హోం మంత్రిత్వ శాఖ
నక్సలిజానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో చరిత్రాత్మక విజయం సాధించిన భద్రతా బలగాలు, చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్లో నిర్వహించిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులను హతమార్చాయి: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
* మరణించిన 27 మంది మావోయిస్టుల్లో సీపీఐ-మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రనేత, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు
* నక్సలిజానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలుగా భారత్ సాగిస్తున్న పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు మరణించడం ఇదే తొలిసారి
* గొప్ప విజయం సాధించిన భద్రతా బలగాలు, సంస్థలకు హోం మంత్రి ప్రశంసలు
* ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో అరెస్టయిన మావోయిస్టుల సంఖ్య 54, లొంగిపోయినవారు 84 మంది
* 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
Posted On:
21 MAY 2025 5:36PM by PIB Hyderabad
నక్సలిజాన్ని తరిమికొట్టేందుకు చేస్తున్న యుద్ధంలో భద్రతా దళాలు ఈ రోజు చరిత్రాత్మక విజయాన్ని సాధించాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్లో చేపట్టిన ఆపరేషన్లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. ఈ గొప్ప విజయం సాధించిన భద్రతా బలగాలు, సంస్థలను హోం మంత్రి ప్రశంసించారు.
‘‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు సాగిస్తున్న యుద్ధంలో ఈ విజయం చరిత్రాత్మకమైన మైలురాయి. చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది మావోయిస్టులను హతమార్చాయి. వారిలో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రనేత, నక్సలిజం ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలుగా భారత్ సాగిస్తున్న పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వారిని మన బలగాలు అంతమొందించడం ఇదే తొలిసారి. ఈ చరిత్రాత్మక విజయం సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేసిన మన భద్రతా బలగాలు, సంస్థలను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లు అరెస్టయ్యారు. మరో 84 మంది లొంగిపోయారు. 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ఎక్స్‌లో చేసిన పోస్టులో కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 2130394)