భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’కు షెడ్యూలును ప్రకటించిన ఎన్నికల సంఘం

*అవసరమైతే సెప్టెంబరు 9న ఓటింగు

*ఈ నెల 21 లోగా నామినేషన్లు దాఖలు చేయొచ్చు

Posted On: 07 AUG 2025 10:35AM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’కు సంబంధించి ఈ కింద పేర్కొన్న విధంగా షెడ్యూలును ఎన్నికల సంఘం నిర్ధారించింది. వివరాలను ఈరోజు గెజిట్‌లో నోటిఫై చేసింది:-

 

 (ఏ) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21.

 

(బీ) నామినేషన్లను ఈ నెల 22న పరిశీలిస్తారు.

 

 (సీ) అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవడానికి ఆఖరు తేదీ ఈ నెల 25.

 

 (డీ) ఎన్నిక అవసరమైతే, సెప్టెంబరు 9న నిర్వహిస్తారు.

 

ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025కు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ-జనరల్ శ్రీ పి.సి. మోదీని, సహాయక రిటర్నింగ్ అధికారులుగా రాజ్యసభ సచివాలయం సంయుక్త కార్యదర్శి గరిమా జైన్‌ను, రాజ్యసభ సచివాలయం డైరెక్టరు శ్రీ విజయ్ కుమార్‌ను నియమించినట్లు గత నెల 25న విడివిడిగా జారీ చేసిన నోటిఫికేషన్లలో ఎన్నికల సంఘం తెలిపింది.

 

 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలు-1974లోని మూడో నియమంలో పేర్కొన్న ప్రకారం, రిటర్నింగ్ అధికారి ఈ రోజు ఒక పబ్లిక్ నోటీసులో ఇలా ప్రకటించారు:

 

(i) నామినేషన్ పత్రాలను అభ్యర్థి గాని, లేదా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారిలో, లేదా అభ్యర్థిత్వాన్ని బలపరిచే వారిలో ఏ ఒక్కరు గాని రిటర్నింగ్ అధికారికి రూం నెంబర్ ఆర్ఎస్-28, మొదటి అంతస్తు, పార్లమెంట్ భవనం, న్యూ ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో అందజేయాలి. రిటర్నింగ్ అధికారి తన కార్యాలయంలో లేకపోతే, సహాయక రిటర్నింగ్ అధికారులైన గరిమా జైన్, రాజ్యసభ సచివాలయం సంయుక్త కార్యదర్శికి గాని లేదా శ్రీ విజయ్ కుమార్, రాజ్యసభ సచివాలయం డైరెక్టరుకు గాని వారి కార్యాలయంలో ఈ నెల 21 లోపు ఏ రోజైనా.. (సెలవు రోజు కాని రోజుల్లో) ఉదయం 11- మధ్యాహ్నం 3 గంటల మధ్య.. నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు.

 

(ii) ప్రతి నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఓటరుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల జాబితా ధ్రువీకరించిన కాపీని జతపరచాలి. అభ్యర్థి కూడా ఒక ఓటరుగా నమోదై ఉన్నారన్న సంగతిని ఈ కాపీ తెలియజేస్తుంది.    

 

(iii) ప్రతి అభ్యర్థి రూ.15,000 జమచేయాలి. లేదా అభ్యర్థి తన తరపున మరెవరి చేతనయినా ఈ సొమ్మును జమ చేయించాలి. ఈ సొమ్మును నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి వద్ద నగదు రూపంలో జమ చేయొచ్చు. లేదా ముందుగానే భారతీయ రిజర్వు బ్యాంకులో గాని, ప్రభుత్వ ట్రెజరీలో గాని జమ చేయొచ్చు కూడా. రెండో సందర్భంలో (మరెవరి చేతనయినా జమ చేయించే పక్షంలో) , ప్రస్తావించిన సొమ్మును జమ చేసినట్లుగా తెలిపే రసీదును నామినేషన్ పత్రంతో జతపరచాలి.

 

(iv) నామినేషన్ పత్రాలను, పైన ప్రస్తావించిన కార్యాలయం నుంచి పేర్కొన్న వేళలో తీసుకోవచ్చు.

 

(v) నామినేషన్ పత్రాల పరిశీలనను.. చట్టంలోని 5బీ సెక్షన్‌, నెంబర్ 4 సబ్-సెక్షన్ల కింద తిరస్కరించినవి కాకుండా మిగతా వాటిని.. ఈ నెల 22 సోమవారం ఉదయం 11 గంటలకు న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులో రూం నెంబర్ ఎఫ్-100, సంగోష్ఠి-2లో గల కార్యాలయంలో చేపడతారు.

 

(vi) అభ్యర్థిత్వాల ఉపసంహరణ నోటీసును అభ్యర్థి గాని, లేదా అభ్యర్థి రాతపూర్వకంగా తన తరఫున ధ్రువీకరించిన తన ప్రతిపాదకులలో ఏ ఒక్కరు గాని, లేదా తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న వారిలో ఏ ఒక్కరు గాని ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల లోగా.. ఒకటో పేరాగ్రాఫులో తెలియజేసిన వారికి.. నిర్దేశించిన కార్యాలయంలో అందజేయొచ్చు.

 

(vii) ఎన్నికను నిర్వహించవలసివస్తే, నియమాలను అనుసరిస్తూ నిర్ధారించిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరు 9 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహిస్తారు.

 

ఈ నోటిఫికేషన్లతో పాటు రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పబ్లిక్ నోటీసును కూడా కలిపి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక గెజిట్లలో ప్రచురించడానికి తగిన ఏర్పాట్లు చేశారు.

 

ఎన్నికల ప్రక్రియ విషయంలో మరింత సమాచారం కోసం ‘ఉపరాష్ట్రపతి ఎన్నిక-2025’ రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి.సి. మోదీని ఆయన కార్యాలయం (రూం నెంబర్ ఆర్ఎస్ 08, గ్రౌండ్ ఫ్లోర్, పార్లమెంట్ భవనం, న్యూఢిల్లీ) లో సంప్రదించవచ్చు. అయితే ఇందుకోసం నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సూచించిన గడువు లోపల శనివారాలు సహా.. అంటే ఈ నెల 9 - 16 తేదీలు సహా.. అన్ని పనిదినాల్లోనూ మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 మధ్య సంప్రదించవచ్చు.

 

***


(Release ID: 2153966)