రైల్వే మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలోని ఘన్సోలీ- షిల్ఫాటా బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. 21 కి.మీ సముద్రగర్భ సొరంగం మొదటి భాగం ప్రారంభం
భారత్ - జపాన్ భాగస్వామ్యంతో ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కోసం తదుపరి తరం ఈ10 షింకన్‌సెన్ రైళ్లు
భారత్, జపాన్‌లలో ఏకకాలంలో షింకన్‌సెన్
షింకన్‌సెన్ సాంకేతికతతో 508 కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్.. వేగం, భద్రత, విశ్వసనీయతకు ఇది మార్గదర్శకం
Posted On:
14 JUL 2025 4:02PM by PIB Hyderabad
బీకేసీ - థానే మధ్య 21 కి.మీ.ల సముద్రగర్భ సొరంగం మొదటి విభాగం ప్రారంభించడం ద్వారా, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కీలక మైలురాయిని సాధించింది. ఇటీవల 310 కిలోమీటర్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా బుల్లెట్ రైలు ప్రాజెక్టు కీలక దశకు చేరింది. రైల్వే ట్రాకులు వేయడం, ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు, స్టేషన్లు, వంతెనల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మహారాష్ట్రలో కూడా నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు నిర్మాణ కార్యకలాపాలు, నియంత్రణ కోసం అవసరమైన సామగ్రి సేకరణ కూడా సజావుగా సాగుతోంది.


గూడ్సు బళ్ళు: జపాన్ షింకన్‌సెన్ ప్రస్తుతం ఈ5 రైళ్లను నడుపుతోంది. తదుపరి తరం రైళ్లు ఈ10. జపాన్, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో.. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఈ10 షింకన్‌సెన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి జపాన్ ప్రభుత్వం అంగీకరించింది. భారత్, జపాన్‌లలో ఈ10ను ఒకేసారి ప్రవేశపెట్టడం గమనార్హం.
జపాన్ సాంకేతికత: మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్‌ను జపాన్ షింకన్‌సెన్ సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ఇది వేగం, భద్రత, విశ్వసనీయతల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పబోతోంది. భారత్ - జపాన్ మధ్య విస్తృతమైన వ్యూహాత్మక, సాంకేతిక సహకారాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
శరవేగంగా నిర్మాణం: సివిల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 310 కిలోమీటర్ల వంతెనను నిర్మించారు. 15 నదీ వంతెనలు పూర్తవగా, మరో నాలుగు నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. 12 స్టేషన్లలో 5 పూర్తవగా, మరో 3 స్టేషన్లు తుది దశకు చేరుకున్నాయి. బీకేసీలోని స్టేషన్ ఓ ఇంజినీరింగ్ అద్భుతం. ఈ స్టేషను భూమికి 32.5 మీటర్ల లోతులో ఉంటుంది. భూమికి ఎగువన 95 మీటర్ల ఎత్తైన భవన నిర్మాణానికి తోడ్పడేలా పునాదిని ఏర్పాటు చేశారు.


భవిష్యత్తులో మరిన్ని కారిడార్లకు పునాది: ముంబయి - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు విజయం దేశంలో భవిష్యత్తులో మరిన్ని బుల్లెట్ రైలు కారిడార్లకు పునాదిగా నిలుస్తోంది. భవిష్యత్తులో నిర్మించతలపెట్టిన కారిడార్లనూ పరిశీలిస్తున్నారు.
అభివృద్ధిలో ఈ అద్భుత వేగం.. అత్యాధునిక అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ సమర్థతను చాటుతుంది. ఈ పయనంలో విశ్వసనీయ భాగస్వామిగా జపాన్ కీలక పాత్ర పోషిస్తోంది.
***
(Release ID: 2144722)