ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంయుక్త ప్రకటన: ఉన్నత లక్ష్యాలు కలిగిన రెండు గొప్ప దేశాలు.. భారత్, బ్రెజిల్

Posted On: 09 JUL 2025 5:55AM by PIB Hyderabad

బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మంగళవారం (2025 జులై 8న) బ్రెజిల్‌కు ఆధికారిక పర్యటనకు విచ్చేశారు. ఇది దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి బ్రెజిల్ - ఇండియాల మధ్య మైత్రి, పరస్పర విశ్వాస భావనలను ప్రతిబింబిస్తోంది. ఈ స్నేహ బంధాన్ని 2006లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించారు.

 నేతలు ఇద్దరూ ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ప్రపంచ అంశాలపై తమ తమ ఆలోచనలను తెలియజేసుకొన్నారు. భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలన్న తమ సంకల్పాన్ని వారు ఉభయులూ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యవహారాల్లో తమ రెండు దేశాలు వాటి నిర్దిష్ట భూమికలను కొనసాగిస్తూ, ఉమ్మడి విలువలను పరిరక్షిస్తూ, ఉన్నత లక్ష్యాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకొంటూనే తమ తమ దేశ ప్రజలకు శాంతి, సమృద్ధిలతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి కోసం కృషిచేయాలని కూడా నేతలు అనుకున్నారు.

భారత్, బ్రెజిల్‌ల మధ్య దృఢమైన ఆర్థిక, సాంకేతిక పూరకాలను ఆధారంగా చేసుకొని, రాబోయే పదేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను ఇప్పటి కంటే మరింత బలోపేతం చేసుకోవడానికి అయిదు ముఖ్య విషయాలు ఆలంబనగా ఉండే ఒక వ్యూహాత్మక మార్గసూచీని రూపొందించాలని నేతలు నిర్ణయించారు: ఆ అయిదు కీలకాంశాల్లో..  

1. రక్షణతో పాటు భద్రత,

2. ఆహారం, పోషణ సంబంధ సురక్ష,

3. కొత్త రకాల ఇంధనాల వినియోగం వైపు మళ్లడం, వాతావరణ మార్పు,

4. డిజిటల్ మార్పును పెద్ద ఎత్తున ఆవిష్కరించడంతో పాటు సరికొత్త టెక్నాలజీలను ప్రోత్సహించడం,

5. వ్యూహాత్మక రంగాల్లో పారిశ్రామిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడం..

పైన ప్రస్తావించిన అయిదు ముఖ్య అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్ఠపరుచుకొనే దిశగా కలిసి పనిచేయాల్సిందంటూ నేతలు తమ తమ సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. చోటు చేసుకొనే పురోగతిని గురించి బ్రెజిల్-భారత్ సంయుక్త సంఘానికి (బ్రెజిల్-ఇండియా జాయింట్ కమిషన్‌) దృష్టికి తీసుకురావాలని కూడా వారు ప్రభుత్వ ఏజెన్సీలకు సూచించారు.

1. రక్షణతో పాటు భద్రత

 భారత్, బ్రెజిల్‌ల మధ్య రక్షణ, భద్రత అంశాల్లో అభిప్రాయాలు కలివిడితనంతో  కూడుకొని ఉన్నాయని, వ్యూహాత్మక ఆలోచనలు పరస్పరం పూరకాలుగా ఉంటున్నాయని నేతలు గుర్తించారు. సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకోవడంతో పాటు ఉభయ పక్షాల రక్షణ రంగ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాలు చర్చలు నిర్వహిస్తుండడం సహా రక్షణ రంగ సహకారం అంతకంతకు విస్తరిస్తుండడాన్ని నేతలు స్వాగతించారు. వివిధ వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని గాఢతరం చేయగలిగిన ‘గోపనీయ సమాచార వినిమయం, పరస్పర పరిరక్షణకు సంబంధించిన ఒప్పందం’పై సంతకాలు పూర్తయినందుకు వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సైబర్ భద్రతతో ముడిపడ్డ అంశాల సమాచారాన్ని, అనుభవాలను, జాతీయ దృష్టికోణాలను వినిమయం చేసుకోవడం ద్వారా పరస్పర సహకారాన్ని మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడగల ఒక ‘ద్వైపాక్షిక సైబర్ భద్రత చర్చావేదిక’ను ఏర్పాటు చేయడాన్ని కూడా వారు స్వాగతించారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు, భారత ప్రజలకూ, భారత ప్రభుత్వానికీ సంతాపాన్నీ, సంఘీభావాన్నీ తెలియజేసినందుకు బ్రెజిల్‌కు ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాలతో పాటు ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ ఇద్దరు నేతలూ నిర్ద్వంద్వంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక ఐక్య అంతర్జాతీయ ప్రతిస్పందన వ్యక్తం కావాల్సిన తక్షణావసరం ఉందని ఇరు పక్షాలూ స్పష్టం చేశాయి. ఇలాంటి దుష్ట చేష్టలు ఏ విధంగానూ సమర్ధనీయం కావని తేల్చి చెప్పాయి. సీమాంతర వ్యవస్థీకృత నేరాలపైనా, ఉగ్రవాదంపైనా పోరాటం సాగించడంలో, వాటిని అడ్డుకోవడంలో ఒకరికొకరం సహకరించుకొందామంటూ తమ నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు.  ఈ సందర్భంగా , వారు అంతర్జాతీయ ఉగ్రవాదంపైనా,  సీమాంతర వ్యవస్థీకృత నేరాలపైనా పోరాడడంలో సహకారం అనే అంశంలో బ్రెజిల్-భారత్ ఒప్పంద పత్రంపై సంతకాలు పూర్తవడాన్ని వారు స్వాగతించారు. సైబర్‌ నేరాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించడాన్ని వారు ప్రశంసించారు. ఈ సంవత్సరంలోనే హనోయిలో దీనిపై సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, ఈ కార్యక్రమానికి మద్దతిస్తామని నేతలు ప్రతిజ్ఞ‌ చేశారు.

నేతలు 1267 యూఎన్ఎస్‌సీ ఆంక్షల సంఘం ప్రస్తావించిన లష్కర్-ఏ-తయ్యిబా (ఎల్ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జేఈఎమ్) వంటి సంస్థలు సహా ఐరాస నామనిర్దేశం చేసిన ఉగ్రవాద సంస్థలతో పాటు ఉగ్రవాదులందరిపైనా ఒక్కుమ్మడి చర్యలు తీసుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందించే వర్గాలు పన్నే పన్నాగాలను వమ్ము చేసే దిశగా చురుకైన చర్యలను తీసుకోవడాన్ని కొనసాగిద్దామనీ, ఎఫ్ఏటీఎఫ్, యూఎన్‌లకూ అండదండలను అందిద్దామంటూ నేతలు దృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 భారత్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలకు గాను ఇండియాను, ప్రధానమంత్రి శ్రీ మోదీనీ బ్రెజిల్ దేశాధ్యక్షుడు శ్రీ లూలా అభినందించారు. శాంతియుత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంతరిక్ష, నౌకావాణిజ్య, మహాసముద్ర సంబంధిత సహకారం సహా, వ్యూహాత్మక రంగాలన్నింటిలోనూ ఇప్పటికే కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని నేతలు అంగీకరించారు. ఇరు పక్షాలూ తమ తమ అంతరిక్ష సంస్థల మధ్య సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయా అనేది పరిశీలించడానికి అంగీకరించాయి. వీటిలో భాగంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), శిక్షణలు సహా కృత్రిమ ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగ నౌకలు, వాణిజ్యసరళి ప్రయోగాలు, నియంత్రణ కేంద్రాలు.. ఈ రంగాల్లో సరికొత్త అవకాశాలను అన్వేషించనున్నారు.

 ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, బహుపక్షవాదాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్పష్టం చేశారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు చర్చలను పున:ప్రారంభించడంతో పాటుగా ఇతర యంత్రాంగాలను కూడా ఆశ్రయించాల్సిన తక్షణ ఆవశ్యకత ఉందని వారు చాటిచెప్పారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు పూచీపడటంలో దౌత్యమే అత్యంత అధిక సానుకూల ఫలితాలను ఇవ్వగలుగుతుందంటూ వారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అభివృద్ధి, భద్రత ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని వారు చెప్తూ, శాంతిసాధనకు ఇప్పటి కంటే ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలన్నారు. ఈ తరహా నిర్ణయాలే దీర్ఘకాలిక శాంతి పరిరక్షణకు అతి ముఖ్యమని స్పష్టంచేశారు.  

 ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంతో పాటు శాశ్వతేతర సభ్యత్వ కేటగిరీలు రెండిటినీ విస్తరించడం సహా సమగ్ర సంస్కరణలను తీసుకు రావాలన్న తమ నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు. దీనిలో భాగంగా లాటిన్ అమెరికా, కరీబియన్, ఆసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఇంతవరకు ప్రాతినిధ్యం లేని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విస్తరించే భద్రతా మండలిలో తమ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని తమ రెండు దేశాలూ పరస్పరం సమర్ధిస్తున్నాయని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. భద్రతామండలి సంస్కరణకు సంబంధించిన వ్యవహారాల్లో బ్రెజిల్, భారత్ సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయని నేతలు స్పష్టంచేశారు.  2028-29 మధ్య కాలానికి గాను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వతేతర స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికి బ్రెజిల్ మద్దతు ఇవ్వడాన్ని ఇండియా స్వాగతించింది.

 నేతలు తమ దేశాలు వలసవాదంపై పైచేయిని సాధించడానికి, సార్వభౌమత్వాన్ని ధ్రువపరచుకోవడానికి చేసిన చరిత్రాత్మక పోరాటాన్ని గుర్తుచేసుకొన్నారు. అంతర్జాతీయ చట్ట పాలనలో భాగంగా ఒక నిష్పాక్షిక అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షల విషయంలో శ్రద్ధ చూపడానికి సమ్మతి తెలిపారు. 2025లో ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవ ఘట్టం జరగనుందని గుర్తుకు తెచ్చుకొని, వారు ప్రపంచ పరిపాలన సంస్థలను త్వరగా, సమగ్రంగా సంస్కరించాల్సి ఉందన్న వాదనను సమర్థించారు. ఆ సంస్థలు చేసే నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెంచే, సమకాలిక భౌగోళిక రాజకీయ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొనే విధంగా సంస్కరణలు చోటుచేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సామూహిక సవాళ్ల సంక్లిష్ఠతను చూస్తూ ఉంటే అంతే మహత్త్వాకాంక్షలతో కూడుకొన్న ప్రతిస్పందన అవసరమనిపిస్తోందని వారు అంగీకరిస్తూ, ఐరాస నియమావళిలోని 109వ ఆర్టికల్ స్ఫూర్తికి అనుగుణంగా ఒక సమీక్షాసమావేశాన్ని నిర్వహించడం సహా ఆ నియమావళిలో విస్తృత సంస్కరణలు తీసుకువస్తే బాగుంటుందన్నారు.

మధ్య ప్రాచ్యంలో భద్రత స్థితి ఇటీవల క్షీణించడంపై నేతలు ఆందోళనను వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో తలెత్తుతుండే అనేక సంఘర్షణలను పరిష్కరించాలి అంటే అందుకు చర్చలు, దౌత్యం.. ఇవి తప్ప మరో మార్గం లేదని వారు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా, మధ్య ప్రాచ్యంలో శాంతి, భద్రతలు దీర్ఘకాలం పాటు కొనసాగే దిశగా సంబంధిత పక్షాలన్నీ కృషి చేస్తాయన్న ఆశాభావాన్ని నేతలు ప్రకటించారు.

అవగాహనపూర్వక చర్చలను నిర్వహించడం ద్వారా రెండు వేర్వేరు , స్వతంత్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, దీంతో ఒక సార్వభౌమ, ఆచరణసాధ్య పాలస్తీనా ఆవిర్భవించేందుకు మార్గం సుగమం కావాలని నేతలు పేర్కొన్నారు. ఇలా ఏర్పడే పాలస్తీనా ఇజ్రాయిల్‌తో శాంతి, భద్రతలతో మనగలుగుతూ పక్క పక్కనే నెలకొనే రెండు దేశాలు సురక్షిత, పరస్పర గుర్తింపు ఉన్న సరిహద్దులను కలిగివుండే వీలు చిక్కాలని వారు ఆకాంక్షించారు. శాశ్వత శాంతికి పూచీ పడటానికి నిరంతర సంప్రదింపులు సాగించాలని తాము పిలుపునిస్తున్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ చిరస్థాయి శాంతి సాధన ప్రధానమైన కృషిలో బందీలందరి విడుదల, గాజాలో ఎక్కడికైనా సత్వర, సురక్షిత, నిరాటంక మానవ ప్రవేశ సౌలభ్యం భాగం అవ్వాలని కూడా వారు స్పష్టంచేశారు.    

యూఎన్ఆర్‌డబ్ల్యూఏ (యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్‌స్ ఏజెన్సీ ఫర్ పాలస్టైన్ రిఫ్యూజీస్ ఇన్ ద నార్త్ ఈస్ట్)కు తమ దృఢ మద్దతు కొనసాగుతుందని నేతలు పునరుద్ఘాటించారు. యూఎన్ఆర్‌డబ్ల్యూఏ తన కార్యకలాపాలను చేపడుతున్న ఐయిదు కార్యక్షేత్రాల్లోనూ పాలస్తీనా శరణార్థులకు కనీస సౌకర్యాలను అందించే విషయంలో యూఎన్‌జీఏ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) యూఎన్ఆర్‌డబ్ల్యూఏకు చేసిన సూచనలను, ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాల్సిన అవసరం ఉందని నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.

ఉక్రెయిన్ సంఘర్షణ గురించి నేతలు చర్చించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటున్నాయనీ, అభివృద్ధి బాటన సాగుతున్న దేశాలపైనా తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైరాలకు స్వస్తి పలికే దిశగా దౌత్య యత్నాలు సాగుతుండడాన్ని వారు స్వాగతించారు. ఈ సంఘర్షణకు ఒక శాంతియుత, శాశ్వత పరిష్కారం లభించే మార్గంలో ముందుకు సాగాల్సిందిగా సంబంధిత పక్షాలకు పిలుపునిచ్చారు.  ‌

 

 (v) వ్యూహాత్మక రంగాల్లో పారిశ్రామిక భాగస్వామ్యాలు

రక్షణవాదంతో కూడిన సవాళ్లు అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక ఆర్ధిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తమ సంసిద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందేందుకు ఉన్న అపార సామర్థ్యాన్ని గుర్తించారు. పరస్పర వాణిజ్య, సాంకేతిక అవకాశాలను అన్వేషించడానికి, దిగువన పేర్కొన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సహా ఇతర భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు: (i) ఔషధ పరిశ్రమ (ii) రక్షణ పరికరాలు (iii) గనుల తవ్వకం- ఖనిజాలు (iv) పరిశోధన, అన్వేషణ, వెలికితీయడం, శుద్ధి చేయడం, పంపణీతో సహా చమురు - సహజవాయు రంగం.

రెండు దేశాల మధ్య ఔషధ రంగంలో పెరుగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. బ్రెజిల్లో కార్యకాలాపాలను నిర్వహిస్తున్న భారతీయ ఔషధ సంస్థల సంఖ్య పెరగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జనరిక్ ఔషధాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తో సహా అవసరమైన ఔషధాలను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో బ్రెజిలియన్ ఆరోగ్య, ఔషధ సంస్థలకు సహకరించేలా భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహించారు. అలాగే నిర్లక్ష్యం చేసిన, ఉష్ణమండల వ్యాధులతో సహా కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడానికి సంయుక్త పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను అన్వేషించాలని సంబంధిత సంస్థలను ప్రోత్సహించారు. ఔషధ పరిశ్రమలో సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా రెండు దేశాల్లోనూ ఆరోగ్య రంగం బలోపేతమవుతుందని, గ్లోబల్ సౌత్ వ్యాప్తంగా నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

భారత్, బ్రెజిల్‌ మధ్య విమానయాన రంగంలో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనేందుకు ఉన్న అవకాశాలపై నాయకులు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ దిశగా సహకారాలను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించారు.

రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ రంగంలో భాగస్వామ్యానికి ఉన్న కొత్త అవకాశాలను అన్వేషించాలని, పారిశ్రామిక భాగస్వామ్యాలను కుదుర్చుకోవాలని రక్షణ రంగంలోని పరిశ్రమలను ప్రోత్సహించారు. ఈ రంగంలో భూతల వ్యవస్థలు, నావికా సదుపాయాలు, వైమానిక సామర్థ్యాల విభాగాల్లో మెరుగవుతున్న సహకారాన్ని ప్రశంసించారు.

ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, స్వచ్ఛ విద్యుత్ సాంకేతికతలైన సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు, విద్యుత్ వాహనాలు, విద్యుత్ నిల్వ చేసే వ్యవస్థల్లో కీలక ఖనిజాలు అవసరమని స్పష్టం చేశారు. కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకం, వ్యర్థపదార్థాలను తొలగించడం, శుద్ధి చేయడం, పునర్వినియోగంలో సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంపొందించాలని నాయకులు భావించారు. అలాగే నూతన, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రెండు దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య సంయుక్త భాగస్వామ్యాలను ఆహ్వానించారు.

