ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం
Posted On:
07 AUG 2025 11:09AM by PIB Hyderabad
మంత్రివర్గ సహచరుడు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్... చాలా మంది స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడున్నారు... వారందరికీ కూడా సగౌరవంగా నమస్కరిస్తున్నాను. శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!
నిర్దిష్ట కాలానికో లేదా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికో పరిమితంకాని సేవలందించిన మహనీయులు కొందరున్నారు. అలాంటి అగ్రగణ్యుడైన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్. అంకితభావం కలిగిన భరతమాత ముద్దుబిడ్డ. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజాసేవకు సాధనంగా మలచుకున్నారాయన. దేశ ఆహార భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. భారత విధానాలు, ప్రాధాన్యాలను కొన్ని శతాబ్దాల పాటు తీర్చిదిద్దగలిగేలా జాగరూకతను నింపారు.
స్వామినాథన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
నేడు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కూడా. గత పదేళ్లుగా చేనేత రంగానికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఆ రంగం మరింత బలోపేతమైంది. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, ఆ రంగంతో అనుబంధం ఉన్నవారికి శుభాకాంక్షలు.
మిత్రులారా,
డాక్టర్ స్వామినాథన్‌తో నా అనుబంధం చాలా ఏళ్ల నాటిది. గుజరాత్‌లో గతంలో పరిస్థితులెలా ఉండేవో చాలా మందికి తెలుసు. కరువులు, తుఫానుల కారణంగా అక్కడ వ్యవసాయం తరచూ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనేది. కచ్ ఎడారి క్రమంగా విస్తరిస్తూ ఉండేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ‘సాయిల్ హెల్త్ కార్డ్’ పథకంపై కృషి చేశాం. ఈ కార్యక్రమంపై ప్రొఫెసర్ స్వామినాథన్ అమితాసక్తిని చూపడం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆయన పెద్ద మనసుతో సలహాలిచ్చి మాకు మార్గనిర్దేశం చేశారు. అది విజయవంతం కావడంలో ఆయన సహకారం ఎంతగానో దోహదపడింది. దాదాపు ఇరవై ఏళ్ల కిందట తమిళనాడులోని ఆయన పరిశోధన కేంద్రాన్ని నేను సందర్శించాను. 2017లో ఆయన రాసిన ‘ది క్వెస్ట్ ఫర్ ఎ వరల్డ్ వితౌట్ హంగర్’ పుస్తకాన్ని విడుదల చేసే అవకాశం నాకు లభించింది. 2018లో వారణాసిలో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించిన సమయంలో ఆయన మార్గనిర్దేశం మరోసారి విశేషంగా ఉపయోగపడింది. ఆయనను కలిసిన ప్రతిసారీ ఏదో నేర్చుకున్న అనుభూతి కలిగేది. ‘‘విజ్ఞానమంటే కేవలం ఆవిష్కరణలే కాదు, వాటిని అందించడం’’ అని ఆయనొక సందర్భంలో వ్యాఖ్యానించారు. దానినే ఆచరించి చూపారు. ఆయన పరిశోధనకే పరిమితం కాలేదు. కొత్త వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించారు. ఆయన దృక్పథం, ఆలోచనలు భారత వ్యవసాయ రంగంలో నేటికీ కనిపిస్తాయి. నిజంగా ఆయన భరతమాతకు కీర్తి కిరీటం. డాక్టర్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేసే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
మిత్రులారా,
ఆహారోత్పత్తిలో భారత్ స్వావలంబన లక్ష్యంగా ఓ మిషన్‌ను డాక్టర్ స్వామినాథన్ ప్రారంభించారు. అయితే, ఆయన హరిత విప్లవానికి మాత్రమే పరిమితం కాలేదు. వ్యవసాయంలో పెరుగుతున్న రసాయనాల వాడకం, ఒకే పంటను సాగు చేయడం వల్ల కలిగే నష్టాలపై నిరంతరం రైతుల్లో అవగాహన పెంచారు. మరో మాటలో చెప్పాలంటే.. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి కృషి చేస్తూనే.. పర్యావరణం గురించి, భూమాత గురించి ఆలోచించారు. రెండింటి నడుమ సమన్వయం సాధించడంతోపాటు ఈ సవాళ్లను పరిష్కరించడం కోసం.. హరిత విప్లవ భావనను ఆయన పరిచయం చేశారు. గ్రామీణ ప్రజలు, రైతులను సాధికారులను చేయగల ‘బయో విలేజెస్’ భావనను ఆయన ప్రతిపాదించారు. ‘సామాజిక విత్తన బ్యాంకులు’, ‘ఆహార భద్రతను పెంపొందించే సామర్థ్యమున్న పంటలు’ వంటి అంశాలకు ఆయన ప్రాచుర్యం కల్పించారు.
మిత్రులారా,
వాతావరణ మార్పు, పోషకాహారం వంటి సవాళ్లకు పరిష్కారం మనం విస్మరించిన పంటల్లోని ఉందని డాక్టర్ స్వామినాథన్ విశ్వసించారు. కరువును, లవణీయతను తట్టుకుని నిలిచే పంటలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని సమయంలోనే ‘శ్రీ అన్న’ చిరు ధాన్యంపై ఆయన కృషిచేశారు. మడ అడవుల జన్యు లక్షణాలను వరి పంటలోకి బదిలీ చేయాలని ఏళ్ల కిందటే డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు చేశారు. తద్వారా పంటలు మరింత సమర్థంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. వాతావరణ అనుకూలత గురించి నేడు మనం మాట్లాడుతున్నాం.. ఆలోచనల్లో ఆయనెంత ముందున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.
మిత్రులారా,
నేడు జీవవైవిధ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలు జీవ వైవిధ్య సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కానీ డాక్టర్ స్వామినాథన్ ఒక అడుగు ముందుకు వేసి 'బయో హ్యాపినెస్' అనే ఆలోచనను మనకు అందించారు. ఈ రోజు దీని గురించే మనం ఇక్కడ సమావేశమయ్యాం. స్థానిక ప్రజల జీవితాల్లో గణనీయమైన పరివర్తనను తీసుకొచ్చే శక్తి జీవ వైవిధ్యానికి ఉందని, స్థానిక వనరులను ఉపయోగించడం ద్వారా కొత్త జీవనోపాధి మార్గాలను సృష్టించొచ్చని డాక్టర్ స్వామినాథన్ తెలిపారు. తన ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే స్వభావం ఆయనది. తన పరిశోధనల ద్వారా వచ్చిన కొత్త ఆవిష్కరణల ప్రయోజనాలను రైతులకు అందించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు. మన చిన్న తరహా రైతులు, మన మత్స్యకారులు, మన గిరిజన సమాజాలు.. అందరూ ఆయన చేసిన పనుల నుంచి అపారమైన ప్రయోజనం పొందారు.
మిత్రులారా,
ప్రొఫెసర్ స్వామినాథన్ వారసత్వాన్ని గౌరవించేందుకు 'ఎం.ఎస్. స్వామినాథన్ ఆహార-శాంతి అవార్డు'ను ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాను. ఆహార భద్రత విషయంలో గణనీయమైన కృషి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వ్యక్తులకు ఈ అంతర్జాతీయ అవార్డును అందజేస్తారు. ఆహారం, శాంతి.. ఈ రెండింటి మధ్య సంబంధం తాత్వికమైనది మాత్రమే కాకుండా లోతుగా ఆచరించదగినది కూడా. మన ఉపనిషత్తులలో ‘అన్నమ్ న నిద్యాత్, తద్ వ్రతం. ప్రాణో వా అన్నమ్. శరీరం అన్నదం. ప్రాణే శరీరం ప్రతిష్ఠితమ్’ అని ఉంది. అంటే అర్థం ‘ఆహారాన్ని అగౌరవించకూడదు.. ఆహారం జీవనానికి ఆధారం.’
కాబట్టి మిత్రులారా,
ఆహార సంక్షోభం తలెత్తితే, జీవన సంక్షోభం ఏర్పడుతుంది. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, ప్రపంచంలో సహజంగానే అశాంతి రేకెత్తుతుంది. అందుకే ‘ఎం.ఎస్. స్వామినాథన్ ఆహార-శాంతి అవార్డు’ అత్యంత ముఖ్యమైనది. ఈ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి, నైజీరియాకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ అడిమోల అడెనెలే...ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
నేడు భారత వ్యవసాయం గొప్ప శిఖరాలకు చేరుకుంది. డాక్టర్ స్వామినాథన్ ఎక్కడ ఉన్నా ఈ విషయంలో ఆయన గర్వపడతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేడు పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. బియ్యం, గోధుమలు, పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం కూడా మనదే. భారత్ గత సంవత్సరం తన చరిత్రలోనే అత్యధిక ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది. నూనెగింజల విషయంలో కూడా మనం కొత్త రికార్డులను సృష్టిస్తున్నాం. సోయాబీన్, ఆవాలు, వేరుశనగ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుంది.
మిత్రులారా,
మాకు మా రైతుల సంక్షేమం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. భారత్ తన రైతులు, పశు పోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీపడదు. నేను వ్యక్తిగతంగా చాలా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని నాకు పూర్తిగా తెలుసు. కానీ నేను ఇందుకు సిద్ధంగా ఉన్నాను. నా దేశ రైతులు, మత్స్యకారులు, పశు పోషకుల కోసం భారత్ ఇవాళ సిద్ధంగా ఉంది. రైతుల ఆదాయాలను పెంచడం, వారి వ్యవసాయ ఖర్చులను తగ్గించడం, కొత్త ఆదాయ వనరులను సృష్టించడం కోసం మేం నిరంతరం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
మా ప్రభుత్వం రైతుల సామర్థ్యాన్ని దేశ పురోగతికి పునాదిగా పరిగణించింది. అందుకే ఇటీవలి సంవత్సరాల్లో రూపొందించిన విధానాలు కేవలం సహాయం అందించడమే కాకుండా, రైతులలో నమ్మకాన్ని పెంపొందించడానికి కూడా కృషి చేస్తున్నాయి. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించిన ప్రత్యక్ష ఆర్థిక సహాయం చిన్న రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పంటకు సంబంధించిన ప్రమాదాల నుంచి పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రక్షణ లభించింది. నీటిపారుదల సంబంధిత సమస్యలను కృషి సించాయ్ యోజన పరిష్కరిస్తోంది. 10,000 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయటం అనేది చిన్న రైతుల సమష్టి బలాన్ని పెంచింది. సహకార సంస్థలు, స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చింది. ఇ-నామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం సులభమైంది. పీఎం కిసాన్ సంపద యోజన కొత్త ఆహార శుద్ది కేంద్రాలు, నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసింది. ఇటీవల పీఎం ధన్ ధాన్య యోజనను కూడా ఆమోదించాం. ఈ పథకం కింద వ్యవసాయంలో వెనకబడిన 100 జిల్లాలను ఎంపిక చేసి.. అక్కడ రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి,ఆర్థిక సహాయం చేయటం ద్వారా వారితో కొత్త ఆత్మవిశ్వాసం నిండుతుంది.
మిత్రులారా,
ఇరవై ఒకటో శతాబ్దికి చెందిన భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలబడడానికి పూర్తి అంకితభావంతో పనిచేస్తోంది. ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారితో పాటు ప్రతి ఒక్క వృత్తికి చెందిన వారు తలో చేయి వేస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించొచ్చు. డాక్టర్ స్వామినాథన్ అందించిన స్ఫూర్తితో, మన శాస్త్రవేత్తలు ఇప్పుడు చరిత్రను రాయడానికి మరో అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇదివరకటి తరం శాస్త్రవేత్తలు ఆహార భద్రతకు పాటుపడితే, ఇప్పుడు పోషణ విలువల విజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వచ్చింది. మనం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బయో-ఫోర్టిఫైడ్ పంటలతో పాటు పోషక విలువలు దండిగా ఉన్న పంటల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి తీరాలి. రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూ, ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాల్సిన సమయం వచ్చేసిందని కూడా మనం చాటిచెప్పాలి.
మిత్రులారా,
వాతావరణ మార్పు ఎలాంటి సవాళ్లను విసురుతున్నదీ మీకు చాలా బాగా తెలుసు. వాతావరణంలో విభిన్న స్థితులకు తట్టుకుని నిలవగలిగిన పంటలలో వీలైనన్ని ఎక్కువ రకాలను మనం కనుగొనాలి. కరవుతో పాటు ఎండ వేడిమిని భరించగల, వరదల స్థితిని ఇముడ్చుకోగల పంటలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తీరాలి. ఒక సారి వేసిన పంటను మళ్లీ వేయకుండా వేర్వేరు పంటలను వంతులవారీగా సాగు చేసే పద్ధతులపైన, ఏ నేలల్లో ఏ పంటలు బాగా పండుతాయో గ్రహించగలగడంపైన పరిశోధనలను ఇప్పటి కంటే ఎక్కువ స్థాయుల్లో చేపట్టాలి. దీంతో పాటు, భూసారాన్ని పరీక్షించడానికి తోడ్పడే సాధనాలను తక్కువ ఖర్చులో తయారుచేయగలగాలి. సరైన పోషణను ఎలా పొందవచ్చన్నది సూచించే పద్ధతుల్ని పక్కాగా రూపొందించాలి.
మిత్రులారా,
సౌర శక్తి అండగా నిలిచే సూక్ష్మ సేద్యానికి ఆదరణ లభించేలా మనం మరెంతో కృషి చేయాల్సిఉంది. బిందు సేద్య వ్యవస్థల్ని, సాగునీరు వృథా పోకుండా పంటలకు కావల్సినంత నీటిని మాత్రమే అందించే పద్ధతుల్ని సమర్థంగా, మరింత విస్తృతంగా అమలుచేయాలి. ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని, కృత్రిమ మేధని, మెషిన్ లెర్నింగ్ ను మనం కలపగలుగుతామా? పంట దిగుబడులను ముందుగా అంచనా వేసే, తెగుళ్లను పసిగట్టే, నాట్లకు మార్గదర్శకత్వాన్నందించే ఒక వ్యవస్థను మనం రూపొందించగలమా? అలాంటి వాస్తవ కాల నిర్ణయ సహాయ వ్యవస్థను ప్రతి జిల్లాకు అందుబాటులోకి తీసుకురాగలమా? మీలో ప్రతి ఒక్కరు వ్యవసాయ సాంకేతికత ప్రధాన రంగంలో పనిచేస్తున్న అంకుర సంస్థలకు ఇప్పటికే అందిస్తున్న సూచనలను, సలహాలను ఇక ముందు కూడా అందిస్తూనే ఉండాలి. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని నేటి యువత కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. మీరు మీకున్న అనుభవంతో వారికి మార్గదర్శకులుగా మారితే, వారు ఆవిష్కరించే ఉత్పత్తులు మరింత ప్రభావవంతంగా, ఉపయోగించడానికి మరింత సులభంగా ఉంటాయి.
మిత్రులారా,
మన రైతుల్లో సంప్రదాయ జ్ఞానానికి కొదవ లేదు. సాంప్రదాయక భారతీయ వ్యవసాయ పద్ధతులను ఆధునిక విజ్ఞానశాస్త్రంతో కలిపి, ఒక సంపూర్ణ జ్ఞానాన్ని ఆవిష్కరించడం సాధ్యమే. పంట మార్పడి తరహా సాగు పద్ధతికి ఇవాళ జాతీయ స్థాయిలో అగ్రతాంబూలాన్ని ఇస్తున్నారు. ఈ పద్ధతికి ఉన్న ప్రాధాన్యాన్ని మనం మన రైతులకు తప్పక వివరించాలి. దీనిలో ఉన్న లాభాలేమిటో వారికి చెప్పాలి. ఈ పద్ధతిని అనుసరించకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయో వివరించాలి. ఈ పనిలో, సత్ఫలితాలు సాధించడానికి సరిగ్గా సరిపోయే వ్యక్తులు మీరే.
మిత్రులారా,
కిందటేడాది, ఆగస్టు 11న పూసా క్యాంపసును నేను సందర్శించినప్పుడు, వ్యవసాయ సాంకేతికతను ‘ప్రయోగశాల స్థాయి నుంచి పొలాని’కి చేర్చడానికి చేస్తున్న కృషిని మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశాను. ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ను మే-జూన్ మధ్య ప్రారంభించారని తెలిసి నేను సంతోషించాను. దేశంలో 700 కన్నా ఎక్కువ జిల్లాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో మొదటిసారి సుమారు 2,200 మంది శాస్త్రవేత్తల బృందాలు పాల్గొంటున్నాయి. 60 వేల కన్నా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంత కంటే ముఖ్య విషయం.. దాదాపు 1.25 కోట్ల మంది విషయ పరిజ్ఞానమున్న రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వీలయినంత ఎక్కువ మంది రైతుల చెంతకు చేరుకోవడానికి మన సైంటిస్టులు చేస్తున్న ఇలాంటి ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.
మిత్రులారా,
వ్యవసాయం అంటే ఒక్క పంటలు పండించడానికే పరిమితం కాదు, వ్యవసాయమంటే జీవనంతో సమానం అని డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ మనకు నేర్పించారు. పొలంలో చెమటోడ్చే ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం, సాగులో పాలుపంచుకొనే ప్రతి వర్గం శ్రేయస్సు, ప్రకృతిని సంరక్షించడం.. ఇవి మా ప్రభుత్వ వ్యవసాయ విధాన రూపకల్పనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సైన్సును, సమాజాన్ని మనం ముడివేసి తీరాలి. మనం చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న రైతుల మేలుకు పెద్దపీట వేయాలి. పొలాల్లో పనిచేసే మహిళలకు సాధికారత కల్పించాలి. ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మనం ముందుకు సాగుదాం. డాక్టర్ స్వామినాథన్ అందించిన స్ఫూర్తి మనకందరికీ దారిదీపంగా ఉంటుంది.
ఈ ప్రత్యేక సందర్భం పురస్కరించుకొని మీకందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.
ధన్యవాదాలు.
***
(Release ID: 2153962)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada