ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఝరియా మాస్టర్ ప్లాన్ సవరణ.. ఆమోదం తెలిపిన మంత్రిమండలి
...ఝరియా బొగ్గుక్షేత్రంలో మంటలు చెలరేగడం, నేల కుంగడం..
ఈ సవాళ్లను లెక్కలోకి తీసుకోవడంతో పాటు
ప్రభావిత కుటుంబాలకు పునరావాస కల్పన కోసమే
Posted On:
25 JUN 2025 3:14PM by PIB Hyderabad
సవరించిన ఝరియా మాస్టర్ ప్లాన్‌కు (జేఎంపీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఝరియా బొగ్గు క్షేత్రంలో మంటలు చెలరేగడం, నేల కుంగడం వంటి సవాళ్లు ఎదురైతేనో, ప్రభావిత కుటుంబాలకు పునరావాసాన్ని కల్పించవలసివస్తేనో ఈ తరహా పరిస్థితులను తట్టుకొని ముందుకు పోవడానికి ఝరియా మాస్టర్ ప్లాన్‌ను సవరించారు. ఈ సవరించిన ప్లానును అమలు చేయడానికి మొత్తం రూ.5,940.47 కోట్లు ఖర్చవుతుంది. దశలవారీగా దీనిని అమలుపరిస్తే గనక మంటలు, నేల కుంగుబాటు సమస్యల్ని ఎదుర్కొనే స్థితికి తోడు ప్రభావిత కుటుంబాలకు అత్యంత ప్రమాదభరిత ప్రదేశాల నుంచి ప్రాథమ్య క్రమం ప్రాతిపదికన సురక్షిత పునరావాసాన్ని అందించేందుకు వీలు ఉంటుంది.
సవరించిన జేఎంపీ పునరావాసాన్ని పొందే కుటుంబాలకు స్థిర ప్రాతిపదికన బతుకుతెరువు చూపించడానికి మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని కట్టబెడుతుంది. పునరావాసం పొందే కుటుంబాలకు ఆర్థిక స్వయంసమృద్ధిని కల్పించడం కోసం ఆదాయాన్నిచ్చే అవకాశాలను వారికి అందించడంతో పాటు ప్రత్యేకంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు.
వీటికి అదనంగా, లీగల్ టైటిల్ హోల్డర్ (ఎల్‌టీహెచ్) కుటుంబాలకు, నాన్-లీగల్ టైటిల్ హోల్డర్ (నాన్-ఎల్‌టీహెచ్) కుటుంబాలకు కూడా 1 లక్ష రూపాయల జీవనోపాధి గ్రాంటుతో పాటు రూ.3 లక్షల వరకు సహాయాన్ని సంస్థాగత రుణం రూపంలో అందిస్తారు.
దీనికి తోడు రహదారులు, విద్యుత్తు, నీటి సరఫరా, మురుగునీటి పారుదలకు అవసరమయ్యే సదుపాయాలు, పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ల వంటి ఇతరత్రా అత్యవసర సౌకర్యాలను, సంపూర్ణ మౌలిక సదుపాయాలను పునరావాస ప్రాంతాల్లో కల్పిస్తారు. ఈ నిబంధనలను, సవరించిన ఝరియా మాస్టర్ ప్లాన్ అమలుకు ఏర్పాటు చేసిన సంఘం సిఫారసుల ప్రకారం అమలు చేయనున్నారు.
జీవనోపాధికి మద్దతిచ్చే చర్యల్లో భాగంగా, ఝరియా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ రిహాబిలిటేషన్ ఫండ్‌ను ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. జీవనోపాధికి సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించడానికి దీనిని ఉద్దేశించారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న బహుళ విధ నైపుణ్యాభివృద్ధి సంస్థల సహకారంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతారు.
***
(Release ID: 2139575)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam