ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగర్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

Posted On: 30 MAY 2025 5:20PM by PIB Hyderabad

భారత మాతా కీ - జై!
భారత మాతా కీ - జై!
భారత మాతా కీ - జై!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారూ, కేంద్ర కేబినెట్‌లో నా సహచరులూ, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారూ, శ్రీ బ్రజేశ్ పాఠక్ గారూ, ఉత్తర ప్రదేశ్ మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, ఎమ్మెల్యేలూ, పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరైన కాన్పూర్ సోదరీ సోదరులకూ శుభాకాంక్షలు.

ఇక్కడున్న ఆ చిన్నమ్మాయి ఏదో పెయింటింగ్ వేసినట్టుంది – ఎస్పీజీ నుంచి ఎవరైనా దాన్ని తీసుకోండి. ఆ మూలన మరో వ్యక్తి కూడా ఓ చిత్రం తీసుకొచ్చారు – దానిపై మీ పేరు, చిరునామా రాయండి. నేను మీకు లేఖ రాసి పంపిస్తా. ఆ మూలన ఓ యువకుడున్నాడు – మీ పేరు, చిరునామా రాయండి, మీకు ఉత్తరం రాస్తాను. అక్కడ ఓ అబ్బాయి చాలా సేపటి నుంచి చేయి పైకెత్తుతున్నాడు. ఇప్పటికీ మీ భుజాలు నొప్పి పుట్టుంటాయి. మీరు అలసిపోయుంటారు. కాన్పూర్‌లో ఈరోజు నిజంగా ఉత్సాహం ఉప్పొంగుతోంది! ఫొటోగ్రాఫర్లలో ఎవరైనా అక్కడ చూడండి – ఎస్పీజీ సిబ్బంది ఆ చిన్నారికి సాయం చేయండి.

భారత మాతా కీ - జై!
భారత మాతా కీ - జై!

కాన్పూర్‌లో ఈ అభివృద్ధి కార్యక్రమం మొదట ఏప్రిల్ 24నే జరగాల్సి ఉంది. కానీ, పహల్గాం దాడి వల్ల ఈ సందర్శనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పహల్గాంలో ఉగ్రవాదులు పాల్పడిన ఈ పిరికిపంద చర్యలో కాన్పూర్‌ బిడ్డ శుభం ద్వివేది కూడా ఆ క్రూరత్వానికి బలయ్యాడు. ఆయన బిడ్డ ఐశన్య బాధనూ మానసిక క్షోభనూ మనం అర్థం చేసుకోవచ్చు. మన బిడ్డలూ అక్కాచెల్లెళ్ల ఆక్రోశాన్ని ఆపరేషన్ సిందూర్ రూపంలో ప్రపంచమంతా చూసింది. మేం పాకిస్థాన్ లోపలికి వందల మైళ్ళు దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. మన బలగాల పరాక్రమం, అద్వితీయమైన ధైర్యసాహసాలూ ఎలాంటివంటే.. అది తట్టుకోలేక పాక్ సైన్యం కాల్పుల విరమణ కోరాల్సి వచ్చింది. స్వాతంత్ర్య పోరాటానికి నెలవైన ఈ గడ్డ నుంచి మన సైనికుల శౌర్యానికి మరోసారి ప్రణమిల్లుతున్నాను. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తోకముడిచిన శత్రువు భ్రమల్లో ఉండొద్దు – నేను మళ్లీ చెప్తున్నా: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. ఉగ్రవాదంపై పోరులో భారత్ మూడు విషయాలను స్పష్టం చేసింది: మొదటిది- ప్రతీ ఉగ్రదాడికీ భారత్ దీటుగా బదులిస్తుంది. అది ఎప్పుడు, ఎలా అన్నదీ ఎలా జవాబివ్వాలన్నదీ సాయుధ దళాలే నిర్ణయిస్తాయి. రెండోది- అణు బెదిరింపులతో భారత్‌ను ఇక భయపెట్టలేరు. వాటిని ప్రాతిపదికగా చేసుకుని భారత్ ఏ నిర్ణయమూ తీసుకోదు. మూడోది- ఉగ్రవాద సూత్రధారులు, వారికి ఆశ్రయమిచ్చే ప్రభుత్వాలూ ఒకటేనని భారత్ భావిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల మధ్య వ్యత్యాసాన్ని ఇకపై అంగీకరించబోము. కాన్పూర్ స్టైల్‌లో చెప్పాలంటే: శత్రువు ఎక్కడ దాక్కున్నా వేటాడుతాం.

మిత్రులారా,

భారత దేశీయ ఆయుధ సామర్థ్యాన్ని, మేకిన్ ఇండియా శక్తిని ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. భారత్‌లో తయారు చేసిన మన ఆయుధాలు, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి శత్రు భూభాగంలోకే దూసుకెళ్లి విధ్వంసం సృష్టించాయి. లక్ష్యాలను గుర్తించిన చోటల్లా పేలుళ్లు జరిగాయి. ఆత్మనిర్భర భారత్ దిశగా మన నిబద్ధతే ఈ శక్తికి మూలం. సైనిక, రక్షణ అవసరాల కోసం భారత్ గతంలో విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. మేం ఆ పరిస్థితులను మార్చడం మొదలుపెట్టాం. రక్షణలో భారత స్వావలంబన మన ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు - మన దేశ ప్రతిష్ఠకూ ఎంతో కీలకమైనది. అందుకే ఈ ఆధీనత నుంచి దేశాన్ని విముక్తం చేయడం కోసం ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా సాగుతున్న ఈ ప్రస్థానంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుండడం యావత్ రాష్ట్రానికీ గర్వకారణం. కాన్పూర్‌లో పాత ఆయుధ కర్మాగారం మాదిరిగానే అలాంటి 7 ఫ్యాక్టరీలను పెద్ద ఆధునిక కర్మాగారాలుగా తీర్చిదిద్దాం. నేడు ఉత్తరప్రదేశ్‌లో ఓ ముఖ్యమైన రక్షణ కారిడార్‌ను నిర్మిస్తున్నాం. ఈ కారిడార్‌లోని కాన్పూర్ ప్రాంతం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు కీలక కేంద్రంగా నిలుస్తోంది.

మిత్రులారా,

గతంలో సాంప్రదాయక పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లే పరిస్థితులుండేవి. కానీ ఇప్పుడు రక్షణ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలూ రాష్ట్రానికి వస్తున్నాయి. అమేథి సమీపంలో ఇప్పటికే ఏకే-203 రైఫిళ్ల ఉత్పత్తి మొదలైంది. ఆపరేషన్ సిందూర్‌లో శత్రువును వణికించిన బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ నిలయమైంది. భవిష్యత్తులో ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా నిలిచే భారత ప్రస్థానంలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ ముందుంటాయి. కొత్త కర్మాగారాలు ఇక్కడ ఏర్పాటవుతాయి. భారీగా పెట్టుబడులొస్తాయి. ఈ ప్రాంతానికి చెందిన వేలాది యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మిత్రులారా,

ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌ అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహించేలా చేయడమే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రాధాన్యం. ఇక్కడి పరిశ్రమలను ప్రోత్సహించడం, కాన్పూర్ చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించడం ద్వారా మాత్రమే ఈ పురోగతి సాధ్యపడుతుంది. కానీ సోదరీ సోదరులారా, గత ప్రభుత్వాలు ఆధునిక పారిశ్రామిక అవసరాలను విస్మరించాయి. పరిశ్రమలు కాన్పూర్‌ను విడిచి వెళ్తుండేవి. అయినప్పటికీ, కుటుంబాల ద్వారా నడిచే ప్రభుత్వాలు కళ్లు మూసుకుని కూర్చున్నాయి. దాంతో కాన్పూర్ మాత్రమే కాదు, మొత్తం ఉత్తర ప్రదేశ్ వెనుకబడిపోయింది.

