పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

100% ఎఫ్‌డీఐ, కొత్త స్టేషన్లు, విధాన సంస్కరణలతో ఎల్ఎన్‌జీ వినియోగానికి ఊతం

Posted On: 07 AUG 2025 5:20PM by PIB Hyderabad

దేశీయంగా సహజవాయు ఉత్పత్తి, ద్రవీకృత సహజవాయు (ఎల్ఎన్‌జీ) దిగుమతి ద్వారా దేశంలో సహజవాయువు అవసరాలు తీరుతున్నాయి. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు రంగాలకు ఎల్ఎన్‌జీని విశేషంగా అందుబాటులోకి తెచ్చింది. దీనితోపాటు ఎల్ఎన్‌జీ టర్మినళ్లు, ఎల్ఎన్‌జీ దిగుమతుల కోసం సార్వత్రిక ఉమ్మడి లైసెన్సింగ్ (ఓపెన్ జనరల్ లైసెన్సింగ్- ఓజీఎల్) కేటగిరీ మొదలైనవి సహా.. ఎల్ఎన్‌జీ మౌలిక సదుపాయాలను నెలకొల్పడానికి పూర్తి ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడం కూడా ఇందులో భాగంగా ఉంది. ఇప్పటి వరకు 52.7  మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 8 ఎల్ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినళ్లు పనిచేస్తున్నాయి.

స్వర్ణ చతుర్భుజి, జాతీయ రహదారులు, తూర్పు-పశ్చిమ హైవే, ఉత్తర-దక్షిణ హైవే, దేశంలోని ప్రధాన మైనింగ్ క్లస్టర్లలో ఎల్ఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు, గ్యాస్ కంపెనీలు ఇప్పటివరకు 13 ఎల్ఎన్‌జీ రిటైల్ స్టేషన్లను ప్రారంభించాయి. ప్రైవేటు సంస్థలకు చెందిన 16 ఎల్ఎన్‌జీ రిటైల్ స్టేషన్లు కూడా పనిచేస్తున్నాయి.

రవాణా ఇంధనంగా ఎల్ఎన్‌జీ వినియోగాన్ని పెంచడం కోసం ఈ చర్యలు తీసుకుంది: - ఎల్ఎన్‌జీని రవాణా ఇంధనంగా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఎల్‌ఎన్‌జీ వాహనాలకు ఉద్గార ప్రమాణాలను కూడా ప్రకటించారు.

స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెజర్ వెసెల్స్ (అన్‌ఫైర్డ్) (అమెండ్‌మెంట్) రూల్స్-2025ను ప్రభుత్వం సవరించి.. విద్యుత్ జ్వలన యంత్రం లేదా సంపీడన జ్వలన తరహా అంతర్దహన యంత్రం (కంప్రెషన్ ఇగ్నిషన్ టైప్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ఉన్న ఎల్ఎన్‌జీ ఇంధనంతో కూడిన నౌకలను ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేయడానికి, అలాగే రైల్వేలు, మైనింగ్, జలమార్గాలు, పరీక్ష ప్రయోగ శాలల వంటి రవాణాయేతర రంగాల్లో ఎల్ఎన్‌జీ మొబైల్ డిస్పెన్సింగుకు అనుమతించింది.

పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) 2020లో జారీ చేసిన ఓ ప్రకటనలో.. పీఎన్‌జీఆర్బీ సీజీడీ అనుమతితో నిమిత్తం లేకుండా ఓ సంస్థ ఎల్ఎన్‌జీ ఆర్వో (రిటైల్ అవుట్‌లెట్)ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించింది (అయితే రవాణా రంగానికి ద్రవస్థితిలో ఎల్ఎన్‌జీని పంపిణీ చేసే ఎల్ఎన్‌జీ స్టేషన్ల స్థాపన, నిర్వహణకు మాత్రమే ఇది వర్తిస్తుంది).

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ గోపీ లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2154087)