ID: 2157072)