తీర ప్రాంత క్షేత్రాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండు దేశాలకు సంబంధించిన చమురు, సహజవాయు సంస్థలను ప్రోత్సహించారు. అలాగే ముందస్తు ఉత్పత్తి, అధిక లాభాలను సాధించాలనే ఆసక్తిని వెలిబుచ్చారు. ఉపశమన, కర్భన ఉద్ఘారాలను తగ్గించే సాంకేతికతల సహకారంలో కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాల్లోని సంస్థలను ప్రోత్సహించారు.

రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాల్లో పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ద్వైపాక్షిక వాణిజ్యంలో నాన్-టారిఫ్ అవరోధాలను గుర్తించి పరిష్కరించాలని తమ అధికారులను రెండు దేశాల నాయకులు ఆదేశించారు.

రాకపోకలను సులభతరం చేయడానికి, పర్యాటకం, వ్యాపార ప్రయాణాలను పెంచడంతో పాటుగా వీసా విధానాలను క్రమబద్ధీకరించే సమన్వయ చర్యలు తీసుకోవడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.

ఇటీవలి కాలంలో రెండు దేశాల్లోని పెట్టుబడుల్లో కనిపించిన పెరుగుదల, బ్రెజిల్, భారతీయ వ్యాపారాల మధ్య విజయవంతమైన భాగస్వామ్యాలను ఇద్దరు నాయకులు అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో మంత్రి స్థాయిలో వాణిజ్య, వ్యాపార సమీక్ష యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో ప్రైవేట్ రంగం పాత్రను నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే పరస్పర వ్యాపారం, పెట్టుబడులకు అవకాశాల అన్వేషణను కొనసాగించాలని రెండు దేశాల వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక వ్యాపార భాగస్వామ్యాలు, సంయుక్త వ్యాపారాల్లో పాలుపంచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 2020, జనవరి 25న సంతకం చేసిన ద్వైపాక్షిక పెట్టుబడి సహకారం, సులభతర ఒప్పందం, 2022, ఆగస్టు 24న సంతకం చేసిన ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్ అమలును వేగవంతం చేయడానికి వారు అంగీకరించారు. బ్రెజిల్-ఇండియా వ్యాపార మండలి ద్వారా ఈ లక్ష్యం కోసం కలసి పనిచేయాలని రెండు దేశాల పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలను ఆహ్వానించారు.

భారత్‌లో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం, బ్రెజిల్ అభివృద్ధి, పరిశ్రమ, వాణిజ్యం, సేవల మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. పరస్పర ప్రయోజనాల నిమిత్తం ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంకేతికత పురోగతి, ఉత్తమ పద్ధతులను పరస్పరం అందించుకోవడం, ఐపీ అవగాహన పెంపొందించడానికి పటిష్టమైన చర్యలను ఈ ఒప్పందం అమలు చేస్తుంది. సావో పౌలోలో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఢిల్లీలో ఏఎన్వీఐఎస్ఏ (ఏజెన్సియా నేషనల్ డె విజిలెన్సియా సానిటేరియా - బ్రెజిలియన్ ఆరోగ్య నియంత్రణ సంస్థ) ప్రతినిధి కార్యాలయాల ప్రారంభాన్ని వారు స్వాగతించారు.

 ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం..

సంస్కృతి, ఆరోగ్యం, క్రీడలు, సంప్రదాయ విజ్ఞానం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించే విషయంగా ద్వైపాక్షిక ఒప్పందాల పురోగతి పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర అవగాహనను బలోపేతం చేయడం.. ఇరు దేశాల గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో సాంస్కృతిక వినిమయం ప్రాముఖ్యాన్ని వారు గుర్తించారు. రెండు దేశాలూ ఔత్సాహిక ఆలోచనలు, కళలు, సంప్రదాయాలను పరస్పరం అర్థం చేసుకునేందుకు వీలుగా.. కొత్త సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునిచ్చేందుకు 2025-2029 సంవత్సరాలకు సాంస్కృతిక వినిమయ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి కొత్తగా వస్తున్న సృజనాత్మక పరిశ్రమల సమర్థ ఏకీకరణ కోసం సంబంధిత ప్రభుత్వ సంస్థల చర్చలతో వ్యూహాలను రూపొందించడానికి, తద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు ప్రపంచస్థాయిలో వాటి సాంస్కృతిక పరిధిని విస్తరించడానికి కూడా వారు అంగీకరించారు.

విద్యారంగంలో ద్వైపాక్షిక సహకార బలోపేతం విషయంలో ఇరువురు నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రెజిల్‌లోని ఎక్చేంజ్ ప్రోగ్రామ్ ఫర్ అండర్‌గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ (పీఈసీ) కోసం భారతీయ విద్యార్థులు అర్హత కలిగి ఉండగా.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) అందించే ఉపకారవేతనాలకు బ్రెజిలియన్ విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారని వారు గుర్తు చేసుకున్నారు. రక్షణరంగ శిక్షణ సహా శిక్షణ, సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఇరుపక్షాలు సహకారాన్ని మరింత ముందుకు కొనసాగించాలని నిర్ణయించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ ఉన్నత విద్యా కార్యక్రమం.. ఆసియా-పసిఫిక్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఏపీఏఐఈ) 2025 వార్షిక సమావేశంలో బ్రెజిల్ పాల్గొనడం ప్రశంసనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ద్వైపాక్షిక సహకార బలోపేతం.. ప్రజల అనుసంధానత, వ్యాపార అనుసంధానతలను పెంపొందించే ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగా దేశ పర్యటన సమయంలో కింది ఒప్పందాలపై సంతకాలు చేయడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు:

• అంతర్జాతీయ ఉగ్రవాదం.. వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో పరస్పర సహకారం గురించి ఒప్పందం.

• సున్నిత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి సంబంధించిన ఒప్పందం.

• పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పర సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• ఈఎమ్‌బీఆర్ఏపీఏ-భారత వ్యవసాయ పరిశోధన మండలి మధ్య వ్యవసాయ పరిశోధనల గురించి అవగాహన ఒప్పందం.

• డిజిటల్ పరివర్తన కోసం గణనీయ ఫలితాలను సాధించిన డిజిటల్ పరిష్కారాలను పంచుకోవడంలో పరస్పర సహకార అవగాహన ఒప్పందం.

• భారత డీపీఐఐటీ, బ్రెజిల్‌కు చెందిన ఎమ్‌డీఐసీ మధ్య మేధో సంపత్తి రంగంలో పరస్పర సహకార అవగాహన ఒప్పందం.

కింది ద్వైపాక్షిక ఒప్పందాలను వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సహకరించాలని ఆయా దేశాల సంబంధిత ప్రభుత్వ సంస్థలను ఇరువురు నేతలు ఆదేశించారు:

•  పౌరుల సంబంధిత వ్యవహారాల్లో పరస్పర చట్టపరమైన సహకారం గురించి ఒప్పందం.

• రక్షణ రంగ సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• క్రీడారంగంలో సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• చారిత్రక రికార్డులు, పత్రాల విషయంలో సహకారం గురించి అవగాహన ఒప్పందం.

• సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ) 2025–2029.

శాంతి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధి.. బ్రెజిల్-భారత్ విదేశాంగ విధానాలకు మార్గనిర్దేశం చేసే ఉన్నత లక్ష్యాలని ఇరువురు నేతలు గుర్తుచేసుకున్నారు. బహుళ గుర్తింపులు, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగల ప్రజలు, శక్తిమంతమైన ప్రజాస్వామ్యం గల ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు.. అందరి కోసం న్యాయమైన, మరింత సమ్మిళితమైన, సుస్థిరమైన ప్రపంచ నిర్మాతలుగా అంతర్జాతీయ వ్యవహారాల్లో వారి ప్రత్యేక పాత్రకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల మార్గాలను మెరుగుపరచడానికి, రోజురోజుకీ పెరుగుతున్న, వివిధ రంగాలకు విస్తరిస్తున్న సహకారాన్ని ప్రోత్సహించడానికి అంగీకరించారు.

బ్రెజిల్ పర్యటన, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశ సందర్భాల్లో తమకు అపూర్వ ఆతిథ్యం అందించిన ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర అనుకూల సమయంలో భారత్‌ను సందర్శించాలని అధ్యక్షుడు లూలాను ఆహ్వానించారు. ప్రధానమంత్రి ఆహ్వానాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా సంతోషంగా అంగీకరించారు.


 

****


(Release ID: 2143540)