ప్రధాన మంత్రి కార్యాలయం
కర్తవ్య భవన్‌కు 6వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
· వివిధ మంత్రిత్వ శాఖలు.. విభాగాలను ఏకతాటిపైకి తేవడం ద్వారా సామర్థ్యం.. ఆవిష్కరణలు.. సహకారానికి కర్తవ్య భవన్ ప్రోత్సాహమిస్తుంది · ఆధునిక పాలన మౌలిక సదుపాయాలకు కొత్త సౌధం నిదర్శనంగా నిలుస్తుంది · శూన్య-ద్రవ వ్యర్థ నిర్వహణ.. అంతర్గత ఘన వ్యర్థాల శుద్ధి.. రీసైకిల్ నిర్మాణ సామగ్రి విస్తృత వినియోగం వగైరాలతో ఇది పర్యావరణ చైతన్యం పెంచుతుంది · దీంతోపాటు ఇంధన పొదుపు... జల నిర్వహణపైనా దృష్టి సారిస్తుంది
Posted On:
04 AUG 2025 5:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లుండి (6వ తేదీన) మధ్యాహ్నం 12:15 గంటలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్మించిన సరికొత్త ‘కర్తవ్య భవన్’ను ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అత్యాధునిక, సమర్థ, పౌర-కేంద్రక పాలనపై ప్రధానమంత్రి దృక్కోణానుగుణ ప్రభుత్వ నిబద్ధతలో కర్వవ్య భవన్ ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది. సెంట్రల విస్టా భవన సముదాయం విస్తృత రూపాంతరీకరణలో ప్రధాని ప్రారంభించనున్న కర్తవ్య భవన్-03 ఒక అంతర్భాగం. పరిపాలన ప్రక్రియల క్రమబద్ధీకరణ, చురుకైన పాలన లక్ష్యంగా నిర్మితమవుతున్న సార్వత్రిక కేంద్ర సచివాలయ భవన సముదాయంలో ఇది మొదటిది.
విస్తృత పరిపాల సంస్కరణల కార్యక్రమానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రతీక. మంత్రిత్వ శాఖల సమన్వయం, అత్యాధునిక మౌలిక సదుపాయాల వినియోగం ద్వారా అంతర-మంత్రిత్వ సమన్వయాన్ని సార్వత్రిక కేంద్ర సచివాలయం మెరుగుపరుస్తుంది. తదనుగుణంగా విధానాల అమలు వేగవంతం కావడమేగాక స్పందనాత్మక పాలనావరణ సృష్టికి దోహదం చేస్తుంది.
ప్రస్తుతం కీలక కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అధికశాతం 1950-1970 దశకాల మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్ వంటి పాత భవనాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, ఇవి బాగా పాతబడి, శిథిలస్థితికి చేరుతున్న నేపథ్యంలో కొత్త భవన సముదాయంతో కొత్త సౌకర్యాల కల్పన, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ఉత్పాదకత, ఉద్యోగుల శ్రేయస్సు సహా అన్నిరకాల సేవల ప్రదానం మొత్తంగా మెరుగుపడుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లోగల వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కర్తవ్య భవన్-03 ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా సామర్థ్యం, ఆవిష్కరణలు, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అత్యాధునిక కార్యాలయ సముదాయం రెండు బేస్‌మెంట్లు, 7 అంతస్తులు (గ్రౌండ్ + 6)లతో దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఇందులో దేశీయాంగ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, ‘ఎంఎస్‌ఎంఈ’, ‘డీవోపీటీ’, పెట్రోలియం-సహజ వాయు మంత్రిత్వ శాఖలు-విభాగాల కార్యాలయాలు సహా ప్రధానమంత్రి ముఖ్య శాస్త్ర సలహాదారు (పీఎస్‌ఏ) కార్యాలయం ఉంటుంది.
సమాచార సాంకేతిక సదుపాయ సంసిద్ధంగా రూపొందిన ఈ సరికొత్త సౌధం సురక్షిత పని ప్రదేశాలు, గుర్తింపు కార్డు ఆధారిత ప్రవేశ-నిష్క్రమణ నియంత్రణ, సమీకృత ఎలక్ట్రానిక్ నిఘా, కేంద్రీకృత కమాండ్ వ్యవస్థ తదితర ఆధునిక పాలన మౌలిక సదుపాయాలకు ఉదాహరణగా నిలుస్తుంది. రెండుపొరల గాజుతో రూపొందించిన ప్రధాన ప్రవేశద్వారాలు, పైకప్పు సౌరవిద్యుదుత్పాదన సౌకర్యం, సోలార్ వాటర్ హీటింగ్, అధునాతన ‘హెచ్‌వీఏసీ’ (వేడి, వెలుతురు, శీతల నియంత్రణ) వ్యవస్థలే కాకుండా వర్షజల సంరక్షణతో ‘గృహ-4’ రేటింగ్ లక్ష్యంగా దీన్ని నిర్మించారు. అందువల్ల సుస్థిరత అంశంలోనూ ఈ సౌధం విశిష్టమైనది. శూన్య-ద్రవ వ్యర్థ నిర్వహణ, అంతర్గత ఘన వ్యర్థాల శుద్ధి, రీసైకిల్ నిర్మాణ సామగ్రి విస్తృత వినియోగం వగైరాలతో ఇది పర్యావరణ చైతన్యాన్ని పెంచుతుంది.
అంతేగాక శూన్య-ద్రవ వ్యర్థ ప్రాంగణంగా కర్తవ్య భవన్ నీటి అవసరాలలో అధికశాతం తీర్చడానికి మురుగునీటి శుద్ధి-పునర్వినియోగం పద్ధతిని అనుసరిస్తారు. ఈ భవనం తాపీ, పేవింగ్ బ్లాక్‌ల పనిలో రీసైకిల్ చేసిన నిర్మాణ-కూల్చివేత వ్యర్థాలను ఉపయోగించారు. ఉపరితల మట్టి వినియోగం, నిర్మాణ భారం తగ్గించేలా కార్యాలయంలో విభాగాలను తేలికైన పొడి గోడలతో రూపొందించారు. దీంతోపాటు అంతర్గత ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ దీని ప్రత్యేకత.
ఇంధన పొదుపు లక్ష్యంగా నిర్మితమైన ఈ సౌధం అవసరాలన్నీ తీరడంతోపాటు 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. భవనాన్ని చల్లగా ఉంచడానికి, వెలుపలి శబ్ద నిరోధానికి ప్రత్యేక గాజు కిటికీలు అమర్చారు. ఇంధన పొదుపు ‘ఎల్‌ఈడీ’ దీపాలు, అవసరం లేనప్పుడు వాటిని ఆపివేసే సెన్సర్లు, ఇంధన పొదుపు స్మార్ట్ లిఫ్టులు, విద్యుత్ వినియోగ నిర్వహణ కోసం అత్యాధునిక వ్యవస్థ వగైరాలన్నీ విద్యుత్ ఇతోధిక ఆదాకు తోడ్పడతాయి. కర్తవ్య భవన్-03 పైకప్పుపై అమర్చిన సోలార్ ఫలకాలు ఏటా 5.34 లక్షల యూనిట్లకుపైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. సోలార్ వాటర్ హీటర్లు రోజువారీ వేడి నీటి అవసరంలో నాలుగో శాతానికిపైగా తీరుస్తాయి. మరోవైపు ఈ ప్రాంగణంలో విద్యుత్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు.
***
(Release ID: 2152346)
|