ప్రధాన మంత్రి కార్యాలయం
యునెస్కో వారసత్వ జాబితాలో భారత మరాఠా సైనిక స్థావరాలకు చోటు కల్పించడంపై ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
12 JUL 2025 9:23AM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారత 44వ వారసత్వ ప్రదేశంగా ‘మరాఠా సైనిక స్థావరాల’కు స్థానం లభించడం దేశానికి గర్వకారణంగా అభివర్ణిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనలేని సంతోషం వెలిబుచ్చారు.
ఈ వారసత్వ శాసన ప్రకటనలో 12 దుర్గాలకు గౌరవం లభించగా, వీటిలో 11 మహారాష్ట్రలోనూ, 1 తమిళనాడులోనూ ఉన్నాయి.
ఈ సందర్భంగా దేశంలో మరాఠా సామ్రాజ్య ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “ఉజ్వల మరాఠా సామ్రాజ్యం గురించి మనం మాట్లాడేటపుడు ఆనాటి సుపరిపాలన, సైనిక శక్తి, సాంస్కృతిక ప్రతిష్ఠ, సామాజిక సంక్షేమ ప్రాధాన్యాలను కూడా గుర్తు చేసుకుంటాం. ఎలాంటి అన్యాయాన్నీ సహించని ఔన్నత్యంగల పాలకులు మనకెంతో స్ఫూర్తినిస్తారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మరాఠా సామ్రాజ్యం గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే ఈ కోటలను తప్పక సందర్శించాలని ఆయన ప్రజలకు సూచించారు.
రాయ్‌గఢ్ కోటను 2014లో సందర్శించిన సందర్భంగా అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి తాను నివాళి అర్పించిన ఫొటో ప్రస్తావన సహా మరికొన్ని జ్ఞాపకాలను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో యునెస్కో గుర్తింపుపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వచ్చిన పోస్టుపై స్పందిస్తూ-
“ఈ గుర్తింపుపై భారతీయులందరూ ఉప్పొంగిపోతున్నారు. మహారాష్ట్రలోని 11, తమిళనాడులోని ఒక దుర్గం ఈ జాబితాలో ఉన్నాయి. ఉజ్వల మరాఠా సామ్రాజ్యం గురించి మాట్లాడేటపుడు ఆనాటి సుపరిపాలన, సైనిక శక్తి, సాంస్కృతిక ప్రతిష్ఠ, సామాజిక సంక్షేమ ప్రాధాన్యాలను కూడా మనం గుర్తు చేసుకుంటాం. ఎలాంటి అన్యాయాన్నీ సహించని ఔన్నత్యంగల పాలకులు మనకెంతో స్ఫూర్తినిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కోటలను సందర్శించి మరాఠా సామ్రాజ్యం ఘన చరిత్ర గురించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.
ఈ నేపథ్యంలో నేను 2014లో రాయ్‌గఢ్ కోట సందర్శన చిత్రాలను మీతో పంచుకుంటున్నాను. అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు నమస్కరించే అవకాశం నాకు దక్కింది. అందువల్ల ఆ ఘట్టం సదా నా మదిలో మెదలుతూనే ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2144243)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam