సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అసత్య వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిజ నిర్ధారణ యూనిట్, పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యత: అశ్వినీ వైష్ణవ్
· పీసీఐ, ప్రోగ్రామ్ కోడ్, ఐటీ నియమాల ద్వారా ప్రభుత్వం పాత్రికేయ నియమావళిని అమలు చేస్తూ.. ముద్రణ, టీవీ, డిజిటల్ వేదికల్లో తప్పుడు, అప్రతిష్ఠ కలిగించే కంటెంట్‌ను అరికడుతోంది
· అసత్య వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తి, అనుచిత కంటెంట్‌ను ప్రసారం చేసిన 43 ఓటీటీ వేదికల బ్లాక్
Posted On:
30 JUL 2025 6:46PM by PIB Hyderabad
నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యత.
తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి చట్టపరమైన నిబంధనలు
· ముద్రణ మాధ్యమాలు: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నిర్దేశించిన ‘పాత్రికేయ ప్రవర్తనా నియమావళి’కి వార్తాపత్రికలు కట్టుబడి ఉండాలి. ఈ నిబంధనలు పలు ఇతరత్రా అంశాలతోపాటు అసత్య/అప్రతిష్ఠకు గురిచేసే/తప్పుదారి పట్టించే వార్తల ప్రచురణను నిరోధిస్తాయి. చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం.. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కౌన్సిల్ విచారణ నిర్వహిస్తుంది. సందర్భాన్ని బట్టి వార్తాపత్రిక, సంపాదకులు, జర్నలిస్టులు మొదలైన వారిని హెచ్చరించవచ్చు, మందలించవచ్చు లేదా ఆక్షేపించవచ్చు.
· టెలివిజన్ మాధ్యమాలు: కేబుల్ టెలివిజన్ నెట్‌వర్కుల (నియంత్రణ) చట్టం-1995 ప్రకారం టీవీ ఛానళ్లు కార్యక్రమ నియమావళికి కట్టుబడి ఉండాలి. పలు ఇతర అంశాలతోపాటు.. అశ్లీల, పరువు నష్టం కలిగించే, దురుద్దేశపూర్వక, తప్పుడు, పరోక్ష అన్యాపదేశ ప్రకటనలు, అర్ధ సత్యాలు ఉన్న కంటెంటును ప్రసారం చేయొద్దని ఆ చట్టం నిర్దేశిస్తుంది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్కుల (సవరణ) నియమాలు-2021 ప్రకారం.. నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి టీవీ చానెళ్లపై ఫిర్యాదులను పరిశీలించడానికి మూడంచెల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఉంటుంది. కార్యక్రమ నియమావళిని ఉల్లంఘించినట్టు తేలితే తగిన చర్యలుంటాయి.
· డిజిటల్ మాధ్యమాలు: డిజిటల్ మీడియాలో వార్తలు, వర్తమాన వ్యవహారాల ప్రచురణకర్తలకు సంబంధించి.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు, 2021 (ఐటీ నియమాలు- 2021) నైతిక నియమావళిని అందిస్తాయి.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు వార్తలను నియంత్రించడం కోసం.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం 2019 నవంబరులో ఓ నిజ నిర్ధారణ విభాగాన్ని (ఎఫ్‌సీయూ) ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలలోని ఆధీకృత ఆధారాలతో ఆ వార్తల ప్రామాణికతను ధ్రువీకరించిన అనంతరం.. ఎఫ్ఎస్‌యూ తన సోషల్ మీడియా వేదికల్లో సరైన సమాచారాన్ని అందిస్తుంది.
సమాచార చట్టం-2000లోని సెక్షన్ 69(ఎ) ప్రకారం.. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులను బ్లాక్ చేయడానికి అవసరమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేస్తుంది.
ఐటీ చట్టం- 2000 ద్వారా.. 2021 ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర నిర్దేశాలు - డిజిటల్ మీడియా, నైతిక నియమావళి) నిబంధనలు- 2021ని ప్రభుత్వం ప్రకటించింది.
· నిబంధనల్లోని విభాగం-III డిజిటల్ వార్తల ప్రచురణకర్తలు, ఆన్‌లైన్ ప్రసారం కోసం రూపొందించిన కంటెంట్ (ఓటీటీ వేదికలు) ప్రచురణకర్తల కోసం నైతిక నియమావళిని అందిస్తుంది.
· ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం నిషేధించిన ఏ కంటెంటునూ ప్రసారం చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఓటీటీ వేదికలపై ఉంది.
· నిబంధనల షెడ్యూలులో పేర్కొన్న సాధారణ మార్గదర్శకాల ఆధారంగా.. వయస్సు ప్రాతిపదికన కంటెంటుకు సంబంధించి స్వీయ వర్గీకరణను చేపట్టాల్సిన బాధ్యత ఉంది. నగ్నత్వం, లైంగికత వంటి అంశాల చిత్రణకు సంబంధించిన నిబంధనలు ఇందులో ఉన్నాయి.
· పిల్లల విషయంలో.. వయసుకు తగని కంటెంటుపై పరిమితులు విధించేందుకు తగిన జాగ్రత్తలతో కూడిన ఏర్పాట్లను చేయాల్సిన బాధ్యత ఓటీటీ వేదికలపై ఉంది. ఈ దిశగా తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా.. ఐటీ చట్టం- 2000లోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం.. చట్టవిరుద్ధమైన చర్యలు లేదా కంటెంట్ గురించి సంబంధిత ప్రభుత్వాలు ఆ మాధ్యమాలకు ఆదేశాలిచ్చి దాన్ని ప్రసారమవకుండా తొలగిస్తాయి/ నిలిపేస్తాయి.
కంటెంటు ప్రసారం విషయంలో భారత చట్టాలకు, ఐటీ నియమాలు- 2021 నిర్దేశించిన నైతిక నియమావళికి కట్టుబడి ఉండేలా చూసుకునేలా ఓటీటీ వేదికలు, స్వీయ నియంత్రణ సంస్థలకు 2025 ఫిబ్రవరి 19న ప్రభుత్వం పలు సలహాలూ సూచనలను అందించింది.
సంబంధిత మంత్రిత్వ శాఖలతో తగిన సంప్రదింపుల అనంతరం.. ఇప్పటివరకు 43 ఓటీటీ వేదికలు బ్లాక్ అయ్యాయి.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2150557)