యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘జాతీయ పతాక క్విజ్’ను ప్రకటించిన మేరా యువ భారత్ (MYBharat) పోర్టల్.. దేశభక్తితో పాటు మువ్వన్నెల జెండాపై అవగాహనను పెంచడం ఈ క్విజ్ లక్ష్యం
* క్విజ్ విజేతలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రితో కలిసి సియాచిన్‌ను చూసే అవకాశం
Posted On:
07 AUG 2025 11:26AM by PIB Hyderabad
దేశభక్తితో పాటు మన జాతీయ జెండాపై అవగాహనను ఇప్పటి కంటే మరింత పెంచాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో క్విజ్ పోటీని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MYBharat) పోర్టల్ ప్రకటించింది. మైభారత్ పోర్టల్ (mybharat.gov.in)లో నిర్వహించే ఈ ఆన్‌లైన్ ప్రశ్న-జవాబుల పోటీ.. దేశ పౌరులందరూ ఈ క్విజ్‌లో పాల్గొని, త్రివర్ణ పతాకానికి సంబంధించి తమకు ఎంత అవగాహన ఉందో స్వయంగా పరీక్షించుకోవాల్సిందిగా.. వారిని కోరుతోంది.
ఈ ప్రశ్న-జవాబుల పోటీని, దీనిలో పాల్గొనేవారందరికీ ఉత్తేజకర, విషయాలను లోతుగా తెలుసుకొనే అవకాశాన్ని ఇచ్చేదిగా రూపొందించారు. దీనిలో బహుళ ఐచ్ఛికాల (మల్టిపుల్-చాయిస్) ప్రశ్నలుంటాయి.. ప్రతి ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలున్నా, వాటిలో ఒక్కటే సరైన సమాధానం. క్విజ్‌లో పాల్గొన్నందుకు గుర్తింపుగా, దీనిలో పాలుపంచుకొన్నవారందరికీ ఒక ‘ఈ-సర్టిఫికెట్’ను ఇస్తారు.
ఒక గొప్ప ప్రోత్సాహకాన్ని అందించే చర్యగా, 25 మంది టాప్ స్కోరర్లను ఎంపిక చేసి వారికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయతో కలిసి సియాచిన్ సందర్శించే అవకాశాన్ని ఇవ్వనున్నారు.
మైభారత్ పోర్టల్‌లో నమోదైన వారందరూ ఈ క్విజ్‌లో పాల్గొనడానికి అర్హులు. అయితే సియాచిన్‌ను చూడటానికి 21-29 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిని మాత్రమే విజేతలుగా ఎంపిక చేయనున్నారు. 25 మంది విజేతల తుది ఎంపిక ప్రక్రియను అగ్రగామి స్కోరర్లలో నుంచి కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతిలో పూర్తి చేస్తారు.
క్విజ్‌లో పాల్గొనడానికి ప్రవేశ రుసుం ఏమీ లేదు. ఈ పోటీలో పాల్గొనదల్చుకున్న వారు మైభారత్ (MYBharat) పోర్టల్‌లో తమ ప్రొఫైల్స్ అన్ని వివరాలతోనూ, అత్యంత తాజా సమాచారంతోనూ ఉండేలా సరిచూసుకోవాలి.
దేశ యువతకు వివిధ సేవలను ఒకే వేదిక నుంచి అందించాలనే దృష్టితో మేరా యువ భారత్ (https://mybharat.gov.in/) పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేదిక యువతకు ప్రొఫైల్‌ను రూపొందించుకోవడానికి, వివిధ స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లోనూ, శిక్షణ కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి, నిపుణుల సూచనలు, సలహాలు అందుకోవడానికి, తోటి యువ ప్రతినిధులతో కలిసి ముందడుగు వేయగలగడానికి.. ఇలా పలు అంశాల్లో తోడ్పాటును అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ లో అనుభవపూర్వకంగా విషయాలను తెలియజేస్తూ ఉండే కార్యక్రమాలు (ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్.. ఇఎల్‌పీ) సహా అనేక భాగస్వామ్య ప్రధాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూవస్తున్నారు. ఈ పోర్టల్‌లో ఇతర మంత్రిత్వ శాఖలకు, సంస్థలకు, పరిశ్రమలకు, యువజన క్లబ్బులు వంటి వాటికి వివిధ భాగస్వామ్య కార్యక్రమాల నిర్వహణకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఈ పోర్టల్‌లో 1.76 కోట్లకు పైగా యువజనులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
***
(Release ID: 2154046)