ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘రోజ్‌గార్ మేళా’.. ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51,000 కు పైగా యువతీ యువకులకు నియామక పత్రాలు


రేపు ప్రదానం చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 11 JUL 2025 11:20AM by PIB Hyderabad

ప్రభుత్వంలో వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51,000 కు పైగా యువతీయువకులకు నియామక పత్రాలను ఈ నెల 12న ఉదయం  11 గంటల వేళలో వీడియో  అనుసంధానం ద్వారా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఈ  సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ఉపాధికల్పనకు అమిత ప్రాధాన్యాన్ని ఇస్తామన్న ప్రధానమంత్రి వాగ్దానాన్ని నెరవేర్చే బాటలో ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముందడుగు. యువతకు బతుకుదెరువును చూపించి వారికి సాధికారతను కల్పించడంతో పాటు, దేశ నిర్మాణంలో వారు పాలుపంచుకొనేందుకు చక్కని అవకాశాలను ఇవ్వడంలో ‘రోజ్‌గార్ మేళా’ది ఒక ముఖ్య పాత్ర. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చిన ‘రోజ్‌గార్ మేళా’లలో 10 లక్షలకు పైగా నియామక పత్రాలను అందజేశారు.

పదహారో ‘రోజ్‌గార్ మేళా’ను దేశవ్యాప్తంగా 47 చోట్ల నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఈ  ఉద్యోగ భర్తీ  కార్యక్రమం చోటుచేసుకొంటోంది. కొత్తగా ఉద్యోగాల్లో నియామక ప్రక్రియ పూర్తి అయిన వారు రైల్వే శాఖ, హోం  శాఖ, తపాలా విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక, ఉపాధికల్పన  శాఖలతో పాటు ఇతర  మంత్రిత్వ శాఖల్లోనూ, విభాగాల్లోనూ చేరనున్నారు.  


 

***


(Release ID: 2143991) Visitor Counter : 2