ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
* ప్రస్తుతం ప్రపంచమంతా వికసిత్ భారత్ సంకల్పం గురించే చర్చ మౌలిక వసతుల్లో మార్పునకు ప్రతిబింబం ఈ పునాదులపైనే అభివృద్ధి చెందిన భారత్: పీఎం
* ఒకటే దేశం, ఒకటే గ్యాస్ గ్రిడ్ లక్ష్యం ఆధారంగా పనిచేశాం... ప్రధానమంత్రి ఊర్జా గంగా పరియోజనను రూపొందించాం: పీఎం
* 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చేయాలి... మన మార్గం అభివృద్ధి ద్వారా సాధికారత, స్పందన ద్వారా సుపరిపాలన: పీఎం
Posted On:
18 JUL 2025 5:10PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయగా, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన దుర్గాపూర్, భారతీయ శ్రామిక శక్తికి కూడా ఒక ప్రధాన కేంద్రమని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధికి ఈ నగరం అందిస్తున్న గణనీయమైన సహకారాన్ని గుర్తిస్తూ.. దాని సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఈ రోజు లభించిందన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాయని, గ్యాస్ ఆధారిత రవాణాను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తాయని, ఉక్కు నగరంగా దుర్గాపూర్ గుర్తింపును పెంపొందిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ‘‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’’ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని, పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తోడ్పడతాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో యువతకు లెక్కలేనన్ని నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత్ సంకల్పం గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో కొనసాగుతున్న విప్లవాత్మకమైన మార్పులే దీనికి కారణమని, ఇవి అభివృద్ధి చెందిన భారత్‌కు పునాది వేస్తున్నాయని తెలిపారు. ఈ మార్పుల్లో కీలకమైన అంశం సామాజిక, భౌతిక, డిజిటల్ సహా మౌలిక సదుపాయాలే అని స్పష్టం చేశారు. అలాగే ప్రధానమైన విజయాలను శ్రీ మోదీ ప్రస్తావించారు: అవి పేదలకు 4 కోట్ల పక్కా ఇళ్లు, కోట్లాది టాయిలెట్లు, 12 కోట్లకు పైగా కుళాయి కనెక్షన్లు, వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు, జాతీయ రహదారులు, నూతన రైల్వే లైన్లు, చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి విస్తృత ఇంటర్నెట్ సౌకర్యం. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు పశ్చిమ బెంగాల్‌తో సహా ప్రతి రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్నాయని స్పష్టం చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో రైల్వే అనుసంధానంలో సాధిస్తున్న గణనీయమైన పురోగతిని గురించి చర్చిస్తూ.. ఎక్కువ సంఖ్యలో వందే భారత్ రైళ్లు నడుస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటని అన్నారు. వేగంగా కొనసాగుతున్న కోల్‌కతా మెట్రో విస్తరణ, కొత్త రైలు మార్గాలు, ట్రాక్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను ఆయన ప్రస్తావించారు. అనేక రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని, పెద్ద సంఖ్యలో రైలు ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ బెంగాల్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని తెలిపారు.
ఈ ప్రాంతంలోని విమానాశ్రయం ఉడాన్ పథకంతో అనుసంధామై ఉందని, గతేడాది 5 లక్షలకు పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఆయన వెల్లడించారు. ఈ తరహా మౌలిక వసతులు సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా.. వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయనీ, ఈ తరహా ప్రాజెక్టుల్లో ఉపయోగించే ముడి పదార్థాల ఉత్పత్తి సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
గడచిన 10-11 ఏళ్లలో గ్యాస్ అనుసంధానంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని, ఈ దశాబ్దంలో దేశవ్యాప్తంగా ఉన్న గృహాలకు ఎల్పీజీ చేరుకుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ప్రపంచ గుర్తింపు సాధించిందని అన్నారు. ‘ఒకే దేశం, ఒకే గ్యాస్ గ్రిడ్’ లక్ష్యం దిశగా ప్రభుత్వం చేస్తున్న పనిని, ప్రధానమంత్రి ఊర్జా గంగా యోజన ప్రారంభం గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పశ్చిమ బెంగాల్‌తో సహా ఆరు తూర్పు రాష్ట్రాల్లో గ్యాస్ పైప్ లైన్లు వేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లోని పరిశ్రమలు, పాకశాలలకు అందుబాటు ధరలకే పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే గ్యాస్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాహనాలు సీఎన్‌జీతో నడపడానికి, పరిశ్రమలు గ్యాస్ ఆధారిత సాంకేతికతలను స్వీకరించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలియజేశారు. దుర్గాపూర్ పారిశ్రామిక ప్రాంతం జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగం కావడం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందని, పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 30 లక్షల గృహాలకు చౌకగా పైపు ద్వారా గ్యాస్ సరఫరా అవుతుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది లక్షలాది మంది కుటుంబాలను ముఖ్యంగా మాతృమూర్తులు, సోదరీమణుల జీవితాలను సులభతరం చేస్తుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలియజేశారు.
