ఆర్థిక మంత్రిత్వ శాఖ
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడి నుంచి రూ. 40 కోట్ల విలువైన 4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ... ఒకరి అరెస్టు
Posted On:
19 JUL 2025 10:45AM by PIB Hyderabad
విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బెంగళూరు జోనల్ యూనిట్ అధికారులు ఈనెల 18న తెల్లవారుజామున దోహా నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని తనిఖీ చేశారు.
అతని లగేజీని జాగ్రత్తగా పరిశీలించగా, ఆ ప్రయాణికుడు అసాధారణ బరువు గల రెండు సూపర్ హీరో కామిక్స్ పుస్తకాలను తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పుస్తకాల అట్టల్లో దాచిన తెల్లటి పొడిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ పొడిలో కొకైన్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. 4,006 గ్రాముల (4 కిలోల కంటే ఎక్కువ) బరువు, అంతర్జాతీయ మార్కెట్ విలువ దాదాపు రూ. 40 కోట్లుగా ఉన్న ఆ కొకైన్‌ను ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఈనెల 18న ఎన్‌డీపీఎస్ చట్టం-1985 నిబంధనల కింద ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
***
(Release ID: 2146099)