సోదరీ సోదరులారా,

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేలా ఇంధన రంగంలో స్వావలంబన, దృఢమైన మౌలిక సదుపాయాలు, అనుసంధానం – రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి ఈ రెండూ అత్యావశ్యకాలు. 660 మెగావాట్ల పాంకి విద్యుత్ ప్లాంటు, 660 మెగావాట్ల నైవేలి విద్యుత్ ప్లాంటు, 1320 మెగావాట్ల జవహర్‌పూర్ విద్యుత్ ప్లాంటు, 660 మెగావాట్ల ఓబ్రా-సి విద్యుత్ ప్లాంటు, 660 మెగావాట్ల ఖుర్జా విద్యుత్ ప్లాంటు సహా పలు ప్రధాన విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించాం. ఉత్తర ప్రదేశ్ విద్యుత్ అవసరాలను తీర్చే దిశగా ఇదో ముఖ్యమైన ముందడుగు. ఈ విద్యుత్ ప్లాంట్లతో యూపీలో విద్యుత్ లభ్యత గణనీయంగా పెరిగి, అది ఇక్కడి పరిశ్రమలకు ఊతమిస్తుంది. నేడు రూ. 47,000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం, వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశాం. వృద్ధులకు ఉచిత వైద్య చికిత్స కోసం ఆయుష్మాన్ వయో వందన కార్డులను అందించాం. ఇతర పథకాల లబ్ధిదారులకు కూడా చేయూతనిచ్చాం. ఈ పథకాలు, అభివృద్ధి పనులు కాన్పూర్, ఉత్తరప్రదేశ్ పురోగతి పట్ల మా బలమైన నిబద్ధతకు నిదర్శనం.

మిత్రులారా,

ఆధునిక, వికసిత ఉత్తర ప్రదేశ్‌ను సాధించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నేడు విశేషంగా కృషిచేస్తున్నాయి. ఫలితంగా, ఒకప్పుడు ప్రధాన మెట్రో నగరాలకే పరిమితమైన ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్‌లోనూ కనిపిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట మా ప్రభుత్వం కాన్పూర్‌కు తొలి మెట్రో సర్వీసును అందించింది. నేడు కాన్పూర్ మెట్రో ఆరెంజ్ లైన్ కాన్పూర్ మధ్య ప్రాంతం వరకు చేరుకుంది. ఎత్తయిన ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ల నుంచి భూగర్భ సొరంగాల వరకు.. అన్ని రకాల మెట్రో సదుపాయాలూ ఇప్పుడు కాన్పూర్‌లోని ముఖ్య ప్రాంతాలన్నింటినీ కలుపుతున్నాయి. ఈ కాన్పూర్ మెట్రో విస్తరణ సాధారణ ప్రాజెక్టు కాదు. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం సదుద్దేశం, దృఢ సంకల్పం, నిజాయితీతో కూడిన పాలన, రాజీ లేని కృషికి ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కాన్పూర్ గురించి జనం ఏమనుకునేవారో గుర్తుచేసుకోండి. ఇరుకైన రోడ్లు, ఆధునిక మౌలిక సదుపాయాలూ తగిన ప్రణాళికా లేకపోవడం వల్ల చున్నిగంజ్, బడా చౌరాహా, నయాగంజ్, కాన్పూర్ సెంట్రల్ వంటి ప్రాంతాలు చాలా రద్దీగా ఉండేవి. ‘‘ఇక్కడ మెట్రో ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ అంత పెద్ద మార్పు ఎలా జరుగుతుంది?’’ అని ప్రజలు అడిగేవారు. ఒక విధంగా చెప్పాలంటే కాన్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఇతర కీలక నగరాలు అభివృద్ధి రేసులో లేవు. ఇది ట్రాఫిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేసింది, పట్టణ పురోగతి మందగించింది. యూపీలో అత్యంత సమర్థమైన నగరాలు వెనుకబడిపోయాయి. కానీ నేడు అదే కాన్పూర్, అదే ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిలో నూతన ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. మెట్రో సేవలు కాన్పూర్ ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగిస్తున్నాయో చూడండి. ప్రముఖ వాణిజ్య కేంద్రమైన కాన్పూర్‌లో వ్యాపారులు, వినియోగదారులు నవీన్ మార్కెట్, బడా చౌరాహాకు చేరుకోవడం ఇప్పుడు సులభతరమైంది. కాన్పూర్ నుంచి రాకపోకలు సాగించే ఐఐటీ విద్యార్థులు, ప్రజలు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి సమయం గణనీయంగా ఆదా అవుతుంది. నగరంలో వేగమే దాని పురోగతికి చోదకశక్తి అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సౌకర్యాలు, ఈ అనుసంధానం, ఆధునిక రవాణా మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి.

మిత్రులారా,

ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుసంధానం పరంగా నేడు ఉత్తరప్రదేశ్ గొప్ప పురోగతి సాధిస్తోంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా రాళ్లు తేలి, గుంతలు పడిన రోడ్లు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ రహదారులు విస్తరించాయి. చీకటి పడితే ప్రజలు బయటకు వెళ్లని అదే ఉత్తరప్రదేశ్‌లో నేడు రోడ్లపై 24 గంటలూ ట్రాఫిక్‌ కనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఎంతగా మార్పు చెందిందో కాన్పూర్ ప్రజల కన్నా మిన్నగా ఎవరికి అర్థమవుతుంది? కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్ రహదారి ద్వారా.. కొన్నిరోజుల్లోనే కాన్పూర్ నుంచి లక్నోకు ప్రయాణ సమయం 40 నుంచి  45 నిమిషాలకే పరిమితం కాబోతోంది. ఈ అమ్మాయి చాలా సేపటి నుంచి ఆ చిత్రాన్ని పట్టుకుని నిల్చుని ఉంది. ఆమె అలసిపోయి ఉంటుంది. ఎస్పీజీ సిబ్బంది ఆమె నుంచి ఆ చిత్రాన్ని తీసుకోండి. థాంక్యూ డియర్. అందమైన, అద్భుతమైన చిత్రాన్ని నువ్వందించావు. నువ్వు దీనిపై నీ పేరు, చిరునామా రాశావు కదా? నా కార్యాలయం నుంచి ఎవరో ఒకరు దాన్ని తీసుకుని నాకిస్తారు. థాంక్యూ వెరీ మచ్ డియర్.

మిత్రులారా,

లక్నో నుంచి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారిని నేరుగా అనుసంధానిస్తాం. కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్ రహదారిని గంగా ఎక్స్‌ప్రెస్ రహదారితో అనుసంధానిస్తాం. ఇది తూర్పు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ వైపు ప్రయాణాలకు దూరం, ప్రయాణ సమయం రెండింటినీ తగ్గిస్తుంది.

మిత్రులారా,

ఫరూఖాబాద్-అన్వర్‌గంజ్ సెక్షన్‌లో సింగిల్-లైన్ రైల్వే ట్రాక్ కారణంగా కాన్పూర్ వాసులు చాలా కాలంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒకటీ రెండూ కాదు.. 18 రైల్వే క్రాసింగ్‌లను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒక్కోసారి ఒక్కో గేటు మూసేసి ఉంటున్నాయి. ఈ సమస్య పరిష్కరించాల్సిందిగా చాలా రోజులుగా మీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రూ. 1000 కోట్ల వ్యయంతో ఇక్కడ ఎత్తయిన రైల్ కారిడార్‌ను నిర్మించబోతున్నాం. ఇది ట్రాఫిక్ ను మెరుగుపరుస్తుంది, వేగాన్ని పెంచుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తుంది, అన్నింటినీ మించి కాన్పూర్ ప్రజల విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.

మిత్రులారా,

కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌ను కూడా నవీకరించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. తొందరలోనే అది విమానాశ్రయంలా ఆధునికంగా కనిపించబోతోంది. మా ప్రభుత్వం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లో 150 కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. దేశంలో అత్యధికంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా యూపీ ఇప్పటికే నిలిచింది. అంటే – రహదారుల్లో, రైల్వేల్లో, వాయుమార్గాల్లో... ఇలా ప్రతీ రంగంలో ఉత్తర ప్రదేశ్ శరవేగంగా పురోగమిస్తోంది.

మిత్రులారా,

పారిశ్రామిక అవకాశాలకు నిలయంగా మేం ఉత్తర ప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఈ ఏడాది బడ్జెటులో మేక్ ఇన్ ఇండియా కింద ‘మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్’ కార్యక్రమాన్ని మేం ప్రకటించాం. దీని ద్వారా స్థానిక పరిశ్రమలు, ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. కాన్పూర్ వంటి నగరాలకు దీని ద్వారా విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. కాన్పూర్ పారిశ్రామిక శక్తిలో ఎంఎస్ఎంఈలదే అతిపెద్ద వాటా అని మీ అందరికీ తెలుసు. ఇక్కడి ఈ చిన్న పరిశ్రమల అంచనాలను నెరవేర్చే దిశగా నేడు మేం కృషిచేస్తున్నాం.

మిత్రులారా,

మన ఎంఎస్ఎంఈలను విస్తరణకు సందేహించేవిగానే ఇటీవలి వరకు భావించారు. అలాంటి కాలం చెల్లిన భావనలను మేం మార్చేశాం. చిన్న పరిశ్రమల టర్నోవరు పరిధులను, పరిమాణాన్ని మేం పెంచాం. ఈ ఏడాది బడ్జెటులో ప్రభుత్వం ఎంఎస్ఎంఈల పరిధిని మరింత విస్తరించి, వాటికి అదనపు మినహాయింపులు కల్పించింది. గతంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో రుణ లభ్యత ఒకటి. గత పదేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించడానికి మేం అనేక ముఖ్య చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సొంత వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటే, ముద్ర యోజన ద్వారా సులభంగా మూలధనాన్ని పొందొచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రుణ భరోసా పథకాన్ని మేం ప్రవేశపెట్టాం. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈ రుణాలపై హామీ పరిమితిని 20 కోట్ల రూపాయలకు పెంచాం. ఎంఎస్ఎంఈలకు రూ. 5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తున్నాం. విధానాలను సరళీకృతం చేయడం ద్వారా కొత్త పరిశ్రమలకు - ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు సహాయక వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. 'ఒక జిల్లా, ఒక ఉత్పత్తి' వంటి పథకాల ద్వారా కాన్పూర్‌లోని సాంప్రదాయక తోలు, అల్లిక వస్తువుల పరిశ్రమలు సాధికారత సాధిస్తున్నాయి. ఈ చర్యలు కాన్పూర్‌తోపాటు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి జిల్లాకూ ప్రయోజనం చేకూరుస్తాయి.

మిత్రులారా,

ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులకు అపూర్వమైన, సురక్షితమైన వాతావరణం నేడు ఏర్పడింది. పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకతతో అమలవుతున్నాయి. మధ్యతరగతి వారి కలలను నెరవేర్చడంలో ప్రభుత్వం కూడా వారికి అండగా నిలుస్తోంది. ఈ ఏడాది బడ్జెటులో రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పూర్తిగా పన్ను రహితం చేశాం. ఇది కోట్లాది మధ్యతరగతి కుటుంబాల్లో కొత్త విశ్వాసాన్ని నింపి, వారికి శక్తినిచ్చింది. 'సేవ', 'వికాసం' పట్ల అంకితభావంతో వేగంగా ముందుకెళ్తూనే ఉంటాం. దేశాన్నీ ఉత్తర ప్రదేశ్‌నూ అత్యున్నత శిఖరాలను అధిరోహింపజేయడంలో ఏ అవకాశాన్నీ మేం వదులుకోం. కాన్పూర్‌ సోదరీ సోదరులకు ఉజ్వల భవిష్యత్తు దిశగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ధన్యవాదాలు! 

 

***


(Release ID: 2133214)