ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తర్వాత మధ్య వయస్కుల్లో ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్, ఎయిమ్స్ విస్తృత పరిశోధనలు:
ఆకస్మిక మరణాలకు, కొవిడ్ - 19 టీకాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిన అధ్యయనాలు
జీవనశైలి, గత అనారోగ్య సమస్యలే ముఖ్య కారణంగా గుర్తింపు
Posted On:
02 JUL 2025 9:30AM by PIB Hyderabad
కారణం తెలియని ఆకస్మిక మరణాల అంశాన్ని దేశంలోని వివిధ ఏజెన్సీలు అధ్యయనం చేశాయి. ఈ అధ్యయనాలు కొవిడ్ 19 టీకాకు, దేశంలో సంభవిస్తున్న అకాల మరణాలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేల్చాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) చేపట్టిన అధ్యయనాలు భారత్‌లో ఇచ్చిన కొవిడ్-19 వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని స్పష్టం చేశాయి. అలాగే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురైన పరిస్థితులు అత్యంత అరుదుగా ఉన్నాయని తేలింది. గుండె సంబంధింత కారణాల వల్ల అకస్మాత్తుగా సంభవించే కారణాలకు జన్యువులు, జీవనసరళి, గతంలో ఉన్న, కొవిడ్ అనంతరం ఎదురైన అనారోగ్య సమస్యలు తదితరమైనవి కారణం కావచ్చు.
ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారిలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకొనేందుకు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ కలసి పనిచేస్తున్నాయి. దీన్ని పూర్తిగా తెలుసుకోవడానికి, భిన్న పరిశోధనా విధానాలను అనుసరించి రెండు అనుబంధ అధ్యయనాలు చేపట్టాయి. మొదటిది గతంలో డేటా ఆధారంగా చేపట్టగా.. రెండోదాన్ని వాస్తవిక పరిశోధన ఆధారంగా చేశారు. మొదటి అధ్యయనాన్ని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఎపిడిమియాలజీ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐఈ) చేపట్టింది. ‘‘భారత్‌లో 18 నుంచి 45 ఏళ్ల వారిలో ఆకస్మిక మరణాల వెనక కారణాలు - ఒక బహుళ కేంద్రక అధ్యయనం’’ పేరుతో ఈ పరిశోధన చేపట్టింది. దీన్ని 2023 మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 46 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చేపట్టారు. 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు ఆరోగ్యంగా కనిపిస్తూనే.. ఆకస్మికంగా మరణించిన వ్యక్తులపై ఈ పరిశోధనలో దృష్టి సారించారు. యువతలో కారణం తెలియని ఆకస్మిక మరణాలను కొవిడ్ - 19 కారణం కాదని ఈ అధ్యయన ఫలితాలు నిరూపించాయి.
‘‘యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాన్ని గుర్తించడం’’ పేరుతో రెండో అధ్యయనాన్ని ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చేపడుతోంది. దీనికి ఐసీఎంఆర్ నిధులు సమకూరుస్తోంది. యువతలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మరణాలకు గల కారణాలను గుర్తించడమే ఈ అధ్యయనం లక్ష్యం. దీని ప్రాథమిక విశ్లేషణ ప్రకారం యువతలో ఆకస్మిక మరణాలకు గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (ఎంఐ) ప్రధాన కారణమని గుర్తించారు. ముఖ్యంగా, మునుపటి సంవత్సరాలతో పోలిస్తే.. ఈ కారణాల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఈ మరణాలకు ఎక్కువ శాతం జన్యుపరమైన మార్పులను కారణంగా గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత తుది వివరాలను వెల్లడిస్తారు.
ఈ రెండు అధ్యయనాలు భారత యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలపై సమగ్ర అవగాహన కల్పిస్తాయి. అలాగే ఈ ముప్పును కొవిడ్ - 19 వ్యాక్సిన్ పెంచదని వెల్లడైంది. అయితే అంతర్లీన ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి ఈ అకాల మరణాలకు కారణమవుతున్నాయి.
కొవిడ్ టీకాకు, ఆకస్మిక మరణాలకు సంబంధం ఉందనే వాదన అవాస్తమని, తప్పుదోవ పట్టించేదని, దీనికి శాస్త్రీయ ఆమోదం లేనిదని నిపుణులు స్పష్టం చేశారు. మహమ్మారి సమయంలో కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషించిన టీకాలపై ఆధారాలు లేని ఊహాజనితమైన వార్తలు విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. ఇలాంటి నిరాధారమైన నివేదికలు, వాదనలు దేశంలో వ్యాక్సిన్లపై సంశయాన్ని పెంచుతాయని, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు.
ప్రజాసంక్షేమం కోసం ఆధార సహిత ప్రజారోగ్య పరిశోధనల పట్ల భారత ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది.
***
(Release ID: 2141632)
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Tamil
,
Malayalam