ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
27 JUL 2025 5:15PM by PIB Hyderabad
వణక్కం చోళ మండలం,
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.
नम: शिवाय वाळघा, नादन ताळ वाळघा, इमैइ पोळुदुम्, येन नेन्जिल् नींगादान ताळ वाळघा!!
నయనార్ నాగేంద్రన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా, చుట్టూ ఉన్న వాతావరణం ఉత్తేజభరితంగా మారడాన్ని నేను గమనించాను.
మిత్రులారా,
ఓ విధంగా ఇది రాజరాజుకు పూజనీయ ప్రదేశం. ఈ పవిత్ర భూమిలో ఇళయరాజా మనందరినీ శివభక్తిలో ముంచెత్తిన తీరు, శ్రావణ మాసం, రాజరాజు ఏలిన పుణ్యభూమి, సంగీత సరస్వతి ఇళయరాజా... అద్భుత వాతావరణమిది. అత్యద్భుతమైన వాతావరణం. నేను కాశీ ఎంపీని. ఓం నమశ్శివాయ అని వినగానే నాలో ఉత్తేజం నిండుతుంది.
మిత్రులారా,
శివ దర్శనంలోని అద్భుత శక్తి, శ్రీ ఇళయరాజా సంగీతం, ఒడువర్ల పారాయణం... నిజంగా మనసును హత్తుకునే ఆధ్యాత్మిక అనుభవమిది.
మిత్రులారా,
పవిత్ర శ్రావణ మాసం, బృహదీశ్వర శివాలయ నిర్మాణం ప్రారంభమై వెయ్యేళ్లు పూర్తయిన చరిత్రాత్మక ఘట్టం.. ఇంత అద్భుతమైన సమయంలో బృహదీశ్వరుడి పాదాల చెంత ఉండి ఆయనను పూజించే భాగ్యం నాకు దక్కింది. 140 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం, దేశ నిరంతర పురోగతి కోసం ఈ చరిత్రాత్మక ఆలయంలో నేను ప్రార్థించాను. ఆ శివుడు ప్రతి ఒక్కరినీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నమఃపార్వతీ పతయే హరహర మహాదేవ!
మిత్రులారా,
నేనిక్కడికి రావడం ఆలస్యమైంది. నేనిక్కడికి ముందుగానే వచ్చాను. కానీ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అద్భుత ప్రదర్శన ఎంతో సమాచారాన్నిచ్చేదిగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. వెయ్యేళ్ల కిందటే మన పూర్వీకులు మానవ సంక్షేమానికి దిశానిర్దేశం చేసిన తీరు మనందరికీ గర్వకారణం. ఇది చాలా పెద్ద ప్రదర్శన. చాలా విస్తృతంగా, గొప్పగా దీన్ని ఏర్పాటు చేశారు. గత వారం రోజుల నుంచి వేలాదిగా ప్రజలు వచ్చి ఈ ప్రదర్శనను వీక్షిస్తున్నట్టు చెప్పారు. ఇది చూడదగినది. ఈ ప్రదర్శనను అందరూ తప్పకుండా చూడాలని నేను చెప్తాను.
మిత్రులారా,
చిన్మయ మిషన్ కృషితో ఈరోజు తమిళ గీత ఆల్బమ్‌ను ఆవిష్కరించే అవకాశమూ నాకు లభించింది. వారసత్వాన్ని పరిరక్షించుకోవాలన్న మన సంకల్పానికీ ఇది ఉత్తేజాన్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగస్వాములైన వారందరికీ నా అభినందనలు.
మిత్రులారా,
చోళ రాజులు తమ దౌత్య, వాణిజ్య సంబంధాలను శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించారు. నేను నిన్ననే మాల్దీవుల నుంచి తిరిగి వచ్చి, నేడు తమిళనాడులో ఈ కార్యక్రమంలో పాల్గొనడమూ యాదృచ్ఛికమే.
శివ భక్తులు శివుడిలో లీనమవడం ద్వారా శివుడిలానే అమరులవుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే.. ప్రత్యేకంగా శివభక్తితో ముడిపడి ఉన్న చోళుల వారసత్వం.. నేటికీ అజరామరంగా వెలుగొందుతోంది. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు.. ఈ పేర్లు భారతదేశ అస్తిత్వానికి, కీర్తికీ పర్యాయపదాలు. చోళ సామ్రాజ్య చరిత్ర, వారసత్వమూ దేశ వైభవాన్ని ఘనంగా చాటుతాయి. అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించే దిశగా పురోగమించాలన్న దేశ లక్ష్యానికి ఇదే స్ఫూర్తి. ఇదే స్ఫూర్తితో రాజేంద్ర చోళుడిని స్మరించుకుంటున్నాను. కొన్ని రోజులుగా మీరంతా ఆది తిరువతిరై పండుగను ఘనంగా చేసుకున్నారు. నేడు బృహత్తరమైన ఈ కార్యక్రమంతో అది ముగుస్తోంది. ఇందుకు సహకరించిన వారందరికీ అభినందనలు.
మిత్రులారా,
భారతదేశపు స్వర్ణయుగాలలో చోళ సామ్రాజ్యం ఒకటని చరిత్రకారులు విశ్వసిస్తారు. దాని వ్యూహాత్మక శక్తే ఆ గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రజాస్వామ్యానికి మాతృకగా దేశ సంప్రదాయాన్నీ చోళ సామ్రాజ్యం ముందుకు తీసుకెళ్లింది. చరిత్రకారులు ప్రజాస్వామ్యం పేరుతో బ్రిటన్ మాగ్నాకార్టా గురించే మాట్లాడుతారు. కానీ వందల ఏళ్ల కిందటే చోళ సామ్రాజ్యంలో కుడవోలై అమై ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా నేడు చాలా చర్చ జరుగుతోంది. మన పూర్వీకులు వాటి ప్రాధాన్యాన్ని ఎప్పుడో అర్థం చేసుకున్నారు. ఇతర ప్రదేశాలను జయించిన తర్వాత బంగారం, వెండి లేదా పశుసంపదను వెంట తెచ్చిన అనేక మంది రాజుల గురించి మనం వింటుంటాం. కానీ రాజేంద్ర చోళుడి విశిష్టత చూడండి.. ఆయన గంగా జలాలను తెచ్చాడు. రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశం నుంచి గంగాజలాన్ని తెచ్చి దక్షిణాన ప్రతిష్ఠించాడు. “गङ्गा जलमयम् जयस्तम्बम्” ఆ నీటిని చోళ గంగా యేరి (చోళ గంగా సరస్సు)లో కలిపారు. దాన్నే నేడు పొన్నేరి సరస్సుగా పిలుస్తున్నారు.
మిత్రులారా,
గంగైకొండచోళపురం ఆలయాన్ని కూడా రాజేంద్ర చోళుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం నేటికీ ప్రపంచ శిల్పకళా అద్భుతంగా నిలిచిపోయింది. కావేరి మాతకు నిలయమైన ఈ నేలన గంగా మాత పండుగను జరుపుకోవడమూ చోళ సామ్రాజ్యపు కానుకే. ఆ చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా నేడు మరోసారి కాశీ నుంచి గంగాజలాన్ని ఇక్కడికి తేవడం అమితానందాన్నిస్తోంది. ఇప్పుడే పూజ కోసం నేనిక్కడికి వెళ్లాను. సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలూ జరిగాయి. గంగాజలంతో అభిషేకం జరిగింది. నేను కాశీ ప్రజాప్రతినిధిని. గంగామాతతో నాకు అవినాభావమైన అనుబంధం ఉంది. చోళ రాజుల ఈ కృషి, వారితో ముడిపడి ఉన్న ఈ చరిత్రాత్మక ఘట్టాలు కొత్త శక్తిని, నవోత్తేజాన్ని ఇస్తాయి. ఇవి ‘ఏక భారత్, శ్రేష్టతా భారత్’ మహాయాగానికి కొత్త శక్తిని అందిస్తాయి.
సోదర సోదరీమణులారా,
సాంస్కృతిక ఏకతా సూత్రంతో చోళ రాజులు భారత్‌ను అనుసంధానించారు. చోళుల కాలం నాటి ఆదర్శాలనే నేడు మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా శతాబ్దాల నాటి ఐక్యతా బంధాలను బలోపేతం చేస్తున్నాం. తమిళనాడులోని గంగైకొండ చోళపురం వంటి పురాతన దేవాలయాలను కూడా ఏఎస్ఐ ద్వారా సంరక్షిస్తున్నాం. దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన వేళ మన శివాధీనం మఠం సాధువులు ఆ కార్యక్రమానికి ఆధ్యాత్మికంగా నేతృత్వం వహించారు. వారంతా ఇప్పుడిక్కడున్నారు. తమిళ సంస్కృతితో అనుబంధమున్న పవిత్ర సెంగోల్‌ను పార్లమెంటులో ప్రతిష్ఠించాం. నేటికీ ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతుంది.
మిత్రులారా,
నేనిప్పుడే చిదంబరం నటరాజ ఆలయంలోని కొందరు దీక్షితార్లను కలిశాను. శివుడు నటరాజ రూపంలో పూజలందుకునే ఈ దివ్య ఆలయంలోని పవిత్ర ప్రసాదాన్ని వారు నాకు అందించారు. ఈ నటరాజ రూపం మన తాత్వికతకు, వైజ్ఞానిక మూలాలకు చిహ్నం. నటరాజ స్వామి ఆనంద తాండవం చేస్తున్న ఇటువంటి శిల్పమే ఒకటి ఢిల్లీలోని భారత్ మండపంలోనూ ఉంది. మండపం అందాన్ని ఆ విగ్రహం ఇనుమడింపజేస్తోంది. జీ 20 సందర్భంగా ప్రపంచవ్యాప్త ముఖ్య నాయకులంతా ఈ మండపంలోనే సమావేశమయ్యారు.
మిత్రులారా,
భారతదేశ సంస్కృతిలో మన శైవ సంప్రదాయానిది కీలక పాత్ర. చోళ చక్రవర్తులు ఈ సంప్రదాయానికి ముఖ్య నిర్మాతలు. అందుకే, శైవ సంప్రదాయం సజీవంగా ఉన్న ప్రదేశాల్లో నేటికీ తమిళనాడుకు విశేష స్థానం ఉంది. గొప్ప నాయనార్ సాధువుల వారసత్వం, వారి భక్తి సాహిత్యం, తమిళ సాహిత్యం, పూజనీయమైన మన ఆధీనాల పాత్ర.. ఇవన్నీ సామాజిక, ఆధ్యాత్మిక రంగంలో ఓ కొత్త శకానికి నాంది పలికాయి.
మిత్రులారా,
ప్రపంచం అస్థిరత, హింస, పర్యావరణం వంటి సమస్యలతో సతమతమవుతున్న నేటి తరుణంలో శైవ సూత్రాలు మనకు పరిష్కారాలను చూపుతాయి. చూడండి, తిరుమూలార్ ఇలా రాశారు - “अन्बे शिवम्”.. అంటే ప్రేమే శివుడు. ప్రేమే శివుడు! ప్రపంచం నేడు ఈ ఆదర్శాన్ని అవలంబిస్తే అనేక సంక్షోభాలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. ‘ఒకే ప్రపంచం, ఒక కుటుంబం, ఒకే భవిత’ రూపంలో భారత్ నేడు ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్తోంది.
మిత్రులారా,
అభివృద్ధి మంత్రమూ, వారసత్వమూ.. రెండింటితోనూ భారత్ నేడు ముందుకు సాగుతోంది. నేటి భారత్ తన చరిత్ర పట్ల గర్విస్తోంది. దేశ వారసత్వ పరిరక్షణ దిశగా గత దశాబ్ద కాలంలో మేం యుద్ధప్రాతిపదికన పనిచేశాం. దొంగతనాలకు గురై, విదేశాల్లో విక్రయించిన దేశంలోని పురాతన విగ్రహాలు, కళాఖండాలను తిరిగి తీసుకొచ్చాం. 2014 నుంచి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 600కు పైగా పురాతన కళాఖండాలు, శిల్పాలు భారతదేశానికి తిరిగొచ్చాయి. ముఖ్యంగా వాటిలో 36 మన తమిళనాడుకు చెందినవే. నటరాజ, లింగోద్భవ, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వర, నందికేశ్వర, ఉమా పరమేశ్వరి, పార్వతి, సంబందార్ వంటి ఎన్నో అద్భుతమైన విగ్రహాలు నేడు ఈ నేల సౌందర్యాన్ని మరోసారి ద్విగుణీకృతం చేస్తున్నాయి.
మిత్రులారా,
మన వారసత్వమూ శైవ తాత్వికత ప్రభావమూ ఇక భారతదేశానికో లేదా ఈ భూగోళానికో మాత్రమే పరిమితం కాదు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటిదేశంగా భారత్ అవతరించిన వేళ.. చంద్రుడిపై ఆ ప్రదేశానికి శివశక్తి అని పేరుపెట్టాం. చంద్రుడిపై ఆ ముఖ్య ప్రదేశం ఇప్పుడు శివశక్తి పేరుతో ప్రసిద్ధి చెందింది.
మిత్రులారా,
చోళుల కాలంలో భారత్ సాధించిన ఆర్థిక, వ్యూహాత్మక పురోగతి నేటికీ మనకు ప్రేరణగా నిలుస్తోంది. రాజరాజ చోళుడు శక్తిమంతమైన నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. రాజేంద్ర చోళుడు దానిని మరింత బలోపేతం చేశాడు. ఆయన కాలంలో అనేక పరిపాలన సంస్కరణలు కూడా జరిగాయి. స్థానిక పరిపాలన వ్యవస్థను బలోపేతం చేశాడు. బలమైన రెవెన్యూ వ్యవస్థను అమలు చేశాడు. వాణిజ్యాభివృద్ధి, సముద్ర మార్గాల వినియోగం, కళలు - సంస్కృతిని ప్రోత్సహించి వ్యాప్తి చేయడం ద్వారా సర్వత్రా భారత్ వేగంగా పురోగమించింది.
మిత్రులారా,
చోళ సామ్రాజ్యం నవ భారత సృష్టికి ప్రాచీనన మార్గదర్శి లాంటిది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మనం ఐక్యతకు ప్రాధాన్యమివ్వాలని చెప్తోంది. మన నౌకాదళాన్ని, మన రక్షణ దళాలను బలోపేతం చేసుకోవాలి. కొత్త అవకాశాలను అన్వేషించాలి. వీటన్నిటితోపాటు మన విలువలనూ కాపాడుకోవాలి. దేశం నేడు ఈ స్ఫూర్తితో ముందుకు సాగుతుండడం సంతృప్తినిస్తోంది.
మిత్రులారా,
నేటి భారత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. దేశ భద్రత, సార్వభౌమాధికారంపై ఎవరైనా దాడి చేస్తే భారత్ ఎలా తిప్పికొడుతుందో ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతా చూసింది. భారత్ శత్రువులకు, ఉగ్రవాదులకు ఏ ప్రదేశమూ సురక్షితం కాదని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. ఈరోజు నేను హెలిప్యాడ్ నుండి 3-4 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి వస్తున్న సమయంలో.. ప్రజలంతా ఓ పెద్ద రోడ్ షోగా ఏర్పడి, అందరూ ఆపరేషన్ సిందూర్‌ను కీర్తించడాన్ని చూశాను. ఆపరేషన్ సిందూర్ దేశంలో నవ చైతన్యాన్ని మేల్కొలిపింది. సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. భారత శక్తిని ప్రపంచం అంగీకరించేలా చేసింది.
మిత్రులారా,
రాజేంద్ర చోళుడు గంగై కొండచోళపురం నిర్మించినప్పుడు దాని శిఖరాన్ని తంజావూరులోని బృహదీశ్వరాలయం కన్నా చిన్నగా నిర్మించాడని మనందరికీ తెలుసు. తన తండ్రి నిర్మించిన ఆలయం అత్యున్నతమైనదిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఘనతను చాటడంలోనూ రాజేంద్ర చోళుడు వినయాన్ని ప్రదర్శించాడు. నేటి నవ భారత్ ఇదే స్ఫూర్తితో పురోగమిస్తోంది. మనం నిరంతరం బలోపేతమవుతున్నాం. ప్రపంచ సోదరభావమూ ప్రపంచ సంక్షేమమే మనకు స్ఫూర్తి.
మిత్రులారా,
నా ఘనమైన వారసత్వ కీర్తిని ముందుకు తీసుకెళ్లేలా.. ఈరోజు నేనిక్కడ మరో ప్రతిజ్ఞ చేస్తున్నాను. భవిష్యత్తులో రాజరాజ చోళుడు, ఆయన కుమారుడూ గొప్ప పాలకుడూ అయిన మొదటి రాజేంద్ర చోళుడి భారీ విగ్రహాలను తమిళనాడులో మేం ప్రతిష్ఠిస్తాం. ఈ విగ్రహాలు మన చారిత్రక స్పృహకు ఆధునిక మూలాధారాలుగా నిలుస్తాయి.
మిత్రులారా,
ఈరోజు డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలాం గారి పుణ్యతిథి కూడా. అభివృద్ధి చెందిన భారత్ సాకారం కావాలంటే.. డాక్టర్ కలాం, చోళరాజుల వంటి లక్షలాది యువత మనకు అవసరం. శక్తీ, దేశభక్తి కలిగిన అలాంటి యువత 140 కోట్ల దేశ ప్రజల కలలు నెరవేరుస్తారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ సంకల్పాన్ని మనమంతా సమష్టిగా ముందుకు తీసుకెళ్దాం. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
నాతో కలిసి నినదించండి...
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
వణక్కం.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన అనువాదమిది. అసలు ప్రసంగం హిందీలో చేశారు.
***
(Release ID: 2149552)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam