ప్రధాన మంత్రి కార్యాలయం
జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
* శివాన్ లో జల, రైలు, ఇంధన రంగ ప్రాజెక్టులు సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
* గినీ దేశానికి ఎగుమతి నిమిత్తం మర్హోరా కేంద్రంలో నిర్మించిన అత్యాధునిక రైలింజన్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
* ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక వేడుకకు శ్రీ మోదీ అధ్యక్ష హోదాలో హాజరు
* భువనేశ్వర్ లో రూ. 18,600 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
* విశాఖపట్నం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నేతృత్వం
* వ్యక్తికీ పుడమి సంక్షేమానికీ గల అవినాభావ సంబంధాన్ని తెలిపే 2025 యోగా దినోత్సవ ఇతివృత్తం “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్”
Posted On:
19 JUN 2025 5:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తదనంతరం ఒడిశా చేరుకుని, సాయంత్రం 4:15 సమయంలో, ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారిక వేడుకలకు శ్రీ మోదీ అధ్యక్షత వహిస్తారు. రూ. 18,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 21న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉదయం 6:30కు జరిగే సామూహిక యోగా ప్రదర్శనలో శ్రీ మోదీ పాల్గొంటారు. అటుపై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
బీహార్‌లో ప్రధాన మంత్రి కార్యక్రమాలు
బీహార్ లో మౌలిక వసతుల అభివృద్ధికి, సామాజిక-ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో ప్రధానమంత్రి శివాన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
రూ. 400 కోట్లు విలువ చేసే నూతన వైశాలి-డియోరియా రైల్వే లైన్ ప్రాజెక్టును, ఇదే మార్గంలో మరో కొత్త రైలు సర్వీస్ ను శ్రీ మోదీ ప్రారంభిస్తారు... ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ చర్యలు దోహదపడగలవని భావిస్తున్నారు. అదే విధంగా ఉత్తర బీహార్‌లో రవాణా సదుపాయాల మెరుగుదలకు దోహదపడే పాటలీపుత్ర–గోరఖ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు ముజఫర్‌పూర్ బేతియా మార్గం ద్వారా ప్రయాణిస్తుంది.
"మేక్ ఇన్ ఇండియా – మేక్ ఫర్ ది వరల్డ్" ఆశయానికి అనుగుణంగా గినీ దేశానికి ఎగుమతి నిమిత్తం మర్హోరా కేంద్రంలో తయారైన అత్యాధునిక రైలింజన్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. తొలిసారిగా, ఎగుమతి కోసమే ప్రత్యేకంగా రైలింజన్ ను తయారు చేయడం గమనార్హం. అధిక హార్స్‌పవర్ ఇంజిన్లు, అత్యాధునిక ఏ.సి. ప్రొపల్షన్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్ ఆధారిత కంట్రోల్ సిస్టమ్స్, సుఖవంతమైన క్యాబ్ డిజైన్లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి సాంకేతికతను ఈ ఇంజిన్లు కలిగి ఉన్నాయి.
గంగా నది ప్రక్షాళన లక్ష్యంగా నమామి గంగే ప్రాజెక్టు కింద స్థానికులకు ఉపయోగపడే రూ. 1,800 కోట్ల విలువైన ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను (ఎస్టీపీ) ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో రూ. 3,000 కోట్లు విలువైన నీటి సరఫరా, పారిశుద్ధ్య, ఎస్టీపీ లకు ప్రధానమంత్రి బీహార్ లోని పలు నగరాలు, పట్టణాల్లో శంకుస్థాపనలు చేస్తారు.
బీహార్‌లో ఇంధన రంగ అభివృద్ధి కోసం 500 మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)కు శ్రీ మోదీ శంకుస్థాపన చేస్తారు. ముజఫర్‌పూర్, మోతిహారీ, బేతియా, శివాన్ సహా మొత్తం 15 గ్రిడ్ సబ్‌స్టేషన్లలో బీఈఎస్ఎస్ లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో 20 నుంచి 80 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీలుంటాయి. దాంతో పంపిణీ సంస్థలు ఖరీదైన రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండా, నిలువ చేసిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు పంపగలుగుతాయి. తద్వారా వినియోగదారులకు లాభం చేకూరుతుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఏవై - యూ) కింద బీహార్ లోని 53,600 మంది లబ్ధిదారులకు శ్రీ మోదీ మొదటి విడత సొమ్ముని విడుదల చేస్తారు. ఇదే పథకంలో భాగంగా 6,600 మందికి కొత్త ఇళ్ళ గృహప్రవేశానికి సంబంధించి తాళం చెవులను అందజేస్తారు.
ఒడిశాలో ప్రధానమంత్రి కార్యక్రమాలు
ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్ లో ఏర్పాటు చేసిన అధికారిక వేడుకకు శ్రీ మోదీ అధ్యక్షత వహిస్తారు.
ఒడిశా సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా రూ. 18,600 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటిలో తాగునీరు, నీటి పారుదల, వ్యవసాయ మౌలిక వసతులు, ఆరోగ్య మౌలిక వసతులు, గ్రామీణ రహదారులు, వంతెనలు, జాతీయ రహదారుల విభాగాలు, కొత్త రైలు మార్గాలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.
తొలిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో బౌధ్ జిల్లా చరిత్రాత్మక అనుసంధానానికి సూచనగా శ్రీ మోదీ కొత్త రైలు సేవలను ప్రారంభిస్తారు.
స్వచ్ఛమైన ఇంధనం, సుస్థిర రవాణా లక్ష్యంగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (సీఆర్యూటీ) కింద ప్రారంభిస్తారు. దాంతో ఈ ప్రాంతానికి పర్యావరణ హిత ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
ప్రధాన మంత్రి ఒడిశా విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒడిశా శతాబ్ద కాలం పూర్తి చేసుకునే 2036 సంవత్సరం, 2047లో భారత స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరాల చారిత్రక సందర్భంలో, సమ్మిళిత అభివృద్ధి కోసం ఈ పత్రం స్పష్టమైన ప్రణాళికలను చూపుతుంది.
ఒడిశా అభివృద్ధికి పాటుపడ్డ ప్రముఖుల కృషికి గౌరవ సూచకంగా ప్రధానమంత్రి 'బరపుత్ర ఐతిహ్య గ్రామ యోజన' పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఒడియా ప్రముఖుల జన్మస్థలాల్లో మ్యూజియంలు, వ్యాఖ్యాన కేంద్రాలు, విగ్రహాలు, గ్రంథాలయాలు వంటివి ఏర్పాటు చేసి వాటిని స్మారక కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. ఒడిశా సంస్కృతిని గౌరవించే ఈ పథకం సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.
రాష్ట్రంలోని 16.50 లక్షల ‘లఖ్ పతీ దిదీ’లు సాధించిన ఆర్థిక స్వయం సమృద్ధికి గుర్తింపుగా రాష్ట్ర మహిళలను ప్రధానమంత్రి సత్కరిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి కార్యక్రమాలు
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) సందర్భంగా, ప్రధానమంత్రి విశాఖపట్నంలో జాతీయ స్థాయి యోగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. విశాఖ బీచ్ వద్ద జరిగే కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ) కార్యక్రమంలో పాల్గొనే శ్రీ మోదీ నేతృత్వంలో, సుమారు 5 లక్షల మంది సామూహిక లయాత్మక కార్యక్రమంలో భాగమవుతారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల ప్రాంతాల్లో యోగా సంగం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 'కుటుంబంతో యోగా', యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో “యోగా అన్‌ప్లగ్డ్' వంటి ప్రత్యేక పోటీలను మైగవ్, మైభారత్ వేదికలపై ప్రారంభించారు.
ఈ సంవత్సర ఇతివృత్తమైన "యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్", వ్యక్తికీ పుడమి సంక్షేమానికీ గల అవినాభావ సంబంధాన్ని ప్రతిబింబిస్తోంది. భారతీయ తత్వంలోని "సర్వే సంతు నిరామయ" (సకల జనులూ అనారోగ్యం నుంచి విముక్తులగుదురు గాక) అన్నసూత్రం నుంచి ఉద్భవించిన ఈ ఇతివృత్తం, సామూహిక సంక్షేమం అన్న ప్రపంచ ఆకాంక్షకు అనువైనది.
2015లో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ భారతదేశ ప్రతిపాదనను ఆమోదించి, జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినప్పటి నుంచి ప్రధానమంత్రి ఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూరు, న్యూయార్క్ (ఐరాస ప్రధాన కార్యాలయం గల నగరం), శ్రీనగర్ వంటి భిన్న ప్రాంతాల నుంచి వార్షిక యోగా ఉత్సవానికి నేతృత్వం వహిస్తున్నారు. నాటి నుంచి ఐడీవై శక్తిమంతమైన ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా రూపుదాల్చింది.
****
(Release ID: 2137919)
Read this release in:
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam