మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ : ప్రత్యేక నమోదుల గడువు 15 వరకు పొడిగింపు
*ఈ పథకంలో ఇంతవరకు 4.05 కోట్ల మంది మహిళలకు లబ్ధి
Posted On:
04 AUG 2025 3:13PM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ (పీఎంఎంవీవై) కింద ప్రత్యేక నమోదు గడువును మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 15వరకు పొడిగించింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన కలిగించి, లబ్ధిదారులను చేర్పించేందుకు ప్రచార కార్యక్రమం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల నాయకత్వంలో కొనసాగుతోంది. అర్హత కలిగిన గర్భవతుల వద్దకు, చంటి బిడ్డలకు పాలిచ్చి సంరక్షిస్తున్న తల్లుల (పీడబ్ల్యూ-ఎల్ఎం) వద్దకు వెళ్లి వారిని సకాలంలో ఈ పథకంలో చేర్చడం ఈ స్కీము లక్ష్యం. గర్భిణులు, చంటి బిడ్డలకు పాలిచ్చే తల్లులు.. పౌష్టికాహారం తీసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందించడంతో పాటు తగిన సూచనలను, సలహాలను కోరే వారికి మార్గదర్శనం చేసి వారి ఆరోగ్యం మెరుగైన స్థితిలో ఉండేటట్లు సాయపడుతోంది. ఆడపిల్ల పుడితే, ఆ శిశువు పట్ల సానుకూల వైఖరిని పెంపొందించే విషయంలో కూడా ఈ పథకం తోడ్పడుతోంది.
తొలిచూలు కాన్పునకు ముందూ, ప్రసవం అయిన తర్వాతా తల్లులు వేతనం నష్టపోకుండా విశ్రాంతి తీసుకొనేందుకు పాక్షిక పరిహారం రూపంలో నగదు ప్రోత్సాహకాలను పీఎంఎంవీవై అందిస్తోంది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి గత నెలాఖరు వరకు మాతృత్వ లబ్ధిగా (కనీసం ఒకసారి) 4.05 కోట్ల మంది మహిళలకు రూ.19,028 కోట్లను వారి బ్యాంకు ఖాతాలలోకి లేదా పోస్టాఫీస్ అకౌంట్లలోకి నేరుగా బదిలీ చేశారు.

మిషన్ శక్తిలో భాగంగా ఉన్న ‘సామర్థ్య’ కింద కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకమే ఈ ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’. ఇది ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ (డీబీటీ) పద్ధతిలో ఆర్థికసాయాన్ని అందిస్తోంది. పీఎంఎంవీవైలో.. మొదటి బిడ్డ పుట్టిన వేళ రూ.5,000 నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడంతో పాటు, రెండో కాన్పులో ఆడ పిల్ల పుడితే ప్రసవం అయిన తరువాత ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌లో రూ.6,000 నగదు ప్రోత్సాహకాన్ని మిషన్ శక్తి స్కీము మార్గదర్శకాల ప్రకారం.. అందిస్తారు. గర్భవతులతో పాటు పాలిచ్చే తల్లులకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెరుగైన సూచనలు, సలహాలను ఇస్తూ దేశమంతటా తల్లీబిడ్డల ఆరోగ్యసంరక్షణకు అండగా నిలవాలనేదే ఈ పథకం ధ్యేయం.
ఈ పథకాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ క్షేత్ర స్థాయి కార్యకర్తలకు ఒక కొత్త ‘ప్రధానమంత్రి మాతృవందన యోజన సాఫ్ట్‌వేర్’ (PMMVYSoft)ను సమకూర్చి, అమలుచేస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను 2023 మార్చి నెలలో ప్రవేశపెట్టారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా యూఐడీఏఐ ఆధ్వర్యంలోని ‘ఆధార్’ ప్రమాణీకరణను డిజిటల్ పద్ధతిలో పూర్తి చేస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరణను కూడా పొంది నిధులను డీబీటీకి అనువైన ఆధార్‌తో లింకు ఉన్న బ్యాంకు ఖాతాలో గాని లేదా పోస్టాఫీస్ ఖాతాలో గాని నేరుగా జమ చేస్తున్నారు. ఈ పథకం కింద వివిధ సేవలు సాఫీగా లభించేలా చూడటానికి పీఎంఎంవీవై పోర్టల్‌లో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. సమీకృత ఫిర్యాదు మాడ్యూల్, అనేక భాషలలో సేవలను అందించే టోల్-ఫ్రీ పీఎంఎంవీవై హెల్ప్‌లైన్ (14408), ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్ఆర్ఎస్)ను ఉపయోగించుకుంటూ ‘ఆధార్’ ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ ప్రమాణీకరణ, అర్హులైన లబ్ధిదారుల జాబితా వంటివి ఈ సంస్కరణలలో కొన్ని.
***
(Release ID: 2152139)