దుర్గాపూర్, రఘునాథపూర్లో ప్రధాన స్టీలు ప్లాంట్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ సౌకర్యాల్లో సుమారుగా రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ ప్లాంట్లు ఇప్పుడు మరింత బలోపేతమై, అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బెంగాల్ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత్‌లోని కర్మాగారాలు లేదా సంబంధిత రంగాల్లో చేపట్టే ప్రతి ప్రయత్నం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళుతుందని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి ద్వారా సాధికారత, ఉపాధి ద్వారా స్వావలంబన, స్పందన ద్వారా సుపరిపాలన ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ విలువలను నిలబెట్టుకోవడం ద్వారా భారత అభివృద్ధి ప్రయాణానికి బలమైన ఇంజిన్‌గా పశ్చిమ బెంగాల్ మారుతుందని శ్రీ మోదీ తెలియజేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరీ, శ్రీ శంతను ఠాకూర్, డాక్టర్ సుకాంత మజుందార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
చమురు, సహజవాయు, విద్యుత్, రోడ్లు, రైలు రంగాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతోపాటు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగు పరిచే దిశగా పశ్చిమ బెంగాల్లోని బంకురా, పురూలియా జిల్లాలో రూ.1,950 కోట్ల విలువైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీీసీఎల్) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది గృహాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్లను, రిటైల్ అవుట్‌లెట్లలో సీఎన్‌జీని అందిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది.
దుర్గాపూర్-హల్దియా సహజవాయు పైప్‌లైన్లో భాగమైన దుర్గాపూర్ నుంచి కోలకతా సెక్షన్ (132 కి.మీ.)ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఇది ప్రధానమంత్రి ఊర్జా గంగా (పీఎంయూజీ) ప్రాజెక్టుగా పిలిచే ప్రతిష్ఠాత్మక జగదీష్‌పూర్-హల్దియా, బొకారో-ధామ్రా పైప్‌లైన్లో భాగం. దుర్గాపూర్ నుంచి కోల్ కతా వరకు ఉన్న ఈ సెక్షన్ విలువ రూ.1,190 కోట్లకు పైమాటే. ఇది పశ్చిమ బెంగాల్లోని పూర్వ వర్థమాన్, హుగ్లీ, నదియా జిల్లాల గుండా వెళుతుంది. ఈ పైప్‌లైన్ నిర్మాణ దశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఈ ప్రాంతంలోని లక్షలాది గృహాలకు సహజవాయువు సరఫరాను సులభతరం చేస్తుంది.
అందరికీ స్వచ్ఛమైన గాలి, ఆరోగ్య భద్రత అందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా,రూ. 1,457 కోట్లకు పైగా వ్యయంతో దుర్గాపూర్ స్టీల్ థర్మల్ పవర్ స్టేషన్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భాగమైన రఘునాథ్ పూర్ థర్మల్ పవర్ స్టేషన్‌కు చెందిన రెట్రోఫిట్టింగ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ - ఫ్లూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ)ను జాతికి అంకితం చేశారు. ఇది స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడటం, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేలా రూ. 390 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పురూలియా-కోట్శిలా డబ్లింగ్ రైల్ లైన్ (36 కి.మీ.)ను పురూలియాలో జాతికి అంకితం చేశారు. ఇది జంషెడ్ పూర్, బొకారో, ధన్‌బాద్ నుంచి రాంచీ, కోల్‌కతా వరకు పరిశ్రమల మధ్య రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తుంది. గూడ్స్ రైళ్ల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. పరిశ్రమలు, వ్యాపారాలకు సరకు రవాణాను మెరుగుపరుస్తుంది.
సేతు భారతం కార్యక్రమం కింద రూ. 380 కోట్లకు పైగా నిధులతో పశ్చిమ్ బర్దమాన్ లోని తోప్సి, పందబేశ్వర్ లో నిర్మించిన రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇది రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు.. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాలను నివారిస్తుంది.
***
(Release ID: 2146101)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam