సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సృజనాత్మక స్వేచ్ఛకు ఇబ్బంది ఉండదన్న ప్రభుత్వం: ఐటీ నిబంధనలు-2021, మూడంచెల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటు ద్వారా ఓటీటీల పర్యవేక్షణ
ప్రింట్, డిజిటల్, ఏవీ మాధ్యమాల ద్వారా ప్రభుత్వ నియమావళికి ప్రచారం
ఏవీజీసీ-ఎక్స్ఆర్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అభివృద్ధి కోసం అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో ప్రభుత్వ భాగస్వామ్యం
392.85 కోట్ల పెట్టుబడితో ఐఐసీటీ ఏర్పాటైన ఏవీజీసీ-ఎక్స్ఆర్ ద్వారా తదుపరితరం ప్రతిభావంతులకు శిక్షణ
Posted On:
06 AUG 2025 2:56PM by PIB Hyderabad
సృజనాత్మక స్వేచ్ఛ, ఓటీటీ నియంత్రణ:
అధికరణ 19 కింద భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా సృజనాత్మక స్వేచ్ఛకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది.
ఓటీటీ వేదికల్లో ప్రమాదకరమైన కంటెంటుతో ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడం లక్ష్యంగా.. ఐటీ చట్టం- 2000 ప్రకారం 2021 ఫిబ్రవరి 25న సమాచార సాంకేతికత (మధ్యస్థ మార్గదర్శకాలు- డిజిటల్ మీడియా, నైతిక నియమావళి) నిబంధనలు-2021ని ప్రభుత్వం ప్రకటించింది.
-
ఆ నిబంధనల్లోని విభాగం- III డిజిటల్ వార్తా ప్రచురణ కర్తలు, ఆన్ లైన్ కంటెంట్ నిర్వాహకులకు (ఓటీటీ వేదికలు) సంబంధించి నైతిక నియమావళిని వివరిస్తుంది.
-
అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిషేధించిన ఏ కంటెంటునూ ఓటీటీ వేదికలు ప్రసారం చేయకూడదు.
ఈ నిబంధనల ప్రకారం.. మూడు స్థాయుల్లో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం కింది విధంగా ఉంటుంది:
స్థాయి-I: ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ
స్థాయి-II: ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ సంస్థల ద్వారా స్వీయ నియంత్రణ
స్థాయి-III: కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ యంత్రాంగం
మంత్రిత్వ శాఖకు అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఐటీ నియమాలు-2021 ప్రకారం సంబంధిత ఓటీటీ వేదికలకు పంపుతారు.
సంబంధిత మంత్రిత్వ శాఖలతో తగిన సంప్రదింపుల అనంతరం.. అసభ్య కంటెంటును ప్రదర్శించిన 43 ఓటీటీ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
ప్రభుత్వ ప్రకటనలు:
వార్తాపత్రికలు, టీవీ/రేడియో, బహిరంగ, డిజిటల్ మీడియా మొదలైన వేదికలకు భారత ప్రభుత్వ ప్రకటనలను కేంద్ర సమాచార కార్యాలయం (సీబీసీ) జారీ చేస్తుంది.
ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి విస్తృతంగా చేరవేయడం లక్ష్యంగా ముద్రణ, దృశ్య-శ్రవణ, డిజిటల్, హోర్డింగ్స్ ద్వారా ప్రచారం- మాధ్యమాలకు సంబంధించి వివరణాత్మక విధాన మార్గదర్శకాలను జారీ చేశారు. సీబీసీ వెబ్‌సైట్ cbcindia.gov.inలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగానికి ప్రోత్సాహం:
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాలు ఇందులో ఉన్నాయి.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగాన్ని దేశ సృజన వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా భారత ప్రభుత్వం గుర్తించింది. 2022 ఏప్రిల్‌లో ఏర్పాటైన జాతీయ ఏవీజీసీ ఎక్స్ఆర్ టాస్క్‌ఫోర్స్ ఈ రంగాన్ని ప్రోత్సహించడం కోసం వ్యూహాత్మక ప్రణాళికను నిర్దేశించింది.
ఏవీజీసీ రంగం కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:
ప్రపంచ దృశ్య శ్రవణ, వినోద సదస్సు- 2025:
● మీడియా, వినోదాల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను నిలపడం లక్ష్యంగా ఈ ఏడాది మే 1 నుంచి 4 వరకు ముంబయిలో నిర్వహించారు.
● క్రియేట్ ఇన్ ఇండియా పోటీ: యానిమేషన్, గేమింగ్, ఏఆర్/వీఆర్, సంగీతం వంటి 34 సృజనాత్మక విభాగాల్లో భవిష్యత్ ప్రతిభావంతులను ప్రోత్సహించి, తీర్చిదిద్దడానికి నిర్వహించిన దేశవ్యాప్త పోటీ ఇది. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా సృజనకారులు ఇందులో నమోదు చేసుకున్నారు.
● సృజనకారులను పెట్టుబడిదారులతో అనుసంధానించేలా.. వేవ్స్ బజార్, వేవ్ఎక్స్ యాక్సిలరేటర్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అది విస్తృత స్థాయిలో మార్కెట్లను అందుబాటులోకి తేవడంతోపాటు మార్గనిర్దేశం పొందడానికి అవకాశాన్నిచ్చింది.
● కథనం, ఏఐ, ఎక్స్ఆర్, డిజిటల్ కంటెంట్ సృజనలో నిపుణులతో తరగతులను, మార్గనిర్దేశాన్ని అందించింది.
భారత సృజనాధార సాంకేతికతల సంస్థ (ఐఐసీటీ) ఏర్పాటు
సృజనాత్మక సాంకేతికతలకు సంబంధించి ప్రధాన సంస్థగా ఐఐసీటీని నెలకొల్పారు. పరిశ్రమ ఆధారిత పాఠ్యాంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్న అత్యుత్తమ పద్ధతులపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
● ఐఐసీటీ అభివృద్ధి, కార్యకలాపాల కోసం రూ.392.85 కోట్లు కేటాయించారు.
● సృజనాత్మక సాంకేతికతల కోసం ఐఐటీలు, ఐఐఎంల తరహాలో ఐఐసీటీని రూపొందించారు.
● విద్యాపరంగా సహకారం కోసం గూగుల్, మెటా, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్, డబ్ల్యూపీపీ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో ఇది అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.
● ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగాల్లోని నిపుణులు, శిక్షకులకు అడ్వాన్స్డ్ శిక్షణను ఐఐసీటీ అందిస్తుంది.
● ప్రారంభ స్థాయి కోర్సుల్లో.. గేమింగ్‌లో నాలుగు ప్రత్యేక కోర్సులు, పోస్ట్ ప్రొడక్షన్‌లో నాలుగు కోర్సులు, యానిమేషన్, కామిక్స్, ఎక్స్ఆర్‌లో తొమ్మిది కోర్సులు ఉన్నాయి.
● మరిన్ని వివరాలు https://theiict.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2153378)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam