రక్షణ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో ఎర్రకోట నుంచి 79వ స్వాతంత్య్ర వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం
· సుసంపన్న... సురక్షిత... సాహసోపేత ‘నవ భారత్’ను కనువిందుగా ఆవిష్కరించనున్న మహోత్సవం
Posted On:
13 AUG 2025 7:13PM by PIB Hyderabad
భారత్ 2025 ఆగస్టు 15న తన 79వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోనుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఐతిహాసిక ఎర్రకోట నుంచి ఈ మహోత్సవానికి నాయకత్వం వహిస్తారు. ఇందులో భాగంగా కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వికసిత భారత్-2047 స్వప్న సాకారంపై ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా దేశం వేగంగా ముందంజ వేస్తున్న నేపథ్యంలో ‘నవ భారత్’ ఇతివృత్తంగా ఈ ఏడాది వేడుకలను నిర్వహిస్తారు. సుసంపన్న, సురక్షిత, సాహసోపేత నవ భారత్ నిరంతర వృద్ధిని గుర్తుచేసుకుంటూ పురోగమన పథంలో దేశం మరింత వేగం పుంజుకోగలిగేలా శక్తిని సంతరించుకునే దిశగా ఈ వేడుకలు ఒక వేదిక కాగలవు.
ఇదీ వేడుకల క్రమం
ప్రధానమంత్రి ఎర్రకోట వద్దకు చేరుకోగానే రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ స్వాగతిస్తారు. అటుపైన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ), ఢిల్లీ ఏరియా లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్‌ను రక్షణ కార్యదర్శి ప్రధానమంత్రికి పరిచయం చేస్తారు. అనంతరం ఆయన శ్రీ నరేంద్ర మోదీని గౌరవ వందన స్వీకార వేదిక వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇంటర్-సర్వీసెస్ సంయుక్త దళం, ఢిల్లీ పోలీస్ గార్డులు ప్రధానమంత్రికి వందనం చేస్తారు. ఈ లాంఛనం ముగిశాక ప్రధానమంత్రి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) స్వీకరిస్తారు.
ఈ బృందంలో 96 మంది (సైనిక, నావిక, వైమానిక దళాలు సహా ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారి సహా మొత్తం 24 మంది) సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవానికి వైమానిక దళం సమన్వయ సేవ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గార్డ్ ఆఫ్ ఆనర్ కు వింగ్ కమాండర్ ఎ.ఎస్.సెఖోన్ నాయకత్వం వహిస్తారు. ఈ బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ అర్జున్ సింగ్, నావికా సిబ్బందికి లెఫ్టినెంట్ కమాండర్ కోమల్ దీప్ సింగ్, వైమానిక దళ సిబ్బందికి స్క్వాడ్రన్ లీడర్ రాజన్ అరోరా, ఢిల్లీ పోలీసు సిబ్బందికి అదనపు డీసీపీ శ్రీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ నాయకత్వం వహిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి ఎర్రకోట బురుజుల పైకి చేరుకుంటారు. అక్కడ ఆయనకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సహాయ శ్రీ సంజయ్ సేథ్, రక్షణ సిబ్బంది అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, సైనిక సిబ్బంది అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికా సిబ్బంది అధిపతి చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠీ, వైమానిక సిబ్బంది అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత జాతీయ పతాకావిష్కరణ కోసం ప్రధానమంత్రిని ఢిల్లీ ఏరియా ‘జీవోసీ’ జెండా వేదిక వద్దకు తీసుకెళ్తారు.
ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో ప్రధానమంత్రికి సహకరిస్తారు. అదే సమయంలో పరాక్రమవంతులైన 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) గన్నర్లు 21 తుపాకులు పేల్చడం ద్వారా గన్ సెల్యూట్ చేస్తారు. స్వదేశీ తయారీ 105ఎం.ఎం. లైట్ ఫీల్డ్ గన్‌లను ఉపయోగించే ఈ ఉత్సవ సైనిక బృందానికి మేజర్ పవన్ సింగ్ షెఖావత్ మార్గదర్శత్వం వహిస్తారు. నాయబ్ సుబేదార్ (గన్నరీలో అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్) అనుతోష్ సర్కార్ గన్ పొజిషన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.
ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో జాతీయ జెండా గార్డ్ బృందంలోని 128 మంది (సైనిక, నావిక, వైమానిక దళాలు సహా ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారి సహా 32 మంది) సిబ్బంది త్రివర్ణ పతాకానికి వందనం సమర్పిస్తారు. ఈ ఇంటర్-సర్వీసెస్, పోలీస్ సంయుక్త గౌరవ వందనానికి వింగ్ కమాండర్ తరుణ్ డాగర్ నాయకత్వం వహిస్తారు.
జాతీయ పతాక గౌరవ వందన బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ ప్రకాష్ సింగ్, నావికా సిబ్బందికి లెఫ్టినెంట్ కమాండర్ మొహద్ పర్వేజ్, వైమానిక సిబ్బందికి స్క్వాడ్రన్ లీడర్ వి.వి.శర్వణ్, ఢిల్లీ పోలీసు సిబ్బందికి అదనపు డీసీపీ శ్రీ అభిమన్యు పోస్వాల్ నాయకత్వం వహిస్తారు.
త్రివర్ణ పతాక ఆవిష్కరణానంతరం జెండాకు జాతీయ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఒక జేసీవో, 25 మంది ఇతర ర్యాంకుల సిబ్బంది సహిత వైమానిక దళ బ్యాండ్ వాద్య పరికరాలపై జాతీయ గీతాన్ని వాయిస్తుంది. జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఎం.డేకా ఈ బ్యాండ్‌కు మార్గదర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది వేడుకలలో తొలిసారిగా 11 మంది వైమానిక దళ అగ్నివీర్ వాద్యకారులు కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేయగానే వైమానిక దళంలోని రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేదికపై పుష్పవర్షం కురిపిస్తాయి. వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ‘ఆపరేషన్ సిందూర్’ను స్ఫురింపజేసే జెండాను ప్రదర్శిస్తాయి. ఈ హెలికాప్టర్లకు వింగ్ కమాండర్లు వినయ్ పూనియా, ఆదిత్య జైస్వాల్ కెప్టెన్లుగా ఉంటారు.
ఆపరేషన్ సిందూర్
ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్ఞానపథ్‌లోని వ్యూ కట్టర్ (బారికేడ్)పై ఆపరేషన్ సిందూర్ ను గుర్తుచేసే పుష్పాలంకరణతో లోగోను ప్రదర్శిస్తారు.
వేడుకల ఆహ్వాన పత్రాలపైనా ఆపరేషన్ సిందూర్ లోగోను ముద్రించారు. దాంతోపాటు ‘నవ భారత్’ను సూచిస్తూ చీనాబ్ వంతెన వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది.
జ్ఞానపథ్‌లో ‘నవ భారత్’ స్వరూపావిష్కరణ
జాతీయ పతాకావిష్కరణ సమయంలో పుష్పవర్షం అనంతరం ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిశాక (సైనిక, నావిక, వైమానిక దళాల) స్త్రీ-పురుష నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ) కేడెట్లు, ‘మై భారత్’ వలంటీర్లు జాతీయ గీతం ఆలపిస్తారు. ఈ రెండు విభాగాల నుంచి 2,500 మంది స్వాతంత్య్ర వేడుకలలో పాల్గొంటున్నారు. వీరంతా జ్ఞానపథ్‌లో ప్రాకారానికి ఎదురుగా ‘నవ భారత్’ లోగో ఆకారంలో కూర్చుని ఆ స్వరూపాన్ని కళ్లకు కట్టేలా చేస్తారు.
ప్రత్యేక అతిథులు
ఈ సంవత్సరం స్వాతంత్య్ర వేడుకలను వీక్షించడం కోసం వివిధ రంగాల నుంచి 5,000 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానాలు అందాయి. వీరిలో...
వీరే కాకుండా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల సంప్రదాయ వస్త్రధారణతో వచ్చి ఈ మహోత్సవం తిలకించేందుకు 1,500 మందికిపైగా ప్రజలకు ఆహ్వానం అందింది.
ప్రజలకు సదుపాయాలు
· క్లోక్ రూమ్: లోగడ గణతంత్ర వేడుకల సందర్భంగా క్లోక్ రూమ్‌ల సౌలభ్యం కల్పించడాన్ని సందర్శకులు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్వాతంత్ర్య దినోత్సవాలకు తొలిసారి 12 ప్రదేశాల్లో 25 క్లోక్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
· హెల్ప్ డెస్క్ కార్యకర్తలు: మొత్తం 190 మంది వలంటీర్లతోపాటు (‘మై భారత్’ నుంచి 120 మంది, ఎన్‌సీసీ నుంచి 70) పోలీసు సిబ్బంది కూడా సందర్శకులకు మార్గనిర్దేశం చేస్తారు. ఎర్రకోటకు వెళ్లే మార్గంలో వీరిని సందర్శకులు సులువుగా గుర్తించవచ్చు.
· వీల్‌చైర్: వీల్‌చైర్ అవసరమైన సందర్శకుల కోసం మెట్రో స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఎన్‌సీసీ కేడెట్లు అందుబాటులో ఉంటారు.
· అదనపు కార్ పార్కింగ్: పార్కింగ్ నంబర్ ‘4ఎ’లో 250 అదనపు కార్లు నిలిపే సౌకర్యం కల్పించారు.
· మెట్రో సేవలు: ఆగస్టు 15 తెల్లవారుజామున 4 గంటల నుంచి మెట్రో రైళ్లు నడుస్తాయి. వీటిద్వారా ప్రజలు సులువుగా వేదిక వద్దకు చేరుకోవచ్చు.
పోటీలు
స్వాతంత్య్ర దినోత్సవానికి నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ‘మై గవ్’ సహకారంతో నిర్వహించిన వివిధ పోటీల వివరాలిలా ఉన్నాయి:
· జ్ఞాన్‌పథ్‌పై స్వరూప కూర్పు పోటీ
· ‘ఆపరేషన్ సిందూర్- ఉగ్రవాదంపై భారత్ విధానానికి పునర్నిర్వచనం’ ఇతివృత్తంగా వ్యాసరచన పోటీ
· రీల్ పోటీ: భారత స్వాతంత్ర్య స్మారక చిహ్నాలు/ప్రదేశాలకు నడక
· ‘నవ భారత్ – సాధికార భారత’ అంశంపై పెయింటింగ్ పోటీ
· క్విజ్ పోటీల పరంపర:
ఎ. నవ భారత్‌ను తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర
బి. భారత్ రణభూమి: భారత సరిహద్దులు
సి. జాతీయ భద్రతలో స్వయంసమృద్ధ ఆవిష్కరణలు
ఈ పోటీలన్నిటిలో విజేతలైన సుమారు 1,000 మంది వేడుకలలో పాలు పంచుకుంటారు.
మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలు
పౌరులలో దేశభక్తిని పెంపొందించడంతోపాటు స్వాతంత్ర్య వేడుకల రోజు సాయంత్రం ఆపరేషన్ సిందూర్ విజయోత్సవంలో భాగంగా తొలిసారి దేశవ్యాప్తంగా అనేక బ్యాండ్ ప్రదర్శనలు ఉంటాయి. ఈ మేరకు 140కి పైగా కీలకమైన ప్రదేశాల్లో సైనిక, నావిక, వైమానిక, తీర రక్షక, ఎన్‌సీసీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్, ఐడీఎస్, ఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఈ ప్రదర్శనలిస్తారు.
***
(Release ID: 2156306)