ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటిన ప్రధానమంత్రి
‘ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టు’లో భాగంగా ఆరావళీ శ్రేణిలో అటవీకరణకు సంకల్పం
Posted On:
05 JUN 2025 12:49PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరచడంలో భాగంగా ఆయన ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు.
ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా ఆరావళీ పర్వత శ్రేణుల్లో అటవీకరణకు ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉందని కూడా శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు.
భూమి మీద అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళీ పర్వతమాల గుజరాత్, రాజస్థాన్, హర్యానాలతో పాటు ఢిల్లీలో విస్తరించి ఉందని ప్రధాని గుర్తు చేశారు.
ఈ ప్రాంతం పర్యావరణ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెబుతూ, ఆయా సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆరావళీ శ్రేణిలోనూ, దానికి వెలుపలా సాంప్రదాయిక మొక్కల పెంపకం పద్ధతులను అనుసరించడానికి తోడు, చోటును కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకించి పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మేం కొత్త పద్ధతులను ప్రోత్సహించనున్నామని శ్రీ మోదీ చెప్పారు. మొక్కల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలకు జియో-ట్యాగ్ చేస్తారని, మేరీ లైఫ్ (Meri LiFE) పోర్టల్ సాయంతో వాటిని పర్యవేక్షించనున్నారని కూడా శ్రీ మోదీ వివరించారు.
ఈ ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకోవడంతో పాటు భూమి మీద హరిత కవచాన్ని పెంచడంలో తోడ్పాటును అందించాల్సిందిగా కూడా దేశ యువతకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు:
‘‘ఈ రోజున, ప్రపంచ పర్యావరణ దినోత్సవం (#WorldEnvironmentDay) నాడు, మేం మొక్కల పెంపకం దిశగా ప్రత్యేక చొరవను తీసుకొని, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (#EkPedMaaKeNaam) కార్యక్రమాన్ని పటిష్టపరిచాం. ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నేను నాటాను. ఇది ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా ఆరావళీ శ్రేణిలో తిరిగి వనాలను పెంచాలన్న మా ప్రయత్నాల్లో ఓ భాగం కూడా.’’
‘‘గుజరాత్, రాజస్థాన్, హర్యానాలతో పాటు ఢిల్లీలోనూ విస్తరించిన ఆరావళీ పర్వత శ్రేణి మన భూ గ్రహం మీద ఉన్న అతి పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటి అనేది అందరికీ తెలిసిందే. ఈ పర్వత శ్రేణికి సంబంధించిన అనేక పర్యావరణ సవాళ్లు గత అనేక సంవత్సరాల్లో మన ముందుకు వచ్చాయి... వాటిని తగ్గించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ శ్రేణితో ముడిపడి ఉన్న ప్రాంతాలకు పునర్వైభవాన్ని తెచ్చేందుకు మేం దృష్టి కేంద్రీకరించాం. ఆయా ప్రాంతాల్లోని స్థానిక పాలనాయంత్రాంగాలతో కలిసి పనిచేయనున్నాం. దీనిలో భాగంగా నీటి వ్యవస్థలను మెరుగుపరచడం, ధూళిని వెంటబెట్టుకు వచ్చే తుపాన్లకు అడ్డుకట్ట వేయడం, థార్ ఎడారి తూర్పు దిక్కుకు వ్యాపించడాన్ని నిరోధించడం తదితర అంశాలపై శ్రద్ధ వహించబోతున్నాం.’’
‘‘ఆరావళీ పర్వత శ్రేణిలోనూ, దానికి వెలుపలా, సాంప్రదాయిక మొక్కల పెంపకం పద్ధతులకు అదనంగా, మేం కొత్త పద్ధతులను ప్రోత్సహించనున్నాం. ప్రత్యేకించి చోటు తక్కువగా ఉన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ పనిని చేస్తాం. మొక్కల పెంపకం కార్యకలాపాలకు జియో-ట్యాగింగును అవలంబిస్తారు. వాటిని ‘మేరీ లైఫ్’ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తారు. మన దేశ యువతీయువకులు ఈ ఉద్యమంలో పాల్గొని, మన భూమి మీద హరిత కవచాన్ని పెంచడంలో తలో చేయి వేయాలంటూ వారికి నేను పిలుపునిస్తున్నాను.’’
***
(Release ID: 2134423)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam