ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని బికనీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 22 MAY 2025 3:31PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

థానే సగలాం నే రామ్ - రామ్!

రాజస్థాన్ గవర్నర్ హరిభావు భాగ్డే, ప్రజాదరణ సొంతం చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ భజన్ లాల్, మాజీ ముఖ్యమంత్రి, సోదరి వసుంధర రాజే, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వనీ వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, ప్రేమ్ చంద్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర మంత్రులకు, సహ పార్లమెంట్ సభ్యుడు మదన్ రాథోడ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ సోదర, సోదరీమణులకు..  

తీవ్రమైన వేడిలోనూ మీరంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఆన్‌లైన్ ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ రోజు మనతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.

సోదర సోదరీమణులారా,

కర్ణీమాత ఆశీర్వాదాలతో నేను మీ మధ్యకు వచ్చాను. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలన్న మన సంకల్పాన్ని కర్ణీమాత ఆశీస్సులు మరింత బలోపేతం చేస్తాయి. కొంత సేపటి క్రితమే, రూ.26 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా దేశ పౌరులకు, రాజస్థాన్‌లోని నా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

అభివృద్ది చెందిన భారత్‌ను తయారు చేయడానికి దేశంలో ఆధునిక మౌలిక వసతుల కల్పన అనే మహాయజ్ఞం జరుగుతోంది. మన రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు, రైల్వే స్టేషన్లను ఆధునికంగా మార్చడానికి గత 11 ఏళ్లలో మునుపెన్నడూ లేని వేగంతో పనులు జరిగాయి. మౌలిక వసతుల నిర్మాణానికి గతంలో కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం, ఆరు రెట్లు. ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆశ్చర్యపోతుంది. ఉత్తరానికి వెళితే చీనాబ్ వంతెన లాంటి నిర్మాణాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తూర్పునకు వెళితే అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగం, అస్సాంలో బోగీబీల్ వంతెన మీకు స్వాగతం పలుకుతాయి. పశ్చిమ భారతానికి వస్తే.. ముంబయిలో సముద్రం మీద నిర్మించిన అటల్ బ్రిడ్జిని, దక్షిణాన.. పంబన్ బ్రిడ్జిని చూడొచ్చు. ఈ తరహా వంతెన దేశంలోనే మొట్టమొదటిది.

మిత్రులారా,

ప్రస్తుతం భారత్ తన రైల్వే వ్యవస్థలను ఆధునికీకరిస్తోంది. ఈ వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు, నమో భారత్ రైళ్లు అన్నీ.. దేశం అందిపుచ్చుకున్న సరికొత్త వేగాన్ని, సాధిస్తున్న ప్రగతిని ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు దేశంలో 70 మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి మారుమూల ప్రాంతాలకు సైతం అత్యాధునిక రైలు ప్రయాణాన్ని తీసుకొచ్చాయి. గడచిన 11 ఏళ్లలో వందల సంఖ్యలో రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించాం. ముప్పైనాలుగు వేల కిలోమీటర్లకు పైగా కొత్త రైల్వే ట్రాకులు వేశాం. బ్రాడ్ గేజ్ లైన్ల వద్ద మానవ రహిత క్రాసింగ్‌లు ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాయి. వాటిని పూర్తిగా తొలగించాం. సరకు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైల్వే ట్రాకు పనులను సైతం మేం వేగంగా పూర్తిచేస్తున్నాం.  దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. వీటన్నింటితో పాటుగా, దేశవ్యాప్తంగా 1300 రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం.

స్నేహితులారా,

ఈ ఆధునిక రైల్వే స్టేషన్లకు దేశం అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అని పేరు పెట్టింది. వీటిలో 100కి పైగా అమృత్ భారత్ స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఈ స్టేషన్లు గతంలో ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా మారాయి అని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు.

స్నేహితులారా,

అభివృద్ధి, వారసత్వం – ఈ మంత్రం అన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి స్థానిక కళలకు, సంస్కృతికి సరికొత్త చిహ్నాలు. రాజస్థాన్‌లోని మందల్‌గఢ్ రైల్వే స్టేషన్ రాజస్థానీ కళను, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. బీహార్లోని థావే స్టేషన్లో థావేవాలీ మాత పవిత్ర ఆలయం, మధుబని చిత్రకళ ప్రదర్శితమవుతాయి. మధ్యప్రదేశ్‌లోని ఊర్చా రైల్వే స్టేషన్లో భగవాన్ రాముని తేజస్సును అనుభూతి చెందవచ్చు. శ్రీరంగం స్టేషన్ నమూనాకు శ్రీ శ్రీరంగనాథ స్వామి ఆలయమే స్ఫూర్తి. గుజరాత్‌లోని డకోర్ స్టేషన్‌కు రణఛోడ్రాయ్ జీ నుంచి ప్రేరణ పొందాం. తిరువణ్ణామలై స్టేషన్‌ను ద్రావిడ నిర్మాణ శైలికి అనుగుణంగా రూపొందించాం. బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద కాకతీయ రాజవంశ నిర్మాణ శైలి కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే, ప్రతి అమృత్ స్టేషన్లో వేల ఏళ్ల నాటి భారతీయ వారసత్వాన్ని మీరు చూస్తారు. ఈ స్టేషన్లు ప్రతి రాష్ట్రంలోనూ పర్యాటకాన్ని ప్రోత్సహించి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఆయా నగరాల ప్రజలకు, రైలు ప్రయాణీకులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆస్తులన్నింటికీ మీరే యజమాని. వాటిని మురికిగా మారనివ్వకూడదు. వాటిని పాడు చేయకూడదు. ఎందుకంటే.. మీరే దానికి యజమానులు.

స్నేహితులారా,

మౌలిక వసతులను నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ము ఉద్యోగాలను సృష్టిస్తుంది, వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడుల వల్ల కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. అలాగే దుకాణదారులకు, దుకాణాలు-కర్మాగారాల్లో పనిచేసేవారికి కూడా ప్రయోజనం కలుగుతోంది. ఇసుక-కంకర-సిమెంట్ రవాణా చేసే ట్రక్కులను, టెంపోలను నడిపే డ్రైవర్లకు సైతం లబ్ధి చేకూరుతోంది. ఈ మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధమైతే.. ఎన్నో లాభాలు కలుగుతాయి. రైతులు పండించిన పంటలు తక్కువ ఖర్చుతో మార్కెట్‌కు చేరతాయి, వృథా తగ్గుతుంది. రోడ్లు బాగున్న ప్రాంతాల్లో కొత్త రైళ్లు వస్తాయి. కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయి. పర్యాటకానికి ప్రోత్సాహం దక్కుతుంది. అంటే మౌలిక వసతులపై పెట్టిన పెట్టుబడి నుంచి ప్రతి కుటుంబం ముఖ్యంగా యువత ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. 

 

 మిత్రులారా,

మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం చేస్తున్న విస్తృత కృషి వల్ల మన రాజస్థాన్ కూడా అనేక ప్రయోజనాలను పొందుతోంది. నేడు రాజస్థాన్ లోని ప్రతి గ్రామంలో మంచి రోడ్లను నిర్మిస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రోడ్లు నిర్మిస్తున్నాం. ఇందుకోసం గత 11 సంవత్సరాల్లో ఒక్క రాజస్థాన్‌లోనే దాదాపు 70 వేల కోట్ల రూపాయలు వెచ్చించాం. రాజస్థాన్‌లో రైల్వేలనూ అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. 2014కు ముందు వెచ్చించిన దానికన్నా ఇది 15 రెట్లు అధికం. ఇంతకుముందే ఇక్కడి నుంచి ముంబయికి ఓ కొత్త రైలును ప్రారంభించాం. ఈరోజే చాలా ప్రాంతాలలో ఆరోగ్యం, నీరు, విద్యుత్ సంబంధిత పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. రాజస్థాన్ నగరాలు, గ్రామాలన్నీ శరవేగంగా పురోగతి దిశగా పయనించాలన్నదే ఈ కార్యక్రమాలన్నింటి లక్ష్యం. రాజస్థాన్ యువత తమ నగరంలోనే మంచి అవకాశాలను పొందొచ్చు.

మిత్రులారా,

రాజస్థాన్ పారిశ్రామికాభివృద్ధి కోసం కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. వివిధ రంగాలకు సంబంధించి కొత్త పారిశ్రామిక విధానాలను భజన్ లాల్ ప్రభుత్వం రూపొందించింది. బికనీర్ కూడా ఈ కొత్త విధానాల వల్ల ప్రయోజనం పొందుతుంది. బికనీర్ విషయానొస్తే.. ఇక్కడి భుజియా రుచి, ఈ రసగుల్లాల తియ్యదనాన్ని ఇకపై ప్రపంచమంతా గుర్తించి, ఆస్వాదించబోతోంది. రాజస్థాన్‌లో శుద్ధి కర్మాగారం పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇది రాజస్థాన్‌ను పెట్రోలియం ఆధారిత పరిశ్రమల ప్రధాన కేంద్రంగా నిలుపుతుంది. అమృత్‌సర్ నుంచి జామ్‌నగర్ వరకు నిర్మిస్తున్న 6 వరుసల ఎకనామిక్ కారిడార్ రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, హనుమాన్‌ఘర్, బికనీర్, జోధ్‌పూర్, బార్మర్, జలోర్ మీదుగా వెళ్తోంది. రాజస్థాన్‌లో ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇది రాజస్థాన్‌లో పారిశ్రామికాభివృద్ధిని కొత్త శిఖరాలకు చేరుస్తుంది.

మిత్రులారా,

రాజస్థాన్‌లో ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కూడా వేగంగా పురోగమిస్తోంది. రాజస్థాన్‌లో 40 వేలకు పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీంతో ప్రజలకు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా పోయింది. సౌర విద్యుదుత్పత్తి ద్వారా కొత్త సంపాదన మార్గం కూడా ప్రజలకు లభించింది. నేడిక్కడ అనేక విద్యుత్ సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. వీటితో కూడా రాజస్థాన్‌కు మరింత విద్యుత్ లభిస్తుంది. పెరుగుతున్న విద్యుదుత్పత్తి కూడా రాజస్థాన్‌లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

మిత్రులారా,

ఇసుక మైదానాలకు పచ్చదనాన్నద్దిన మహారాజా గంగా సింగ్‌ జన్మించిన పుణ్యభూమి రాజస్థాన్. నీళ్లు మనకెంత ముఖ్యమైనవో ఇక్కడి ప్రజల కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది?  బికనీర్, శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్, పశ్చిమ రాజస్థాన్‌ వంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి నీరు అత్యావశ్యకం. అందుకే ఓ వైపు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే, మరోవైపు నదులను అనుసంధానిస్తున్నాం. పార్వతి- కాళీసింధ్- చంబల్ అనుసంధాన ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌లోని అనేక జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడి భూమికి, ఇక్కడి రైతులకు ఇదెంతో ఉపయోగకరమైనది.

మిత్రులారా,

దేశమూ దేశ ప్రజల కన్నా ఏదీ ఎక్కువ కాదని వీరభూమి అయిన రాజస్థాన్ బోధిస్తుంది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మతమేమిటో అడిగి మన అక్కాచెల్లెళ్ల నుదుట సిందూరాన్ని చెరిపేశారు. పహల్గాంలో పేలిన ఆ తూటాలు 140 కోట్ల దేశ ప్రజల హృదయాలను బద్దలుగొట్టాయి. ఈ దాడి తర్వాత దేశ ప్రజలంతా ఏకమయ్యారు. ఉగ్రవాదులను తుడిచిపెట్టాలని, ఊహకందని విధంగా వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని సంకల్పించారు. నేడు మీ ఆశీస్సులతో, మన సైన్యం పరాక్రమంతో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాం. మా ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మన మూడు దళాలూ కలిసి చక్రవ్యూహాన్ని రచించి పాకిస్థాన్ ను మోకరిల్లేలా చేశాయి.

మిత్రులారా,

22వ తేదీన జరిగిన దాడికి సమాధానంగా 22 నిమిషాల్లోనే 9 అతిపెద్ద ఉగ్రవాద రహస్య స్థావరాలను మనం ధ్వంసం చేశాం. సిందూరం తుపాకీ మందై పేలిన వేళ.. ఏం జరుగుతుందోనంటూ యావత్ప్రపంచం, దేశ శత్రువులు కూడా కళ్లప్పగించి చూశారు.

అలాగే మిత్రులారా,

అయిదేళ్ల కిందట బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు చేసిన తర్వాత, నా మొదటి బహిరంగ సభ రాజస్థాన్ సరిహద్దులోనే జరగడం యాదృచ్చికం. అది ఈ వీరభూమి మహత్తు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా నా మొదటి బహిరంగ సభ పరాక్రమానికి పెట్టింది పేరైన ఈ రాజస్థాన్ సరిహద్దులో, బికనీర్‌లో మీ మధ్యన జరుగుతోంది.  

 

 మిత్రులారా,

చురు లో చెప్పాను - వైమానిక దాడి జరిగిన తర్వాత నేను అక్కడికి వచ్చాను. అప్పుడు నేను చెప్పిన మాటే - “ఈ మట్టిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, నా దేశం నాశనం కాకుండా చూస్తాను, నా దేశం తల వంచకుండా చూస్తాను.” ఈ రోజు, రాజస్థాన్ నేల నుంచి, నేను నా దేశ ప్రజలకు వినయపూర్వకంగా చెప్పాలనుకుంటున్నాను. దేశం నలుమూలలా తిరంగా యాత్రలు నిర్వహిస్తున్న నా దేశవాసులకు చెబుతున్నాను - సింధూరాన్ని (కుంకుమ) తుడిచివేయాలని, సింధూరాన్ని చెరిపివేయాలని వచ్చినవారు ధూళిలో కలసిపోయారు. భారతదేశ రక్తాన్ని చిందించేవారు, చిందించాలని చూసేవారు నేడు ప్రతి బొట్టుకు మూల్యం చెల్లించుకున్నారు. ఒకప్పుడు భారతదేశం నిశ్శబ్దంగా ఉంటుందని భావించిన వారు నేడు తమ ఇళ్లలో దాక్కున్నారు. తమ ఆయుధాలను చూసుకుని గర్వించినవారు నేడు శిథిలాల కింద కూరుకుపోయారు.

నా దేశవాసులారా,  

ఇది ఒక దాడి లేదా ప్రతీకార క్రీడ కాదు - ఇది దాడి, ప్రతీకార ఆట కానే కాదు, ఇది కొత్త తరహా న్యాయం, ఇది ఆపరేషన్ సిందూర్. ఇది కేవలం కోపం మాత్రమే కాదు, ఇది శక్తిమంతమైన భారతదేశ ఉగ్రరూపం. ఇది భారతదేశ కొత్త రూపం. ఇంతకుముందు ఇంటి లోపలికి ప్రవేశించి దాడి చేసేవారు, ఇప్పుడు నేరుగా ఛాతీ పైనే దాడి చేస్తున్నారు. ఇదీ  విధానం, ఇదీ ఉగ్రవాదాన్ని అణచివేసే మార్గం, ఇదీ భారత్, ఇదీ కొత్త భారత్-చెప్పండి-

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

మిత్రులారా,

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆపరేషన్ సిందూర్ మూడు సూత్రాలను నిర్దేశించింది. మొదటిది - భారత్ పై ఉగ్రవాద దాడి జరిగితే దీటైన సమాధానం చెప్పడం. ఇందుకు సమయాన్ని మన బలగాలు నిర్ణయిస్తాయి. అలాగే, పద్ధతిని కూడా మన బలగాలు నిర్ణయిస్తాయి. షరతులు కూడా మనమే విధిస్తాం. రెండోది - ఉత్తుత్తి అణుబాంబు బెదిరింపులకు భారతదేశం భయపడదు. ఇక మూడోది - ఉగ్రవాద నాయకులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని వేర్వేరుగా చూసే ప్రసక్తి ఉండదు. మనం వాటిని వేరువేరుగా చూడబోం. వాటిని ఒక్కటిగానే  పరిగణిస్తాం. పాకిస్థాన్ ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల ఆటలు ఇక సాగవు. మీకు తెలుసు - పాకిస్థాన్ ను ఎండగట్టేందుకు మన దేశం నుంచి ఏడు వేర్వేరు ప్రతినిధి బృందాలు ప్రపంచ దేశాలకు వెళ్లనున్నాయి. ఈ ప్రతినిధి బృందంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, విదేశాంగ విధాన నిపుణులు, ప్రముఖులు ఉన్నారు, ఇప్పుడు పాకిస్థాన్ నిజస్వరూపాన్ని  యావత్ ప్రపంచానికి చూపబోతున్నాం.

మిత్రులారా,

భారత్ తో ప్రత్యక్ష యుద్ధంలో పాక్ ఎప్పటికీ గెలవలేదు. ప్రత్యక్ష పోరు జరిగినప్పుడల్లా పాక్ పదేపదే ఓటమిని చవిచూడాల్సి వస్తోంది. అందుకే భారత్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుంది. స్వాతంత్య్రానంతరం గత కొన్ని దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.  పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసి, అమాయక ప్రజలను చంపి, భారతదేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించేది, కానీ,  ఆ దేశం ఒక విషయాన్ని మర్చిపోయింది, ఇప్పుడు భారతమాత సేవకుడు మోదీ ఇక్కడ తల పైకెత్తి నిలబడి ఉన్నాడు. మోదీ మనసు చల్లగా ఉంటుంది -  ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. కానీ మోదీ రక్తం మరుగుతుంటుంది— ఇప్పుడు ఆయన నరాల్లో రక్తం కాదు -  వేడి సింధూరం ప్రవహిస్తోంది. ఇప్పుడు భారత్ స్పష్టంగా చెప్పింది – ప్రతి ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ పెద్ద మూల్యం చెల్లించాల్సిందే.  ఆ మూల్యం చెల్లించేది పాకిస్థాన్ సైన్యం కావచ్చు లేదా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు.

మిత్రులారా,

ఢిల్లీ నుంచి ఇక్కడికి రాగానే బికనీర్ లోని నాల్ ఎయిర్ పోర్టులో దిగాను. ఈ వైమానిక స్థావరాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నించింది. కానీ అది ఈ వైమానిక స్థావరానికి కొంచెం కూడా నష్టం కలిగించలేకపోయింది. ఇక్కడికి కొద్ది దూరంలో, సరిహద్దు వెంబడి, పాకిస్థాన్ కు చెందిన రహీమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది, అది ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవరికీ తెలియదు, అది ఐసియులో పడి ఉంది. భారత సైన్యం చేసిన కచ్చితమైన దాడితో ఈ వైమానిక స్థావరం ధ్వంసమైంది.

మిత్రులారా,

పాకిస్థాన్ తో ఎలాంటి వాణిజ్యం కానీ, చర్చలు కానీ ఉండవు. చర్చలు జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్, పీఓకే గురించి మాత్రమే. ఒకవేళ పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ పోతే అది ప్రతి పైసాకు భిక్షాటన చేయాల్సి ఉంటుంది. భారత్ కు దక్కాల్సిన నీటి వాటా పాకిస్థాన్ కు ఎంతమాత్రం దక్కదు. భారతీయుల రక్తంతో ఆడుకోవడం వల్ల పాక్  ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే. ఇది భారతదేశ సంకల్పం - ఈ సంకల్పం నుంచి ప్రపంచంలోని ఏ శక్తీ మనల్ని అడ్డుకోజాలదు.

సోదర సోదరీమణులారా,

అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి భద్రత, సౌభాగ్యం రెండూ అవసరం. భారతదేశంలోని ప్రతి మూల బలంగా మారినప్పుడే ఇది సాధ్యమవుతుంది. భారతదేశ సమతుల్య అభివృద్ధికి, భారతదేశ వేగవంతమైన అభివృద్ధికి నేటి కార్యక్రమం ఒక గొప్ప ఉదాహరణ. ఈ వీరభూమి నుంచి మరోసారి దేశవాసులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ రెండు పిడికిళ్లు బిగించి, పూర్తి శక్తితో నాతో పాటు కలసి చెప్పండి -  

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

వందేమాతరం. వందేమాతరం.

వందేమాతరం. వందేమాతరం.

వందేమాతరం. వందేమాతరం.

వందేమాతరం. వందేమాతరం.

వందేమాతరం. వందేమాతరం.

వందేమాతరం. వందేమాతరం.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2130687)