ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిటన్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం
Posted On:
24 JUL 2025 5:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి స్టార్మర్,
స్నేహితులారా,
నమస్కారం!
ముందుగా, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి స్టార్మర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తర్వాత మన రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఈ రోజు ఖరారైనందుకు సంతోషిస్తున్నాను.
ఈ ఒప్పందం ఆర్థిక భాగస్వామ్యానికే పరిమితం కాలేదు. ఇది ఉమ్మడి సంక్షేమానికి ప్రణాళిక. ఓ వైపు భారతీయ జౌళి, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకేలో మెరుగైన మార్కెట్ లభిస్తుంది. ఇది భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార శుద్ధి పరిశ్రమకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ప్రత్యేకించి భారతీయ యువత, రైతులు, మత్స్యకారులు, ఎంఎస్ఎంఈ రంగానికి ఈ ఒప్పందం లబ్ధి చేకూరుస్తుంది.
మరోవైపు, యూకేలో తయారైన వైద్య పరికరాలు, ఏరోస్పేస్ విడిభాగాలు లాంటి ఉత్పత్తులు భారత వినియోగదారులకు, పరిశ్రమలకు చౌకగా అందుబాటులోకి వస్తాయి.
వాణిజ్య ఒప్పందంతో పాటుగా, డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌పై కూడా ఏకాభిప్రాయం కుదిరింది. ఇది రెండు దేశాల్లోని సేవా రంగాల్లో ముఖ్యంగా సాంకేతిక, ఆర్థిక రంగాల్లో కొత్త ఒరవడిని తీసుకువస్తుంది. అలాగే సులభతర వాణిజ్య విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నిర్వహణ వ్యయాలను తగ్గిస్తుంది. వ్యాపార నిర్వహణలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వీటికి అదనంగా నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభ అందుబాటులోకి రావడం ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది.
ఈ ఒప్పందాలు రెండు దేశాల్లోనూ ద్వైపాక్షిక పెట్టుబడులను పెంపొందించి నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. అలాగే, రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందాలు.. అంతర్జాతీయ స్థిరత్వాన్ని, ఉమ్మడి సంక్షేమాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయి.
స్నేహితులారా,
వచ్చే దశాబ్దంలో మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త వేగాన్ని, శక్తిని అందించడానికి విజన్ 2035ను ప్రారంభించనున్నాం. సాంకేతికత, రక్షణ, పర్యావరణం, విద్య, ప్రజా సంబంధాల్లో దృఢమైన, నమ్మకమైన, లక్ష్యంతో కూడిన భాగస్వామ్యానికి ప్రణాళికగా ఈ దార్శనికత పనిచేస్తుంది.
రక్షణ, భద్రతలో మా భాగస్వామ్యాన్ని పెంపొందించే రక్షణ పారిశ్రామిక ప్రణాళిక తయారైంది. మా సాంకేతిక భద్రతా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి సైతం మేం కృషి చేస్తాం.
ఏఐ నుంచి కీలక ఖనిజాల వరకు, సెమీకండక్టర్ల నుంచి సైబర్ భద్రత వరకు కలసి భవిష్యత్తును నిర్మించుకొనేందుకు నిబద్ధతతో ఉన్నాం.
స్నేహితులారా,
విద్యారంగంలో నూతన అధ్యాయాన్ని మా రెండు దేశాలు లిఖిస్తున్నాయి. యూకేకు చెందిన ఆరు విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ప్రారంభిస్తున్నాయి. గత వారమే భారత్‌లోని గురుగ్రాంలో సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌ను ప్రారంభించింది.
స్నేహితులారా,
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని స్టార్మర్, ఆయన ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించే పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదనే విషయంలో మేం ఏకాభిప్రాయంతో ఉన్నాం. ప్రజాస్వామ్య స్వేచ్ఛను అతివాద భావజాల శక్తులు దుర్వినియోగం చేయకుండా నిలువరించాలని మేం అంగీకరించాం.
స్వేచ్ఛను దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూసేవారిని జవాబుదారీగా చేయాలి.
ఆర్థిక నేరస్తుల అప్పగింత విషయంలో సైతం పరస్పర సహకారం, సమన్వయంతో మా సంస్థలు పని చేస్తాయి.
స్నేహితులారా,
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి-స్థిరత్వం, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, పశ్చిమాసియాలో పరిస్థితి గురించి మా అభిప్రాయాలను పంచుకుంటాం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు మేం సహకరిస్తాం. అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం అవసరం. ప్రస్తుత యుగం అభివృద్ధిని ఆశిస్తోంది కానీ విస్తరణవాదాన్ని కాదు.
స్నేహితులారా,
గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో యూకేకి చెందిన సోదర సోదరీమణులు కూడా ఉన్నారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.
యూకేలో నివసిస్తున్న భారతీయ సంతతి ప్రజలు మన స్నేహానికి సజీవ వారధిలా పనిచేస్తున్నారు. వారు భారత్ నుంచి కూరను మాత్రమే కాదు.. సృజనాత్మకత, అంకితభావం, వ్యక్తిత్వాన్ని కూడా వెంట తీసుకువచ్చారు. యూకే ఆర్థిక వ్యవస్థకు మాత్రమే వారు అందిస్తున్న సహకారం పరిమితమైపోలేదు. ఈ దేశ సంస్కృతి, క్రీడలు, పౌరసేవలో సైతం కనిపిస్తోంది.
స్నేహితులారా,
భారత్, యూకే ఒక్కచోట ఉన్నప్పుడు ముఖ్యంగా టెస్ట్ సిరీస్ సమయంలో క్రికెట్ గురించి ప్రస్తావించాలి. మన రెండు దేశాలకి క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు.. అది ఓ అభిరుచి. అలాగే మన భాగస్వామ్యానికి ఉత్ప్రేరకం లాంటిది. కొన్నిసార్లు స్వింగ్ ఉండొచ్చు మిస్ అవ్వొచ్చు. కానీ ఎల్లప్పుడూ మేం స్ట్రెయిట్ బ్యాట్‌తో ఆడతాం. మేం అధిక స్కోరుతో కూడిన దృఢమైన భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాం.
విజన్ 2035తో సహా ఈ రోజు ఖరారైన ఒప్పందాలు ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విజయాలు.
ప్రధానీ,
మీ ఆత్మీయ ఆతిథ్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారత్‌ను సందర్శించాలని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. భారత్‌లో మీకు ఆతిథ్యమిచ్చేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన పత్రికా ప్రకటనకు ఇది తెలుగు అనువాదం
***
(Release ID: 2148127)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam